మెయిన్ ఫీచర్

హాస్యానికే హీరోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాస్యరసం అనేది ఏ సాహిత్య ప్రక్రియలోనైనా, దృశ్య మాధ్యమంలోనయినా అటు పాఠకులను, ఇటు ప్రేక్షకులను అలరించేదే! ఇక నాటక, సినీ రంగాలలో హాస్యరసానికి ఉన్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే! చిత్ర రంగ విషయానికి వస్తే, నాటి ‘కస్తూరి శివరావు’నుంచి, నేటి వర్ధమాన హాస్య నటీనటులవరకూ చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలున్నాయి. అగ్ర కథానాయకులున్నా, కథా సందర్భంగా వారికి స్నేహితులుగానో, తోడబుట్టిన వారుగానో, బంధువులుగానో, హాస్య నటీనటులుండటం చిత్ర కథాసూత్రంగా వస్తోంది! హీరోలతోబాటు, హాస్య నటీనటులు కూడా అలా పేరు సంపాదించుకోవడమూ జరుగుతోంది.
*
తొలిసారిగా ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గుణసుందరి కథ’లో అంతవరకూ ఒక మాదిరి హాస్య వేషాలువేస్తున్న కస్తూరి శివరావు ప్రధాన పాత్రలో నటించడం ఆ చిత్ర విజయంతో శివరావుకి, స్టార్‌డమ్ రావడం జరిగాయి! అలా వచ్చిన పేరుప్రఖ్యాతులతో శివరావు స్వంత చిత్ర నిర్మాణం ప్రారంభించి, దర్శకుడుగా ప్రధాన పాత్రధారిగా నటించడం జరిగినా విజయలక్ష్మి అందీ అందనంత దూరంలోనే ఉండిపోవడంతో, తరువాతి కాలంలో మళ్ళీ చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయిపోయిన చిత్రమైన స్థితి ఏర్పడింది శివరావుకి! అలా తొలిసారిగా ఒక ప్రముఖ హాస్యనటుడు కథానాయకుడుగా నిలబడలేకపోవడం జరిగింది!
ఇక తెరమీద కనిపించిన వెంటనే, నవ్వించేలా ప్రేక్షకులను ఆకట్టుకొన్న ప్రముఖ హాస్య నటుడు ‘రేలంగి’. ఆనాటి చిత్రాలలో 60-70 దశకాలలో ఇంచుమించు రేలంగి లేని చిత్రం ఉండేది కాదు అంటే అతిశయోక్తికాదు. అది సాంఘికమైనా, పౌరాణికమయినా, జానపదమైనా ఏ రకం చిత్రమైనా రేలంగి ఉండాలని, అప్పట్లో పంపిణీదారులు, నిర్మాత దర్శకులతో చెప్పడం జరిగేది. అలా రేలంగి తన హాస్యరంగంలో ఇంచుమించు హీరోల స్థాయిని పొందడం విశేషం!
ఇక రేలంగికున్న ప్రేక్షకాభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన కథానాయకుడుగా, ఆరోజుల్లో రెండు చిత్రాలు వచ్చాయి. అవి పక్కింటి అమ్మాయి, మామకుతగ్గ అల్లుడు చిత్రాలు. మొదటిదానిలో నాటి ప్రముఖ కథానాయిక ‘అంజలి’ ఆయనకు జోడీ అయితే, రెండో చిత్రంలో సావిత్రి కథానాయికగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి.
నిజానికి వాళ్ళిద్దరూ అప్పటికే అక్కినేని, రామారావు వంటి అగ్ర హీరోలతో కథానాయికగా నటిస్తున్నారు. అయినా రేలంగి పక్కన హీరోయిన్లుగా తెరను పంచుకోవడం, వారి సంస్కారానికి నిదర్శనం. ఈ రెండు చిత్రాల్లో ‘పక్కింటి అమ్మాయి’ విజయవంతమైన చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇదే చిత్రం దాదాపు 30 సంవత్సరాల తరువాత, అదే పేరుతో నేటి నటీనటులతో రావడం, అదీ విజయం పొందడం విశేషం! అప్పట్లో రేలంగి ధరించిన పాత్రను తరువాత వచ్చిన చిత్రంలో చంద్రమోహన్ పోషించడం జరిగింది. అంజలి పాత్రలో సహజ నటి జయసుధ రమ్యంగా నటించింది.
విచిత్రం ఏమిటంటే, ఈ రెండు చిత్రాల తర్వాత రేలంగి కథానాయకుడుగా మరే చిత్రంలోనూ నటించలేదు.
