మెయన్ ఫీచర్

అదుపు తప్పిన ‘అద్దెగర్భం’ వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాతృత్వం అనేది మహిళకు గొప్పవరం’- అనేవారు మన పూర్వీకులు. సంతానం కలిగినపుడే స్ర్తి జీవితం సాఫల్యాన్ని పొందుతుందని వారి నమ్మకం. ఇందులో అభ్యంతరం ఉండాల్సిన విషయం ఏదీ లేదు గాని, ఈ ‘వరం’ లభించని మహిళ లేదా దంపతులు ఆధునిక వైద్యశాస్త్రంలో వచ్చిన మార్పులను అవకాశంగా తీసుకుని- మరొక స్ర్తిని ఇందుకు వినియోగించుకోవడంలోనే వుంది అసలు కథ. దీనినే ఇవాళ ‘అద్దెగర్భం’ (సరోగసీ) అంటున్నారు. ఈ పద్ధతిని ‘కృత్రిమ గర్భధారణ’ అని కూడా అనవచ్చు. సంతానం లేని దంపతుల కోసం- తొమ్మిది నెలలు గర్భాన్ని మోసి శిశువును కని ఇచ్చే మహిళను ‘అద్దెతల్లి’గా నేడు వ్యవహరిస్తున్నారు. ‘సరోగసీ’కి అంగీకరించి, తనకు ఎన్నడూ పరిచయం లేని ఒక పరాయి పురుషుడి వీర్యాన్ని తన గర్భంలోనికి జొనుపుకుని, తన అండాలతో అవి కలిసిన కారణంగా గర్భాన్ని దాల్చి బిడ్డను కని, వారి కప్పగించి, అందుకు బదులుగా కొంత ‘మూల్యాన్ని’ తీసుకొనడాన్ని ‘కమర్షియల్ సరోగసీ’ అంటారు. ఇందులో- మాతృత్వం ఒక వరం, తియ్యటి కల వంటి ‘సెంటిమెంటల్’ భావాలకు చోటుండదు. ద్రవ్య మారకానికి మాత్రమే తావుంటుంది. ఆర్థిక బాధలతో సతమతమయ్యే పేదవర్గాల మహిళలు ‘సరోగసీ’కి సిద్ధమవుతున్నారు. ఈ ధోరణి అంతకంతకూ పెచ్చుమీరి ప్రస్తుతం ‘సరోగసీ’ వ్యాపారంలా విస్తరిస్తోంది. ఇలాంటి సాహసానికి ఒడిగట్టే మహిళలను ‘సరోగేట్’లని అంటారు.
సనాతన సంప్రదాయాలకు, కట్టుబాట్లకు నిలయమైన మన భారతదేశంలో ఇపుడు ‘సరోగసీ’ ఒక పెద్ద వ్యాపారం. ఇందులో ‘అద్దెతల్లులే’ కాదు, బ్రోకర్లుంటారు, ఏజంట్లుంటారు. వ్యాపార దృక్పథంతో పనిచేసే వైద్యులూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఏడాదికి నాలుగు వందల మిలయన్ డాలర్ల వ్యాపారం ఇది. ఇందుకోసం మన దేశంలోని నగరాల్లో గుర్తించబడిన దాదాపు 3,000 సంతాన సాఫల్య కేంద్రాలు వున్నాయి. ప్రపంచం మొత్తం మీద ‘సరోగసీ’ వ్యాపారానికి భారతదేశం ఇవాళ ఒక ముఖ్యమైన కేంద్రంగా విరాజిల్లుతోంది. విదేశస్తులు ముఖ్యంగా అమెరికన్లు ఈ ‘పని’మీద భారతదేశానికి ఎక్కువగా వస్తుంటారు. దీనికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. మొదటిది- ప్రపంచంలో 14 దేశాలు ‘సరోగసీ’ పద్ధతిని నిషేధించాయి. నిన్నమొన్నటివరకు మన దేశంలో అట్లాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. రెండోది- అమెరికాలో ‘సరోగసీ’ కింద ‘అద్దె తల్లుల’కు ఇక్కడ ఇస్తున్న దానికన్నా అయిదురెట్లు ఎక్కువ డబ్బు ఇవ్వాలి. భారత్‌లో 2,500 డాలర్ల నుండి 7,000 డాలర్ల వరకూ ‘అద్దెతల్లుల’కు చెల్లించవలసి వుంటే- అమెరికాలో 10,000 డాలర్ల నుండి 35,000 డాలర్ల వరకూ చెల్లించవలసి వుంటుంది. విదేశీయులు చెల్లించే మొత్తంలో అధిక శాతం బ్రోకర్లు, ఆస్పత్రి సిబ్బంది కాజేసి, నిస్సహాయులైన అద్దెతల్లులకు కొద్ది మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంటారు. ఆ మొత్తం లక్షల్లో వుంటుంది కాబట్టి, బీదవర్గాల మహిళలు ఏ కొంతమొత్తం దక్కినా చాలనుకుని సంతృప్తి పడుతుంటారు.
