మెయిన్ ఫీచర్

చిన్నతల్లి ‘పెద్దమనసు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వార్థమే పరమావధిగా, సంపాదనే ధ్యేయంగా మారి ఎవరికివారు పక్కవారిని సైతం పట్టించుకోని నేటి నవ నాగరిక సమాజంలో ఓ బాలిక కష్టాల్లో ఉన్నవారి కోసం పరితపిస్తోంది. తనకు తెలిసిన ‘కళ’ను సామాజిక సేవ కోసం వినియోగిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలిచింది. తాను సృష్టించిన కళాకృతులను విక్రయించగా వచ్చిన డబ్బును క్యాన్సర్ రోగులకు, వీధిపిల్లలకు ఖర్చు చేస్తోంది. ముంబయికి చెందిన పదహారేళ్ల క్షీరజ ఇప్పటికే పలు ప్రాంతాల్లో కళాప్రదర్శనలు నిర్వహించి, తాను సంపాదించిన మొత్తాన్ని ఆపన్నుల కోసం ఖర్చు చేస్తూ పెద్దమనసును చాటుకుంటోంది.
పంటపొలాల్లో పనిచేసే మహిళలు, చేనేత వస్త్రాలు నేసే గ్రామీణ స్ర్తిలు, ప్రకృతి రమణీయత, ముద్దులొలికే చిన్నారులు.. ఇలాంటి దృశ్యాలన్నీ ఆమె రూపొందించే కళాకృతుల్లో జీవం పోసుకుంటాయి. చిన్నప్పటి నుంచి బొమ్మలు తయారుచేయడం అంటే ఎంతో ఇష్టపడే క్షీరజ గృహాలంకరణకు అవసరమైన అన్ని రకాల బొమ్మలను అవలీలగా సృష్టిస్తుంది. తాను తయారు చేసిన బొమ్మలను విక్రయించి ఇప్పటివరకూ ఆమె సుమారు ఎనభై వేల రూపాయలను క్యాన్సర్ రోగుల కోసం, వీధిబాలల కోసం ఖర్చు చేసింది. పేదవర్గాలకు చెందిన క్యాన్సర్ పీడితులు కీమోథెరపీ చేయించుకొనేందుకు, వీధిబాలలకు పోషకాహారం, పుస్తకాలు అందజేసేందుకు ఆమె తన సంపాదనను వినియోగిస్తోంది. క్షీరజలోని సేవాగుణాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. క్షీరజ తయారు చేసిన బొమ్మలతో పలుచోట్ల ‘ఆర్ట్ ఎగ్జిబిషన్ల’ను ఏర్పాటు చేసేందుకు ఆమె తల్లి ఉజ్వల తోడ్పాటును అందిస్తున్నారు. మహారాష్టల్రోని కొల్హాపూర్‌లో వరద బాధితులను ఆర్థికంగా ఆదుకోవడంలోనూ క్షీరజ తన సేవాగుణాన్ని చాటుకొంది. పేదింటి బాలికలు అక్షరాస్యులుగా మారేందుకు సైతం ఆమె కృషి చేస్తోంది. సియాచిన్‌లో భారత సరిహద్దులను కాపాడుతున్న జవాన్ల కోసం కూడా ఆమె విరాళాలను పంపింది.
ఇతరులకు సేవ చేయడంలో ఉన్న ఆత్మసంతృప్తి ఇంకెక్కడా ఉండదని క్షీరజ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. పేదల కోసం డబ్బు ఖర్చు చేయడం ఒక్కటే సేవ కాదని ఆమె అంటోంది. వృద్ధులను, చిన్నారులను రోడ్డు దాటించడం, ఆకలితో ఉన్న వారికి కాస్త ఆహారం అందించడం కూడా సేవ చేయడమేనని చెబుతోంది. ఏడ్చే పిల్లలను సముదాయించేందుకు బోలెడు డబ్బు పోసి కేకులు, జంక్‌ఫుడ్, ఐస్‌క్రీములు వంటివి కొని ఇవ్వడం మంచిది కాదని, ఆ డబ్బును పేదపిల్లల కోసం ఖర్చు చేస్తే ఎంతో సమాజసేవ చేసినట్టేనని అంటోంది. తన చిన్నతనంలో తల్లి వెంట కొన్ని మురికివాడలకు వెళ్లగా, అక్కడి పేదపిల్లలు ఆహారం పొట్లాలను అందుకొనేందుకు పోటీపడడం తనను ఎంతగానో కదిలించివేసిందని ఆమె గుర్తు చేస్తోంది. పసితనంలో సరైన ఆహారం అందినపుడే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని తెలుసుకొని, వారి కోసం సేవ కార్యక్రమాలు ప్రారంభించానని వివరించింది.