ఆ తరువాతి కాలంలో పేరుతెచ్చుకున్న హాస్య నటులతో వారే కథానాయకులుగా చిత్రాలు చాలా తక్కువగా రావడం గమనించాల్సిన విషయం!
అందుకు కారణం ఏమిటన్న విశే్లషణకు వచ్చినప్పుడు, ఒక సీనియర్ సినిమా జర్నలిస్టు చెప్పిన విషయం ఆలోచింపచేసేదిగా ఉంది. అదేమిటంటే, హాస్యనటులు, హీరోల పక్కన ఉన్నంతవరకూ ప్రేక్షకులు ఆదరిస్తారు గానీ, వారే హీరోలంటే ఒప్పుకోరు. అందుకు కారణం, వారివారి హీరోల మీద ఉన్న అభిమానమే! ఈ కారణం ఎంతో సహేతుకంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు! అందుకే మొన్నమొన్నటివరకూ ఇంచుమించుగా ఓ ప్రముఖ హాస్యనటుడితో హీరోగా చిత్రాలు వచ్చినా విజయం కాలేదు. అయితే, కాలమూ, పరిస్థితులూ ఎప్పుడూ ఒకేలా ఉండవని అందరికి కాలమూ పరిస్థితులూ ఎప్పుడూ ఒకేలా ఉండవని అందరికీ తెలిసిందే! చిత్ర పరిశ్రమలో అది మరీ సహజం!
ఆ ధోరణిని మారుస్తూ, అప్పటికే ప్రముఖ హాస్య నటుడిగా పేరుతెచ్చుకున్న అలీతో ‘యమలీల’ చిత్రం రావడం, అది ఘన విజయం సాధించడం జరిగింది. ఆ చిత్ర విజయంతో తరువాత ‘అలీ’ మరికొన్ని చిత్రాల్లో హీరోగా నటించినా కథానాయకుడుగా నిలబడలేకపోవడం చెప్పుకోవాల్సిన విషయం. ఇందుకు సరైన కథ, దర్శకత్వం లేకపోవడం ఇలా ఏ కారణమయినా చెప్పుకోవచ్చు! కాని ఫలితం మాత్రం పైన చెప్పిందే!
ఆ తరువాత వచ్చిన నవ్వుల తుఫాన్ ‘వేణుమాధవ్’కూడా మూడునాలుగు చిత్రాల్లో మాత్రమే హీరోగా నటించి, ఆ తరువాత కొనసాగించ లేకపోవడం జరిగింది.
ఇక అప్పట్నుంచీ అంటే గత మూడున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను బ్రహ్మాండంగా తన హాస్య నటనతో అలరిస్తున్న బ్రహ్మానందం సైతం హీరోగా నిలబడలేక పోవడం వి‘చిత్ర’ సత్యం!
బ్రహ్మానందం, కథానాయకుడుగా, నాలుగయిదు చిత్రాలు వచ్చాయి. ఇంకో రెండుమూడు కూడా ఉండవచ్చు! కానీ చివరికి తేలేది మాత్రం బ్రహ్మానందం హీరోలకు స్నేహితుడుగానో బంధువుగానో లేక ఇతర పాత్రలలో మాత్రమే రాణించడం జరుగుతోంది. ఆయన హాస్యం, ప్రేక్షకుల పెదవుల మీద చిరునవ్వుల లాస్యం చేయిస్తుంది. అందుకే వందల చిత్రాల్లో నటించినా, బ్రహ్మానందం హాస్యం అంటే ఇప్పటికీ ప్రేక్షకులకి అభిమానమే. ఆ అభిమానమే ఆయనకి పద్మశ్రీ బిరుదు రావడానికి
కారణమయింది. కానీ కథానాయకుడి స్థానం ఇవ్వలేకపోయింది.
ఇక, గోదావరి జిల్లాల యాసతో ఆ యాసలో తన హాస్య నటనతో ప్రేక్షకులకు చాలా తొందరగా దగ్గరయిన ‘్భమవరం బుల్లోడు’ సునీల్. ప్రారంభంలో అందరి హాస్య నటుల్లాగానే హీరోల పక్కన నటించినా, తరువాతి కాలంలో తనే హీరోగా మారాలన్న నిర్ణయం తీసుకోవడం, అందుకు అనుగుణంగా కథానాయకుడి పాత్రలో నటించడం, వాటిలో కొన్ని విజయం సాధించడం జరిగింది.
అయితే, ఆ విజయ ప్రకాశం, క్రమంగా తగ్గుతూ రావడం హీరోగా సునీల్ నటించిన చిత్రాలు నిర్మాతలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం అందరికీ తెలిసిందే.
