మెయిన్ ఫీచర్

నరకాసురుడు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరకాసురుడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తినపుడు, ఆయనకూ భూదేవికీ సాంగత్యమేర్పడింది. దాని ఫలమే ఈ నరకాసురుడు. భూదేవి కుమారుడు. వాడికా విషయం తెలియదు. బ్రహ్మను గూర్చి కఠోర తపస్సు చేశాడు, దారుణమైన వరాలు అడిగి, పొందాడు. వరగర్వంతో స్వర్గంమీద దండెత్తాడు. దేవతలను హింసించి స్వర్గ్ధాపతి అయాడు. యజ్ఞయాగాది ఫలములన్నీ వాడికే చెందాలని మహర్షులను నిర్బంధించాడు, వారంగీకరించకపోతే చిత్రహింసలు పెట్టాడు. వాళ్ళంతా శ్రీకృష్ణుని ప్రార్థించారు. వాణ్ణి వధించి ధర్మాన్ని నిలబెడతానన్నాడు, శ్రీకృష్ణపరమాత్మ. సత్యభామతో సహా బయలుదేరాడు యుద్ధానికి.
నరకుని సహచరులైన మురాదులను మట్టుపెట్టాడు. అజ్ఞానమనే అంధకారానికి సంకేతమే నరకుడు. నరీయతే ఇతి నరః- ముక్తిలభించే వరకూ వదలని తత్వం- జీవభావం. జీవుడు నరుడైతే, జీవుడికి ఉన్న అజ్ఞానం- నరకుడు. ఇదే అసుర. స్వరూపంతో రాజిల్లేది సుర, అంటే జ్ఞానం. అది లేకపోతే అసుర. అజ్ఞానమున్న నరుడాసురుడు. ప్రాగ్జోతిషమే నివాసస్థానం. ప్రాక్కంటే ఏమిటి? ప్రాచీనం ఏమిటి దీనర్థం? పురాతనం నుంచీ మనలో ఆత్మ చైతన్య జ్యోతి ఉంది. ఎప్పుడూ ఉంటుంది. దాన్ని గుర్తిస్తే మనలో అసుర భావనలు నశిస్తాయి, మనవతా విలువలు తెలుస్తాయి, దైవీతత్త్వం అంకురిస్తుంది. ఆ వెలుగు ద్యోతకమవుతుంది. అది లేకపోతే అసుర తత్త్వంతో నరకాసురులం.
పరమాత్మ అసుర భావాన్ని శిక్షించదలిచాడు. ఆయన ఎక్కడున్నాడు? ద్వారకలో. ద్వారక ఈ శరీరమే. నవద్వారమైన పురమిది. ఇందులో ఉన్న అంతరాత్మే- కృష్ణుడు. కర్షితీతి కృష్ణః- అసుర సంపదను తరిమేస్తాడు. దేనితో? సత్యభామా సహాయంతో. సత్యమైన భా- సత్యభా. ‘్భ’ అంటే వెలుగు, దీప్తి, చైతన్యం, అనశ్వరమైన చైతన్యదీప్తి. ఆ యోగ మాయాప్రభావంతో దండెత్తి వచ్చాడు- నరకుడుమీదికి. వాడిలో పాతుకుపోయిన అసుర గణాలను ముట్టుపెట్టాడు.
‘ప్రాగ్‌ః జ్యోతిః షః’- పూర్వపు జ్యోతిని మరచినవారి పురము ప్రాగ్జోతిషపురము. ప్రకృతి వాంఛలకు ప్రభావితుడై అధర్మ వర్తనులై దుష్కృత్యములు చేసేవారందరూ నరకులే అని, అందరిలో వున్నది ఒకే చైతన్యం అన్న తత్త్వాన్ని తెలిసికొన్నవాడు నరుడని, చెప్తుంది నరకచతుర్దశి. ప్రాగ్జ్యోతిషపురం అనేది నరకుని రాజధాని. అంటే జ్యోతిర్మయమునకు ముందు ఉన్న అంధకార స్థితి. కనుక నరకుడు అంటే అజ్ఞానాంధకారంలో వుండి అధోగతిపాలైన నరుడు.
నరకుడు కామరూప దేశాన్ని చాలాకాలం పాలించాడు. ద్వాపర యుగంలో నరకుడికి మరో రాక్షసునితో సఖ్యత ఏర్పడింది. ఆ ప్రభావంతో నరకుడు ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాక్యాదేవిని పూజించటానికి వెడుతుంటే, ఆలయం తలుపులు మూయించాడు నరకుడు. దానికి కోపించిన వశిష్ఠుడు ‘నీజన్మ దాత చేతిలోనే మరణిస్తావు’ అని శపించాడు.
మాయను జయించి, మనస్సును స్వాధీనంలో ఉంచుకొన్న యోగేశ్వరేశ్వరుడు, పూర్ణపుణ్యవతారుడు- శ్రీకృష్ణుడు. అందుకే ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నారు. దీనే్న అన్నమయ్య అద్భుతంగా చెప్పాడు. ‘ముద్దుగారే యశోద ముగిటి ముత్యము వీడు’ అన్న కురంజిరాగ, ఆదితాళ కీర్తనలో.
