మెయిన్ ఫీచర్

సంగీత - సాహిత్య సంచారిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదం కవిభ్యః పూర్వేభ్యః నమోవాకం ప్రశాస్మహే
వందేమహిచ వాణీం తామమృతాం ఆత్మనః కలామ్’’
(ఉత్తర రామచరిత్ర - భవభూతి)
కవిత్వం ఎప్పుడూ కూడా దేశ కాలాతీతమైనది. కాళిదాసులో వున్న కవిత్వం గాలిబ్ గీతాల్లోనూ వున్నది. కారణం అది సార్వకాలీనతనూ, సార్వజనీనతనూ సంతరించుకుని ఉండటమే. సారస్వతోపాసకులందరూ దైవీగుణ సంపన్నులు. దైవీగుణాంశ లేకపోతే వాడు కళాకారుడు కాలేడు. అందునా కవిత్వం (సారస్వతం) ఆత్మకు సంబంధించిన కళ. కనుక భౌతిక సంబంధమైనది అప్రధానం. అప్రధానమే కానీ అనవసరం కాదు. దైవీ గుణాల్లో మొట్టమొదటిది ‘అభయం’ అన్నాడు గీతాచార్యుడు. భయగ్రస్తుడొక విధంగా జీవన్మృతుడు. షేక్సిపియరు చెప్పినట్టుగా వాడు నిత్యం చచ్చేవాడు. వానికి గానీ, వాని మాటలకు గానీ విలువలేదు. కవి తాను దర్శించిన సత్యతత్వాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. ఎవరికోసమో, తన స్వార్థంకోసమో ఏ ఎండకాగొడుకు పట్టేవాడు కావ్య ప్రపంచ బహిష్కృతుడు. వాని వ్రాతల్లో, చేతల్లో ఎంత చమత్కారమున్నా జీవనముండదు. తాత్కాలిక ప్రయోజనాన్ని సాధించవచ్చుగానీ, శాశ్వత జీవనపరమైన విలువను ప్రతిపాదించదు. సందర్శనం, ప్రదర్శనం- ఈ రెండూ కవికి కావలసిన ప్రధాన గుణాలు. తాను దర్శించిన వస్తు తత్వ భావనలో తాను నిమగ్నుడైనాడా అని విమర్శించుకుని దానిని శ్రోతలకు, పాఠకులకూ ప్రదర్శించాలి. అప్పుడా పరిధిలోనున్నవారు తన్మయులౌతారు. సహృయదులు కవితో మమేకమవుతారు. కవి కౌశలమంతా ప్రదర్శనలో వుంటుంది. అది పద్యం కానీండి, గద్యం కానీండి, పాటలు గానీండి. మహత్తరమైన కావ్యానుభూతిని పొందగలుగుతాడు శ్రోత. ఈ ప్రదర్శనలోనే ఛందస్సు, అలంకారాలు, ఔచిత్యం, బింబ ప్రతిబింబాలు మొదలైన చమత్కారాలుంటాయి. మామూలుగా కన్పించే మాటలు మాయమై, ఆ స్థానంలో మరొక విలక్షణార్థం శ్రోతల మనస్సులకు హత్తుకుంటుంది. అట్లాగని వాచ్యార్థం పూర్తిగా నిరర్థకం కాదు. వాచ్యార్థం, విలక్షణార్థం- రెండూ రమణీయంగా ఉండటమే ఉత్తమం. అప్పుడే పాఠకుడు చకితుడౌతాడు. తాను విన్నది లేదా పాఠకుడు చదివినదీ హృదయానికి హత్తుకునేటట్లుగా చేయడంలో శబ్ద రామణీయకత కూడా తోడ్పడుతుంది.
