మెయన్ ఫీచర్

‘మలిసంధ్య’లో మనసుకు తోడేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శతమానం భవతి’... అంటూ పెద్దలు చిన్నవారిని నూరేళ్లు నిండుగా జీవించాలని ఆశీర్వదిస్తూ వుంటారు. ఒక మనిషి వంద సంవత్సరాలు జీవిస్తే గనుక ‘సంపూర్ణ జీవితం’ అనుభవించినట్టని వారి దృష్టిలో అర్థం. ఈ నూరేళ్ల జీవితంలో ముఖ్యమైన మజిలీలుగా షష్టిపూర్తి, సప్తతి, అశీతి, సహస్ర చంద్రోదయం వంటి వేడుకలు నిర్వహించడం మన భారతీయ సంప్రదాయం. తల నెరిసిన వృద్ధులు (జుట్టుకు రంగువేసుకునే పద్ధతి ఒకప్పుడు లేదు.) అనుభవానికి, విజ్ఞతకు ప్రతీకలనే గౌరవం కూడా ఒకప్పుడు వుండేది(ట). మరి నేటి నవ నాగరిక సమాజంలో పరిస్థితి ఏమిటి?
ధనిక వర్గాలు, కొంతవరకూ ఎగువ మధ్యతరగతికి చెందినవారి విషయం ఎలా వున్నా- దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకు, దారిద్య్ర రేఖ దిగువన వున్న నిరుపేద వర్గాలకు చెందిన వారిలో నేడు వృద్ధాప్యం అనేది ఒక శాపంగా పరిణమించింది. పెద్దల పట్ల గౌరవం, మర్యాదల సంగతి దేముడెరుగు..! తిట్లు, శాపనార్థాలు, ఇంటినుండి గెంటివేతలు, ఏవగింపు, వివక్ష.. ఇలాంటి పరిణామాలు నేడు చాలామంది వృద్ధుల జీవితాల్లో చోటుచేసుకుంటున్నాయి.
వృద్ధుల దయనీయ పరిస్థితిని దృష్టిలో వుంచుకొని 1982 జూలై 26వ తేదీ నుంచి ఆగస్ట్ 7వరకూ ఐక్యరాజ్యసమితి వియన్నాలో ‘ప్రపంచ వృద్ధుల మహాసభ’ (వరల్డ్ ఎసెంబ్లీ ఆన్ ఏజింగ్) నిర్వహించింది. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు, మేధావులు ఈ అంతర్జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నో ఉపన్యాస విన్యాసాలు జరిగాయి. ఈ సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సమితి (డబ్ల్యుహెచ్‌ఓ)- ‘జీవితానికి జీవం పొయ్యండి’ (ఏడ్ లైఫ్ టు ఇయర్స్) అనే నినాదాన్ని కూడా ఇచ్చింది. ఎక్కువ కాలం జీవించే మర్రిచెట్టు బొమ్మను ఈ సమావేశానికి ‘లోగో’గా తీసుకున్నారు. ఇదంతా బాగానే వుంది. కానీ, చివరకు జరిగిందేమిటి? అన్నది ప్రశ్నార్థకమే. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్య సదుపాయాలు పరిమితంగా వుండేవి. కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలతోసహా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ సహజ మరణాల రేటు బాగా తగ్గుముఖం పట్టింది. మొండి వ్యాధులకు సైతం వైద్యచికిత్స అందుబాటులోకి రావడంతో వృద్ధుల సంఖ్య పెరగడానికి ఆస్కారం కలిగింది. 1950-1980 సంవత్సరాల మధ్య కాలంలో వృద్ధుల సంఖ్య మూడింతలు పెరిగింది. ‘ఇరవై ఒకటవ శతాబ్దం- వృద్ధులతో నిండి వుండే శతాబ్దం’- అనే పరిశీలనలో కొంత అతిశయోక్తి వున్నప్పటికీ, ప్రపంచ జనాభాలో నానాటికీ అధికమైపోతున్న వృద్ధులకు సంబంధించిన సమస్యలు మాత్రం నిర్లక్ష్యం చెయ్యదగ్గవి కావు.
