మెయన్ ఫీచర్

‘ఉరిశాల’ ఇక సిరిశాలగా మారుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోచంపాడు నీటిపారుదల ప్రాజెక్టు కాలువల నిర్మాణం పనుల పర్యవేక్షణకై వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం వస్తే- ‘విలువ తక్కువ’గా భావించి దాన్ని కాదని- చేనేతనే గౌరవ కులవృత్తిగా నమ్ముకొని జీవనం కొనసాగిస్తే... దినసరి కూలీగానే బతుకీడుస్తున్నానంటూ 64 ఏళ్ల వెంకటస్వామి నాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటున్నాడు. వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా చేరిన తన ముస్లిం మిత్రుడు ఉద్యోగ విరమణ తర్వాత 30 వేల రూపాయలకు పైగా పెన్షన్ పొందుతున్నాడంటూ అతను ఆవేదన చెందాడు. ఈ లెక్కన సుందర పిచైయ్, సత్య నాదెండ్ల నైపుణ్యత ముందు- నేచిన చీరను అగ్గిపెట్టెలో పెట్టి విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చిన పరంధాములు బలాదూరే!
సమాజానికి అనుబంధంగా ఒకప్పుడు ప్రతి ఆవాస ప్రాంతానికి కుల వృత్తులుండేవి. రెక్కల కష్టంపై, సహజ నైపుణ్యతతో ఆధారపడే ఈ వృత్తులు ప్రజల అవసరాల్ని తీర్చుతూ, మరికొన్ని ఇతర వృత్తులకు దోహదకారిగా వుండేవి. ‘తలలో నాలుకలా’ బతికిన ఈ వర్గాల వారు యాంత్రీకరణతో మసిబారిపోయారు. దీనికితోడు పాలకవర్గాల పెట్టుబడిదారుల అనుకూల విధానాలు చేతివృత్తులను చావుదెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు ఒక్క మగ్గంతో ఓ కుటుంబం హాయిగా బతికేది. వీటి స్థానంలో వచ్చిన మరమగ్గాలు మొత్తం కుటుంబం పనిచేసినా బతకలేని దుస్థితికి నెట్టివేశాయి. దీనికి కారణం- దాదాపు 10 మరమగ్గాలు 24 గంటలకు గాను కేవలం ఇద్దరికి మాత్రమే కూలిని (ఉపాధి కాదు) అందిస్తున్నాయి. కుటీర పరిశ్రమగా విరాజిల్లి ఖండాంతర ఖ్యాతిని గాంచిన చేనేతలో మరమగ్గాలు (పవర్‌లూం) రావడంతో ఆ పరిస్థితులు- కుటుంబాల్నే బలిపశువులుగా మార్చాయి. ప్రభుత్వానికి ఓ విధానమంటూ లేకపోవడంతో చేనేత కార్మికులు పరాధీనతకు గురయ్యారు.
