మెయిన్ ఫీచర్

స్వచ్ఛతే సత్త్వగుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
అజ్ఞాన మాలస్య జడత్వ నిద్రా
ప్రమాద మూఢత్వముఖా స్తమోగుణాః
ఏతైః ప్రయుక్తో న హి వేత్తి కించి
న్నిద్రాలువత్ స్తమ్భవదేవ తిష్ఠతి॥
అజ్ఞానము, సోమరితనము, అసమర్థత, తరచు నిద్రలో ఉండుట, కార్యదీక్ష లేక అజాగ్రత్తతతో మెసలుట, మూఢత్వము ఇత్యాదివి తామస గుణమునకు చెందిన లక్షణములు. ఇవి గల వ్యక్తి ఎల్లవేళల నిద్రావస్థలో ఉన్నట్లు, స్తంభమువలె చేష్టారహితుడై ఉండును.
తామస గుణముచే ఆవరింపబడిన కర్త ఎట్టివాడో వివరిస్తూ స్మృతి ఇట్లు బోధిస్తున్నది ‘‘అయుక్త. ప్రాకృతః స్తబ్ధః శతో నైష్కృతితో అలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే’’ ॥ (బుద్ధికుశలత లేనివాడు, పామరుడు, ధూర్తుడు, సోమరి, పరుల కార్యములకు విఘాతము కలిగించేవాడు, నిత్యము వ్యధ చెందేవాడు, దీర్ఘసూత్రీ అనగా వృధాగా కాలయాపన చేసేవాడు, ఎవడో వానినే తామసకర్త అందురు. - భ.గీ.18-28)
సత్త్వగుణము
119. సత్త్వం విశుద్ధం జలవత్త్థాపి
తాభ్యాం మిలిత్వా సరణాయ కల్పతే
యత్రాత్మబింబః ప్రతిబింబితః సన్
ప్రకాశయత్యర్క ఇవాఖిలం జడమ్‌॥
ప్రకృతః సత్త్వగుణము జలమువలె పరిశుద్ధమైనది. కాని కొంత రజోగుణము, తమోగుణములతో కూడియున్నందువలన లౌకిక జీవనమునకు సంసార బంధమునకు కారణవౌతున్నది. ఆకాశము దేనితోను కలుషితము కాదు, అందువలన స్వతఃసిద్ధముగా నిర్మలము. కల్మష రహితమైన ఆకాశములో, ప్రతిబింబ రూపములో నక్షత్ర సముదాయము దృశ్యవౌతున్నది; అట్లే, సూర్యుని తేజస్సు ప్రతిఫలించగా సమస్త జడపదార్థములు కన్పిస్తున్నవి. శుభ్రమైన అద్దములో జడరూపములైన శరీరము, పర్వతాదులు సహితము ప్రతిబింబ రూపములో ప్రకాశవంతమై కన్పిస్తున్నవి కదా! స్మృతి సత్త్వగుణ విశిష్టతను ఇలా తెలియజెప్తున్నది-
‘‘తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశక మనామయమ్‌
సుఖసంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ॥
(త్రివిధ గుణములలో సత్త్వగుణము స్వచ్ఛమైనది. నిర్మలముగా ప్రకాశించునది వికార రహితమైనది. ఇదియే మనిషికి సుఖమును, జ్ఞానమును సమకూర్చుచున్నది. - భ.గీ.14-6).