మన దేశం విషయమే తీసుకుంటే 1950వ సంవత్సరంలో మనిషి సగటున 36 సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశం వుండేది! 2011 జనాభా లెక్కల ప్రకారం అది 65 సంవత్సరాలకు పెరిగింది. 2001-2011 సంవత్సరాల మధ్యకాలం తీసుకుంటే - మన దేశ జనాభా 17.7 శాతం పెరిగితే, 60 సంవత్సరాలు పైబడిన వారి సంఖ్య 35.5 శాతం పెరిగింది! ఇక, 2011 జనాభా లెక్కల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 39.7 మిలియన్లు వుంది. వీరిలో 70 ఏళ్లు పైబడిన స్ర్తిలు 20.3 మిలియన్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే- జనాభాలో 3.44 శాతం మంది 70 ఏళ్లు పైబడిన వారున్నారు.
సాంకేతికత, ఆధునిక వైద్య విజ్ఞానం విస్తరించినప్పటికీ వృద్ధుల సమస్యలు పలురకాలుగా వుంటాయి. వీటిలో ఆర్థికపరమైనవి, మానసిక పరమైనవి, ఆరోగ్యపరమైనవి ముఖ్యమైనవి. దారిద్య్రరేఖ దిగువన వున్న వృద్ధులలో ఆర్థికపరమైన సమస్య ప్రత్యేకంగా గమనించదగ్గది. ఈ కేటగిరీకి చెందిన కుటుంబాలలోని వృద్ధులు పిల్లలకు భారమవుతారు. కొందరు కఠినాత్ములైన పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రులను ఇంటిలోనుండి గెంటివేస్తుంటారు. మరికొన్ని కుటుంబాలలో వృద్ధులను మానసికంగా హింసిస్తుంటారు. 2012వ సంవత్సరంలో ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ సంస్థ దేశంలోని 12 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో- 60 ఏళ్లుపైబడిన వృద్ధులలో ప్రతి పదిమందిలో కనీసం నలుగురు తీవ్రమైన దూషణలకు గురవుతున్నారు. ప్రతి పదిమంది వృద్ధులలో కనీసం ముగ్గురు తమ కుటుంబాల్లో తీవ్ర నిర్లక్ష్యానికి లోనవుతున్నారు. మిగిలినవారు ఏమాత్రం గౌరవానికి నోచుకోవడం లేదు. అయిదుగురులో ఒకరు స్వకుటుంబీకుల చేత దెబ్బలు కూడా తింటున్నారు! ఆర్థిక స్వతంత్రత లేని కారణంగా వృద్ధులు ఈ తరహా అవమానాలన్నీ భరించవలసి వస్తున్నది అని ఆ నివేదిక పేర్కొంది.
వయసు పెరుగుతున్నకొద్దీ వృద్ధులకు అనారోగ్య సమస్యల బాధ ఎక్కువగా వుంటుంది. రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, గుండె సంబంధిత సమస్యలు వంటి అనారోగ్యాలేకాక- శరీర అవయవాలు కూడా శిథిలమై పనిచెయ్యడం మానెయ్యడం గాని, సరిగా పనిచెయ్యకపోవడం గాని వుంటుంది. వృద్ధుల ఆరోగ్యంపై ఇటీవల ప్రచురితమైన ఒక నివేదికలో 13శాతం మంది వృద్ధుల్లో కనీసం ఒక అవయవం సరిగా పనిచెయ్యడం లేదు! ఈ విధమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులు వైద్యం ఖర్చు భరించడం అనేది పేద కుటుంబాలలో చాలా కష్టమైన పని. ఈ విషయాలకు సంబంధించిన ఆర్థిక సమస్యలకు ఉపశమనం కలిగించేందుకు- ‘నేషనల్ ఓల్డ్‌ఏజ్ పెన్షన్ స్కీమ్’ఉన్నది, కానీ, దానివలన ఒక్కొక్క వృద్ధునికి లభించే ఆర్థిక సాయం 200 నుండి 500 రూపాయలకు మించదు. కేంద్రం యిచ్చే ఈ ఆర్థిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం మరికొంత కలిపి వృద్ధులకు అందజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి సహాయం 1000 రూపాయల దాకా లభిస్తుంది. అయితే- ఇది లభించడంలో చాలా మతలబులుంటాయి. మంజూరు అయిన పెన్షన్ కూడా సరిగా రాదు. దేశం మొత్తం మీద చూస్తే ‘హెల్ప్‌ఏజ్’ సంస్థ సర్వే ప్రకారం- ఏదో విధమైన పింఛను పొందుతున్న వృద్ధులు 11 శాతం మించి లేదు. 2014లో ‘గ్లోబల్ ఏజ్ వాచ్’ సూచికను ఐక్యరాజ్యసమితి వారు 86 దేశాలకు లెక్కిస్తే, వృద్ధుల పరిస్థితికి సంబంధించి భారతదేశం 71వ స్థానాన్ని పొందింది. ఈ నేపథ్యంలో మన దేశంలోని వృద్ధుల పరిస్థితి ఎంత దయనీయంగా వుందో తెలుస్తుంది.