ఒకప్పుడు ‘సిరిశాల’గా వెలుగొందిన సిరిసిల్లలో ఇంటికో మగ్గం చొప్పున దాదాపు 10వేలకు పైగా వుండేవి. కొందరి దగ్గర పెట్టుబడి పోగుపడడంతో, మరికొందరు రాజకీయ పలుకుబడితో బ్యాంకుల నుంచి రుణాల్ని పొంది పవర్‌లూంలను స్థాపించారు. ఇలా ఇంటి శ్రమ షెడ్డుకు మారిపోయింది. మగ్గాల స్థానంలో దాదాపు 40 వేల మరమగ్గాలు (సాంచాలు) దాదాపు 800 యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఇందులో దాదాపు 22వేల మంది దినసరి కూలీలు (కార్మికులు కాదు) పని గ్యారంటీ, ఉపాధి హామీ, ఎలాంటి సౌకర్యాలు, నిబంధనలు లేకుండా పనిచేస్తున్నారు. వీరెవ్వరికీ పిఎఫ్ గాని, ఇఎస్‌ఐ సౌకర్యం గాని, బీమా పథకం గాని లేకపోగా ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయింది. 50 సాంచాలు గల ఒక యూనిట్‌ను నడపడానికి సరాసరి ఆరుగురు కూలీలు సరిపోతున్నారు. కండెల నుంచి 720 దారపుపోగుల్ని జతచేయడానికై పెద్ద రాట్నాన్ని (వైఫని) నడపడానికి ఒకరు, 305 దారాల చొప్పున బీమ్‌ల్ని (పెద్ద కండెలు) నింపడానికై ఇద్దరు కూలీలు, అడ్డం దారం పోగుల్ని చిన్న కండెలకు నింపడానికై మరో కూలీ సరిపోగా, మిగతా ఇద్దరు మొత్తం సాంచాల్ని నియంత్రిస్తారు. వీరే సాంచాలకు బీమ్‌ల్ని ఎక్కించడం, తయారైన గుడ్డను బేళ్ళుగా కట్టడం చేస్తూ వుంటారు. ఈ విధంగా రెండు షిఫ్టులు (12గంటల చొప్పున) మాత్రమే నడవడంతో అతి తక్కువ మందితో అత్యధికంగా బట్ట ఉత్పత్తి జరుగుతున్నది.
ఇలా కండెల్ని చుట్టేవారికి సరాసరి రూ.300/-, సాంచాల్ని పర్యవేక్షించే వారికి మీటరుకు రూ.1.25 చొప్పున రూ.300/- కంటే దినసరి కూలీ మించడం లేదు. ఈ పని కూడా యాజమాన్యం దయాదాక్షిణ్యాలపై, విద్యుత్ సరఫరాపై, తయారైన బట్ట అమ్మకంపై ఆధారపడి లభిస్తుంది. ఇక చీర నేతగాళ్ళది మరో దీనావస్థ. ఒక కూలీ రెండు సాంచాలపై దినసరిగా 4 చీరలు నేయగా చీరకు రూ.68 చొప్పున 272 రూపాయలు గిట్టుబాటు అవుతున్నది. అదనంగా వీరు రంగుల్ని కూడా పులమడం, డిజైన్లను కూడా చూసుకోవడం జరుగుతుంది. దీంతో వీరు కంటిచూపు కోల్పోవడం, పవర్‌లూం శబ్దాలకు చెవుడు, గుండె జబ్బులకు గురికావడం, పనికి ఆటంకం కలుగుతుందని తక్కువ నీరుతాగడంతో కిడ్నీ సంబంధ వ్యాధులు సోకడం మామూలైపోయింది. వీటికితోడు సరైన ఆహారం లేకపోవడంతో పోషకాహార లోపంతో క్షయవ్యాధికి గురవుతున్నారు. కర్మాగార స్థాయి పనియైనా, కార్మికుల కనీస సంఖ్య 20కి పైగా లేకపోవడంతో వీరికి కార్మిక చట్టాలు అమలుకావడం లేదు. 1957 నాటి కనీస వేతన చట్టం కూడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పిఎఫ్, కార్మిక బీమా, ఇఎస్‌ఐ దవాఖాన వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు. ఇతర సాధారణ ప్రజల్లాగానే సంక్షేమ పథకాల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. గతంలో వున్న అంత్యోదయ కార్డుల్ని మార్చి, వ్యక్తికి ఆరు కిలోల చొప్పున వర్తింపచేయడంతో సరాసరి 24 కిలోలకు మించి రేషన్ బియ్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీ కార్డులున్నా, అనారోగ్యం వీరిని వెంటాడుతూనే వున్నది. ఉన్నత చదువులే కాదు, పాఠశాల చదువును కూడా చదివించలేక, ఆడపిల్లలకు పెళ్ళిళ్లు చేయలేక, కుటుంబాన్ని భారంగా భావించి తనువు చాలించిన వారి సంఖ్య గత సంవత్సర కాలంగా 20కి పైగా ఉంది. ఇప్పటివరకు 400పైగా నేతన్నలు ప్రాణాల్ని తీసుకున్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వేముల మార్కండేయులు చైతన్య స్వచ్ఛంద సేవాసంస్థను నడుపుతూ నేతన్నలకు చేదోడుగా నిలుస్తున్నాడు.
