మెయిన్ ఫీచర్

మనసును దోచే సజీవ సాధనం ‘రేడియో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా..
*
అత్యంత శక్తివంతమైన అద్భుతమైన ప్రసార సాధనం ‘రేడియో’. రేడియోను మారుమూల ప్రాంతాల్లోని ప్రజలలోకి కూడా తీసుకువెళ్ళి, వారిలో విజ్ఞానాన్ని పెంచాలన్న ముఖ్య ఉద్దేశంగా రేడియో దినోత్సవం జరుగుతోంది. దినపత్రికలు, రేడియో, టీవీల వంటి ఆధునిక సమాచార సాధనాలను దేనితో పోల్చినా వాటిలో రేడియో అత్యంత సరళమైంది. చదువుకున్నవారే పత్రిక చదువగలరు. రేడియోకు ఆ పరిమితి లేదు. చదవడం రానివారు కూడా రేడియో సమాచార ప్రసారాన్ని అర్థం చేసుకోగలరు. పైగా పెద్దగా ఖర్చు ఉండదు. టెలివిజన్‌లో ఒక సంఘటననో.. విషయాన్నో వీక్షకులకు చూపాలంటే సాధన సంపత్తి అవసరం. దృశ్యం శ్రవణంతో కలవడానికి పంపిణీ (ట్రాన్స్‌మిషన్) కీలకం. కెమెరాలు, కంప్యూటర్ల వంటి పెద్ద పెద్ద పరికరాలు పెద్దఎత్తున కావాలి. రేడియోకు ఇంత అవసరం లేదు. రేడియోలు అప్పటికప్పుడు వార్తాప్రసారం జరుగుతుంది. పత్రికకు యజమాని ఖర్చుపెట్టాలి. పాఠకుడు నిత్యమూ చెల్లించాలి. ఇక టీవీల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అదే రేడియో అయితే కాలాన్ని, దూరాన్ని, వ్యయభారాన్ని జయించడమే కాదు చౌక అయిన మాధ్యమంగా కూడా చెరగని ముద్ర వేసింది. వార్తలలో, ప్రసంగాలలో పరిచయ కార్యక్రమాలలో క్రమశిక్షణ కలిగిన అర్థవంతమైన తెలుగుకు ఆకాశవాణిలో కొదవ లేదు. రాదు. రేడియో అవతరించి దశాబ్దాలు దాటాక గానీ రేడియో దినోత్సవం జరుపుకోవడం ప్రారంభం కాలేదు. టెలివిజన్, ఎఫ్‌ఎం రేడియో వచ్చిన తర్వాత 2012లో ప్రపంచ రేడియో ఉత్సవం జరుపుకోవడం మొదలైంది.
1946లో యునైటెడ్ నేషన్స్ మొదలైన రేడియో వ్యవస్థాపక దినోత్సవంనాడే ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవంగా జరపడానికి యునెస్కో చొరవతో 2011లో జరిగిన 36వ ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొన్నారు.
రేడియోద్వారా సమాచారాన్ని అతి తక్కువ ఖర్చుతో త్వరగా చేరవేయడానికి సులువైన మార్గం.
నేటి ఆధునిక కాలంలో కూడా రేడియో అత్యంత సమాచార వనరుగా మారింది. ఇప్పుడు కాస్త తగ్గింది గానీ ప్రపంచ జనాభాలో 95 శాతానికి పైగా దశాబ్దం క్రితం వరకు ప్రజలు రేడియోను అధికంగా వినియోగించేవారు. అభివృద్ధిచెందుతున్న దేశాలకు సంబంధించి 75 శాతం మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారంకోసం రేడియోపై ఆధారపడుతున్నారు.