నిజానికి సునీల్ వాణిజ్య చిత్ర కథానాయకులు చేసే హీరోచిత కార్యాలన్నీ సమర్ధంగాచేస్తున్నా ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం వాస్తవం!
ఇప్పుడు ఒక్కసారి కొంచెం వెనక్కివెళితే అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరో పాత్రల్లోనూ, రాణించి, విజయవంతమైన నిర్మాతగా కూడా పేరుతెచ్చుకున్న హాస్యనటులు ఇద్దరున్నారు.
వారిలో మొదటిగా పద్మనాభం పేరు చెప్పుకోవాలి. హాస్య పాత్రతో చిత్ర రంగప్రవేశం చేయకపోయినా, తరువాతి కాలంలో ప్రముఖ హాస్య నటుడుగా, నిర్మాతగా తదుపరి దర్శకుడుగా పేరుతెచ్చుకోవడం విశేషం! హాస్య నటుడుగా ప్రేక్షకులను అలరిస్తూనే, కొన్ని చిత్రాలలో, దుష్టపాత్రలను కూడా పోషించడం, ప్రేక్షక అభిమానం పొందడం, చెప్పుకోదగిన విషయం! మంచి చిత్రాల నిర్మాతగా, దర్శకుడుగా పేరుపొందిన పద్మనాభం, ఆయన స్వంత నిర్మాణ చిత్రాలలో హీరోగా నటించి, విజయం పొందినా, సంపూర్ణ కథానాయకుడుగా నిలబడలేక పోవడం అన్నది గమనించాలి!
మరి మరో ప్రముఖ హాస్య నటుడు ‘చలం’. ఈయన సైతం, అగ్ర హీరోల పక్కన కామెడీ పాత్రలు ప్రతిభావంతంగా పోషించి, అందమైన హాస్య నటుడుగా పేరుతెచ్చుకోవడం జరిగింది. (ఆంధ్రా దిలీప్‌కుమార్‌గా పేరుంది చలానికి) విజయవంతమైన చిత్రాలలో ఉత్తమ హాస్యనటుడిగా పేరుపొందిన చలం స్వంత చిత్ర నిర్మాణంలో చాలా చక్కని కుటుంబ కథా చిత్రాలతోబాటు, మంచి సందేశాత్మక చిత్రాలుకూడా నిర్మించడం, నిర్మాతగా ఆయనలోని అభిరుచిని తెలియచేస్తుంది.
ఒక పక్క హాస్యరసాన్ని పోషిస్తూనే, అదే పాత్రలో ఉద్వేగభరిత దృశ్యాలలో కూడా ప్రతిభావంతంగా నటించడం చలంలోని విశేషత! ఆయన నిర్మాణంలో వచ్చిన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. అయితే, హాస్యనటుడిగా ఎంత ప్రసిద్ధుడయినా, ‘కథానాయకుడి’ తరగతిలోకి చేరిన నటుడు చలం అని చెప్పుకుంటే తప్పులేదు!
ఇలా హాస్యనటుల ప్రస్థానాన్ని ముఖ్యంగా హీరోలుగా రాణించలేక పోవడానికి, ముందువెనకాల పరిశీలన చేసినప్పుడు మరి కొందరి గురించి తప్పకుండా ప్రస్తావించుకోవాలి!
ఇంతింతై వటుడింతింతై అన్న సూక్తిలా, రాజమండ్రీలోని ప్రైమరీ స్కూలు టీచరు, మహాకవి శ్రీశ్రీ తోడల్లుడు అయిన (పుణ్యమూర్తుల) రాజబాబు ఒకటిన్నర దశాబ్దంపాటు ప్రసిద్ధ హాస్యనటుడిగా వెలుగొందడం, హాస్యనటుల చరిత్రలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం! హాస్య నటునిగా రాజబాబు ప్రభ ఎలా వెలిగిందంటే, అగ్ర హీరోలు సైతం ఆయన డేట్స్‌కోసం ఎదురుచూసేంతగా! రాజబాబు, హాస్య రంగంలో నటుడుగా, తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే ‘రేలంగి’తరువాత అంతటి ఫాలోయింగ్‌ను తెచ్చుకున్న హాస్య నటుడు రాజబాబు. ఆయన కూడా కొందరు హాస్య నటుల్లా, స్వంత చిత్ర నిర్మాణం ఆరంభించి చిత్రాలు తీసినా, అవి హాస్యచిత్రాలు కాకపోవడం చిత్రమయిన విశేషం! కారణాలు ఏమయినా, గొప్ప హాస్యనటుడుగా ప్రసిద్ధుడయిన రాజబాబు, తన స్వంత చిత్రాల్లోనే హీరో అయ్యారు తప్ప అంతకుమించి కాకపోవడం అనేదానికి కారణాలు వెతకనవసరం లేదు. ఎందుకంటే, చిత్ర పరిశ్రమ వ్యాపారాత్మక, కళాసంవిధానం!
