మెయిన్ ఫీచర్
ఆత్మదర్శనంతో ఆనందలోకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
34. శ్రోత్రియో వృజినో కామహతో యో బ్రహ్మవిదుత్తమః
బ్రహ్మణ్యుపరతః శాన్తో నిరిన్ధన ఇవానలః
35. అహేతుక దయాసిన్ధు ర్భన్ధురానమతాం సతామ్॥
ఈ రెండు శ్లోకములలో ఎటువంటి విశిష్ట గుణములున్న గురువును జిజ్ఞాసువు సమీపించవలెనో ఇలా వివరించడమేనది:-
ఆత్మతత్త్వమును బోధించే గురువు, శ్రోత్రియుడు అనగా ఉపనిషత్తులను బాగుగా అధ్యయనముచేసిన వేద విద్వాంసుడు, పాపరహితుడు, ఎట్టి ఆకాంక్ష లేనివాడు, ప్రశాంత మనస్సుగలవాడు, శ్రేష్ఠబ్రహ్మవేత్త, సదా ధ్యానములో నిమగ్నమైన బ్రహ్మతత్పరుడు, శాంతించిన అగ్నివంటివాడు, శిష్యులందు ఎనలేని దయగలవాడు. మరియు సత్పురుషులను ఆదరించే గుణశీలుడై ఉండవలెను.
‘‘అమృతస్య పరంసేతుం దగ్ధేంధనమివానలమ్’’ (అగ్నిలో దహించిన కట్టెలా నా అజ్ఞానమును నశింపజేసి, నా బుద్ధిని తేజోవంతమైన ఆత్మవైపు మరలించే ఆ పరమపురుషుని శరణు నేను పొందుదునుగాక! అని శే్వతాశ్వతరోపనిషత్తులో వినిపిస్తున్నది. అయితే, అచ్చట సర్వేశ్వరుని వేడుకుంటున్నట్లు స్పష్టవౌతుంది (శే్వ.ఉ .6-19). దానిని అనుసరించే ఇచ్చట బ్రహ్మజ్ఞానియైన సద్గురువును ఉద్దేశిస్తూ చెప్పడమైంది. కఠోపనిషత్తుకూడా దుష్కర్మలనుండి విరమించనివారు, ఇంద్రియ లోలత్వం పోనివారు, ధ్యానపరులు కానివారు, శాంతమైన మనస్సులేనివారు, బుద్ధితో ఆత్మజ్ఞానమును పొందలేరని ప్రకటిస్తున్నది- క.ఉ.1-2-24).
36. తమారాధ్య గురుం భక్త్యా ప్రహ్వః ప్రశ్రయ సేవనైః
ప్రసన్నం తమను ప్రాప్య పృచ్ఛేత్ జ్ఞాతవ్య మాత్మనః॥
వినయ విధేయతలతో గురువును సేవించి, భక్తితో ఆరాధించి, ప్రసన్నుడైన అతనిని నెమ్మదిగా సమీపించి ఆత్మతత్త్వము గూర్చి తను ఏమేమి తెలిసికొనవలెనో, వాటి విషయముపై ప్రశ్నించి యథార్థజ్ఞానమును పొందవలెను.
భగవద్గీతలోనూ పరమాత్మ తత్త్వమును గురువులనుండి ఎట్లు పొందవచ్చునో ఇలా బోధింపబడినది-
‘‘తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశే్నన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః॥ (తత్త్వమును దర్శించుకున్న జ్ఞానులవద్దకుపోయి దండప్రణామములను ఆచరించి, వారి సేవను చేసి, భక్తిశ్రద్ధలతో ఉచిత రీతిలో ప్రశ్నించినవారు ప్రీతి చెంది నీకు ఆత్మతత్త్వమును ఉపదేశింతురు- భ.గీ.4-34).
37. స్వామిన్నమస్తే నతలోకబన్ధో కారుణ్యసిన్ధో పతితం భవాబ్దౌ
మా ముద్ధరాత్మీయ కటాక్షదృష్ట్యా ఋజ్వ్వాతికారుణ్య సుధాభివృష్ట్యా॥
ఓ ప్రభూ! నీకు నమస్కారము. నేను జనన మరణాలనే వలయంలో చిక్కుకొని, సంసారమనే సముద్రములో పడిపోయినాను, నీవు కరుణ అనే అమృతమును వర్షించే దయామయుడవు. నన్ను అనుగ్రహించి, నీ కటాక్షవీక్షణ నాపై ప్రసరించి, దయతో సంసార జలధినుండి ఉద్ధరింపుమని నా ప్రార్థన.