వినోదం, విజ్ఞానం అందించే అరుదైన నేస్తం రేడియో అని చెప్పాలి. వేల టీవీ ఛానళ్లున్నా, వందలాది పత్రికలున్నా.. నేటికీ తుపానులు, వరదలు, పిడుగులు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి ప్రళయాలు సంభవించినప్పుడు అక్కడి ప్రజలకు వాతావరణ పరిస్థితులను, ప్రభుత్వాలకు ప్రజల స్థితిగతులను చేరవేసి త్వరగా విలయాలనుంచి కాపాడుకోవడానికి రేడియోనే మూలాధారం. ప్రాణ, ఆస్తినష్టాలను నివారించేందుకు ఉన్న ఏకైక ద్వారం. ఉదాహరణకు హుదూద్, తిత్లీ, పెథారు వంటి తుపానులు సంభవించి.. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పూర్తిగా స్తంభించినప్పుడు.. రేడియో ద్వారానే వాతావరణం గురించి తెలుసుకున్నామని విశాఖ, శ్రీకాకుళం ప్రజలు రేడియో సేవలను కొనియాడారు. ఎందుకంటే, వర్షానికి కేబుల్ వ్యవస్థ నాశనమై... పత్రికలు చేరవేసే మార్గం కరువైనప్పుడు.. వారికి అండగా ఉన్న ఏకైక మాధ్యమం రేడియో మాత్రమే. ఇక యుద్ధాల్లో పాల్గొనే జవానులు, సరిహద్దుల్లో పహారాకాసే సైన్యానికి ఇప్పటికీ రేడియో మాత్రమే వారిని చేరే ఏకైక సాధనం. ప్రపంచవ్యాప్తంగా కాలపరీక్షకు నిలబడి, పోటీ పరీక్షలు నెగ్గుతూ స్థిరపడిన ప్రసార ప్రణాళిక రేడియో సొంతం. అందుకే ఎంత సులభతరమైన, సౌకర్యవంతమైన మాధ్యమాలొచ్చినా రేడియోకు లేదు అంతం.
విద్య, వినోదం, విజ్ఞానం, సమాచారాలను సమపాళ్లలో మేళవించిన వినసొంపైన కార్యక్రమాలు రేడియో ప్రత్యేకం. వార్తాప్రసారం, నాటకం, శాస్ర్తియ సంగీతం, జానపద సంగీతం, రైతాంగం, విద్యార్థిలోకం, గ్రామీణ మహిళలు, పిల్లలు, క్రీడల ఆథారిత కార్యక్రమాలు, శ్రోతలు స్వయంగా పాల్గొనే మనోరంజని, జనవాణి వంటి కార్యక్రమాలు ఏ ఇతర మాధ్యమాల్లోనూ కనపడవు. కేవలం రేడియోలోనే నేటికీ వినపడతాయి. ఇంత వైవిధ్యానికి మరే ఇతర మాధ్యమాల్లో చోటులేదు. గంటసేపు వచ్చే టీవీ వార్తలకన్నా.. పది నిమిషాల్లో ప్రపంచంలోని విషయాలన్నీ క్లుప్తంగా, క్షుణ్ణంగా చెప్పే ఆకాశవాణి వార్తల్లో ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులు కూడా రేడియోలో ప్రసారమయ్యే స్పష్టమైన, సూటిగా వుండే సమాచారాల ద్వారానే అనేక విషయాలను తెలుసుకొంటుంటారు. సూటిగా మనసును తాకే.. మస్తిష్కాన్ని మేలుకొలిపే సరికొత్త సమాచార మాధ్యమం రేడియో. అందువల్లనే రేడియోకు ఆదరణ ఎక్కువ. తక్కువ శ్రమ కలిగిస్తూనే ఎక్కువ సంతోషాన్ని, సమాచారాన్ని అందించేది రేడియో మాత్రమే!
ఇంకా ఆ రేడియో గురించి మరింత తెలుసుకొందాం.
భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 జూన్‌లో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా ప్రసారమయ్యేవి. తరువాత బ్రాడ్ కాష్టింగ్ కంపెనీ ఏర్పాటుచేశారు. ప్రయోగాత్మకంగా జూలై 1927లో కలకత్తా, బొంబాయి నగరాలలో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు చేసింది. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరంలో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, లక్నో, తిరుచిరాపల్లి 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 215 కేంద్రాలు 337 ప్రసార కేంద్రాల (144 ఎంవివి కేంద్రాలు, 54 ఎస్‌వివి కేంద్రాలు, 139 ఎఫ్‌ఎం కేంద్రాలు)తో 77 ఆకాశవాణి కేంద్రాలు 99.13% ప్రజలకు ప్రస్తుతం సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. 1938లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు తేనెలొలికే తెలుగులో తొలిసారి తన వాణిని వినిపించిన మొదటి మహిళా అనౌన్సర్ శ్రీమతి పున్నావజ్జుల భానుమతిగారు. ఈమెను రేడియో భానుమతి అని కూడా పిలుస్తారు. ఈమె కూతురు జ్యోత్స్న కూడా రేడియో అనౌన్సర్‌గా పనిచేసింది. తెలుగులో మొదటి రేడియో నాటకం ‘అనార్కలి’ మద్రాసు కేంద్రం ద్వారా 1938 జూన్‌లో ప్రసారమైంది. విశ్వనాథ సత్యనారాయణ, వింజమూరి నరసింహారావు, ముద్దు కృష్ణ సమర్పించి నటించారు. నటుడు కొంగర జగ్గయ్య, ఉషశ్రీ, ప్రయాగ రామకృష్ణ లాంటి ఎందరో మహానుభావులు ఆకాశవాణిలో పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంనుంచి హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కడప, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, కొత్తగూడెం, తిరుపతిలో ఆకాశవాణి ప్రసార కేంద్రాలు ఉన్నాయి.