ప్రపంచం మొత్తం మీద ఉన్న దంపతుల్లో వివిధ కారణాల రీత్యా 15 శాతం మందికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. వీరిలో చాలామంది భారతదేశానికి వచ్చి బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. మన దేశంలో ఇట్లాంటి వ్యాపారానికి గుజరాత్‌లోని ‘ఆనంద్’ పట్టణం ముఖ్య కేంద్రం! డెయిరీ పరిశ్రమ (పాల ఉత్పత్తుల)కు ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం ‘సరోగసీ’కి కూడా ముఖ్య కూడలిగా మారింది. ఇక్కడ అధిక సంఖ్యలో సంతాన సాఫల్య కేంద్రాలున్నాయి. గ్రామీణ, పేదవర్గాలకు చెందిన మహిళలు ‘అద్దెగర్భం’ ద్వారా శిశువులను కని ఇచ్చేందుకు అధిక సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఆరోగ్యరీత్యా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా వీరికి దక్కే ప్రతిఫలం తక్కువే.
పిల్లలు కావాలనుకునే దంపతులున్నారు. వారికి బిడ్డను కని ఇచ్చేందుకు అద్దెతల్లులు ఉన్నారు. ఇందులో సమస్య ఏమిటని కొందరు అనుకోవచ్చు. ఇది నైతికమా? కాదా? అనే ప్రశ్నలను ప్రక్కన పెడితే, ‘సరోగసీ’ విధానంలో చాలా సమస్యలున్నాయి. బిడ్డను కనడానికి సిద్ధపడిన మహిళకు ఏ కారణం చేతనయినా ‘గర్భవిచ్ఛితి’ (అబార్షన్) జరిగితే- వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వరు. అంగవైకల్యం వున్న బిడ్డ పుడితే, ‘కొనుగోలుదార్లు’ తీసుకోరు. అదే విధంగా కవల పిల్లలు పుడితే ఒక బిడ్డనే తీసుకుని, రెండో బిడ్డను వదిలేసే అవకాశం వుంది. ఇక కన్నబిడ్డకు, తల్లికి మధ్యన వుండే ‘పేగుబంధం’ గురించి మాట్లాడ్డానికి అవకాశమే లేదు. అన్ని ‘సరోగసీ’లు సఫలమవుతాయనే నమ్మకం లేదు. అది వేరే కథ.
పురుషుడి వీర్యాన్ని స్ర్తి గర్భంలోనికి జొనిపించడం అంత సులువైన, క్షేమకరమైన విషయం కాదు. ఫెర్టిలిటీ సెంటర్ల వారు చెప్పేటట్టు ఇది మామూలు‘ట్రీట్‌మెంట్’ కాదు. చాలా క్లిష్టమైన ప్రక్రియ. ‘అద్దె తల్లి’ హార్మోన్‌లకు సంబంధించి ప్రమాదకరమైన మందులు వాడాల్సి వుంటుంది. ఒకవేళ అనివార్యమైతే సర్జరీకి కూడా లోనుకావలసి వుంటుంది. దీని ప్రభావం ఆమెపై శారీరకంగా, మానసికంగా తీవ్రంగానే వుంటుంది. కొన్ని సందర్భాలలో ఇది కేన్సర్ వంటి ప్రమాదకర రోగాలకు కూడా దారితియ్యవచ్చు. ఈ వివరాలన్నింటినీ వైద్య సిబ్బంది బీద అద్దె తల్లికి ముందుగా చెప్పరు. ప్రపంచం మొత్తం మీద ప్రతి ముగ్గురు నిరుపేదలలో కనీసం ఒకరు మన దేశంలో ఉన్నారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్నందునే భారత్‌లో కేవలం ద్రవ్యానికి ఆశపడి కృత్రిమ గర్భధారణకు పేదవర్గాల స్ర్తిలు సిద్ధపడుతున్నారు.