ఛందస్సు, సంగీతం విడదీయరాని జంట. ఆ సంగీతంవలన శ్రోత వినడానికి కుతూహలం ప్రదర్శిస్తాడు. ఛందస్సు అనగానే ఉత్పలమాల, చంపకమాల మొదలగునవి అనుకోనక్కరలేదు. ఎవరి ఊహ అయినా, భావనయైనా, అనుభూతియైనా అక్షరాలంకృతమైనప్పుడు లయబద్ధంగా ఉండక తప్పదు. వచనమైనా, చెప్పేటప్పుడు, అది పాఠకుడు చదువుతున్నప్పుడు ఊనికలను పాటిస్తాడు. ఆ ఊనిక లయకు జన్మస్థానం. లయ సంగీతానికి జన్మనిస్తోంది. ఆ సంగీతం రాగ తరంగాల సంభరితం. రాగం స్వర సమన్వితం. ఛందస్సునకు ఇంతటి ప్రాధాన్యమున్నది. శ్రీ వేదాంత కవిగారంటారు, ‘్భవోద్రేకముచే జనించు కవితా పద్మాలయా తన్వి- భాషా వైదుష్యముచే విలాసవతియై శ్రావ్యంబుగా గాన విద్యా వైశాల్య వన ప్రదేశముల దీర్ఘాయుస్సుతో నుండు’’ని (కెరటాలు - ఖండకావ్యం). పదిమందిలో ప్రచారం కావడానికి గానం ముఖ్యం. సంగీతంతో కూడిన కవిత్వం పది కాలాలపాటు నిలబడుతుంది. వాల్మీకి, కాళిదాసు వంటి కవులునూ, శంకరాచార్యాది ప్రవక్తలునూ, ఈనాటి ప్రజా సాహిత్యంను ప్రచారం చేసేవారునూ ఛందస్సు నాశ్రయించారంటే, ఆశ్రయిస్తున్నారంటే వారు చెప్పిన, చెప్పుచున్న బోధలకు, భావాలకూ దీర్ఘాయుస్సు నిచ్చేందుకే. ప్రజానీకంలో బహుళ వ్యాప్తి చెందేందుకే. కానీ, ఛందస్సు ఒక శాస్తమ్రే కానీ కవిత్వం కాదు. కవిత్వం ఛందస్సు చేత అచ్ఛాదితమైనదని మాత్రమే చెప్పవచ్చు. ఆచ్ఛాదనను తొలగించుకుని సహృదయు ఆ భావాన్ని మబ్బునుండి బయటకు వచ్చిన చంద్రబింబాన్ని వలె దర్శించగలుగుతారు. ఆ జీవాన్ని మనసులో దాచుకుని మరల, మరల జ్ఞాపకం చేసుకుంటూ ఆనందిస్తారు. ఇతరులకు అందివ్వడానికి ప్రయత్నిస్తారు. జ్ఞాపకముండడానికే ఛందస్సులో వున్న సంగీతం. ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి’ అని సంగీత ప్రాధాన్యాన్ని గురించి చెప్పారు కదా!
‘తాతాతా, తకతా తథింతతా- ఇది శుద్ధ విరాట్ ఛందం. మూడో గణం మొదటి అక్షరం యతి. యతిప్రాసలు శబ్దాలంకారాలలోని భాగాలే. మరి ఇట్లా పాడుతూ పోతే అది కవిత్వం కాదు కదా! కాకపోతే ఆవంత్స సోమసుందరం గారన్నట్లు సంగీతమే కవిత్వమని భ్రాంతిపడే ప్రమాదమున్నది. మునుపటి మన నిఘంటువులు కూడా పద్యాల్లో, శ్లోకాల్లో (్ఛందోబద్ధంగా) వ్రాయడం మనకు జ్ఞాపకముండటానికి మాత్రమే. ఆంధ్ర నామ సంగ్రహంలో దొంగకు పేర్లు చెప్తాడు. ‘‘దొంగ తెక్కలి కాడు దొరకోలు సన్నాసి- ముచ్చెత్తు బలికాడు ముడియ కాడు- టకటొంకుటాటోటు టక్కులాడు- పిసాడి టక్కరి ముడికాడు ఠవలికాడు’’ దొంగకు మరియొక మాట వాడాల్సి వచ్చినపుడు ఇది పనికివస్తుంది. అంతేగాని ఇది కవిత్వం కాదు కదా! దాని ప్రయోజనం జ్ఞాపకముండడమే. శబ్దార్థాలు దాటి, ఛందస్సును దాటి, అలంకారశాస్త్ర పరిధిని దాటివచ్చిన ఒక చమత్కార భావమును కూడా దాటి నిలిచిన అనుభూతి సహృదయుడైన శ్రోత మనస్సును అయస్కాంతంవలె పట్టివేస్తుంది. అది టోటల్ ఎఫెక్ట్‌గా కావచ్చు. పీస్ మీల్‌గా కావచ్చు. ఏ విషయ పరిజ్ఞానానికైనా తత్సంబంధమైన శాస్త్ర పరిచయం అవసరం. మరి అట్లాగే కవిత్వానికీ కావాలి. భాషమీద అధికారం వుండాలి. వ్యాకరణాలంకార శాస్త్రం క్షుణ్ణంగా పరిశీలించాలి. కల్పనా చాతుర్యం ఉండాలి. అందులకు సాధు సాంగత్యం, సత్‌గ్రంథ పఠనం, దేశ సంచారం ముఖ్య సాధనాలు. పెరుగును చిలికి, చిలికి వెన్నను తీసినట్లు, యాతనలు పడీ పడీ నిజమైన వెలుగును చూడాలనే ప్రయత్నం ఉండాలి. కల్పన లేకపోతే కవిత్వం లేదు. ఏ దేశపు కవియైనా ఆ జాతిజనుల సంస్కృతిని జీర్ణింపచేసుకోవాలి. అది వస్తుతః ఆ కవి రక్తంలోనే ఉంటుంది. సంప్రదాయం తెలిసి ఉండాలి. చాలామంది, ఈ పదాలను వాడుతూనే వుంటారు. అభేదమని చెప్పుతూ ఉంటారు. సంస్కృతి స్థిరమైనది. అది రక్తగుణం. సంప్రదాయం సంస్కృతికి విరుద్ధముగాని రీతిలో మారుతూ వుంటుంది. సంస్కృతిలో వివాహ వ్యవస్థ ఒకటి. ఆ వివాహ పద్ధతులు మాత్రం మారుతూ వుంటాయి. రామాయణ, భారతాలలో మనమిప్పుడు చూస్తున్న తాంబూలాలు పుచ్చుకునే పద్ధతి కానీ, వధూవరులు తలంబ్రాలు పోసుకునే ఆచారం కానీ లేదు. తాంబూలాలు పుచ్చుకునే సంప్రదాయం గుప్త రాజుల కాలం నుండి వచ్చి ఉండవచ్చు. సీతారాముల పెండ్లికి కౌసల్యా సుమిత్రా కైకేయిలు రాలేదు. ఇది అప్పటి సంప్రదాయం కావచ్చు. సంస్కృతికి, సంప్రదాయానికీ తేడా తెలిసికొనేందుకు ఈ ఉదాహరణ చాలు.
