మెయిన్ ఫీచర్

వేయిపడగల పాపరేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీ విశ్వవిద్యాలయం పార్లమెంటు హాలు కిటకిటలాడుతున్నది. హాలు వసారా చుట్టూ కూడా జనం గజిబిజిగా ఇరుక్కుని ఉన్నారు. వేదిక ముందువరుసలో విశ్వవిద్యాలయోపాధ్యక్షులు ఆచార్య నరేంద్రదేవ్, విశ్వవిద్యాలయాచార్యులు, ప్రముఖుడు ఆసీనులయి ఉన్నారు. వేదిక నుంచి -
‘‘గోదావరీ పావనోదార వాఃపూర / మఖిల భారతము మా దన్ననాడు, / తుంగభద్రా సముత్తుంగ రావముతోడ / కవులగానము శ్రుతిగలయునాడు’’ - అని మేఘ గంభీర నిర్ఘోషం వినబడగానే కలకలం చప్పున చల్లారింది. అందరూ చెవులు దోరపెట్టుకొని వినసాగారు. శ్రోతలలో తెనుగు తెలియని హిందీ బెంగాలీవారే పెక్కుమంది. వారిని ఏదో రసధుని ముంచెత్తింది. వేదికనుంచి మరికొంత సేపటికి -
‘‘పరసుఖదశా పరీపా
క రామణియక మెరుంగు కచసాన్నిధ్యా
త్తరమణ ప్రథమ స్పర్శ
ప్రరూఢి మెడవొలిచె సూత్రబంధన వేళన్’’
అని వివాహ ఘట్టమూ, ఆఖరున
‘‘అమరీ కైశిక పారిజాత కుసుమో
హాస్వాదు నీ బాలకాం
డము నీ భక్తుడు శోభనాద్రి దగు సం
తానంబు జన్మాద్యపా
యము తప్పించుతః....’’
అని మంగళ పద్యం వినిపించాయి.
పది నిముషాలపాటు కరతాళ ధ్వనుల కోలాహలం ఆగలేదు. తర్వాత ఆచార్య నరేంద్రదేవ్ లేచి వేదిక అధిరోహించి, పద్యాలు చదివినవారిని గాఢాలింగనం చేసుకొని, ‘‘ఈ గమకం, సంస్కృత వృత్తాలగతి, శయ్య దేశంలోనే అపూర్వం. సంస్కృతాంధ్రాలు ఇంత సహజీవనం చేస్తాయని మాకు తెలియదు. ఇలాటి కవి దేశంలో ఉన్నారని కూడా మేము ఎరుగం. హిందీలో ‘రీతి సంప్రదాయ’ మనే విశిష్ట విధానానికి ప్రవర్తకులు తెనుగువారు. ఈ కవి రచనారీతి భారతదేశంలోనే విశిష్టమయింది. దీనిని ఆంధ్ర రీతి అని కాని, విశ్వనాథరీతి అని కాని అందాము’’ అంటూ ఉండగా జయజయ నినాదాలతో మరొకమారు సభాంగణం ప్రతిధ్వనితమైంది. ఆచార్య నరేంద్రదేవ్ ఆ కవికి దుశ్శాలువలు కప్పి, తులసీ రామాయణం, అవదీ వ్యాకరణం, నిఘంటువు మొదలయినవి బహూకరించారు. పర రాష్ట్రంలో సాటి తెనుగువానికి, తెలుగు వాణికి జరిగిన ఆ మహాగౌరవం తలంచుకుంటేనే ఒళ్లు కడిమిచెట్టవుతుంది. ఆ కవి - శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు. వారిని ఫలానా అని చెప్పడం సూర్యుణ్ని దివిటీతో చూపడమే.