38. దుర్వారసంసారదవాగ్నితప్తం
దోధూయమానం దురదృష్టవాతైః
భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః
శరణ్యమన్యం యదహం న జానే॥
గురువర్య! నేను సంసారమనే అగ్నిజావలలో చిక్కుకొని దహించుకుపోతున్నాను. ఏ పాపకర్మల పూర్వవాసనల వలననో పెనుగాలులు నన్ను పడదోస్తున్నవి. భయపీడితుడైన నేను మీ శరణు వేడుకుంటున్నాను. నన్ను మృత్యుముఖమునుండి కాపాడుమని ప్రార్థిస్తున్నాను. అన్యులెవరు నా భయనివృత్తిచేసి నన్ను రక్షింతురో నేను ఎఱుగను.
జననమరణ వలయంలో చిక్కుకున్నవారికి ముక్తి ఒక్కటే మృత్యుముఖం నుండి తప్పించగలదు. అందువలన, వివేకులు ఆత్మజ్ఞానమును ఆశించి బ్రహ్మవేత్త అభయం వేడుకుందురు.
‘‘న తస్య ప్రాణాః ఉత్క్రామంతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి’’అని శ్రుతివాక్కు. (ఆత్మవేత్త యొక్క ఇంద్రియములు లోకాంతర గమనము చేయవు. అతడు ఇక్కడనే పరబ్రహ్మమై పరిపూర్ణబ్రహ్మమును పొందుతున్నాడు. (బృ.ఉ.4-4-6).
39. శాన్తా మహాన్తో నివసన్తి సన్తో
వసన్తవలోకహితం చరన్తః
తీర్ణాః స్వయం భీమభవార్జవం
జనానహేతునాన్యానపి తారయన్తః॥
వసంత ఋతువు ఈ లోకంలో అందరికి సుఖమును ప్రసాదించును. అదే విధంగా లోకశ్రేయస్సును, మంచినిగోరే శాంతచిత్తులు, మహాత్ములు అతిదుఃఖరమైన భీకర సంసార సాగరాన్నిదాటి మృత్యువును జయిస్తారు. స్వలాభమేమీ లేకపోయినా ఇతర దుఃఖభాగులను ఈ సంసార జలధిని దాటే సన్మార్గమును చూపే సత్పురుషులు ఈ లోకంలో నివసిస్తున్నారు.
దయార్ద్ర హృదయులైన జ్ఞాన సంపన్నులను ఆశ్రయించిన శుభము కలుగుననే తాత్పర్యము విశదము.
40. అయం స్వభావః స్వత ఏవ యత్పర
శ్రమాపనోద ప్రవణం మహాత్మనామ్
సుధాంశురేష స్వయమర్మ కర్కశ
ప్రభాభితప్తా మవతి క్షితిం కిల॥
మహాత్ములకు ఇతరుల బాధలను తొలగించాలనే అపేక్ష స్వభావ సిద్ధిము. దీనికి చంద్రుడే తార్కాణము. ప్రపండ భానుడి కిరణాలతో తపించిన భూమిని తన చల్లని కిరణాలతో ఆదుకొనుట అన్ని ప్రాణులకు సదా అనుభవయోగ్యవౌతున్నదే కదా!
41. బ్రహ్మానన్ద రసానుభూతి కలితైః పూతైః సుశీతైః సితైః
యుష్మాద్వాక్కలశ్కోజితైః శ్రుతిసుఖై ర్వాక్యామృతైః సేచయ
సన్తప్తం భవతాప దావదహన జ్వాలాభిరేనం ప్రభో
ధన్యాస్తే భవ దీక్షణక్షణగతేః పాత్రీకృతాః స్వీకృతాః॥
స్వామీ! నీ కరుణాకటాక్ష వీక్షణలకు పాత్రులైనవారు ధన్యులు. నేను ఈ సంసారములోనున్న దుఃఖమనే అగ్నిజాలలో దహించుకుపోతున్నాను.
- ఇంకావుంది...