ఇక ప్రస్తుత కాలంలోకి వస్తే, కొత్తగా వస్తున్న హాస్య నటీనటులు, వర్తమాన కాలానికి తగిన హాస్యపాత్రలు పోషిస్తూ, నేటితరం ప్రేక్షకుల అభిమానం పొందుతున్నారు. అయితే వీరిలో కొందరు హాస్యనటులు, హీరోలుగా నటించిన చిత్రాలు వస్తున్నా జయాపజయాలుగా మారుతున్నాయి. అటువంటి హాస్య నటుల్లో, ‘వెనె్నల కిశోర్’, ‘శ్రీనివాస్‌రెడ్డి’ చిత్రాలను చెప్పుకోవాలి! అలా వారు కథానాయకులుగా నటించిన చిత్రాలున్నా ఆ చిత్రాలు వారిని హీరోల తరగతిలోకి చేర్చలేకపోయాయి అన్నది వాస్తవం! భవిష్యత్తు (వారి గురించి) చెప్పలేం!
ఇలా హాస్య నటులు, హీరోలుగా రాణించాలని చేసిన ‘బాలీవుడ్’లోని ప్రయత్నాల గురించి చెప్పుకుంటే, నాటి ‘్భగవాన్‌దా’, ఆ తరువాత ‘మహమూద్’ గురించి చెప్పుకోవాలి! ఆ ఇద్దరూ ప్రతిభావంతులయిన హాస్య నటులు! చిత్ర నిర్మాతలు! దర్శకులు! అయినా హీరోలుగా, రాణించలేకపోయారు! స్వంత చిత్రాల్లో తప్పించి వీరి గురించి మరో చక్కటి చిత్రముచ్చట చెప్పుకోవాలి ఈ సందర్భంలో.
భగవాన్‌దా నిర్మించి, నటించిన ‘అల్‌బేలా’చిత్రాన్ని ప్రముఖ గుణ చిత్ర నటుడు నాగభూషణం తెలుగులో ‘నాటకాల రాయుడు’గా నిర్మించి, ప్రధాన పాత్రను పోషించారు.
ఇక ‘మహమూద్’ నిర్మించిన ‘కున్వారాబాప్’ చిత్రాన్ని పద్మనాభం తెలుగులో ‘పెళ్ళికాని తండ్రి’గా నిర్మించడమేకాదు, ముఖ్య పాత్రలో నటించడమూ జరిగింది.
మరి తమిళ చిత్రరంగంలో హాస్య నటీనటులు, ఒకప్పుడు ఎంతోమంది ఉండేవారు! ఇవాళ అయిదారుగురు మించి లేకపోవడం విశేషం. అయితే తెలుగు చిత్రరంగంలో లేకపోవడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సంగతి.
తమిళ చిత్రాల్లోని ప్రముఖ హాస్యనటుల్లో నాటి ఎన్.ఎస్.కృష్ణన్ (హాస్యనటి, టి.ఏ.మధురం ఆయన భార్య). కమలాచంద్రబాబు, తంగవేలు, ఆ తరువాత తన అనువాద చిత్రాలద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయిన నాగేష్, ఎన్నో చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించినా వారికి రెగ్యులర్ హీరోలుగా పేరురాలేదు. కథానాయకుల స్థానమూ లభించలేదు.
ప్రసిద్ధ హాస్యనటులుగా పేరుతెచ్చుకున్న వీరు వాణిజ్య కథానాయకులుగా నిలబడలేకపోవడానికి కారణం వారిలోని హాస్య ప్రతిభే వారిని అడ్డంకిగా నిలిచినదనుకోవచ్చు.
కానీ, ఈ సందర్భంగా మరో విశేషం ఏమిటంటే, అగ్ర కథానాయకులు, అక్కినేని, ఎన్.టి.ఆర్, సంపూర్ణ హాస్యపాత్రలు పోషించిన చిత్రాలుండటం, ఆ పాత్రల్లోవారిని ప్రేక్షకులు ఆదరించడం జరగడం విశేషం!
ఏమయినా, హాస్యనటులు వారి ప్రతిభా విశేషాలను చిత్ర చిత్రానికీ వైవిధ్యంగా ప్రదర్శిస్తూ ఉంటే ప్రేక్షకుల మనసుల్లో కలకాలం నిలిచి ఉంటారు. అందుచేత, కథానాయకుల స్థానం పొందలేదని, వారూ మనమూ చింతించనక్కర్లేదు!

-యడవల్లి