ఈ పరిస్థితిని సమూలంగా తొలగించడానికి ప్రభుత్వం సరైన ప్రయత్నం చెయ్యడం లేదు. అయితే, 2007లో కేంద్ర ప్రభుత్వం ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్’ పేరిట ఒక చట్టం చేసింది. దేశంలోని అన్ని మతస్తులకూ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం తమ తల్లిదండ్రులను పోషించని పిల్లలు శిక్షకు లోనవవలసి వుంటుంది. వృద్ధులకు సంతానం లేకపోతే వారి సంరక్షణ బాధ్యత- వారి ఆస్తికి ఎవరు వారసులవుతారో వారికి చెందుతుంది. ఇది వినడానికి బాగానే వుంది గాని, తినడానికే తిండి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు తల్లిదండ్రుల అవసరాలు ఎలా తీర్చగలరు?- పిల్లలు లేని బీదవారి ‘ఆస్తులకు’ వారసులెవరు వుంటారు?- ఎవరు వారిని చూస్తారు?- వృద్ధులలో స్ర్తిల పరిస్థితి మరింత భయంకరంగా వుంటుంది. వివాహం కాని స్ర్తిలను ఈ చట్టం ఎలా రక్షిస్తుంది?- ప్రభుత్వం ఈ బాధ్యతను ప్రజలపై నెట్టెయ్యకుండా, వృద్ధుల సంక్షేమానికి మరిన్ని చర్యలు చేపట్టవలసి వుంది.
ఆర్థికంగా ఎటువంటి లోటులేని వృద్ధుల విషయంలో కూడా కొన్ని రకాల సమస్యలు తీవ్రంగానే వుంటాయి. వారికి తిండి, బట్టకు లోటులేకపోయినా, ఎయిర్ కండిషన్డ్ గదులు వున్నా- భరించలేని ఒంటరితనం వారిని నిరంతరం బాధిస్తుంది. ఇంట్లో పిల్లలు వున్నా ఎవరూ వారి సలహాలను, మాటలను ఖాతరు చెయ్యరు. వారికి ఆత్మీయ హస్తం అందివ్వరు. మానసిక సమస్యలు- ముఖ్యంగా ‘డిప్రెషన్’ వారిని బాధిస్తుంది. ఇక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వుండనే వున్నాయి.
ముసలివాళ్లకు జీర్ణించుకుపోయిన వ్యాధులు (క్రానిక్ డిసీజెస్) వుంటాయి. అందుచేత వారిని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్యులు ఎక్కువ ఉత్సాహం చూపరు. ‘వాళ్లు మంచం ఎక్కితే ఓ పట్టాన దిగరు. మరో రోగికి మంచం దొరకదు..’ అనేదే వైద్యుల భయం.
వృద్ధుల సమస్యలను బహుముఖంగా ఎదుర్కొనవలసిన సమయం ఆసన్నమైంది. వారిని ఆర్థికంగా ఆదుకొనడం ఎంత ముఖ్యమో- వారికి మనశ్శాంతి కలిగించేలా ఏదో ఒక వ్యాపకం చూపించగలిగేలా బృహత్ కృషి జరగవలసి వుంది. ఇందుకు ప్రభుత్వేతర సంస్థలు (ఎన్.జి.ఓ.లు) మరింత కృషి చెయ్యవలసి వుంది. ‘వృద్ధుడైనంత మాత్రాన ఎవరూ వ్యర్థుడు కాడు’ అనే అవగాహన ప్రజలలో, ముఖ్యంగా యువతలో కలగడం అత్యంత అవసరం. ఇది జరిగిననాడు వృద్ధాప్యం శాపం కానేకాదు. వృద్ధుల సమస్యలపై అన్ని వర్గాల వారూ చిత్తశుద్ధితో దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు దేశదేశాల్లో ఏటా అక్టోబరు ఒకటవ తేదీన ‘ప్రపంచ వృద్ధుల దినం’ పాటిస్తున్నారు.

-కోడూరి శ్రీరామమూర్తి 93469 68969