మెయన్ ఫీచర్

తప్పటడుగులతో తిప్పలే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగనగా ఓ సుబ్బారావు. కూతురి పెళ్లికోసం సంబంధాలు చూస్తున్నాడు. ఆయన ఇంటికొచ్చిన పెళ్లిళ్ల పేరయ్య తాను తెచ్చిన వరుడి గుణగణాలు ఇలా చెప్పాడు.. ‘అబ్బాయి సుందరాంగుడు. ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఏ చెడ్డ అలవాటూ లేదు.’.. ఈ మాటలకు సుబ్బారావు పరవశుడయ్యాడు. ‘కానీ..’ అని పేరయ్య మధ్యలోనే ఆగిపోయాడు. తన ఆనందానికి బ్రేకులు వేసిన పేరయ్య వైపు చూసి- ‘మళ్లీ.. ఈ కానీలు, అర్ధణాలేమిటయ్యా..’ ప్రశ్నించాడు సుబ్బారావు. ‘అయ్యా.. అన్ని మంచి గుణాలున్న అబ్బాయికి రెండు అవలక్షణాలున్నాయి. అవేమిటంటే- అతనికి ఏదీ తెలియదు. చెబితే వినడు. ఇవి తప్ప అబ్బాయి బంగారం’ అని ముక్తాయింపు ఇచ్చాడు. ‘ఏడ్చినట్టే ఉంది. ఎన్ని కోట్లు, పదవులుంటే ఏం ఉపయోగమయ్యా? అసలు దుర్గుణాలే ఆ రెండయితేనూ! తనకు తెలియక, ఇంకోడు చెబితే విననివాడితో మా అమ్మాయేం బాగుపడుతుంది? ఈ సంబంధం అక్కర్లేదు’ అని సుబ్బారావు జవాబిస్తాడు. ఇది చిన్నప్పుడు కథల పుస్తకంలో నిన్నటి తరానికి గుర్తున్న కథ! ఏదీ తెలియని వాడితో, చెబితే విననివాడితో ఎంత నష్టమో అప్పటి పెద్దలకు తెలుసు.
ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ అడుగులు చూస్తున్న ఎవరికైనా ఈ కథ గుర్తుకురాక మానదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు పదవులను త్యజిస్తారని గతంలో ప్రకటించిన జగన్‌బాబు దానికి తాజాగా కొనసాగింపు ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోగా హోదా ఇవ్వకపోతే తన ఎంపీల చేత రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలకు వెళతామని జగన్ తాజాగా ప్రకటించేశారు. రాజీనామా పర్యవసానాలేమిటో అంచనా వేయకుండా, జనం ‘మూడ్’ గమనించకుండా జగన్ చేసిన ప్రకటన ప్రమాదకరమన్నది వైకాపా ఎంపీల వ్యాఖ్య. ఒక ఎంపి దీనిపై మాట్లాడుతూ, ‘ ఏం చెప్పమంటారు? మా వాడికి తెలియదు. చెబితే వినడు. రాజీనామాలన్నప్పుడు మాతో ఒకముక్క చెప్పాలి కదా? మేం కూడా దానిపై చర్చించేవాళ్లం కదా? ఇపుడు జనం ఉపఎన్నికల మూడ్‌లో ఉ న్నారా? లేదా? అని గమనించకుండా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే దాని పర్యవసానాలకు ఎవరు బాధ్యులు? పోనీ జగన్ డబ్బులిస్తాడా? అంటే నయాపైసా ఇవ్వడు. మరి ఖర్చులు ఎవరు పెట్టుకోవాల’ని వాపోయారు.