విశ్వనాథవారు పట్టి సాధించని సాహిత్య ప్రక్రియ అంటూ లేదు. మెట్టి చూడని సారస్వతమంటూ లేదు. వారిని తలచుకొన్నప్పుడెల్లా హంపీ విరూపాక్షాలయ గోపురం, దానికి అనతిదూరంలోని పంపాసరోవరం, మహాబలిపురంలోని దీపస్తంభం, దాని పక్కనే దొర్లాడే తరంగ హస్తనిస్తులమై మహోదధి, వింధ్యాటవీమధ్య మణిచిత్ర కూటం, దాని పక్కనే పారే గద్గదనదద్గోదావరీపూరం, వేయి మైళ్ళ వేగంతో వీచే ఝంఝామారుతం, దానిని అనుసరించి వచ్చే అకాల జలధర ధారాసంపాతం, అభ్రం కష శిఖరరాజి విరాజమాన హిమవన్నగం, అగాధాధమై తిమితిమింగిలాకులమైన పసిఫిక్ మహాసాగరం స్ఫురిస్తాయి.
వారు ఇంతటివారు కావడానికి నినాదం, స్వయంకృషీ, పట్టుదలనూ. ఈ గుణాలు ఏర్పడడానికి మూలహేతువు వారు తలయెత్తే నాటికే పిత్రార్జితం పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవడం. వారి పితృపాదులు శ్రీ శోభనాద్రిగారు వందంజిల్లర యకరాల పెద్ద భూస్వామి. ఆయన మహభోగి; మహాత్యాగి. వారి యింట భుజించనివారు నందమూరు పరిసర ప్రాంతాలలోనేకాక కృష్ణా జిల్లాలోనే లేరని ప్రతీతి.
విశ్వనాథవారు జన్మించింది నందమూరులోనే (1893), అయినా, విద్యార్థి దశ అంతా బందరులో హిందూ హైస్కూలులోను, నోబుల్ కాలేజిలోను గడిపారు. ఆ దశలో హిందూ హైస్కూలు ఆవరణంలోని కానుగచెట్లెక్కి కూర్చొని, ముచ్చట ముడి సర్దుకుంటూ ‘శృంగార వీథి’ అని పద్యాలు చెప్పారు.
మొదట్లో శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారితో కలిసి పద్యాలు చెబుదామని వారికి ఉబలాటగా ఉండేది. ఒకనాడు బందరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో కలుసుకున్నప్పుడు ‘‘నీతో కలసి పద్యాలు చెబుదామని ఉందోయ్!’’ అన్నారట. ‘‘్ఛస్: నీకేమి వచ్చు. సంస్కృతమా? తెలుగా? ఇంగ్లీషా?’’ అని పింగళివారు కస్సుమన్నారట. ‘ఇది సంగతి?’ అనుకున్నారు విశ్వనాథవారు. పొంగే రక్తం: పట్టుదల పెరిగింది. సంస్కృతం సాధించదలచుకున్నారు. ‘‘సత్కవి చెళ్లపిళ్ల వేంకన గురువంచు జెప్పి కొనగా నదిగొప్ప’’ అని వారు చెప్పుకున్నా, నిజానికి వారి శిక్షాగురువు శ్రీ విమలానంద భారతి (పూర్వాశ్రమంలో శ్రీ కె.టి.రామారావు). వారితో కలిసి, సంస్కృత రామాయణ భారతాలు పిండి చేశారు. పాణినీయం పుక్కిట బట్టారు. ఈ నిరంతర పరిశ్రమ వల్లనే కాబోలు బి.ఎ. పలుమారు తప్పారు. (డిగ్రీ త్వరగా చేతికి రాలేదనే ఆవేదన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికి ‘‘ఆంధ్ర ప్రశస్తి’’ని అంకితమిస్తూ అవతారికలో చెప్పిన ‘‘డిగ్రీలు లేని పాండిత్యము... ఈ పాడు కాలానబుట్టి’’ ఇత్యాదులలో ధ్వనించింది.) తర్వాత వారు ఎం.ఎ., కూడా పాసయారు.
నిరంతర సంస్కృత కావ్య వ్యాసంగంతో విలక్షణత సంపాదిద్దామనే అభినివేశంతో వారి రచన క్లిష్టతరమయింది. అప్పటి బందరు కవులు ముందు మెచ్చుకుంటూ వెనుక వెక్కిరించేవారట. ‘‘పాషాణ పాక ప్రభూ’’ అని కూడా సంబోధించారు. ఆ విమర్శలకు వారి మనసు కొంత కలగుండు పడింది. సంఘర్షణ బయలుదేరింది. ‘‘నా మార్గం నాదే. నేను ఎందుకు ఒకరివెంట పెరుగుపెట్టాలి?’’ అనే నిశ్చయానికి వచ్చారు. ఈ ఆవేదన అర్ధ శతాబ్దిక్రితం కృష్ణా పత్రికలో ప్రకటితమైన కినె్నరసాని పద్యాలలో కనిపిస్తుంది.
వారు జీవిక కోసం నేషనల్, హిందూ, ఎ.సి.కాలేజీలలో కొంతకాలం, విజయవాడ కళాశాలలో ఇరవై ఏళ్లూ ఆంధ్ర భాషాచార్యులుగా ఉన్నా, కరీంనగర్ కళాశాల ప్రిన్సిపాలుగాను ఉన్నా, సాహిత్య అకాడెమీ ఉపాధ్యక్షులుగా ఉన్నా, శాసనమండలి సభ్యులుగా ఉన్నా ప్రధాన వ్యాసంగం రచన. లేడికి లేచిందే వేళ అన్నట్టుగా వారు వెళ్ళిందే కాలేజీ వేళగా గడిచాయి ఉద్యోగాలన్నీ.
వారి తొలి కవిత గిరికుమారుని ప్రణయ గీతాలని అంటారు. మొదటి నవల సగం వ్రాసి వదలిపెట్టారు. ముద్రితమైన మొదటి నవల ఏకవీర. నాటినుంచి పుంఖాను పుంఖంగా పత్రికలలోను, విడిగాను వేయి పడగలు, చెలియలికట్ట, బద్దెన సేనాని, సముద్రపు దిబ్బ, మ్రోయు తుమ్మెద మొదలయిన నవలలు: ఆంధ్రప్రశస్తి, ఋతుసంహారం, విశ్వనాథ మధ్యాక్కరలు, రామాయణ కల్పవృక్షం మొదలయిన కావ్యాలు: కినె్నరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, బానిసల దీవి, ఉయ్యాలతాళ్లు మొదలయిన గేయ కావ్యాలు; నర్తనశాల, సౌప్తిక ప్రళయము, అనార్కలీ, వేనరాజు, త్రిశూలం, కళింగరాజ్యం మొదలయిన నాటకాలు; అద్భుత శర్మిష్ఠ సంస్కృత నాటకం వ్రాశారు. ‘మాకళిదుర్గంలో కుక్క’ మొదలైన కథలు ఎన్నో వ్రాశారు. ఇటీవలనే పురాణవైర గ్రంథమాల పేర దాదాపు ఇరవై నవలలు వ్రాశారు. ఇటీవల వ్రాసింది మ్రోయు తుమ్మెద. ఇంకా నేటికి వ్రాస్తున్నారు; రేపూ వ్రాస్తారు.
ఇంత కవిత చెప్పినా, తిరుపతి వేంకటేశ్వరుల శిష్యులమని చెప్పుకున్నా వారు ఎప్పుడూ అవధానం చేయలేదు. ఒకానొకప్పుడు ‘‘ద్రుపదభూపతి యజ్ఞ్ధూమంబు వెంబడి బాహిరిల్లిన చంద్భ్రమరవేణి’’ అని వేణీ సంహార కథ ఆశువుగా మాత్రం చెప్పారు.
ప్రతి రచయిత పాత్రలకూ ఏదో ఆలంబన విభావం ఉంటుందనడం నిజం. కాని, విశ్వనాథవారి పాత్రలు కొంత వేషం మార్చుకొని తిరిగే లోకంలోని మానవులే పూర్తిగా విశ్వనాథవారు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకం మనుష్యుల సావాసంలో ఉంటారు- వారు పరమోత్తములూ కావచ్చు, పరమ నికృష్టులూ కావచ్చు. అలాటి వారి స్వరూప స్వభావాలన్నీ కొంత కల్పనాకల్పంతో వారి తర్వాతి రచనలలో అచ్చయాయన్నమాటే. పిదప అలాటివారి సహవాసం వారికి ఉండదు. ఈ విధంగా తెరచిరాజు ముంజులూరి కృష్ణారావనే నటుని జీవితం. చెలియలికట్ట ‘ఫ్రీలవ్’ ఉద్యమంపై దెబ్బ. హరిజను నాయకుడైన బద్దెన సేనాని నేటి పలువురి గాథల పుట్ట, వేయిపడగలలో నేటి నాయకులు, పత్రికా సంపాదకులు పలువురు మనకు కన్నుల గడుతారు. వేనరాజు బందరు జాతీయ కళాశాల కుళ్లు కడిగివేసిన మడివేలు. దమయంతీ ద్వితీయ స్వయంవరం తమ ఆంధ్ర విశ్వవిద్యాలయోద్యోగ ప్రయత్న నాటకం. మ్రోయు తుమ్మెద కరీంనగరులోని ఒక మహాగాయకుని ఇతివృత్తం. పేరుకూడా కరీంనగర్ పరిసరాల మ్రోయుతుమ్మెద వాగుదే.
విశ్వనాథవారి రచనలలో శాశ్వత లక్ష్యమేకాక సమసామయికోద్యమాల ప్రభావం గలవీ చాల ఉన్నాయి; ‘‘బానిస గుడిసెల పజ్జల పయోరాశి ఎందులకో?’’ అని ఆరంభమై ‘‘వయోరాశి వీచివాత్య పరుపులిడుట ఇందులకా?’’ అని ముగిసే బానిసల ద్వీపం, ‘‘ఎడ్ల కనులకు గంతలు’’ అని ప్రారంభమయ్యే ఉయ్యాల త్రాళ్లు ఆనాటి భారతీయుల బానిస బ్రతుకుకు ముకురాలు.
విశ్వనాథవారి రచనా విధానం విచిత్రాతి విచిత్రం. కూర్చునే బల్ల అవీ ఏమీ లేవు. పద్యాలయితే వందకు పైగా తలలోనే వ్రాసుకుని తర్వాత స్వయంగా కాయితంపై పెడుతారు. వచనమయితే, వారు చెబుతూంటే ఇతరులు వ్రాసుకోవలసిందే. ఏకవీర వ్రాసినప్పుడు మాత్రం ప్రతి శుక్రవారం టెంకాయకొట్టి పూజ చేసి మిత్రులకు వినిపించే వారట. వేయిపడగలు మొదట్లో స్వయంగా వ్రాయడం ప్రారంభించగా మూడు ప్రకరణాలు మూడునెలలు పట్టింది. ఇది సరికాదని చెప్పడం ప్రారంభించి వేయి పుటలు 29 నాళ్ళలో చెప్పారట. నవల ఏదీ నాలుగునాళ్ళకు మించలేదు.
వారి అలవాట్లు మరీ వింతగా ఉంటాయి. వారు మంచి భోక్త. ఆవకాయలో పచ్చి మిరపకాయ కొరుక్కుంటారు. హాస్య ప్రియులు. వారు జిలేబీ జాతి. స్టంట్ సినిమాలన్నా, ఇంగ్లీషు సినిమాలన్నా వారికి ప్రీతి మెండు.
వారి రచనలలో ఏది నిలుస్తుందీ అంటే ప్రతిదీ నిలుస్తుందనేవారున్నారు. కాని, ‘‘తన కావ్యం ప్రతివాడూ గొప్పదంటాడు. ప్రతివాడూ తన అభిప్రాయమే గొప్పదంటాడు. ఎవరో నా ఏకవీర ఉత్తమమన్నారు. నేను ఉత్తమమని ఎందుకనాలి? ఒక తరంపోయి మరొకతరం వచ్చినట్టు చెప్పిన వేయిపడగలు గొప్పది కాదా? దాని గుణగణాలు ఎవరైనా పరిశీలించారా? ఎంతో ‘సైకాలజీ’ గుప్పించిన చెలియలికట్ట ఏమైనట్టు? పురాణ వైర గ్రంథమాలలో ఒక్కొక్క నవలలో ఒక్కొక్క శిల్పం చూపానే? ఎవరైనా చూచారా? మన ప్రమాణాలు నిలుస్తాయా? ఎంతో పోయె! దేవాలయాలే కూలిపోయె!’’ అంటారు వారు.
