మెయన్ ఫీచర్

ఆంధ్రప్రదేశ్‌కు పరిష్కారం శ్రీబాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర అసెంబ్లీ తాజా సమావేశాల్లో శ్రీబాగ్ అనే పేరు చాలా సార్లు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తమ ప్రసంగాల్లో శ్రీబాగ్ ఒప్పందం పేరును అనేకసార్లు ప్రస్తావించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధాని, అమరావతిని శాసన రాజధాని, కర్నూలును న్యాయపరిపాలన రాజధానిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ తీర్మానం మేరకు విశాఖకు అమరావతి నుంచి సచివాలయం తరలి వెళ్లడం ఖాయం. అలాగే హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలంటే కేంద్ర న్యాయమంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర న్యాయ శాఖమంత్రిత్వశాఖ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి అనుమతితో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అలాగే అమరావతి, విశాఖపట్నంలో హైకోర్టు బెంచి ఏర్పాటు చేసే విషయమై కూడా కేంద్ర న్యాయ శాఖ పాత్ర కీలకపాత్ర వహిస్తుంది. బీజేపీ కూడా గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు హామీ ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. వచ్చే ఏడాదిన్నర కాలంలో హైకోర్టు ప్రధాన కార్యాలయం కర్నూలు నుంచి పనిచేసే అవకాశం ఉంది. అమరావతి నుంచి సచివాలయం తరలింపు తదితర అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఇటువంటి విషయాల్లో కోర్టులు స్టేలు ఇవ్వవు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో తన ప్రతిపాదనలు అన్నీ చెప్పి వారి ఆమోదం తర్వాతనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుపై సాహసోపేతమైన అడుగువేశారు. ఈ విషయమై బీజేపీకి చెప్పకుండా జగన్మోహన్‌రెడ్డి సొంతంగా నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తే అంత కంటే తెలివితక్కువతనం మరొకటి ఉండదు. టీడీపీని నమ్మదగిన మిత్రుడుకారని భావించిన బీజేపీ, దక్షిణాదిలో 25 లోక్‌సభ సీట్లున్న వైకాపాను ఇప్పుడుండే పరిస్థితుల్లో దూరం చేసుకోదు. లోతుగా విశే్లషిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలరీత్యా 2024 వరకు వైకాపా అవసరం బీజేపీకి, బీజేపీ అవసరం వైకాపాకు ఉంది.
ప్రస్తుతం అమరావతిలో చోటు చేసుకున్న పరిణామాల్లో తరచుగా ప్రస్తావించిన శ్రీబాగ్ ఒప్పందం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేసే అవకాశం ఒక అదృష్టంగా భావిస్తున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పారు. ఇంతకీ శ్రీబాగ్ ఒప్పందం అంటే ఏమిటి? ఈ ఒప్పందం ఎక్కడ జరిగింది ? అనే విషయమై చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేధావులు, ఉన్నత విద్యావంతులు కూడా చర్చించుకోవడం చూస్తున్నాం. చరిత్ర సంక్లిష్టమైనది. కాలక్రమంలో అనేక రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. పోతుంటాయి. నేతలు కూడా అంతే. కాలగర్భంలో నేతలు కలిసిపోతారు. కానీ చరిత్ర శాశ్వతం. వీటిని మర్చిపోతే వెంటాడుతాయి. 1953 అక్టోబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్రం అవతరణకు శ్రీబాగ్ ఒప్పందం ప్రధాన కారణమని చెప్పవచ్చును. ఈ ఒప్పందానికి చట్టబద్ధత లేదు. కానీ ఇది పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒప్పందం లేకపోతే 1953లో మద్రాసు రాష్ట్రంలోనే రాయలసీమ కొనసాగేది. దీని వల్ల బళ్లారి రాయలసీమలోనే ఉండేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వల్లనే విభజనలో భాగంగా ఆ నాటి నేతల హ్రస్వదృష్టి వల్ల బళ్లారిని రాయలసీమ ప్రాంతం కోల్పోయింది. బళ్లారి కర్నాటకలో కలిసింది.
ఆంధ్ర, రాయలసీమ ప్రాంత నేతల మధ్య జరిగిన చారిత్రాత్మక ఒడంబడిక. ఈ ఒప్పందం ప్రస్తుతం చెన్నై, ఆ నాటి మద్రాసు మహానగరంలో 1937 నవంబర్ 16వ తేదీన జరిగింది. ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులు, కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం శ్రీబాగ్‌లో ఈ ఒప్పందం జరిగింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళుల ఆధిపత్యం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని గ్రహించిన ఆంధ్ర ప్రాంత నాయకులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే శరణ్యమని భావించి అనేక వేదికలపైన గళం ఎత్తారు. కానీ రాయలసీమ, నెల్లూరు ప్రాంత ప్రజలు, నేతలు మాత్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్ర నేతలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని, కానీ వెనకబడిన తమ ప్రాంత ప్రయోజనాలను కాపాడితే కలిసి వస్తామని ప్రతిపాదించారు. అప్పటికే గోదావరి, కృష్ణా డెల్టాలతో సిరిసంపదలతో ఆంధ్రప్రాంతం ఉండేది. వెనకబడిన రాయలసీమ ఎప్పటిలాగానే ఎడారిగా ఉండేది. ఆ రోజుల్లో రాయలసీమ ప్రాంతమంటే ప్రస్తుతం కర్నాటకలో ఉన్న బళ్లారి, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు. వీటిన బ్యాక్ జిల్లాలుగా బ్రిటీష్ వారు పేర్కొన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంత నేతలు ఆంధ్ర రాష్ట్ర సాధన ఆశయంగా పోరాడేందుకు చేతులు కలిపారు. రాయలసీమ ప్రజల్లో ఉన్న ఆందోళనలను తొలగించేందుకు ఇరు ప్రాంతాల నేతల మధ్య అనేక దఫాలు చర్చలు జరిగాయి. ఈ చర్చల ఫలితంగా శ్రీబాగ్ ఒప్పందం కుదిరింది.