జగన్‌కు సన్నిహితుడైన ఎంపి మేకపాటి కూడా రాజీనామాల గురించి పార్టీ అధినేత తమతో చర్చించలేదని, రాజీనామాల వల్ల ఉపయోగం ఏమిటో చూడాలని అన్నారు. ఇలాంటి భావన ఒక్క మేకపాటిదే కాదు. మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యేలది కూడా! వైకాపా ఎంపీల రాజీనామాలు, పదవులపై వారి భయం సంగతేమో గానీ- నిజానికి ఇప్పుడు జనం ఉపఎన్నికలకు సిద్ధంగా లేరన్నది కాదనలేని వాస్తవం. ఎంపీల రాజీనామాలతో ఉపఎన్నికల్లో అన్ని సీట్లూ తాము గెలుస్తామని, అపుడు తెదేపా పని అయిపోయిందన్న భావన జనంలో కల్పించవచ్చన్నది జగన్ ఆలోచన కావచ్చు. తెదేపా ప్రజాప్రతినిధుల్లో ఇప్పటినుంచే ఆలోచన మొదలై, వైకాపాలోకి చేరికలుంటాయన్నది ఆయన అంచనా కావచ్చు. అలా అధికార పార్టీ నుంచి తన పార్టీలోకి చేరికలు మొదలైతే- తాను సిఎం పీఠమెక్కేందుకు మార్గం సుగమం అవుతుందన్నది జగన్ వ్యూహం కావచ్చు. జగన్ ఆలోచనను తప్పుపట్టలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ సిఎం అయ్యే అవకాశం ఉంది. సాధ్యాసాధ్యాలు, అందుకయ్యే శ్రమ, వ్యూహాలకు పదునుపెట్టే అనుభవం కూడా ఉండాలి.
ఉపఎన్నికలకు జనం సిద్ధంగా లేరన్నది ఎంత నిజమో, ఎపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం అంతే నిజం. సిఎం చంద్రబాబు హోదా కోసం స్వరం పెంచి, ఆనక ప్యాకేజీ గురించి మాట్లాడినప్పుడే హోదా రాదని, ప్యాకేజీనే వస్తుందని జనం మానసికంగా సిద్ధమయ్యారు. నాయకులకంటే ప్రజలు చాలా తెలివైనవాళ్లు. నేతాశ్రీలే ఏసి గదుల్లో కూర్చుని అంచనాలు వేసుకుంటారు. హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నది జనం నమ్మిక. దానికి మన నేతలు గతంలో చేసిన ప్రకటనలే కారణం. నిజంగా చెప్పాలంటే వందమందిలో ఐదుగురికి కూడా హోదా వస్తే లాభమేమిటో, రాకపోతే నష్టమేమిటో అవగాహన లేదన్నది పచ్చినిజం!
హోదా రాకపోతే తెలంగాణ ప్రజల మాదిరిగా రోడ్డెక్కి ఉద్యమించి అన్ని వ్యవస్థలనూ స్తంభింపచేసేంత శక్తి, ఓపిక, సమయం సీమాంధ్రుల్లో మొదటి నుంచీ లేదు. సీమాంధ్ర ప్రజల్లో అత్యధికులు వ్యవసాయం మీద ఆధారపడేవారు. మిగిలిన వర్గాలు కూడా పక్కనేం జరుగుతుందో పట్టించుకునే ఓపికస్తులు కాదు. వీటికిమించి కులాలు, వర్గాల పరంగా చీలిపోయిన రాష్ట్రం. తెలంగాణలో అలా కాదు. నిజాం కాలం నుంచి ఉద్యమాలతో వారు అలసిపోయారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు చేసిన ఉద్యమం ప్రపంచచరిత్ర. తెలంగాణ అంతా ఒకటే సమాజం. ఎపి అలా కాదు. రాయలసీమ, కోస్తా ప్రాంతాలున్నాయి. సీమాంధ్రలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం కూడా ప్రేరేపిత, సౌజన్య సహాయాలతో నడిచినదే తప్ప, ప్రజలు స్వచ్ఛందంగా చేసినది కాదు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు మమేకమయ్యాయి. అంతెందుకు? హోదా కోసం జగన్ నిర్వహించిన సభకు జనం లక్షల్లో పోటెత్తాలి. మరి జనం ఎందుకు రాలేదు? ప్రత్యేక హోదా రాకపోతే భావితరాలు నష్టపోతాయని ప్రజలు గట్టిగా భావించినట్లయితే ఎప్పుడో రోడ్డెక్కేవారు. అన్ని వ్యవస్థలనూ స్తంభింపచేసేవారు. అప్పుడప్పుడూ ‘బుల్లితెర’పై కనిపించి హోదా కోసం ఉద్యమిస్తామని ప్రకటించిన మేధావి సంఘాల కమేడియన్లు సైతం ఇప్పుడు కనిపించడం మానేశారు. ప్రజలు హోదాపై ఉద్యమించే మూడ్‌లో గానీ, దాని గురించి ఆలోచించే ఓపికతోగానీ లేరనే కదా అర్థం?