అనేకానేక సమస్యలు చుట్టుముడుతున్నందున ‘సరోగసీ’లో లోపాలను సవరించేందుకు, అద్దెతల్లుల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఒక బిల్లుకు చట్టరూపం ఇవ్వాలని తలపెట్టింది. ‘సరోగసీ’కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలచిన చట్టం ముసాయిదాను కేంద్ర కేబినెట్ ఇదివరకే ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ‘కమర్షియల్ సరోగసీ’ అంటే ద్రవ్యానికి ఆశపడి స్ర్తిలు గర్భధారణకు సిద్ధపడడాన్ని నిషేధిస్తారు.
ఇతర దేశాలకు చెందిన దంపతులు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయ దంపతులు, భారతదేశానికి ‘సరోగసీ’ లక్ష్యంతో రావడాన్ని అనుమతించరు. ఇక, మన దేశానికి చెందిన దంపతులకు అయిదేళ్ల దాంపత్య జీవితం తర్వాత కూడా సంతానం కలిగే అవకాశం లేకపోతే, డాక్టరు సర్ట్ఫికెట్‌తో కేవలం రక్త సంబంధీకులయిన బంధువులు అంగీకరిస్తేనే- ‘సరోగసీ’కి అనుమతిస్తారు. అవివాహిత స్ర్తి, పురుషులకు, స్వలింగ సంపర్కులకు, పెళ్లిచేసుకోకుండా సహజీవనం చేసే స్ర్తి, పురుషులకు ‘సరోగసీ’ ద్వారా బిడ్డలను కని ఇవ్వడం ఇక కుదరదు. ఇదివరకే బిడ్డలను దత్తత చేసుకున్న వారి విషయంలో కూడా అనుమతి వుండదు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లులో రక్తసంబంధీకులంటే- తల్లి, చెల్లెలు, మేనకోడలు, మరదలు, వదిన, యిట్లాంటి వారిని పేర్కొనడం జరిగింది. ఇట్లాంటి వారి విషయంలో జరిగే ‘సరోగసీ’ని ‘ఎథికల్ సరోగసీ’ అంటారు. ‘ఎథికల్ సరోగసీ’ అంటే- ద్రవ్యం కోసం కాక, కేవలం ప్రేమాభిమానాలతో జరిగే ‘సరోగసీ’కి ఈ బిల్లులో ఎలాంటి అభ్యంతరమూ లేదు.
‘సరోగసీ’ అనేది నైతిక పరమైనదైనా, వాణిజ్యపరమైనదైనా దాని దుష్ఫలితాలు వుండనే వుంటాయి. అదీగాక- రక్తసంబంధీకులలో వున్న బీద మహిళలకు ద్రవ్యాశ చూపి రహస్య ఒప్పందం చేసుకునే అవకాశం వుంది. కాబట్టి మొత్తం ఈ విధానాన్ని రద్దుచెయ్యడం వలన మహిళలకు రక్షణ లభిస్తుంది.
ఆ మధ్య ఒక ఆంగ్ల పత్రిక- ఒక అద్దె తల్లితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె- ‘నేను ఇంకొకరికి బిడ్డను కని, సంపాదించిన ద్రవ్యంతో మా కుటుంబంలో బాకీలన్నింటినీ తీర్చేసి ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాను. అవకాశం లభిస్తే ఇంకొకసారి గర్భం దాల్చడానికి సిద్ధమే. డబ్బు తీసుకుని అందుకు బదులుగా బిడ్డను కని- సంతానలేమితో బాధపడే దంపతులకు ఇవ్వడంలో తప్పేముంది?- దానినెందుకు నిషేధించాలి?’ అని తన వాదన వినిపించింది. మరి కొందరు అద్దె తల్లుల అభిప్రాయం కూడా ఇదే కావచ్చు. దారిద్య్రం రాచపుండులాగా దొలిచేస్తున్న మనలాంటి దేశాలలో- ఏ చట్టం మటుకు మహిళలకు రక్షణ కల్పించగలదు?
గత 11 ఏళ్లలో దాదాపు 1,400 మంది దంపతులకు ఈ విధానం ద్వారా బిడ్డలనందించి, కోట్లు సంపాదించిన ‘ఆనంద్’లోని సంతాన సాఫల్య కేంద్రాలు- ప్రతి చట్టానికీ అడ్డదారులు వెదక్కుండా వుంటాయా? వేచి చూడవలసిందే. అదీగాక- ఈ పురుషాధిక్య సమాజంలో స్ర్తి పిల్లలను కనే యంత్రమా? అనే ప్రశ్నకు బదులెక్కడ?

-కోడూరి శ్రీరామమూర్తి 93469 68969