1937 నవంబర్ 14వ తేదీన చెన్నైలోని లుజ్ చర్చి రోడ్, మైలాపూర్‌లో ఉన్న శ్రీబాగ్ భవనంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహానుభావులు కే కోటిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, భోగరాజు పట్ట్భా సీతారామయ్య, ఎల్, సుబ్బరామిరెడ్డి, కొండా వెంకటప్పయ్య, పప్పూరి రామాచార్యులు, ఆర్ వెంకటప్ప నాయుడు, హెచ్ సీతారామిరెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మహబూబ్ అలీబేగ్, దేశిరాజు హనుమతరావు, వరదాచారి, దేశపాండ్య సుబ్బారావు, ముళ్లపూడి పల్లంరాజు పాల్గొన్నారు. 1937లో విజయవాడలో జరిగిన ఆంధ్రమహాసభ రజతోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ఈ కమిటీ చెన్నై మైలాపూర్‌లో సమావేశమై ఇరుప్రాంతాల మధ్య అభిప్రాయాలు తలెత్తకుండా ఉండేందుకు చేసిన మహోన్నతమైన ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో, రాయలసీమలోని అనంతపురం ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో పీజీ సెంటర్లను ఏర్పాటు చేయాలి. సాగునీటి అవసరాల నిమిత్తం ఏ ప్రాజెక్టును ముందు నిర్మించినా, రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. యూనివర్శిటీ, హైకోర్టు, రాజధాని వేరు వేరు ప్రాంతాల్లో ఉండాలి. కానీ తమకు ఏది కావాలో ముందుగా కోరుకునే హక్కు రాయలసీమ ప్రజలకు ఉంటుంది. ఆ రోజుల్లో ఆంధ్రా వర్శిటీ ఏర్పాటుపై వివాదం తలెత్తింది. ఈ వర్శిటీ కొంత కాలం బెజవాడ, ఆ తర్వాత రాజమండ్రి, చివరకు విశాఖపట్నంకు తరలి స్థిరపడింది.
1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆంధ్ర ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంది. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. శ్రీబాగ్ ఒప్పందం మేరకు రాయలసీమ ప్రజలు రాజధానిని కోరుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు రాజధానిపై తలెత్తిన వివాదాలకు శ్రీబాగ్ ఒప్పందమే పరిష్కారమని గ్రహించి కర్నూలు రాజధాని అన్ని రకాల మేలని ప్రకటించారు. అభిప్రాయబేధాలు ఉన్నా, చివరకు అందరూ సమ్మతించారు. హైకోర్టును ఆంధ్ర ప్రాంతమైన గుంటూరులో ఏర్పాటు చేశారు. 1956 నవంబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం మిగులు హైదరాబాద్ ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. ఈ విలీనమే ఆంధ్రప్రదేశ్‌కు శాపంగా మారింది. అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్న కర్నూలు కంటే హైదరాబాద్ మేలు అని ఆంధ్ర నేతలు భావించడం, హైదరాబాద్‌తో కలిస్తే విశాలాంధ్రకు ముఖ్యమంత్రి కావచ్చనే సీమ నేతల ఆలోచనలతో కర్నూలు రాజధానితో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం మిగులు హైదరాబాద్‌తో విలీనమై ఉనికిని కోల్పోయింది. మళ్లీ 58 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం అమరావతి రాజధానిగా ఏర్పడింది.
అమరావతి రాజధాని అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లాంటి భౌగోళిక స్వరూపం, భిన్న ప్రాంతాలు, జాతీయవాద దృక్పథం లేని నేతలు, స్వార్థప్రయోజనాలు, సామాజిక వర్గాల ఆధిపత్యాలకు ప్రజలు బలికావడం ఆంధ్రప్రదేశ్‌లో అలవాటే. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్‌ను కోల్పోయి అమరావతికి తరలిన తర్వాత అధికార వికేంద్రీకరణపై పాలకులు దృష్టిపెట్టలేదు. కర్నూలులో హైకోర్టు కోసం నెలల తరబడి ఉద్యమాలు సాగాయి. రాయలసీమ ప్రాంతమంతా హైకోర్టు కావాలని న్యాయవాదులు కోర్టులను బహిష్కరించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని కోరారు. కానీ టీడీపీ పాలకులు ఈ అంశాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే రాయలసీమలో టీడీపీకి గత ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. హైదరాబాద్ నుంచి హైకోర్టును తరలించే సమయంలోనే కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తూ అదే నోటిఫికేషన్‌లో ప్రస్తావించి ఉంటే బాగుండేది. అప్పట్లో ప్రధాని మోదీ వద్ద ఆ నాటి సీఎం చంద్రబాబుకు విపరీతమైన పలుకుబడి ఉండేది. టీడీపీ ఒకరకంగా తనకు అంది వచ్చిన సువర్ణావకాశాన్ని కోల్పోయిందని చెప్పవచ్చును.
