మెయిన్ ఫీచర్

ప్రశ్నకు బదులేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ దశాబ్ధపు ముగింపు ఏడాది ఆరంభంలోనే-
రెండు విషయాలు ప్రత్యేకమైన చర్చకు వస్తున్నాయి. అది -టాలీవుడ్‌కు రియల్ సూపర్‌స్టార్ కృష్ణకు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి సజెస్ట్ చేయడం. టాలీవుడ్ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించి -సౌత్‌లోనే టాప్ ప్రొడ్యూసర్‌గా నిలిచిన తన తండ్రి అల్లు అరవింద్‌కు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని తనయుడు అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేయడం. ఈ రెండూ పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రతిపాదనలే. ఈ ప్రతిపాదనలకు ప్రజామద్దతు కూడా ఊతమిస్తే -సాధ్యమయ్యేవే. అదే సాకారమైతే -ఇద్దరు ఉద్దండులకు న్యాయం జరిగినట్టే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. కాకపోతే -అంతే స్థాయిలోనో.. అంతకంటే ఎక్కువ స్థాయిలోనే ఇదే టాలీవుడ్ ఎదుగుదలలో భాగమైన మిగిలిన వాళ్ల మాటేంటి? తెలుగు కళామతల్లికి అంకితమై’పోయిన దిగ్గజ ఉద్దండుల మాటేంటి? నడుస్తున్న పరిశ్రమ మస్తిష్కం నుంచే మాయమైపోతున్న -పాతతరం మహానుభావులకు మనం చేసిన న్యాయమెంతవరకు? అన్న ప్రశ్నకు ఉద్భవించక మానవు.
**
జీవితంలో సాధించిన దానికొక -తృప్తివుంటుంది. చేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తే ఆనందం కలుగుతుంది. కార్యశూరుడెప్పుడూ -తన కృషిని గుర్తించాలని అనుకోడంటారు. చెప్పుకోవడానికి అలాంటివి బాగానే ఉంటాయి. కానీ, కళారంగంలో గుర్తింపే శక్తికిమించిన ఆయుష్షునిచ్చేది. అలా -టాలీవుడ్‌లో తమ పని తాము చేస్తూ -ఆశించిన గుర్తింపు లభించకుండానే వెళ్లిపోయిన వాళ్ల జాబితా చిన్నదేం కాదు. ఆ కాలం నుంచి ఈ కాలం వరకూ పరిశ్రమలో కొనసాగుతూ -పేరొచ్చినా ప్రఖ్యాతికి నోచుకోని వాళ్లూ తక్కువేం లేరు. అలాగని ‘అవార్డులు’ కోసం పబ్లిక్‌లో ప్రతిపాదనలు తీసుకొచ్చిన సందర్భాలు బహుతక్కువ. మారిన కాలంతోపాటు మార్పులకు సంకేతంగా -ఈ కొత్త ప్రతిపాదన చూడాల్సి వస్తుందన్న చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.
**
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి ప్రసంగిస్తూ -సూపర్‌స్టార్ కృష్ణకు చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే ఇవ్వాలన్నారు. ఒకరోజు తేడాలో జరిగిన అల.. వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ సైతం తండ్రి అల్లు అరవింద్‌కు ‘పద్మశ్రీ’ ఇవ్వాలంటూ ప్రతిపాదించారు. ఈ రెండు ప్రతిపాదనల్లో తప్పు ఉండకపోవచ్చు. కానీ, ప్రతిపాదించిన విధానం.. అంతకుముందు తరానికి దక్కిన ప్రతిఫలం.. లాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని ఉంటే -ప్రతిపాదనల్లో వాస్తవికత జ్యోతకమయ్యేది.
