మెయన్ ఫీచర్

‘రెండవ రాజధాని’ సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించాలనే డిమాండ్‌పై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు దేశానికి హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేస్తే బాగుంటుందని పలువురు మేధావులు ప్రతిపాదన చేస్తున్నారని పేర్కొన్నారు. మేధావుల సూచన మంచిదే అయినా, ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి బీజేపీ పరిశీలనలో లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌ను అప్పటి యూపీఏ ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను విశే్లషిస్తే, రెండవ రాజధాని అనే ఆలోచన వెనక అనేక అజెండాలున్నాయని చెప్పవచ్చు.
70 ఏళ్ల క్రిందట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ భవిష్యత్తు,సమగ్రతలను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన సూచన చేశారు. 1950 దశకంలో ఆయన రాసిన ‘్థట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ ’ పుస్తకంలో రెండవ రాజధాని గురించి రాశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఢిల్లీ చాలా దూరం. సరిహద్దుల్లోనే ఉన్న శత్రుదేశాలకు ఢిల్లీ సమీపంలో ఉంది. ఢిల్లీలో ఎక్కువ ఎండలు, చలి ఉంటాయి. సముద్ర తీరంలోని ముంబయి రెండవ రాజధానికి అనువైన ప్రదేశం కాదు. ఏ విధంగా చూసినా హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతం సరైన ప్రదేశమని, రెండవ రాజధానిగా అనుకూలమైన నగరమని అంబేద్కర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నైజాం సంస్థానం పోలీసు చర్య ద్వారా 1948లో విముక్తి పొంది భారత్‌లో విలీనమైన నేపథ్యంలో అంబేద్కర్ దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ చేయాలన్నారు. కాగా, నాగ్‌పూర్‌ను సైతం రెండవ రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఉంది.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాద్ సంస్థానం నుంచి విడిపోయిన మరాఠ్వాడా, సెంట్రల్ ప్రొవిన్స్ నుంచి విడిపోయిన నాగ్‌పూర్ ప్రాంతాలను మహారాష్టల్రో విలీనం చేశారు. మహారాష్టక్రు రెండవ రాజధాని అయిన నాగ్‌పూర్‌లో ఏటా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి. ఇలాగే కర్నాటకకు రెండు రాజధానులు ఉన్నాయి. బెంగళూరు పరిపాలనాపరంగా రాజధాని. బెల్గాంలో ఏటా కొన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. జమ్మూ కశ్మీర్‌కు శ్రీనగర్, జమ్మూ నగరాలు రాజధానులుగా ఉన్నాయి.
దేశానికి రెండు రాజధానులు ఉండాలన్న డిమాండ్ గొంతెమ్మ కోర్కె ఏమీ కాదు. మనదేశ జనాభా 130 కోట్లు. ఇంత పెద్ద దేశానికి రాజధాని అయిన ఢిల్లీ నగరం దక్షిణాది, తూర్పు, పశ్చిమ రాష్ట్రాలకు చాలా దూరంగా ఉంది. ప్రపంచంలో 16 దేశాలకు రెండు రాజధానులు ఉన్నాయి.
మన దేశానికి రెండవ రాజధానితో పాటు మరో చోట సుప్రీం కోర్టు బెంచ్ కూడా అవసరం. సుప్రీం కోర్టులో సామాన్య వ్యక్తి పిటిషన్ దాఖలు చేయలేడు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఢిల్లీ వెళ్లి పిటిషన్ దాఖలు చేయాలన్నా, అక్కడ న్యాయ సహాయాన్ని పొందాలంటే లక్షల్లో సొమ్ము ఉండాలి. చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, హైదరాబాద్, అమరావతి నుంచి రెండు రోజులు ప్రయాణం చేస్తే తప్ప ప్రజలు ఢిల్లీకి చేరుకోలేరు. దక్షిణాది, తూర్పున ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ అందుబాటులో లేవు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడచినా, ఇప్పటికీ ఈ రెండు వ్యవస్థలకు నిలయమైన ఢిల్లీకి తూర్పు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎంత మంది వెళ్లారు?.
భారత్‌కు రెండవ రాజధానిని ఏర్పాటు చేసే నగరంలోనే సుప్రీం కోర్టు బెంచ్‌ని నెలకొల్పాలి. అప్పుడే దేశ ప్రజలకు అందుబాటులో శాసన, న్యాయవ్యవస్థలు ఉంటాయి. అయితే, రెండో రాజధాని ఎంపికలో సహజంగానే రాజకీయాలు ఉంటాయి. అధికారంలో ఉన్న బీజేపీకి మహారాష్టన్రు రెండు ముక్కలు చేయాలన్న ఆలోచన ఉంది. నాగ్‌పూర్ రాజధానిగా విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్రం ఆలోచిస్తోంది. శివసేన వల్ల ఈ ప్రతిపాదనను అటకెక్కించిన కేంద్రం మళ్లీ ఈ ఫైలుకు దుమ్ము దులిపి ఆచరణలో అమలు చేసే అవకాశాలున్నాయి. బీజేపీ సిద్ధాంత దిక్సూచి ఆరెస్సెస్ కేంద్రం నాగ్‌పూర్‌లో ఉంది. దేశానికి రెండవ రాజధాని ఉండాలన్న సంకల్పం బీజేపీకి బలంగా ఉంటే తొలుత నాగ్‌పూర్ పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. దేశానికి మధ్యలో నాగ్‌పూర్ నగరం ఉంది. నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి మధ్య దూరం 1100 కి.మీ. నాగ్‌పూర్, చెన్నై మధ్య దూరం కూడా అంతే. చెన్నైను రెండవ రాజధాని చేయాలన్న డిమాండ్ లేకున్నా, సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలని తమిళ ప్రజలు కోరుతున్నారు.