ఈ మధ్యన ఒక వాదం చోటుచేసికొంటున్నది. అంతకుముందు ఎవరూ చెప్పనివిధంగా చెప్పాలి, కొత్తత్రోవ వెయ్యాలి అని. అదొక్కటే కవిత్వలక్షణం కాదు. వస్తువు, రూపమూ క్రొత్తవే అయితే మంచిదే. వస్తువూ మారుతూ వుంటుంది. రూపమూ మారుతూ వుంటుంది. నన్నయాదులు వృత్తాలలో రాశారు గనుక నేను మాత్రాఛందస్సులో రాస్తాను, లేదా వచనకవిత రాస్తాను అని ప్రతిజ్ఞ పట్టడం సాధువాదన కాదు. నలుగురూ నడిచిన త్రోవలో నడిచిన మాత్రాన అనుకరించటం కాదు. ఎవరి నడక వారిది, ఎవరి పోలిక వారిది. ఎప్పటి వస్తువు అప్పటిది- రూపమూ వలెనే. నన్నయ వ్రాసిన ఉత్పల, చంపకమాలలకూ తిక్కన రాసిన అదే వృత్తాలకూ ఎంతో తేడా వున్నది. ఇది నన్నయదనీ, తిక్కనదనీ తెలుస్తూనే వున్నది. అట్లా కాదని వ్రాసిన పాలకుర్తి సోమన ద్విపదలలో శైవమత విచారం కొట్టవచ్చినట్లు కనపడుతుందే గానీ కవిత్వం కనపడదు. ‘పరమయోగి విలాసం’లోనూ అంతే. కనుక దారి క్రొత్తది, అయినంత మాత్రాన అది కవిత్వం కాదు. క్రొత్తదారి త్రొక్కడం కవి గొప్పతనానికి ఒక తార్కాణ కావచ్చు. తలుచుకున్నపుడల్లా నవ్వు వచ్చేదే హాస్యం. వెకిలి హాస్యం కానట్టు, వెకిలి వ్రాతలు కవిత్వాలు కావు.
శ్రీశ్రీగారు కందాలు వ్రాశారు. ఆ కందాలకు తిక్కన, కుందవరపు కవి చౌడప్ప, గువ్వల చెన్నడు వరవడి పెట్టినారని చెప్పుకొన్నారు. అయినా సిరిసిరిమువ్వల్లో శ్రీశ్రీ తొంగిచూస్తూనే వుంటాడు. శ్రీనాథుని సీసానికి, తిక్కన సీసానికి ఎత్తుగడలోనే కాదు ముగింపులో కూడా చాలా భేదం వుంది. ఎవరి వ్యక్తిత్వం వారిది. వాక్యంలో సగభాగం చదవగానే ఇది చలం రచన అని తెలుస్తుంది. అట్లాగే విశ్వనాథవారి వీధి వేరు. స్ర్తి పాత్ర చిత్రణలో కుటుంబరావు, గోపిచందుల విభిన్న చిత్రీకరణ కనపడుతున్నది. కవి యొక్క సొంత ముద్రను గూర్చి, మూర్తిమత్వాన్ని గూర్చి చెప్పటానికి ఇంతగా చెప్పవలసి వచ్చింది. కవి తనదైన ఒక బాణీని ఏర్పరచుకోవాలి. పరిణత కవితలో అది స్పష్టంగా కనిపిస్తుంది.