87 ఏళ్ల తర్వాత కూడా శ్రీబాగ్ ఒప్పందం పేరు 1953 నుంచి 1956 వరకు కర్నూలు అసెంబ్లీలో, 1956 నుంచి 2014 వరకు హైదరాబాద్‌లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, ప్రస్తుతం అమరావతిలోని అసెంబ్లీలో మార్మోగింది. శ్రీబాగ్ ఒప్పందం జరిగిన శ్రీబాగ్ భవనం ఒక సుందరమైన కట్టడం. ఈ భవనానికి మహోజ్వలమైన చరిత్ర ఉంది. మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన పీఆర్ సుందర అయ్యర్ అనే తమిళ బ్రాహ్మణుడు శ్రీబాగ్ భవనాన్ని తాను ఉండేందుకు నిర్మించుకున్నారు. ఆయన 1863లో జన్మించి 1913లో మరణించారు. ఈ భవనాన్ని పాలరాయితో నిర్మించారు. ఈ ఇంటి ఆవరణలో అందమైన తోటలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ అపురూపమైన ఇంటిని చూసేందుకు అనేక మంది వచ్చేవారు. ఈ ఇంటికి పది ద్వారాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు పది అవతారాలకు సంబంధించి చిత్రాలను ఒక్కో ద్వారం పైన ఉన్నాయి. న్యాయమూర్తి సుందర అయ్యర్ మరణించిన తర్వాత ఆ భవనాన్ని ఆయన కుమారులు దేశోద్ధారక శ్రీకాశీనాథుని నాగేశ్వరరావుకు విక్రయించారు. అమృతాంజనం ఆఫీసులు ఈ భవనంలో ఉండేవి. ఈ భవనం పక్కనే ఉన్న ఆర్త కుట్టై అనే చెరువుకు నాగేశ్వరరావు పార్కు అని ఆ నాటి ప్రభుత్వం పేరుపెట్టింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించేందుకు ఈ భవనంలో ఆ నాటి పెద్దలు రోజుల తరబడి సమాలోచనలు చేసేవారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత శ్రీకాశీనాథుని నాగేశ్వరరావుకే దక్కుతుంది.
చరిత్రను మర్చిపోయినా, తెలిసీ తెలియనట్లు నటించినా చరిత్ర క్షమించదు. అది విష సర్పంలా అదును చూసి కాటేస్తుంది. చరిత్ర క్రూరంగా ఉంటుంది. పునరావృతమవుతుంటుంది. చరిత్రపై అవగాహన ఉన్న వారికి ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే సాధారణమే. చరిత్ర తెలియని వారు భావోద్వేగాలకు లోనవుతుంటారు. ప్రతి అంశాన్ని గ్యాంబ్లింగ్ (జూద) కోణంలో చూడడం మానుకోవాలి. తెలంగాణ, తమిళ, మళయాళం, కన్నడ, మరాఠీ సంస్కృతుల మాదిరిగా ఆంధ్ర సమాజం ఏకరూపమైనది కాదు. ఈ సమాజం బహుముఖమైనది. సంక్లిష్టమైనది. మూడు రాజధానులనే కానె్సప్ట్ ముందుగా విన్నా, చర్చించినా చాలా మంది ఏకీభవించకపోవచ్చు. మళ్లీ ఇదేదో బాగుంది చూస్తే బాగుంటుందనుకుంటారు. సామాజిక మాధ్యమాలు, వాట్సప్ సందేశాల్లో చరిత్ర తెలియదు. అమరావతి శాసన రాజధాని కొనసాగుతుంది. కానీ జ్యుడీషియరీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు తరలిపోతాయనుకున్న యావత్ ఆంధ్రప్రదేశంలో అలజడి లేదు. స్థానికంగా భూములు ఇచ్చిన అన్నదాతలు రైతన్నలు మాత్రం పోరాడారు.
ఆంధ్ర రాష్ట్రంలో 1. రాయలసీమ - నెల్లూరు, 2. కృష్ణా, గుంటూరు 3. ఉభయగోదావరి జిల్లాలు, 4. ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. వీరి మధ్య సయోధ్య సాధన కేంద్రీకృత పాలనా వ్యవస్థ ద్వారా అసాధ్యం. సచివాలయం, న్యాయ, అసెంబ్లీ వ్యవస్థలు ఒకే చోట ఉండడమనేది ఉత్తమమైన విధానమే కావచ్చు.

- కె. విజయశైలేంద్ర 98499 98097