వ్యక్తిలో స్వార్థం విజృంభిస్తే అధర్మం ప్రబలుతుంది. సమాజంలో సమన్వయదృష్టి, సమరసభావం మృగ్యమవుతాయి. అవి లోపిస్తే సంఘర్షణ మొదలవుతుంది. సంఘర్షణలో వ్యక్తులు అదుపు తప్పి ఎవరికి తోచినట్లు వాళ్ళు, ఎవరికి బలం ఉన్నంతవరకు వాళ్ళు సమాజాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తారు. దుర్మార్గులది బలవంతులది పైచెయ్యి అవుతుంది. బలహీనులు సాధుజనులు బాధలకు గురిఅవుతారు. సమాజం అల్లకల్లోలమవుతుంది. అల్లకల్లోలాన్ని అణచి, వ్యక్తి స్వార్థాన్ని అదుపులో పెట్టటానికి, దుష్టశిక్షణ శిష్టరక్షణకు, ధర్మ పునరుద్ధానానికి అవతరించిన పరబ్రహ్మమే- శ్రీకృష్ణపరమాత్మ.
అర్జునుని నిమిత్తంగా చేసి, గీతాసారాన్ని బోధించి జీవనగతిని నిర్దేశించి, హంసల ఆధ్యాత్మిక చిరుశబ్దాలు అందెల రవళులు కాగా, కనుల కొలనులలో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసంగా, విశ్వమోహన మురళీగానంతో జీవనగీతాన్ని సుమనోహరంగా గానం చేయించి, జీవిత పరమార్థాన్ని బోధించిన కరుణామయుడు, ఆచార్యాగ్నిహోత్రుడు- శ్రీకృష్ణుడు. గరుత్మంత వాహనంపై వచ్చి శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై, నరకాసురునితో యుద్ధం చేశాడు.
వీరశృంగార మూర్తి అయిన సత్యభామ ముఖం- హరికి చంద్రబింబం, అరికి (నరకాసురుడికి) ప్రచండ సూర్యబింబంగా గోచరించింది. ఆమె చేలాంచలం హరికి మన్మథ కేతువు, నరకుడికి ధూమకేతువు. ఆమె రూపం హరికి అమృత ప్రవాహం, నరకునికి ఆవల సందోహం. ఆమె బాణవృష్టి హరికి హర్షదాయి, అరికి మహారోషదాయి. ఆ మహా సమరాంగణంలో, సత్య కరాళ కాళికాకృతి దాల్చింది. ఆమె బాణాగ్నికి నరకుని సైన్యం మల మల మాడిపోసాగింది. రోషాయిత నేత్రములతో భీకరాకారుడై నరకుడు తనలోనున్న కామక్రోధాధి ఆరు స్థితులకు ప్రతీకగా ఆరు బాణాలను సత్యపాలిండ్లపై ప్రయోగించాడు.
శ్రీకృష్ణుని వైపు మేలు చూపులతోనూ, అసురపతి (నరకుడు) వైపు వాడి తూపులతోనూ, సత్యభామ విజృంభించింది. రణభూమిలో ఒకవైపు భర్తకు సంతోషాన్ని, మరొకవైపు నరకునికి సంతాపాన్ని కల్గించిందని నాచన సోముడు సందర్భోచితంగా మత్త్భే వృత్తంలో వర్ణించాడు.
కుసుమ కుమారి అయిన సత్యభామ భీకారాకారం దాల్చింది. బొమ్మపెండ్లిండ్లకు పోలేని సత్య, రణరంగంలో వీర విహారం చేసింది. మగవారిని చూస్తేనే మరుగుకుపోయే మగువ, శత్రువీరులను మట్టుపెట్టింది. బంగారు ఉయ్యాల ఎక్కటానికి భయపడే బాల, ఖగపతిని అనగా అతి వేగంగా వెళ్ళే గరుత్మంతుని అధిరోహించింది. చెలికత్తెల కోలాహలాన్ని భరించలేని సుకుమారి, పటహ భాంకృతులను సహించింది. నెమళ్ళకు నృత్యం నేర్పితేనే అలసి సొలసిపోయే అతివ, ప్రత్యాలీఢపాదంతో పగతురను చీల్చి చెండాడింది. ఆనాడు వీరయే ఆడుతనంపు రూపును ధరించింది. ‘‘వీర శృంగార భయరౌద్ర విస్మయములు కలిసి భామిని యయ్యెనో యనగ’’ సత్యభామ రూపమున్నదని, ఏనాటికీ మరచిపోలేని సత్యరూపాన్మి చిత్రించాడు సహజ కవి, పరమ భాగవతోత్తముడు పోతన.
సత్యమైన చైతన్యదీప్తి- ‘్భ’. అదే పరమాత్మకు నిత్యసిద్ధమైన సంపద. దానితో నరకునిలోని అసుర గణాలను పారద్రోలాడు. నరకుని కుమారుడు సహదేవుడు. అతణ్ణి ప్రాగ్జ్యోతిషపురానికి రాజుని చేసి ధర్మసంస్థాపన చేశాడు. దేవతల తల్లి అదితి. ఆమె ధరించిన కుండలాలను అపహరించి తెచ్చుకున్నాడు నరకుడు. అదితి అంటే పూర్ణమైన ఆకాశతత్త్వం. దానికున్న కుండలేవో కావు- సూర్యచంద్రులే. అంటే, మనఃప్రాణాలు, జ్ఞాన క్రియాశక్తులు. వాటిని రాక్షస బలంతో కాజేసినా అవి ఉపయోగపడవు. ఆత్మ చైతన్యంతో అవి దగ్గరవుతాయి. ఉపయోగపడతాయి. ఇది నరకాసుర వధలోని ఆంతర్యం.

-పసుమర్తి కామేశ్వర శర్మ