120. మిశ్రస్య సత్త్వస్వ భవన్తి ధర్మా
స్త్వమానితాద్యా నియమా యమాద్యాః
శ్రద్ధా చ భక్తి శ్చ ముముక్షుతా చ
దైవీ చ సంపత్తి రసన్నివృత్తిః॥
సత్త్వగుణములో, ఎటువంటి తామస గుణాచ్ఛాదనము లేక స్వల్పముగా రజోగుణము మాత్రమే మిళితమై వ్యక్తి ఏనాడూ గర్వపడదు; తన గురించి గొప్పలు చెప్పుకోడు. యమము తదితర నియమములు ఆచరిస్తూ, భక్తిశ్రద్ధలతో మోక్షమందు మిక్కిలి ఆసక్తి కనబరచును. సత్త్వగుణము ఎక్కువగా ఉన్న కారణంగా, స్వతఃసిద్ధ దైవగుణ లక్షణము తప్ప, ఇతరులను హింసించే రాక్షస ప్రవృత్తి వానికి ఎన్నడూ ఉండబోదు. సత్త్వగుణ లక్షణములు, దైవగుణ సంపద ఉన్నవారిలో ఎక్కువగా కన్పిస్తాయి. భగవద్గీతలో పలుచోట్ల సత్త్వగుణ లక్షణములు బోధించబడినవి. వాటిలో కొన్నింటిని ఇచ్చట సూచించడమైనది.
‘‘తేజః క్షమా ధృతిః శచమద్రోహో నాతి మానితా
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత॥
(అర్జునా! తేజస్సు, సహనత, ఎవరిపైన శత్రుత్వము లేకుండుట, ప్రగల్భాలు పలకకుండుట, దైవీసంపదగలవారి లక్షణములు - భ.గీ.16-3). ‘‘దైవీ సంపద్విమోక్షాయ నిబంధా యాసురీ మతా’’ (దైవీ సంపద ముక్తిని ప్రసాదించునదికాగా అసురీసంపద బంధహేతువని అంగీకరించబడుతున్నది- భ.గీ.16-5).
‘‘ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ
జన్మమృత్యుజరావ్యాధి దుఃఖ దోషానుదర్శనమ్‌॥
(ఇంద్రియ విషయములందు వైరాగ్యము, అహంకార రాహిత్యము, జనన మరణములు, ముసలితనము, రోగము, దుఃఖము కలిగించే హేతువులను విచారించి తెలిసికొనవలెను - భ.గీ.13-8).
‘‘అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్:’’
(ఆధ్యాత్మిక జ్ఞానమందు నిత్యభావము కల్గుట, మోక్షప్రాప్తి మిక్కిలి శ్రేయస్కరమని భావించుట జ్ఞానప్రాప్తికి అనివార్య సాధనములు- భ.గీ.13-11).
పతంజలి యోగ సూత్రాలలోనూ యమనియమములు మోక్షసాధనకు సాధనములని ఉల్లేఖించబడినది. భూతదయ కల్గి, సంయమముతో ప్రవర్తిస్తూ అహింసను ఆచరించుటమే యమము. నిష్కామ ధర్మాచరణతో తపస్సు, జపము, వేదాంత శ్రవణము, భగవదర్చన ఇత్యాది పలు నియమములనాచరించి యోగులు జన్మరాహిత్యసిద్ధికి తమదైన శైలిలో కఠోర సాధన చేయుదురు.
121. విశద్ధసత్త్వస్య గుణాః ప్రసాదః
స్వాత్మానుభూతిః పరమా ప్రశాన్తిః
తృప్తిః ప్రహర్షః పరమాత్మనిష్ఠా
యయా సదానన్దరసం సమృచ్ఛతి॥
విశుద్ధసత్త్వగుణము అనగా రజోగుణము, తమోగుణము ఎంత మాత్రము లేని సంపూర్ణ సత్త్వగుణము. ప్రసన్న వదనము, స్వస్వరూప ఆత్మానుభూతి, నిరతిశయ ప్రశాంతత, లభించినది చాలనే గొప్ప తృప్తి, మహదానందము, నిశ్చలబుద్ధితో పరమాత్మపై కలిగే ఏకాగ్రత, ఇవి శుద్ధసత్త్వముయొక్క లక్షణములు. ఈ గుణసంపన్నుడు, ఎల్లవేళలా నిర్వికల్ప సమాధిస్థితిలో ప్రపంచ స్పృహ లేక ఆనంద రసాస్వాదనలో నిమగ్నమై ఉండుట సహజము.
- ఇంకావుంది...