ఇతర పనులు చేయలేక, ఈ కాస్త పనికూడా సంవత్సర కాలం దొరక్క పస్తులుండే రోజులే ఎక్కువ. సరాసరి సంవత్సరానికి రూ.30వేలు కూడా దాటని వీరి నెలసరి కూలి రూ.2,500 మాత్రమే! ఇంత తక్కువ వేతనంతో కుటుంబాన్ని నడపడం ఎలా సాధ్యమో ప్రభుత్వాలకే తెలియాలి! పోనీ, సూరత్,్భవాండి లాంటి ప్రాంతాలకు వలస పోదామంటే, అక్కడ కార్మికులు మిగులుగా వుండడంతో పని దొరకని పరిస్థితి. ఇక గల్ఫ్ దేశాల బాట పట్టినవారు తిరిగి ఇక్కడికి వస్తారనే గ్యారంటీ లేదు. వచ్చినా, తీసుకున్న అప్పుల్ని కూడా తీర్చని వైనం.
ఈ విధంగా బతుకు బరువై, జీవితం చెరువై, జాతీయ దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల ఆత్మహత్యలు గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హృదయాన్ని కదిలించగా- పార్టీ ఆవిర్భవించిన మరుసటి రోజే సిరిసిల్లను ఆయన సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో రాజకీయంగా అనూహ్యమైన మార్పులేవో జరుగుతాయని భావించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ చేనేత వైపు దృష్టి సారించాడు. అప్పటికే కాగితాలకు పరిమితమైన టెక్స్‌టైల్ పార్కు తిరిగి తెరపైకి వచ్చినా, సాధారణ నేత కార్మికుడికి అందింది, ఒరిగింది ఏమీ లేదు. ప్రభుత్వ రంగంలో వున్న నూలుమిల్లు ప్రైవేటుపరం అయింది. తెలుగుదేశం హయాంలో అంటే- 1999-2003లో రూ.491.62 కోట్లను, 2009-10కి రుణమాఫీ పథకంతో కలిపి రూ.391.94 కోట్లను కేటాయించి, చిరంజీవి ప్రభావానికి అడ్డుకట్టవేశానని వైఎస్ భావించాడు. అయితే ఈ కేటాయింపుల్లో నేరుగా కార్మికుని చేరింది ఏమిలేకపోగా, నిధుల ఖర్చు మాత్రం 50 శాతం దాట లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఈ కేటాయింపులు కూడా ఇరు రాష్ట్రాల్లోనూ తగ్గిపోయాయి.
‘ఆప్కో’ సంస్థ రెండుగా విడిపోయి, తెలంగాణకు టెస్కో ఏర్పడినా నేటికీ ఒక్క అమ్మకం కేంద్రం కూడా తెరుచుకోలేదు. ఒకవేళ ఇవి ప్రారంభం అయినా, పవర్‌లూం బట్టలే చేనేత బట్టలుగా చెలామణి కావడంతో, ప్రత్యేకంగా చేనేతకు ఒరిగేది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఆగస్టు 7ను చేనేత దినోత్సవంగా ప్రకటించినా కొట్టొచ్చిన మార్పేమీలేదు. ఇలాంటి అననుకూల పరిస్థితుల్లో తిరిగి చేనేత గత వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు మృగ్యం అనే చెప్పాలి. దీన్ని కుటీర పరిశ్రమగా గుర్తించి, ముడి సరకులను సబ్సిడీలపై అందించి, తయారైన గుడ్డకు మార్కెట్ గ్యారంటీని ఇస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే, దీనికి సరిపడ రుణ సౌకర్యాన్ని కల్గిస్తే కొంతలోకొంత చేనేతరంగం బతికి బట్టకడుతుంది. ఇందుకోసం పటిష్టమైన సహకార వ్యవస్థ, సరైన అధికార నియంత్రణ వుండాలి. దీన్నో గౌరవప్రదమైన వృత్తిగా ప్రచారం చేయాలి.