కవిత్వానికి ఛందస్సు అవసరమా, అనేది కవి తనకు తానే నిర్ణయించుకోవాలి. దీనికి చంపూ కావ్యాలనూ పేర్కొనవచ్చు. ‘‘బాణోచ్ఛిష్టం జగత్సర్వం’’ అనికదా! బాణభట్టు ‘కాదంబరి’లో కవిత్వం జనానికి జ్ఞాపకముండకపోవడానికి గల కారణం, అది గానయోగ్యంగా లేకపోవడమేనని, ఛందస్సంబంధం లేకపోవడమేనని శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారి అభిప్రాయం. పిండితార్థం; ఎవరికి తోచిన ఛందస్సులో వారు రాయవచ్చు. పాశ్చాత్య కవులు చాలామంది అట్లాగే వ్రాశారు.
సాహిత్యంలో అనేక శాఖలున్నవి. ఏ శాఖ ప్రయోజనం ఆ శాఖకున్నది. బాల సాహిత్యంలో శబ్దం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ పాటల్లో పద్యాల్లో ధ్వనికోసం, వ్యంగ్యం కోసం వెతకగూడదు. అది బాల బాలికల వయస్సు బట్టి వుంటుంది. ఉదా- అల్లవారింటికి - చల్లకెళ్ళాను / నల్ల మచ్చల కుక్క- ‘్భ’మన్నాది / నా కాళ్ళగజ్జెలు- ఘల్లుమన్నాయి. ఇందులో ఛందస్సు వున్నది. అలంకారమున్నది. ఒక తీరు వున్నది. ఒక మాత్ర ఎక్కువైనా, తక్కువైనా అది మన చదవడంలో లయకు ఒదిగిపోతుంది. ఇక్కడ మాటల సౌందర్యం పిల్లలకు శ్రవణ పేయంగా వుంటుంది. భాష నేర్పడమే ప్రధానోద్దేశం. అట్లాగే జానపద సాహిత్యం, హరికథా సాహిత్యం, బుర్రకథలూ, రూపకాలు కూడా. ఇవి ప్రచార సాహిత్యానికి సంబంధించిన ప్రక్రియలు. వస్తువుతోపాటు సంగీతం కూడా వీనిలో ముఖ్యం. జనాన్ని ముందుగా ఆకర్షించేది, అలరించేది సంగీతమే. స్థాయిని బట్టి భాష వుంటుంది. తత్కాల సమస్యలను ప్రచారం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. నిజానికి ఇదే ప్రజా సాహిత్యం (ప్రజలందరికీ కవిత్వం అక్కరలేదు). జనానికి తెలిసిన వస్తువును తీసికోవాలి. దేశ స్వాతంత్రోద్యమానికి, తెలంగాణా విముక్తి ఉద్యమానికి పనికివచ్చాయి. ముందు రచయితకీ, ప్రచార కార్యకర్తకూ గూడా ధైర్యం వుండాలి. నిజాయితీ వుండాలి. ‘‘నీ గోరి కడతాం కొడకో / నైజాము సర్కరోడా’’ అనడానికి ఎంత దమ్ము వుడాలి, ఆలోచించండి! ఈ పాట చేసినంత పని తెలంగాణ విముక్తి ఉద్యమానికి కుందుర్తి ‘తెలంగాణా’ కానీ, ఆరుద్ర ‘త్వమేవాహం’ కానీ చేయలేదు. దాశరథి పద్యాలు చాలా పనికివచ్చాయి. దాశరథి ఆ అగ్నిధారను దర్శించిన ఆ రుద్రవీణను మ్రోగించాడు. ఇటువంటి పాటల్లో లేదా పద్యాల్లో టెక్నిక్కు గానీ విలక్షణార్థ సృజనకానీ వృథా.
ఈ ముందుమాటలో ఇంత మాత్రం చాలు. వస్తువు యొక్క వాస్తవికత తెలిసి వుండాలి. ఈనాడు డంకెల్ ప్రతిపాదన గురించి కానీ, అల్‌కబీర్‌ను గురించి గానీ ఎన్ని పాటలు పాడినా అనుకున్న ప్రయోజనం సిద్ధించటంలేదు. కారణం ఆ సమస్యలు జనానికి తెలియకపోవటమే. కవిత్వమనేది సంగీత, సాహిత్య సంచారిణి. ఆ దేవి సరస్వతి. సారస్వతోపాసకులకు పునఃనమస్సులు.
ప్రముఖ రచయత ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి ‘సుహృలేఖలు’ పేరుతో 1994లో కవులు, రచయతలకు అమూల్యమైన సూచనలు చేశారు. రంగారెడ్డి జిల్లా రచయతల సంఘం ‘సాహితీ సమితి’కి ఆయన రాసిన ఆరు లేఖలు తరువాయ సంచిక నుంచి వరుసగా..
*

- ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి