మెయిన్ ఫీచర్

సాధనతో ఇంద్రియ నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
గురూపదేశము పొందినపిదప శ్రవణ, మనన, నిధిధ్యాసములనే సాధనల ద్వారా బ్రహ్మీభూతుడై ఆత్మైకత్వము సాధించుటకు నిరన్తర ధ్యానముచేసిన , శాశ్వత బంధవిముక్తి పొందుటకు యోగ్యుడగును. తత్త్వజ్ఞానార్జన ఎట్లుకల్గునో స్మృతి ఇట్లు బోధిస్తున్నది-
‘‘తద్విద్ధి ప్రణిపాతే పరిప్రశే్నన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినిః ॥ (తత్త్వమును దర్శించిన బ్రహ్మవేత్తలను ఆశ్రయించి, వారిని సేవించి, వినయ విధేయతలతో సంకోచింపక సందేహములను తీర్చుకొనిన శిష్యునకు పరమాత్మతత్త్వజ్ఞానమును వారు సమగ్రమముగా ఉపదేశింతురు- భ.గీ.4-34).
9. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసారవారధౌ
యోగారూఢత్వమాసాద్య, సమ్యగ్ధర్శననిష్ఠయా॥
సంసార సాగరములో మునిగి కొట్టుమిట్టాడే వ్యక్తికి, సమ్యక్ జ్ఞానార్జన, ఆత్మసాక్షాత్కారము కల్గుటకు అతి ముఖ్యమైనది మనోనిగ్రహము చిత్తశుద్ధికొరకు శమదమాది షట్సంపత్తులు పొందుటకు, ఏ మానవుడైనా యోగారూఢుడై తన మనస్సును తానే నియంత్రించుకొనే సాధన, అభ్యాసముతోను, వైరాగ్యముతోను చేయశక్యము. ఎవని శరీరము వాని సొత్తు, ఆ శరీరములోని భాగమే మనస్సు. అందువలన, శరీర ధారుడి ఇచ్ఛానుసారమే వాని మనోబుద్ధులు పనిచేయుట సహజము. సంకల్పవికల్పములు మనోజనితములు.
కూర్మము తన అంగాలను తానే తనలోకి తీసుకుంటుంది; అది ఇతరులపై ఆధారపడదు. అదే విధంగా, ప్రతి వ్యక్తి తన మనస్సును తానే సాధనతో నియంత్రించుకొని తననుతాను ఉద్ధరించుకొనవలెనని భగవద్గీత కూడ బోధిస్తున్నది.
‘‘ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్‌
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపు రాత్మనః॥
(మనిషి తనకుతానే ఉద్ధరించుకొనవలెను. అన్యథా, అధోగతి అనివార్యము. ఏలనన, యథార్థతః తమకు తామే మిత్రులు, శత్రువులు అగుదురు (్భ.గీ.6-5)
10. సంన్యస్య సర్వకర్మాణి భవబన్ధవిముక్తయే
యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః॥
సమస్త కామ్యకర్మలను పరిత్యజించి, స్థిరబుద్ధిగల ధీమంతులు, ఆత్మతత్త్వమును అభ్యసించుటకు పూనుకొని ఉపస్థితులైన విద్వాంసులతో తద్విషయముపై విచారించి, తదేక లక్ష్యముతో మోక్షప్రాప్తికి ప్రయత్నించవలెను.
నచికేతుడనే బాలుడు మరణానంతరము పొందే రహస్యమైన పరలోక విషయముగూర్చి పదే పదే అడుగగా శ్రేయోమార్గము, ప్రేయోమార్గము అనే రెండు భిన్నమార్గములను నరలోకములో జన్మించిన ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఎంచుకునే అవకాశం కల్పించబడినదని మృత్యుదేవత కఠోపనిషత్తులో ఆ మార్గములను ఇలా విశదీకరిస్తాడు- 1) శ్రేయోమార్గాన్ని అనుసరించి శుభమును చేకూర్చే పరమాత్మ అనుగ్రహము తత్త్వజ్ఞానార్జనతో పొందటము, 2) ప్రేయోమార్గం అనుసరించి అవిద్యాప్రేరిత శారీరిక సుఖాలకు దాసులై దుర్గతి పొందటము (క.ఉ.1-2-1).
