మెయన్ ఫీచర్

దేశ రాజకీయాల్లో నూతన వొరవడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా ఉండే అవకాశం లేకపోయినా, ఎన్నికల ప్రచారం జరిగిన తీరు, తెన్నులు నేటి ఆడంబర రాజకీయాల పట్ల విసుగు చెందిన దేశం ప్రజలకు నూతన ఆశలు కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ధనబలం, కండబలం, అధికారబలం లేకుండా కేవలం ప్రజల విశ్వా సం పొందటం ద్వారా ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వవచ్చని ఈ సందర్భంగా దేశ ప్రజలకు చాటి చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందనీయులు.
దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రదాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలా ఎన్నికల ప్రచార ఎత్తుగడలు చూసి దిమ్మ తిరిగి, వారిని అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మొదటిసారి గా, ఢిల్లీలో అమిత్ షా తన పంథా మార్చుకొని కేజ్రీవాల్ మార్గంలో నిరాడంబరంగా ఎన్నికల ప్రచారం జరిపే ప్రయత్నం చేశారు. సుమారుగా ఐదు వేల మేరకు అటువంటి చిన్న సమావేశాలను భాజపా నేతలు జరిపారు.
సరిగ్గా పది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీని ఓడించడం కోసం దేశంలోని రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. మోదీకి పోటీగా మీ అభ్యర్హ్ది ఎవ్వరో చెప్పండి అంటూ భాజపా నాయకులు మిగిలిన పార్టీలను ఎగతాళి చేశారు. కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఇతర పార్టీలను అదే ప్రశ్న వేశారు. ‘మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవ్వరో చెప్పండి’ అంటూ అందరిని నిలదీశారు.
ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించిన పథకాలను చూపడం కాకుండా తాను అమలులోకి తెచ్చిన కార్యక్రమాలను చూపు ప్రజలను ఓట్లు వేయమని అడిగారు. ఎన్నికల ప్రచారాలలో రాజకీయ నాయకులు పరస్పరం తమ హోదా మరచిపోయి ప్రత్యర్థులపై దుర్భాషలకు దిగడం సాధారణమే. అయితే తనను ఎంతగా కవ్వించినా సంయమనం కోల్పోకుండా, ప్రజల భావోద్వేగాలను ఆకట్టుకొనే విధంగా కేజ్రీవాల్ ప్రవర్తించారు.
కేజ్రీవాల్ ఉగ్రవాది అంటి అధికార పక్షానికి చెందిన నేతలు అసహనంతో ఆరోపణలు చేసినా ఆయన సంయమనం కోల్పోలేదు. చాలా ప్రశాంతంగా, తానా విషయాన్నీ ప్రజలకే వదిలివేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. బీజేపీ ఆరోపణలతో రెచ్చిపోయి, ప్రత్యారోపణలు చేయకుండా తాను నిజంగా ఉగ్రవాది నైతే బీజేపీ గుర్తు కమలంకే ఓట్ వేయండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘నేను ఉగ్రవాదినా కాదా అన్న విషయాన్ని ఢిల్లీ ప్రజలకే వదిలేస్తున్నా. ఒకవేళ నేను ఉగ్రవాదిని అనుకుంటే ఫిబ్రవరి 8న కమలం ఉన్న బటన్‌పై నొక్కండి. ఒకవేళ ఢిల్లీ ప్రజల కోసం, దేశం కోసం పనిచేశానని భావిస్తే చీపురుకట్ట గుర్తుపై నొక్కండి’ అని విజ్ఞప్తి చేశారు. ఎటుంవటి హుందాతనం నేటి రాజకీయాలలో కనిపించడం లేదు.
నిజంగా కేజ్రీవాల్ ఉగ్రవాది అయితే అందుకు నైతిక బాధ్యత వహించవలసింది కేంద్ర ప్రభుత్వమే. ముఖ్యం గా అమిత్ షా. ఎందుకంటే ఢిల్లీలో సూపర్ కాఫ్.. అమిత్ షా. ఢిల్లీలో పోలీస్ వ్యవహారాలు అయన ఆధీనం లో ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిపై ఉగ్రవాది అనే ఆరోపణ చేసే ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం, కేంద్ర మంత్రులు దానిని తమ ప్రభుత్వం వైఫల్యమనే అంశాన్ని మరచి ప్రవర్తించడం విచారకరం.
నేడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సహితం ప్రధాని మోదీని చూసి ఓటేయమని అడుగుతున్న భాజపా నేతలు ఢిల్లీలో అటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రధాని కేవలం రెండు బహిరంగసభలలోనే ప్రసంగించారు. అసలు భారీ బహిరంగసభలు లేకుండా చిన్న, చిన్న సభలను కాలనీలలో జరుపుతూ చాలా నిరాడంబరంగా అమిత్ షా ప్రచారం జరిపారు. ఆయన ప్రతి రోజూ స్వయంగా 500 నుండి 2000 మంది వరకు గుమికూడె సభలకు వెళ్లారు. కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు ఇంటింటికి తిరగడం, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ వ్యవస్థను సమీక్షించడం వంటి పనులు చేశారు.
వాస్తవానికి ఢిల్లీలో కేజ్రీవాల్ కు పార్టీ యంత్రాంగం అంటూ పెద్దగా లేదు. మూడు పురపాలక సంఘాలలో అధికారంలో ఉన్న భాజపాకు విస్తృతమైన యంత్రాంగం ఉంది. అయితే ఆ పార్టీ నాయకులు అందరూ దాదాపు ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాల వారు చెందినవారు కావడంతో వారు తమ వద్దకు వచ్చే సాధారణ ప్రజల పట్ల కొంచెం అహంకార ధోరణితే వ్యవహరిస్తుంటారు. కానీ ఆప్ నాయకులు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కావడంతో తమ వద్దకు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తుంటారు. అదే ఇప్పుడు ఆప్ కు రాజకీయంగా లాభదాయకంగా మారింది.
ఒక విధంగా కేజ్రీవాల్ ఒంటరి పోరాటం చేశారు. ఆప్ ప్రారంభించినప్పుడు ఉన్న పేరొందిన నాయకులు ఎవ్వరు ఇప్పుడు ఆయనతో లేరు. కేవలం ఐదారుమంది సహచరుల బృందంతో మొత్తం ప్రచారం జరిపారు. గతంలో ఢిల్లీలో ఎన్నికల సమయంలో కామన్ వెల్త్ క్రీడలు, భారీ ఫ్లై ఓవర్లు, మెట్రో రైల్ వంటివి ప్రచార అస్త్రాలుగా ఉండెడివి. కానీ మొదటిసారిగా అనధికార కాలనీల క్రమబద్దీకరణ, పేదలకు విద్య, వైద్య, రవాణా సదుపాయాలు వంటి అంశాలకు ప్రాధాన్యత చోటు చేసుకొన్నాయి.
తనకంటూ బలమైన పార్టీ యంత్రాంగం గాని, కార్యకర్తల బలం లేని కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా సాధారణ ప్రజలను లక్ష్యంగా పెట్టుకొంటూ గత రెండేళ్ల్లుగా పనిచేస్తూ వచ్చారు. అందుకనే పార్టీలకు అతీతంగా మద్దతు దారులను సమకూర్చుకోగలిగారు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఢిల్లీలో ఆందోళన తీవ్ర రూపం దాల్చడమే కాకుండా, హింసాత్మకంగా కూడా మారాయి. ఈ నిరసనలను ఆధారం చేసుకొని మతాల వారీగా ప్రజలలో చీలిక వస్తుందని ఆశించిన భాజాపాకు ఆశాభంగం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
పలు సర్వేల ప్రకారం ఢిల్లీలో ప్రజలు 70 శాతంకు పైగా ఈ చట్టాన్ని సమర్థిస్తున్నారు. కానీ వారంతా భాజపా ఓట్ వేయడానికి సిద్ధంగా లేదు. మోదీ అభిమానులుగా ఉన్న వారు సహితం ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కావాలను కోవడం కనిపిస్తున్నది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే తిరిగి మొత్తం ఏడు సీట్లలో భాజపాకు పట్టం కట్టే సూచనలు ఉన్నాయి. కానీ గతం 15 ఏళలుగా ఢిల్లీ ప్రజలు లోక్‌సభ, అసెంబ్లీ, మునిసిపల్ ఎన్నికలను వేర్వేరుగా చూస్తూ తమ రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తున్నారు.
గత 22 ఏళలుగా అధికారంలో లేని భాజపా ఇప్పుడు ఎట్లాగైనా గెలుపొందడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే విస్తృత రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆ పార్టీకి తనకు గెలుపొందడం కన్నా కాంగ్రెస్ తలెత్తుకోకుండా చేయ డం ముఖ్యం. దేశ రాజధానిలో కాంగ్రెస్ బలం పెంచు కొంటే ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పటి కాంగ్రెస్ మద్దతుదారులే ఇప్పుడు ఆప్ వెంట ఉన్నారు. అంటే ఆప్ అధికారం కోల్పోయి, బలహీనమైతే కాంగ్రెస్ రాబోయే రెండు, మూడేళ్ళల్లో బలం పుంజుకొనే అవకాశం లేకపోలేదు. అందుకనే ఆప్ తిరిగి రావడం ఒక విధంగా రాజకీయంగా భాజపాకు కలసి వచ్చే అంశమే.