దీపావళి రోజున బాణసంచా కాల్చేందుకు మితిమీరి డబ్బు ఖర్చు చేయడాన్ని క్షీరజ తీవ్రంగా తప్పు పడుతుంది. ఆర్భాటంగా టపాసులు పేల్చడం కన్నా, ఆ డబ్బుతో పేదపిల్లలకు పుస్తకాలు కొని ఇవ్వడం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని చెబుతోంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా తాను తయారు చేసిన ‘కాగితం లాంతర్ల’ను విక్రయించి, ఆ డబ్బుతో కొన్న స్వీట్లు, బొమ్మలను మురికివాడల్లోని బాలలకు పంపిణీ చేసింది. చిత్రలేఖనంలో క్షీరజ ప్రతిభను ఆమె తండ్రి చిన్నతనంలోనే గుర్తించి ఎంతగానో ప్రోత్సహించారు. వ్యర్థ పదార్థాలతో సైతం విభిన్నమైన కళాకృతులను రూపొందించవచ్చని, తీరిక వేళల్లో సమయాన్ని వృథా చేయకుండా బొమ్మలు తయారుచేయడం, పెయింటింగ్స్ వేయడం మంచి అలవాటు అని చెబుతోంది. బొమ్మలు, పెయింటింగ్స్ రూపొందించడానికి అవసరమైన సామగ్రిని కొనిచ్చి ఆమెను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు.
2015లో మహారాష్టల్రోని కల్యాణ్ పట్టణంలో ఆమె తొలిసారిగా ఏర్పాటు చేసిన ‘ఆర్ట్ ఎగ్జిబిషన్’ను స్థానికులు ఎంతగానో ప్రోత్సహించారు. బొమ్మలు కొనేందుకు ఎంతోమంది ఆసక్తి చూపడంతో మరిన్ని ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసేందుకు ఆమె ఉత్సాహం చూపుతోంది. తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి బొమ్మలు తయారుచేస్తున్న క్షీరజకు వింతైన బొమ్మలను సేకరించడం హాబీగా మారింది. ఆమె వద్ద విభిన్న ఆకృతుల్లో సుమారు వెయ్యి బొమ్మలున్నాయి. బొమ్మల సేకరణలో ‘గిన్నిస్ రికార్డు’ సాధించడమే తన లక్ష్యమంటోంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడే పేదమహిళలు కీమోథెరపీ చేయించుకొనేందుకు క్షీరజ 30వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం తనకెంతో సంతోషం కలిగించిందని తల్లి ఉజ్వల చెబుతుంటారు.
టాటా మెమోరియల్ హాస్పిటల్ సహా పలు స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్ రోగుల కోసం ఏర్పాటు చేసే వైద్య శిబిరాలకు క్షీరజ తన వంతు సహాయం చేస్తోంది. క్యాన్సర్ లక్షణాలున్న బాలల కోసం కూడా ఆమె ఆర్థిక సహాయం అందజేస్తోంది. థానే పోలీస్ సంక్షేమ నిధికి, పదవీ విరమణ చేసిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల సంక్షేమానికి కూడా విరాళాలు అందజేసింది. కొల్హాపూర్ ప్రాంతంలో వరద బాధితులకు 8వేల రూపాయల విలువచేసే మందులు, ఆహార పదార్థాలు, దుస్తులను పంపి తన దాతృత్వాన్ని చాటుకొంది. తన కుమార్తె సేవలు మరింతగా విస్తరించాలన్న ఆకాంక్షతో ‘క్షీరజ క్రియేషన్స్’ పేరిట ఓ సంస్థను ఉజ్వల నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడంలో ఆమె కృషి చేస్తున్నారు. ‘సహాయం కోసం ఎదురుచూసే వారు సమాజంలో ఎందరో ఉంటారు.. కొద్దిమందికైనా సేవ చేయడంలో ఎంతో ఆనందం, ఆత్మసంతృప్తి ఉంటాయి.. ఈ విషయంపై నేటి యువత దృష్టి సారించాలి..’ అని క్షీరజ సూచిస్తోంది.