మెయిన్ ఫీచర్
ఆనందంతో నిస్పృహ దూరం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మనం అనుకున్న రీతిలో జీవితం ముందుకు సాగదు. ఏవో కొన్ని అడ్డంకులు వస్తూనే వుంటాయి. చదువుకునేటప్పుడు కొందరికి కష్టాలు ఎదురైతే, ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతాయి మరికొందరికి. సంసార జీవితంలో చిక్కులు మరికొందరివి. ఇలా జీవితంలో ఆశించినవి జరగకుండా ఏవో తెలియని సమస్యలు ఎదురైనపుడు నిరాశా, నిస్పృహలకు గురవటం జరుగుతుంది. నిస్పృహ అనేది ఒక ఎమోషన్. ఇది కోపం, నిరాశలు ఎదురైనప్పుడు ప్రదర్శించే భావోద్వేగం.
ఒక వ్యక్తి తన ఆలోచనకు, తాను చేయదలచుకున్నదానికి భిన్నంగా లేదా పూర్తిగా వ్యతిరేకంగావున్నా, పని చేయాల్సి వచ్చినపుడు నిస్పృహకు గురవుతాడు. ఆ నిస్పృహలో తాను ఏం చేస్తున్నది తెలియనంతగా ఆ వ్యక్తి ప్రవర్తన మారిపోతుంటుంది. నిస్పృహలో తీవ్రమైన కోపం వస్తుంది. ఆ కోపంలో తనను తాను నష్టపరచుకోవచ్చు లేదా ఇతరులకు నష్టం కలిగించవచ్చు. ఈ స్థితిలో చేసే పనివల్ల ఫలితం పూర్తిగా వ్యతిరేకమవుతుంది. ఇది ఎక్కువమంది జీవితంలో కనిపించేటటువంటిదే.
నిస్పృహ ఏర్పడటానికి మనిషి అంతర్గత బలహీనతలు కారణమవుతుంటాయి. తనలో లోపించిన ఆత్మస్థైర్యం, వ్యక్తిగతంగా లేని రూపం, నలుగురిలో కలవలేని, మాట్లాడలేని వ్యక్తిత్వ లోపాలు వంటివి నిస్పృహలోకి నెడతాయి. బయటనుండి ఎదురయ్యే అంశాలు నిస్పృహకు గురిచేస్తాయి.
తన స్థాయికి మించిన బాధ్యతలను అప్పగించి, తాను వైఫల్యం చెందినట్టుగా చూపించే ప్రయత్నం బాస్ చేసినప్పుడు ఉద్యోగి నిస్పృహలోకి నెట్టబడతాడు. పెత్తనం చెలాయించే జీవిత భాగస్వామికి తనకు ఇష్టంలేని పద్ధతిలో పనులు చేయాల్సి వచ్చినపుడు నిస్పృహకు గురవటం జరుగుతుంది.
ఇలా నిస్పృహలోకి నెట్టబడినవారు మానసికంగా పూర్తిగా కుచించుకపోయి తన బతుకు ఇంతేనన్న భావంతో తమకంటూ
ఒక లక్ష్యం లేకుండా ఉండిపోతారు లేదా ఆవేశం పెరిగిపోయి ఏంచేస్తున్నదీ తెలియని ఉన్మాద స్థితికి చేరతారు. ఈ రెండూ ప్రమాదకరమైన పరిస్థితులే. అందుకే ఈ పరిస్థితినుండి వీలైనంత త్వరగా బయటకొచ్చే యత్నం చేయాలి. మనిషిని నిస్పృహకు గురిచేసే అంశాలు అనేకం వున్నప్పటికీ వాటిలో నాలుగు రకాల అంశాలు ముఖ్యమైనవి. అందరికీ అనుభవంలోకి వచ్చేటటువంటివి.
ఎక్కువమంది జీవితంలో కనిపించే ఈ సవాళ్ళను గుర్తించి, అవి ఎందుకు ఎదురవుతాయి, వాటికి స్పందించాల్సిన తీరు ఏమిటనేది అర్థం చేసుకుంటే జీవితం వీలైనంత వరకు సాఫీగా సాగిపోతుంది. వీటికి అవతల వుండే ఇతర రకాల ఇబ్బందులను ఎదుర్కొని నిస్పృహ నుండి బయటపడగలుగుతారు. ప్రతీది స్పష్టంగా తెలిసి ఉండాలని, అనుకున్న రీతిలో సాగాలని అనుకుంటాం. అయితే జీవితంలో అనేక దశల్లో అనిశ్చితి తప్పదు. జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలు ఎదురవుతూనే వుంటాయి.
జీవితంలో థ్రిల్ కావాలంటే రిస్క్ తప్పదు. అదేసమయంలో రిస్క్‌తో ఎదురయ్యే వాటిని ఎదుర్కొనే మానసిక సంసిద్ధత అవసరం. తన చర్యలకు తానే బాధ్యుడననే భావం ఎవరిలో ఉంటుందో వారిలో నిస్పృహ ఉండదు. ఒక్కొక్కసారి తప్పు జరగొచ్చు. అలాగని తప్పులు చేయకుండానే జీవితం సాగదు. జీవితంలో తానింతవరకు ఒక్క పొరపాటు కూడా చేయలేదని ఎవరైనా అనుకుంటే, వారు ఏ కొత్త పని చేయలేదని అర్థం అన్నాడు ఐన్‌స్టీన్. సమస్యలు లేని జీవితం అనుకున్నవారు సక్రమమైన మార్గంలో వెళుతున్నట్టు కాదన్న వివేకానందుని మాటను గుర్తుంచుకోవాలి.
సమాజంలో అనేక రకాల మనుషులుంటారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో తరహా ప్రవర్తన. ఈ వైవిధ్యాన్ని అంగీకరించలేక అందరూ తనలాగే ఉండాలని, అలా వారుండటంలేదని కోపం తెచ్చుకుని, ఆ కోపం కూడా తగిన ఫలితం ఇవ్వనపుడు నిరాశ, నిస్పృహలోకి నెట్టబడతారు. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని మార్చాలనుకుంటారే కాని తనను తాను మార్చుకోరు. అదే అతి పెద్ద చిక్కు అనే లియో టాల్‌స్టాయ్ మాటల్లో ఎంతో వాస్తవముంది.
నిస్పృహ వదిలించుకోవాలంటే మీరు సాధించాలనుకున్న దానిపై దృష్టి పెట్టాలే కాని మధ్యలో ఎదురయ్యే అడ్డంకుల మీద కాదు. అడ్డంకులను భూతద్దంలో చూసేవారు ఎప్పటికీ జీవితాన్ని మార్చుకోలేరు. నిస్పృహలోనుండి ఎంత త్వరగా బయటపడితే జీవితం అంత ఆనందంగా సాగుతుంది.