‘‘అయినా, అన్నిటికన్నా విశ్వనాథ మధ్యాక్కరలు శిల్పవైలక్షణ్యంతోను, భావనా సౌకుమార్యంతోను దేశిచ్ఛందోవిశేషంవల్లను శాశ్వతంగా ఉంటుందండీ’’ అన్నాను. వారు ఒప్పలేదు. ‘‘రామాయణ కల్పవృక్షాన్ని మించిన కవిత్వం ఉండదు. సర్వశక్తులూ పెట్టి వ్రాశాను. పరమేశ్వరుడు అనుగ్రహించాడు. నారాయణుడే పరమేశ్వరుడు’’ అన్నారు వారు.
పత్రికలంటే వారు ఉగ్రులైపోతారు. పత్రికా సంపాదకులకు శిక్షణ అవసరమని వారి సూచన. ప్రతి అడ్డమైనవాడూ వ్రాసినది ప్రచురించి సాహిత్య ప్రమాణాలు పాడుచేస్తున్నారు పత్రికలవారని, బాధ్యత గుర్తెరగడం లేదని వారి విమర్శ.
వారు పట్టుబట్టలు కట్టుకుని భోజనం చేయడం చూచి ఎవరైనా, ‘‘మరీ సనాతన ధర్మం పునశ్చరితవౌతుందా?’’ అని ప్రశ్నిస్తే, ‘‘సనాతన ధర్మం రాదు. కాని వేదమతానుసరణ తప్పదు. అది వినా ప్రపంచ శాంతి ఉండదు. ఏ ఇజమూ గట్టెక్కించదు. వేదిజం ఒక్కటే శరణ్యం’’ అంటారు వారు.
‘‘మీరు సాధించనిది లేదు. సాహితీ సమితి వారి ఆక్షేపణకు కోపం వచ్చి, పాశ్చాత్య సాహిత్యానే్న మధించివేశారు. ఇంగ్లీషులోను, సంస్కృతంలోను, కవిత చెబితే ఎంతో బాగుండును. దిగంతాలకు కీర్తి వ్యాపించేది’’ అని అంటామనుకోండి. ఇంగ్లీషులో ఏ రవీంద్రుడిలాగో, ఇలియట్స్‌లాగో కవితా భాష వ్రాసే అలవాటు పోయింది. సంస్కృతంలో ఇప్పుడు వ్రాస్తే ప్రాచీన కవుల పరంపరలో ఏ వెయ్యినొక్కటో వాణ్నో అవుతాను. తెలుగులోనంటారా, పనె్నండుగురు ప్రాచీన మహాకవుల తర్వాత పదమూడవ వాణ్ని నేను’’ అంటారు.
లక్షన్నర పుటలకు పైగా వ్రాసిన విశ్వనాథవారు ఏ సిద్ధాంతం చెప్పినా, ఏమి వ్రాసినా వారి రచనలకున్న ప్రాచుర్యం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, భారతదేశంలోనే మరే కవి రచనలకూ లేదు. వారితో పోల్చదగినవారు అలనాటి క్షేమేంద్రుడు, పడమటి సీమ బాల్జాక్, నేటి రాహుల్ సాంకృత్యాయనులూను.
వేయిపడగల పాపరేడూ, చెలియలికట్ట లేని పసిఫిక్ పాథోనిధీ, మూడడుగులతో నేల కొలిచిన త్రివిక్రముడూ ఒక్క రూపంలో తెనుగు సాహిత్య లోకంలో అవతరించినట్టు నాకు పొడగట్టుతారు విశ్వనాథవారు.

- తిరుమల రామచంద్ర