పిమ్మట ఆ శ్రుతియే ధీమంతుని విశేష లక్షణాలను ఇలా ప్రకటిస్తున్నది-
‘‘పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ స్తస్మాత్ పరాజ్ పశ్యతి
నాంతరాత్మన్‌ కశ్చిత్ ధీరాః ప్రత్యగాత్మానమోక్ష దావృత్తచక్షుః
అమృతత్వమిచ్ఛన్‌॥
(పరమేశ్వరుడు ఇంద్రియాలను బహిర్ముఖంగానే సృష్టించాడు. అందువలన, బాహ్యవిషయాలను గ్రహించే శక్తిమాత్రమే వాటికి ఉన్నది. అంతరాళములో ఉన్న ఆత్మను ఏ ఇంద్రియము గ్రహించలేదు. బహుకొద్దిమందిలో ఒక కృతనిశ్చయుడైన ధీమంతుడే అంతర్ముఖుడై, అమృతత్త్వమును పొందే ఇచ్ఛతో ప్రత్యగాత్మను దర్శించుకొనును).అవివేకులు బాహ్యసుఖములకొరకు ప్రాకులాడుదురు. వారు మృత్యుపాశంలో పడిపోదురు. నిత్యానిత్య పరిజ్ఞానంకలవారు, అశాశ్వతమైన ప్రాపంచిక విషయాలను కోరుకోరు. (క.ఉ.అ.2-1, అ.2-2).
11. చిత్తస్య శుద్ధయే కర్మ న తు వస్తూపలబ్ధయే
వస్తుసిద్ధిర్విచారేణ న కించిత్కర్మకోటిభిః॥
కర్మలయొక్క ఫలితము చిత్తశుద్ధిని పొందుటకు మాత్రమే పరిమితము. వస్తుజ్ఞానము కోటికర్మలు చేసినా లభించదు. వస్తుజ్ఞానలబ్దికి నిరంతర విచారణ, పరిశీలన చేయవలసినదే. అయితే, చిత్తశుద్ధి పునాది వంటిది. చిత్తచాపల్యమే ఏకాగ్రతకు అవరోధము. శుద్ధ మనస్కుడే ఛిన్నసంశయుడై పరిపరి విచారణ చేసి, వస్తుజ్ఞానము పొందశక్యము. యాదృచ్ఛికంగా కోటికర్మలు చేసినా అజ్ఞాన నివృత్తి కాదు. అజ్ఞాన నాశనము కానిదే ద్వంద్వ వైఖరి పోదు. ద్వంద్వ వైఖరితో యథార్థజ్ఞానము సిద్ధించదు. ఈ విషయానే్న ఒక ఉదాహరణతో రానున్న శ్లోకంలో బోధిస్తున్నారు.
12. సమ్యగ్విచారతః సిద్ధా రజ్జుతత్త్వావధారణా
భ్రాన్త్యోదితమహాసర్ప భవదుఃఖవినాశినీ॥
వెలుగులేని ప్రదేశంలో త్రాడును చూచి విష సర్పమని భావించి భయపడిన వ్యక్తికి, భ్రాంతికి నివృత్తిచేయటానికి, దీపపు వెలుగులో త్రాడును చూపిన, సమ్యక్ వస్తు జ్ఞానముకల్గి భయవిహీనుడౌను. రజ్జు-సర్ప దృష్టాంతమును యథార్థజ్ఞాన నిరూపణకు తరచుగా వేదాంతులు వినియోగింతురు. అధ్యాస కారణంగా భ్రాంతి కలుగుతుందని, అధ్యాసకు మూలకారణము అజ్ఞానమే అని తెలియజేయుటమే దీని ముఖ్య ఉద్దేశము. సద్గురువు యొక్క తత్త్వోపదేశముతో, సంశయములన్నీ ఛిన్నా-్భన్నమై పరమాత్మపై దృష్టి కేంద్రీకృతమై ఆత్మజ్ఞానము సిద్ధించుట తథ్యము.
13. అర్థస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోక్తితః
న స్నానేన న దానేన ప్రాణాయామశతేన వా॥
యథార్థ వస్తుజ్ఞానము లేకపోవుటవలన త్రాడును చూచి సర్పమని భయగ్రస్తుడైన వ్యిక్తికి, ఒక హితోభిలాషి త్రాడును చూపినందువలనే భ్రాంతిపోయి నిశ్చితబుద్ధి కల్గినది. అంతేకాని, ఎన్ని దానములు చేసినా, పలు పుణ్యనదులలో స్నానము చేసినా, వందల సంఖ్యలో ప్రాణాయామము చేసినా భ్రాంతివలన కలిగిన భయము పోదు. అదే విధంగా జ్ఞానసంపన్నుడైన గురువుయొక్క ఉపదేశముతోనే సాధకునకు అజ్ఞానము నశించి ఆత్మబోధ కల్గును.

ఇంకా ఉంది