ఆదరణ పెరిగింది..
ఈమధ్యకాలంలో రేడియో ప్రసారాలకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఆల్ ఇండియా రేడియోతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియోలు రావడంవల్ల శ్రోతలు ఆయా ప్రసారాలను వినడానికి పోటీపడుతున్నారు. టీవీల రాకతో రేడియో ప్రసారాలకు ఆదరణ తగ్గలేదు. టీవీ అనేది ఒకేదగ్గర కూర్చొని వీక్షించే అవకాశం ఉంది. కానీ రేడియోమాత్రం ఎక్కడికైనా తీసుకువెళ్లే వీలుంది. వెస్ట్రన్ నుంచి ఈ కానె్సప్ట్‌ను తీసుకున్నారు. ముఖ్యంగా రేడియోలో ప్రయోజిత కార్యక్రమాలు, ఫోన్‌ఇన్ ప్రోగ్రామ్స్, ప్రత్యక్ష కార్యక్రమాలు, ఫిలిమ్ మ్యూజిక్ వంటి వాటికి మంచి ఆదరణ ఉంటోంది. ప్రజలతో మమేకం అవ్వడం ఎక్కువైంది. దీంతో శ్రోతల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని సేకరించే వీలు ఎక్కువైంది. ముఖ్యంగా నిర్మాణరంగంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులు రేడియోను వింటూ తమ పనులు చేస్తున్నారు.
పెన్నులోనూ.. మొబైల్ ఫోన్‌లోనూ.. కారులోనూ.. ఇతర వాహనాల్లోనూ రేడియోలు అమరిపోతున్నాయి. కాలక్షేపానికి, విజ్ఞాన సముపార్జనకు మంచి మాథ్యమంగా మారింది. రేడియో ఆకాశవాణిలో పనిచేసి.. తమ శ్రావ్యమైన స్వరంతో శ్రోతలను కట్టిపడేసి.. ఓ వెలుగువెలిగిన పండితులు ఎందరో ఉన్నారు. ఉషశ్రీ రామాయణ వ్యాఖ్యానం రేడియోకు ఎంత పేరుతెచ్చిందో.. ఆయనకూ.. రామాయణానికి అంతే ప్రఖ్యాతి తెచ్చింది. సినీ ప్రముఖులు, సాహితీశ్రేష్ఠలు.. నాటక రంగ ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులూ ఒకరేమిటి ఎందరో మహానుభావులకు ‘స్వరం’గా మారింది మన రేడియో.
ఎలా పనిచేస్తుంది..?
కాంతి వేగ పౌనపున్యాలతో విద్యుత్ అయస్కాంత తరంగాలను మాడ్యులేషన్‌తో గాలిలో శబ్దసంకేతాలను ప్రసారంచేసేదే దూరశ్రవణ ప్రక్రియ అని అంటారు. ఇలాంటి శబ్దాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అని అంటారు. మొదటి రోజులలో వాల్వ్‌లను ఉపయోగించి తయారుచేసేవారు. వీటికి ఎక్కువ విద్యుత్ వినియోగంతోపాటు పరిమాణంలోనూ చాలా పెద్దవిగా ఉండేవి. ప్రస్తుత టెలివిజన్‌లా ఒకచోట ఉంచి మాత్రమే వినాల్సివచ్చేది. 1960 వచ్చేటప్పటికి ట్రాన్సిస్టర్లు వచ్చాయి. వీటితో తయారైన రేడియో అందుబాటులోకి వచ్చింది. ఇవి తక్కువ విద్యుత్‌తోపాటు బ్యాటరీల ద్వారా కూడా పనిచేసేవి. రానురాను సాంకేతిక అభివృద్ధిచెందడంతో ఈ రేడియోలు అతిచిన్న పరిమాణంలోకి మారాయి. ప్రస్తుతం ప్రతీ మొబైల్‌లో రేడియో అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటుచేస్తున్నారు.