**
నటశేఖర్ కృష్ణను తక్కువ చేసి చెప్పలేం. రియల్ సూపర్‌స్టార్ అనటంలో సందేహం లేదు. సినిమా పరిశ్రమలో కొత్తగా ఎటువంటి సాంకేతికత వచ్చినా -ఆ అనుభూతిని ప్రేక్షకుల ముంగిటకు తెచ్చిన హీరో ఆయన. సినిమాస్కోప్ పద్ధతిని తొలిసారిగా అల్లూరి సీతారామరాజు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన క్రెడిట్ ఆయనది. కౌబాయ్ తరహా చిత్రాలను అందించి, మోసగాళ్లకు మోసగాడు వంటి భారీ బడ్జెట్ ట్రెండ్ సెట్టర్ చిత్రాన్ని తీసిందీ ఆయనే. తరువాత వచ్చిన 70 ఎంఎం స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్‌లో రూపొందించిన ‘సింహాసనం’ చిత్రం ఆయన ఖాతాలోనిదే. దేవుడే గెలిచాడు, హేమాహేమీలు, అవేకళ్ళు, దొంగలకు దొంగ, గూఢచారి 116లాంటి చిత్రాలతో సూపర్‌స్టార్ అయ్యాడు. స్టూడియో అధినేతగా, అనేకమంది కొత్త హీరో హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన కీర్తీ ఆయనదే. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎక్కడా రాజీపడని తత్వంతో సినిమాను కొత్తపుంతలు తొక్కించాడు కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్నార్ మల్టీస్టారర్ చిత్రాల తరువాత ఎన్టీఆర్- కృష్ణల హవా దేవుడు చేసిన మనుషులు చిత్రంతో సాగింది. రాజ్ సీతారాం వంటి నూతన గాయకుడినే కాదు, ఎంతోమందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ట్రాక్ రికార్డు ఆయనది. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన సేవలు అపారం.
బన్నీ ప్రతిపాదించిన అల్లు అరవింద్‌దీ టాలీవుడ్‌లో చిన్న స్థానమేం కాదు. సుదీర్ఘ ప్రయాణం చేసిన నిర్మాతే.
గీతా ఆర్ట్స్ పతాకంపై ఎన్నో చిత్రాలు తెరకెక్కించారు. దేవుడే దిగివస్తే లాంటి సోషియా ఫాంటసీ చిత్రాలనూ అందించారు. పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూట్ చేశారు. అభిరుచి కొద్దీ స్క్రీన్‌పైనా అరవింద్ కనిపించి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్‌కు వున్న స్థానంలో వీళ్లిద్దరి భాగస్వామ్యం లేదని చెప్పడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరి అభిమానానికి తగ్గట్టు వాళ్లు అవార్డులకు ప్రతిపాదించటంలోనూ తప్పులేదు. కానీ ఎంతో ఎత్తులకు ఎదిగి, ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి ఇప్పటికీ నిశ్శబ్దంగా వున్నవాళ్లను ఎవరు ప్రతిపాదించాలన్నదే సిసలు ప్రశ్న. తెలుగు చిత్ర పరిశ్రమకు వనె్నలద్ది హొయలొలకించి అద్భుతమైన పరిశ్రమగా తీర్చిదిద్ది మహామహులను ఇలాంటి సందర్భాల్లోనైనా స్మరణ చేసుకోకుండా ఉండగలమా? నటనకు ఆద్యుడైన చిత్తూరు నాగయ్య నుంచి మొదలుపెట్టి లెక్క చూడాలి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఎక్కడికెళ్లినా ఏనుగు అంబారీలపై ఊరేగిన అద్భుతమైన నటులు టాలీవుడ్‌లో లేకపోలేదు. తెలుగులో తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నెత్తికెత్తుకొని అటు తెలుగు, ఇటు తమిళం మరోవైపు హిందీ భాషల్లో దర్శకత్వం వహించి అదే సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించి తన పాటలను తానే పాడుకున్న గొప్ప విదూషిమణి భానుమతి మన మధ్య లేకుంటే మాత్రం -మర్చిపోగలమా? రచయిత, నిర్మాత, స్టూడియో అధినేత, గాయని, నటివంటి ఎన్నో నెమలి ఈకలు ఆమె కిరీటంలో ఉన్నాయి.
