మెయిన్ ఫీచర్

ఆత్మ స్వయం జ్యోతిస్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు శరీరావస్థలలోను సాక్షిగా వ్యవహరిస్తూ జడరూపములైన అన్నమయకోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనే పంచకోశములకు భిన్నముగా, నీ ఈ శరీరమును ఆశ్రయించి, ఒక చైతన్యస్వరూపుడు స్వేచ్ఛగా వ్యవహరిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రాజ్ఞుడే నీ హృదయస్థానంలో ఉంటూ ‘నేను’అని ప్రకటితవౌతూ, నీ శరీర వ్యవహారమును అనుక్షణమూ వీక్షిస్తున్న పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మ.
128. యో విజానాతి సకలం జాగ్రత్స్వప్న సుషుప్తిషు
బుద్ధితద్వృత్తి సద్భావ మభావ మహ మిత్యయమ్‌॥
ఏది జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలందు, నీ బుద్ధిని దానికి సంబంధించిన ఇతర వృత్తుల ఉనికిని, వాటి అభావాన్ని సదా పరీక్షిస్తూ, నీ కార్యకలాపాలన్నింటినీ సాక్షిగా తెలిసికుంటూ, ‘నేను’అని వ్యవహరిస్తున్నాడో ఆ పదార్థమే పరమాత్మాంశమైన నీ ఆత్మ.
129. యఃపశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కించన
య శే్చతయతి బుధ్ధ్యాది న తద్యం చేతయత్యయమ్‌॥
ఏది తనకుతానే స్వయముగా సమస్తమును చూస్తున్నదో, దేనిని ఏదియూ చూడలేదో, ఏది బుద్ధ్యాదులను చైతన్యవంతముచేసి నడిపిస్తున్నదో, దేనిని బుద్ధితదితర దేహేంద్రియములు చైతన్యవంతము చేయలేవో అదే ఆత్మ పదార్థము.
‘‘నాన్యదతో‚స్తి ద్రష్టృ, శ్రోతృ, మన్తృ, విజ్ఞాతృ’’అని శ్రుతి వాక్యము (మరియొకటి ఏదీ చూచేది, వినేది, ఆలోచించేది, తెలుసుకునేది లేదు- ఛా.ఉ.6-8-7). ఇదే విధంగా, మరో శ్రుతికూడా విన్పిస్తున్నది. ‘‘నాన్యో‚తో‚స్తి ద్రష్టా, శ్రోతా, మన్తా, విజ్ఞాతా ఏష త ఆత్మా అన్తర్యామీ అమృతో‚తో‚ న్యదార్తమ్’’ (ఇంకొకటి చూచేది, వినేది, ఆలోచించేది, తెలుసుకునేది లేదు. శరీరము లోపల ఉంటూ సమస్తమునూ నడిపిస్తున్న ఆత్మ శాశ్వతము, తక్కినవన్నీ నశించేవి - బృ.ఉ.3-7-23). చైతన్య స్వరూపముగా అన్నింటినీ ఆత్మ గ్రహిస్తున్నా, ఆత్మను గ్రహించే ఇంద్రియమేదీ లేదని, శ్రుతి ఇలా నిర్ధారిస్తున్నది ‘‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ’’ (మాటలతో చెప్పలేనిది, ఊహకందనిది- తై.ఉ.2-3-6).
130. యేన విశ్వ మిదం వ్యాప్తం యం న వ్యాప్నోతి కించన
అభారూప మిదం సర్వం యం
భాన్త మనుభాత్యయమ్‌॥
జగమంతా వ్యాపించి ఏది ఉన్నదో, దేనిని ఇంకొకటి వ్యాపించి ఆవరించదో, ప్రకాశగుణములేని యావత్ ప్రపంచము ఏ తేజోమయమైన రూపమును అనుసరించి ప్రకాశిస్తున్నదో అదియే ఆత్మ.సమస్త లోకములు పరమాత్మనే సృష్టింపబడినవని ఐతరేయ శ్రుతి ఇలా తెలియజేస్తున్నది ‘‘స ఇమాన్ లోకానసృజత అంభో మరీ చీర్మరమాపో‚ దో‚ మృఃపరేణ దివం ద్యౌః ప్రతిష్ఠా‚ స్తరిక్షం మరీచయః పృథివీ మరో యా అధస్తాత్తా ఆపః’’ (స్వర్గలోకం పైన అంభలోకమున్నది. దానికి ఆధారము స్వర్గలోకమే. మరీచిలోకము కాంతి కిరణాలతో నిండి యున్నది అంతరిక్షము. భూలోకమే మరలోకము, భూమికి క్రిందనున్నది జలమయమైన ఆపలోకము- ఐ.ఉ.1-1-2). వేరొక శ్రుతి ‘‘ఈశావాస్యమితగ్‌ం సర్వం యత్కించ జగత్యాం జగత్’’అని ప్రకటిస్తున్నది (ఈ జగత్తులో ఉన్న చరాచరములన్నీ పరమేశ్వరుని కారణంగా సంభవించినవి- ఈ.ఉ.1).
పరమాత్మ స్వయం జోతిస్స్వరూపము. జగత్తు జడమయము. ప్రకాశ గుణరహితమైన ప్రపంచము, తేజోరూపమైన పరమాత్మను అనుసరించి ప్రకాశిస్తున్నది. ‘‘తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి’’ (పరమాత్మ తేజోమయ స్వరూపము. ఆ తేజస్సువలననే జగత్తులో సర్వమూ ప్రకాశిస్తున్నది- క.ఉ.2-2-15, ము.ఉ.2-2-10).
131. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనో ధియః
విషయేషు స్వకీయేషు వర్తనే్త ప్రేరితా ఇవ॥

ఆత్మకు సమీపములో ఉన్న కారణంగా, జడపదార్థమలైన మనోబుద్ధులు తదితర ఇంద్రియములు దానిచేత ప్రేరేపింపబడినట్లు, వాటివాటి విషయములందు ప్రవర్తిస్తూ కార్యనిర్వహణ చేస్తున్నవి.
- ఇంకావుంది...