మధ్యతరహా తరంగాలు:
ప్రజలు వినే రేడియో తరంగాలు మూడురకాల ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. మధ్యతరహా (మీడియం వేవ్), అతి చిన్న తరంగాలు (షార్ట్‌వేవ్), ఎఫ్.ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్).
ఈ ఫ్రీక్వెన్సీని ముఖ్యంగా కొద్ది ప్రాంతంలో అంటే 200నుంచి 300 కిలోమీటర్ల పరిధివరకు ప్రసారానికి వాడతారు. ఈ ప్రసారాలలో నాణ్యత, ధ్వనిలో స్వచ్ఛత మధ్యరకంగా ఉంటుంది. మనం వింటున్న హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలు ఈ విధమైన ప్రసారాలు చేస్తున్నాయి.
ఈ ఫ్రీక్వెన్సీని సుదూర ప్రాంతాలకు ప్రసారానికి వాడతారు. రేడియో ట్రాన్స్‌మిటర్‌కు అనుసంధించిన ఏరియల్ కోణాన్నిబట్టి ప్రసార దూరాన్ని నియంత్రిస్తారు. సామాన్యంగా 3500 కిలోమీటర్లను దాటి ఈ ప్రసారాలు ఉంటాయి. ట్రాన్స్‌మిటరు ఏరియల్ కోణాన్ని నియంత్రించి ఈ దూరాన్ని పెంచవచ్చు.. తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో జరిగే ప్రసారాలు చాలా దూరం వినబడినా, ధ్వనిలో నాణ్యత ఉండదు. ప్రస్తుతం ఈ పద్ధతిలో చాలాతక్కువ రేడియోస్టేషన్‌లు ప్రసారాలు చేస్తున్నాయి. బి.బి.సి, వి.వొ.ఎ. అనే అంతర్జాతీయ రేడియో సంస్థలు ఈ విధానంలో దశాబ్దాలపాటు ప్రసారాలు చేశాయి...చేస్తున్నాయి.
ఎఫ్.ఎమ్..
ఈ ఫ్రీక్వెన్సీని తక్కువ పరిధిలో ప్రసారాలకు వాడతారు. ప్రస్తుతం ఈ ప్రసార విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ రేడియోస్టేషన్లు ప్రసారాలు అందిస్తున్నాయి. మన భారతదేశంలో కూడ అనేక ప్రైవేట్ ఛానల్స్ ఈ విధానానే్న పాటిస్తున్నాయి. రేడియో మిర్చి, రెడ్ ఎఫ్.ఎమ్.,(93.5) ఈ విధానానే్న అనుసరిస్తున్నాయి. ఈ ధ్వని తరంగాలు ప్రసారమయ్యే మధ్యలో ఎత్తయిన భవంతులు, కొండలు వస్తే అక్కడితో ఆగిపోతాయి. వచ్చినంతవరకైనా ఈ పద్ధతిలోని ప్రసారాలు నాణ్యతను, ధ్వని స్వచ్ఛతను కలిగిఉంటాయి. ఇవికాక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని శాటిలైటు రేడియోలు, ఇంటర్‌నెట్ రేడియోలు కూడా కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నాయి.
కొత్తగా వస్తున్న ఎఫ్.ఎం.లకు ధీటుగా ఆకాశవాణి తింటే గారెలే తినాలి... వింటే రెయిన్‌బో వినాలి అంటూ దాని అనుబంధ ఎఫ్.ఎం. ‘రెయిన్‌బో’ప్రచారం చేపట్టింది. దీనికి విస్తృత ప్రచారం కల్పించడంకోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆలిండియా రేడియో (ఎ.ఐ.ఆర్) ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార యంత్రాంగ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసారభారతి విభాగం. దూరదర్శన్ కూడ ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం పార్లమెంట్ వీధిలో భారత పార్లమెంట్ పక్కనే ఉన్న ఆకాశవాణి భవన్‌లో ఉంది. ఆకాశవాణి భవన్‌లో నాటక విభాగం, ఎఫ్.ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రసారమయ్యే స్టేషన్ కూడా ఉంది. ఈ స్టేషన్‌లో 24 గంటలు కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి.
ఏదిఏమైనప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మిగిలిన ప్రసార సాధనాల పోటీని తట్టుకొనే విధంగా ఆధునిక రేడియోలో కూడా అనేక మార్పులతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. రేడియో శ్రోతలకు సంజీవిని. అందుకే రేడియో సజీవంగా నిలచింది.

- కంచర్ల సుబ్బానాయుడు, 9492666660