భిన్నత్వంలో ఏకత్వంతో అలరారుతూ, అన్ని భాషాలు మాట్లాడే వారి సంగమ స్థలం హైదరాబాద్. అందుకే అంబేద్కర్ హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా చేసేందుకు అన్ని యోగ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. మిగతా నగరాలతో పోల్చితే ఇక్కడ భూమి లభ్యత ఎక్కువ. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అనేక జాతీయ సంస్థలు ఉన్నాయి. రెండవ రాజధానితో పాటు సుప్రీం బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తే మిగతా ప్రాంత ప్రజలు సైతం స్వాగతిస్తారు. దేశంలో మరే ఇతర నగరానికి లేని అర్హతలు హైదరాబాద్ నగరానికి ఉన్నాయి. రెండవ రాజధాని ఏర్పాటుతో హైదరాబాద్‌కు వచ్చే ప్రయోజనం ఏమీలేదు. ఏడాదికోసారి కొద్దిరోజుల పాటు పార్లమెంటు సమావేశాలను నిర్వహిస్తే ఏం లాభం? సుప్రీం బెంచ్‌ను కూడా ఏర్పాటు చేయాలి. ఈ రెండు ఏర్పాటు చేయాలంటే ముందుగా ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాల్సి ఉంటుంది. అక్కడే వివాదం మొదలవుతుంది.
దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పదేళ్ల పాటు (2024 వరకూ) హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. ఈ నగరాన్ని కోల్పోతే తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధ్వానమవుతుంది. హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధాని చేసినా, తెలంగాణ రాజధాని ఇక్కడే కొనసాగుతుందనడంలో సందేహం లేదు. రెండో రాజధానిగా అవతరిస్తే మాత్రం ఈ నగరంపై విశేషాధికారాలు కేంద్రానికి ఉంటాయి. హైదరాబాద్ నగరంపై తెలంగాణ పట్టు కోల్పోతుంది. కేంద్రం ఆధీనంలోకి వెళితే భూముల రేట్లు పెరుగుతాయి తప్ప, తెలంగాణ ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ను కోల్పోయాక ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న దుస్థితి ఎలాంటిదో అందరికీ తెలిసిందే.
హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని అంటే ఆ పరిధి ఎంతవరకు ఉంటుందన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మనకు మూడు హైదరాబాద్‌లు ఉన్నాయి. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా 204 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ 650 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత హెచ్‌ఎండీఏ పరిధిలో ఏడు జిల్లాలకు చెందిన ప్రాంతాలు, 70 మండలాలు, 1034 గ్రామాలున్నాయి. హెచ్‌ఎండీఏ విస్తీర్ణం 7257 చ.కి.మీ. హెచ్‌ఎండీఏ ప్రాంతాన్ని కేంద్రం కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి తన ఆధీనంలో తీసుకుంటుందా? ఇందులో అనేక చిక్కుముడులు ఉన్నాయి.
370వ అధికరణం రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన కేంద్రానికి హైదరాబాద్‌ను యూటీ చేయడంలో మాత్రం సవాళ్లు తప్పవు. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వ వ్యవహారశైలి నచ్చలేదని హైదరాబాద్ యూటీ చేస్తే- సంక్లిష్ట సమస్యలు తలెత్తుతాయి. రెండవ రాజధాని, సుప్రీం బెంచ్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో కనీసం ఐదు వేల ఎకరాలను సేకరించి పార్లమెంటు భవనం, సుప్రీం కోర్టు బెంచ్‌ను ఏర్పాటుచేసి ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే సరిపోతుంది. ఇందులోకి సికింద్రాబాద్ కంటోనె్మంట్‌లో ఉన్న ఆర్మీ ప్రాంతాన్ని కూడా చేర్చుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేంద్రానికి మధ్య పోలీసు వ్యవస్థతో పాటు అనేక అంశాలపై రాజ్యాంగపరమైన తగాదాలున్న విషయం విదితమే. హైదరాబాద్‌ను రెండవ రాజధాని చేసే శక్తి బీజేపీకి ఉంది. సుప్రీం కోర్టు కొలీజియంను ఒప్పించి బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలి. అంబేద్కర్ దార్శనికతతో వెలిబుచ్చిన అభిప్రాయాలను కేంద్రం నిజం చేయాలి. సుప్రీం కోర్టులో ఈ ఏడాది ఇప్పటి వరకు 58,669 కేసులు దాఖలయ్యాయి. ఇంతవరకు పెండింగ్‌లో ఉన్న కేసులు 58,689 ఉన్నాయి. 37,385 కేసులు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసినట్టే సుప్రీం బెంచ్‌లను నెలకొల్పితే బాగుంటుందని హైదరాబాద్ నుంచి న్యాయ నిపుణులు కేంద్రాన్ని కోరారు. సుప్రీం బెంచ్‌లను దేశంలోని నాలుగు నగరాల్లో ఏర్పాటు చేయాలని 70 ఏళ్ల క్రితమే అంబేద్కర్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలకు సత్వరమే న్యాయం అందించవచ్చని ఆయన సూచనలు కేంద్ర పాలకులకు అనుసరణీయం.

-కె.విజయ శైలేంద్ర 98499 98097