మరి.. ఒక పార్టీకి అధ్యక్షుడైన జగన్‌కు ఈపాటి అవగాహన, అంచనా లేకపోవడమే విచిత్రం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలంటే ఎవరికైనా ముందుగా గుర్తుకువచ్చేది కేసీఆర్. ఆయన లెక్కలేనన్నిసార్లు రాజీనామాలను పూచికపుల్ల మాదిరిగా వాడారు. ఆయన ఓ సారి బ్రహ్మాండమైన మెజారిటీ సాధిస్తే, ఇంకోసారి ఎలాగో గెలిచి బయటపడ్డారు. అంతటి సాహసి కేసీఆర్ కూడా ఇప్పుడు ఉపఎన్నికలంటే వెనుకంజ వేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వచ్చిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ఆయన ఖాతరు చేయడం లేదు. అంటే విపక్షంలో ఉన్నప్పటి కేసీఆర్‌కు, సీఎం కేసీఆర్‌కు అంచనాలు, అనుభవాల్లో తేడా ఉందని అర్థమవుతోంది. నిజానికి కేసీఆర్ తన సహజశైలి ప్రకారమైతే వారితో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలి. జనం ఆ మూడ్‌లో లేరనే ఆయన వెనుకంజవేస్తున్నారు. ఈ విషయం జగన్ కూడా గ్రహించాలి.
వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళితే తర్వాత జరగబోయే పరిణామాలు, ఫలితాలు జగన్ చేతుల్లోనో, ఆయన ఆలోచనల మేరకో ఉండవు. రాజీనామాలు చేసిన అన్ని సీట్లూ గెలిస్తే మంచిదే. ఆయన స్థాయి పెరుగుతుంది. అధికార స్థానాల్లో, విధేయతల్లో మార్పులొస్తాయి. అధికార పార్టీలో ముందుచూపున్న నేతలు ముందే విపక్షంలోకి దూకేయవచ్చు. అది ఒక కోణం. అదే- అన్ని సీట్లూ గెలుచుకోలేకపోతే విపక్ష నేతగా జగన్ బలహీనమవుతారు, స్వపక్షంలోనే చులకన అవుతారు. అవగాహన లేని నేతగా అవహేళనకు గురవుతారు. పైగా ఇప్పుడు వైఎస్ ఆకర్షణ, సానుభూతి కూడా లేదు. ఒకరకంగా జగన్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టాల్సిందే.
ఓసారి గతంలోకి వెళితే.. వైఎస్ మృతి తర్వాత జగన్ శిబిరానికి కాంగ్రెస్ నుంచి ప్రముఖులు రావచ్చు. ఆ తర్వాత తనతో వచ్చిన వారితో రాజీనామా చేయించి మళ్లీ వారిని గెలిపించుకుని ఉండవచ్చు. అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం.. వైఎస్ వారసుడిగా, తండ్రిలేని బిడ్డగా ప్రచారంలో ఉన్న జగన్‌తో యుద్ధం చేసే స్థాయిలో లేదు. తెదేపా కంటే జగన్ పార్టీకి ఓటేయమని కాంగ్రెస్ అభ్యర్థులే చెప్పిన రోజులవి. కాబట్టి జగన్ ఇప్పుడూ నాటి రోజులను అంచనా వేసుకుని, ఉప ఎన్నికలకు వెళితే మాత్రం ‘తప్పులో’ కాలేసినట్లే. ఇప్పుడు తెదేపా అధికారంలో ఉంది. కాంగ్రెస్ దాదాపు అచేతనావస్థలో ఉంది. చెప్పేవాళ్లు లేకపోయినా, చెప్పింది వినేవాళ్లు లేకపోయినా నష్టమే కదా? జగన్ గురించి ఆయన అభిమానుల ఆవేదన కూడా అదే!
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144