విదేశాల్లో భారతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగినపుడు తొలిసారిగా ఉత్తమనటుడిగా అవార్డుపొందిన యస్వీఆర్‌ను తక్కువ చేయగలమా? నటనలో యస్వీఆర్, గాత్రంలో ఘంటసాల.. ఇలా ఒక్కో విభాగంలో అద్వితీయ ప్రతిభ చూపించిన నాటితరాన్ని ఎవరు ఎలాంటి అవార్డులకు సిఫార్స్ చేశారు? ప్రతిభను గుర్తించి పరిశ్రమకు తీసుకొచ్చిన స్టూడియో అధినేత్రి, నటి, దర్శకురాలు, నిర్మాత, గాయని సి కృష్ణవేణమ్మ మన మధ్యేవున్నా -ఆమెను ఎవరు ఏ అవార్డుకు ప్రతిపాదించారు. ఎవరినుంచీ ప్రతిపాదన రాలేదంటే -అవార్డుకు ఆమె అర్హురాలు కారనా?
ఎవరి ఆకలి వాళ్లే తీర్చుకోవాలి.. ఎవరి ప్రతిభను వాళ్లే చెప్పుకోవాలి.. ఎవరి అవార్డును వాళ్లే వెతుక్కోవాలి -అన్న చందం టాలీవుడ్‌లో ఎదురయ్యే పరిస్థితికి ఎవరిని నిందించాలి.
టాలీవుడ్ అనేది -కళాకారుల సకుటుంబం. కళామతల్లి తెలుగింట -ఘనాపాటీల గొప్పతనాన్ని చెప్పుకోడానికి, గుర్తింపునిచ్చే ప్రయత్నం చేయడానికీ ఏదైనా తరుణోపాయం కనిపెడితే మంచిదేమో. ప్రతిభావంతులకు గౌరవాలు అందాల్సిందే. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం ఉండదు. ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో కనీసం పద్మశ్రీకి నోచుకోని అర్హులైన సీనియర్లు ఎంతమంది లేరు. వాళ్ల ఘనతకు గుర్తింపునిమ్మంటూ ప్రతిపాదించే వాళ్లే లేరు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఎవరు ఎవరినీ పట్టించుకోరు. పట్టించుకోమని ఎవరూ అడగరు. అంతమాత్రాన -ప్రతిభను గుర్తించి ప్రోత్సహించటం మానుకోవాలా? ఒక్కటి మాత్రం మేలే జరిగింది. అటు చిరంజీవి, ఇటు అల్లు అర్జున్ చేసిన సరికొత్త ప్రతిపాదనలు -కొత్త ఆలోచనలకు నాంది పకాలి. పరిశ్రమ అంతా ఒకతాటిపైకొచ్చి -ఏటా ఇద్దరికైనా కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు అందేలా ప్రణాళికలు రచించాలి. వారికొస్తే మనకేం వస్తుంది అన్న ఉదాసీనతను వదిలేయాల్సిన సందర్భమిది. మనకన్నా ముందుతరాల్లో అద్భుతమైన చిత్రాలను అందించి తెలుగు చిత్ర పరిశ్రమను గౌరవ స్థానంలో నిలబెట్టిన పెద్దలను గౌరవించుకునే సంస్కృతి ఇప్పటినుంచైనా మొదలవ్వాలి. దీనికోసం టాలీవుడ్‌లో స్వయంకమిటీ ఏర్పాటై, ఘనత ప్రాతిపదికన కేంద్రానికి నివేదికలు ఇవ్వాలి. పరిశ్రమకు పెద్ద అన్న గౌరవాన్ని అందుకుంటున్న పెద్దలు -పూనుకుంటే ఇది అసాధ్యమా? గతంలో ఇటువంటి పురస్కారాలు సాధించిన నాగిరెడ్డి, అక్కినేని, డి రామానాయుడు లాంటివాళ్లే ప్రేరణ. అదే ఉత్సాహంతో పరిశ్రమ కీర్తి కిరీటాలను సాధించాలని ప్రతి తెలుగువాడూ కోరుకునేదే.

-జి రాజేశ్వరరావు