2014 ఎన్నికలలో నరేంద్ర మోదీ అనూహ్యమైన విజయం సాధించడంతో ఆయనకు పోటీగా దేశంలో మరే నాయకుడు నిలబడలేని పరిస్థితులలో అఖండ ఆధిక్యతతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కేజ్రీవాల్ కు తాను ప్రధానికి పోటీ కాగలననే ఆశలు చిగురించాయి. అందుకనే మొదటి రెండేళ్లు పాలనను గాలికి వదిలివేసి ప్రధానికి పోటీ తానే అనే సంకేతం దేశ ప్రజలకు ఇవ్వడం కోసం నిత్యం ప్రధానిపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. అయితే దాని వల్లన బలహీనం అవుతున్నానని గ్రహించి, గత రెండేళ్లుగా ఢిల్లీ పాలన పట్ల దృష్టి పెట్టారు. సంఘర్షణ రాజకీయాలకు స్వస్తి పలికారు. దానితో కొంతమేరకు బలం పుంజుకున్నట్లు వెల్లడి అవుతున్నది.
ఆయన ఎక్కడా ప్రధానిపై, భాజపా నాయకులపై గతంలో వలే విమర్శనాస్త్రాలు సంధించలేదు. తన ఐదేళ్ల పాలన చూసి ఓటేయమని అడుగుతున్నారు. ప్రధాని మోదీపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ‘మా ప్రధానిని అంత మాట అంటావా?’ అంటూ అంతెత్తున ఎగిరారు. ఆ విధంగా సానుకూల ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో సిఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా జరిగిన హింసను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వం అవ్వన్నీ కేజ్రీవాల్ ప్రోద్బలంతో జరిగినవే అంటూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనిపించడం లేదు.
ఎంత రెచ్చగొట్టిగా ఎదురు తిరగని కేజ్రీవాల్ ధోరణి ఒక విధంగా భాజపా నాయకులలో అసహనం రేపినట్లు కనిపిస్తున్నది. అందుకనే ఒక కేంద్ర సహాయ మంత్రితో సహా ఏకంగా ముగ్గురు ప్రముఖ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాల పట్ల ఎన్నికల కమీషన్ అభ్యంతరం తెలిపినది. వారి ప్రచారంపై ఆంక్షలు విధించింది. సుమారు లక్ష మంది కార్యకర్తలు, నాయకులను భాజపా ఎన్నికల ప్రచారంలోకి నింపినట్లు చెబుతున్నారు. అయితే సాదా, సీదా ప్రచారంతో కేజ్రీవాల్ ధీమాతో కనిపిస్తుండటం గమనార్హం.
నేడు ఎన్నికలు అనగానే - గ్రామ పంచాయతీ స్థాయి నుండి దాదాపు ప్రతి పార్టీ కూడా వారికి పార్టీ విధానాల పట్ల గల నమ్మకాన్ని బట్టి కాకుండా వారికి గల ధన బలం, కండ బలాలను పరిగణనలోకి తీసుకొంటున్నారు. అటువంటివి ఉధృతంగా ప్రచారం చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయి గానీ ఓటర్లను ఆకట్టుకోవడానికి సరిపోవని ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. దేశం మొత్తం మీద ఢిల్లీ ప్రభుత్వంలో అవినీతి చాలా తక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు దాఖలు చేసే అఫిడవిట్‌లను పరిశీలిస్తే అధికార పక్షానికి ప్రజా ప్రతినిధుల ఆస్తులు ఐదేళ్ల కాలంలో 100 నుండి 150 శాతం పెరగడం నేడు దేశంలో సర్వసాధారణమై పోతున్నది. కానీ ఢిల్లీలో తిరిగి పోటీ చేస్తున్న ఎమ్యెల్యేల ఆస్తులు గమనిస్తే ఐదేళ్ల నాటి కన్నా 10 నుండి 15 శాతం మించి పెరగలేదు. నేటి కళంకిత రాజకీయాలలో ఒదొక్క అపూర్వమైన పరిణామం అని చెప్పవచ్చు. ఒక విధంగా ఈ ఎన్నికలు దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠంగా మారాలి.
ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా భారత రాజకీయాలలో ఒక నూతన వొరవడి కేజ్రీవాల్ శ్రీకారం చుట్టారని, మనం రాజకీయాలలో నూతన ధోరణులకు అంకురార్పణ చేశారని, ఎన్నికల సమయంలో సాధారణ ప్రజల కేంద్రంగా రాజకీయ విధానాలు ఉండేటట్లు చేసారని మాత్రం చెప్పవచ్చు.

- చలసాని నరేంద్ర