ఇక పవర్‌లూంలలో పనిచేసే కార్మికుల్ని సంఖ్యతో సంబంధం లేకుండా కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి. ప్రతి యూనిట్‌ను మూడు షిఫ్టులు నడిచేలా, 4 సాంచాలకు ఒక కార్మికుని చొప్పున ఉండేలా చట్టం రూపొందించాలి. నేసిన బట్టతో సంబంధం లేకుండా కనీస వేతనాన్ని, సంవత్సరంలో 200 రోజులకు తగ్గకుండా చూడాలి. నేత కార్మికుల పిల్లలకు విద్యా సౌకర్యాల్ని, కుటుంబాలకు ఆరోగ్య సౌకర్యాల్ని కల్గించాలి. చీరల, ఎంబ్రాయిడరీ పనికి నైపుణ్యతల్ని పెంచుకునేలా శిక్షణను అందించాలి. వీరికి అనుగుణమైన వేతనాల్ని ఇవ్వాలి. 60 ఏళ్ల వయసు నిండిన కార్మికులకు నెలసరి పెన్షన్‌ను కనీసంగా రూ.10,000 నిర్ణయించాలి. ప్రభుత్వ ఖర్చుతో వీరికి గృహవసతి కల్పించాలి. స్వయంగా ఉపాధిని ఏర్పాటు చేసుకునే వారికి రుణ సౌకర్యాన్ని అందించి, టెక్స్‌టైల్ పార్కులో స్థలాలను కేటాయించాలి. అప్పుడే ఈ రంగం బాగుపడుతుంది. కార్మికులు ఆరోగ్యంగా వుండి, ఉత్పత్తిని అధికం చేస్తారు. పెద్ద మిల్లులలో బట్టల్ని నియంత్రించాలి. లేదా వీటిలో ఈ కార్మికులకే ఉపాధిని కల్పించాలి.
ఇవన్నీ సాధ్యమా..? అనే ప్రశ్న సాధారణమే! అసాధ్యాల్ని సాధ్యాలుగా మారుస్తున్న తెరాస ప్రభుత్వానికి, అందునా, స్వయాన తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటిఆర్ సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇవన్నీ సాధ్యపడుతాయనే ఈ ప్రాంతీయులు నమ్ముతున్నారు. పెట్టుబడులకై విదేశాల్ని చుట్టివస్తున్న కెటిఆర్‌కు రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా ఏర్పడిన ‘రాజన్న సిరిసిల్ల జిల్లా’ను తిరిగి ‘సిరిశాల’గా మార్చడం పెద్ద సమస్య కాదు. బ్రిటన్‌లోని టాటా ఉక్కు పరిశ్రమ నష్టాల్లో వుందని, దాన్ని అమ్మివేస్తామని ఆ సంస్థ ప్రకటించగానే, కుటుంబ సభ్యులతో విదేశాల్లో సెలవులు గడుపుతున్న అప్పటి ప్రధానమంత్రి డేవిడ్ కేమరాన్ గత ఏప్రిల్‌లో హుటాహుటిన ఇంగ్లాండుకు చేరుకుని, ఆ సంస్థ మూడు యూనిట్లలో పనిచేస్తున్న 15వేల మంది కార్మికుల సంక్షేమానికై పాటుపడిన విధానం మన నేతలకు స్ఫూర్తిని ఇస్తే- నేతన్నల బతుకులే కాదు, ఇతర రంగాల కార్మికుల బతుకులు సైతం బాగుపడుతాయి.

-డా. జి.లచ్చయ్య