మెయన్ ఫీచర్

నేరమయ రాజకీయాలకు సుప్రీం అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలంటేనే డబ్బుతో ముడిపడిన అంశం. అధికారంలో ఉన్న పార్టీలు సంక్షేమ పథకాల పేరుతో మిగిలిన పార్టీలు హామీల పేరుతో ఓటర్లను ఎరవేస్తున్నాయి. ఎన్నికల వేళ అన్ని పార్టీలూ ఒకే బాటలో నడుస్తూ అక్రమమార్గాలను అనుసరిస్తున్నాయి. ఇంకో పక్క రాజకీయ పార్టీలు ధనవంతుల్నే అభ్యర్ధులుగా రంగంలోకి దింపుతున్నాయి. అందులో నేరచరిత్ర ఉన్న వారిని సైతం నిర్లజ్జగా గెలుపుగుర్రాల పేరిట తమ అభ్యర్థులుగా నిలుపుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుండి ఇదే తతంగం నడుస్తోంది. రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తర్వాత అనివార్యంగా అక్కడక్కడా మంచివారు గెలుస్తున్నా, ప్రతి ముగ్గురిలో ఒకరు నేరచరితులేనని ఇటీవలె ఏడీఆర్ సంస్థ లెక్కలు తేల్చింది. ఎన్నికల ప్రక్షాళనకు కాలక్రమంలో ఎన్నో చర్యలు చేపట్టినా, రాజకీయ పక్షాలు ముందుకు రానంతకాలం ఇది సాధ్యం కాదనేది సుస్పష్టం. వేళ్లూనుకున్న రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి నేర చరిత్ర లేని వారికే టిక్కెట్లు ఇస్తామని చెప్పే ధైర్యం లేదా అని ఒక నాటి రాష్టప్రతి కే ఆర్ నారాయణన్ సూటిగా ప్రశ్నించినా జవాబు లేదు. ఇక అనివార్యంగా కొంత మంది సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి రాజకీయాల్లో నేరచరితులు పోటీ చేయకుండా నిలువరించాలని ప్రజావాజ్య పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా బీజేపీకి చెందిన అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు శిక్ష పడేంత వరకూ కేవలం ఆరోపణలు ఎదుర్కొన్నంత మాత్రాన రాజకీయ నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించలేమని స్పష్టం చేసింది. అయితే పనిలో పనిగా రాజకీయాల్లో నేర చరితులకు సంబంధించి కీలక ఆదేశాలను కూడా ఇచ్చింది. ప్రాంతీయ, జాతీయ పార్టీలు అన్నీ తమ తమ అన్యర్ధులపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలను ప్రచారంలోకి తీసుకురావాలని ఆదేశించడం గొప్ప ముందడుగుగా చెప్పవచ్చు. అధికారిక వెబ్‌సైట్లలో సామాజిక మాధ్యమాల్లో వివరాలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 2018 సెప్టెంబర్‌లోనే సుప్రీంకోర్టు నుండి ఆదేశాలు వెలువడినా వాటిని అభ్యర్థులు కానీ, రాజకీయ పక్షాలు కానీ పాటించడం లేదని, కోర్టు ధిక్కారణగా భావించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. క్రిమినల్ కేసులున్న వారు అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేశారో రాజకీయ పార్టీలు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేర చరిత్ర లేని వారికి ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో కూడా పార్టీలు వివరించుకోవాలి. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోనే లేదా నామినేషన్లు ప్రారంభమయ్యే తేదీకి కనీసం రెండు వారాలు ముందైనా ఈ వివరాలు అన్నీ వెల్లడించాలి. కొన్ని పార్టీలు నామినేషన్లు ముగిసే వరకూ కూడా తమ అభ్యర్థులను వెల్లడించని పరిస్థితి ఉంటాది, కనుక పేరు ప్రకటించిన 48 గంటల్లోనే ఆయా అభ్యర్థుల చరిత్రను, నేర చరిత్రను ప్రజల ముందు ఉంచాల్సి ఉంటుంది. దానివల్ల ఓట్లు వేసే ప్రజలు ఏ పార్టీ నుండి ఎవరు పోటీ చేశారో, అందులో ఎవరి నేర చరిత్ర ఏమిటో అంతా తెలుసుకుని, తమకు అనువైన అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఒక వేళ ఏ అభ్యర్థీ నచ్చని పరిస్థితి ఉంటే నోటా ఎలాగూ ఉండనే ఉంది. ఒక వేళ నేరచరితుడు ఎన్నికైన పక్షంలో ఈ వివరాలు అన్నింటినీ 72 గంటల్లోగా ఎన్నికల సంఘానికి వివరించాలి. మరో పక్క అభ్యర్థి తన అఫిడవిట్‌లో ఎలాగూ తనపై ఉన్న కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఆ అఫిడవిట్‌ను ఎన్నికల కమిషన్ తన పోర్టల్‌లో ఉంచుతుంది. ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా పార్టీకి సంబంధించిన అన్ని సామాజిక మాద్యమాల్లో కూడా ఈ సమాచారాన్ని ఉంచాలి. అక్కడితో ఊరుకోకుండా సుప్రీంకోర్టు మరో నిబంధన కూడా చేర్చింది. స్థానిక భాషలో వస్తున్న ప్రముఖ దినపత్రికలోనూ, ఆంగ్లభాషాపత్రికలోనూ ఆ వివరాలను పొందుపరచాలి. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉంటే ఎవరైనా ఒక అభ్యర్థిని ఎంపిక చేసినపుడు వారి విజయావకాశాల ఆధారంగానే కాకుండా వారి విద్యార్హతలు, సాధించిన విజయాలు, ప్రతిభా పాటవాలను కూడా టిక్కెట్ల కేటాయింపులో ప్రస్తావించాల్సి ఉంటుంది. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల నుండి నేరచరితుల సంఖ్య ప్రమాదకరస్థాయికి చేరుకుందని ఏడీఆర్ సంస్థ ఎప్పటికపుడు విడుదల చేస్తున్న గణాంకాలతో తేలిపోయింది. క్రిమినల్ కేసులను ఎదుర్కొన్న వారినే ఎందుకు ఎంపిక చేయాల్సి వస్తోందో ఇంత వరకూ రాజకీయ పార్టీలు చెప్పకపోయినా, సామాన్యుడికి సైతం ఇట్టే అర్ధమైపోతుంది. ఎన్నికల్లో ఇతరులను బెదిరించడం, ఎన్నికల పోలింగ్ బూత్‌ల స్వాధీనం, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడైనా వారు గెలుస్తారనే భరోసా రాజకీయ పార్టీలది. నేరచరితులు అయితే బాగా డబ్బు ఖర్చు చేసి ఎలాగైనా ఓటర్లను లోబరుచుకుని ఎన్నికల్లో గెలిచే జిమ్మిక్కులు చేస్తారనేది పార్టీల నమ్మకం. డబ్బు పంపిణీపై గట్టి నిఘా పెట్టినా, డబ్బుల పంపిణీ మార్గాన్ని రాజకీయ పార్టీలు మార్చుకున్నాయి. ఏకంగా ఏటీఎం కార్డులనే ఇచ్చేస్తూ, ఆయా అకౌంట్లలో డబ్బును జమ చేస్తున్నాయి. మరికొన్ని పార్టీలు డిపార్టుమెంటల్ స్టోర్సు, నగల వాణిజ్య సంస్థల కూపన్లు ముందుగా తీసుకుని వాటిని పంపిణీ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఆయా ఓటర్ల అప్పులు, ఇతర వివరాలను తెలుసుకుని ఆయా ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నాయి. గతంలో ఈ వ్యవహారాలు అన్నీ ఎన్నికలకు ఒకటి రెండు రోజులు ముందు జరిగేవి. దాంతో వివాదాలు ఎక్కువగా జరిగేవి. కొంత మంది తమకు బిర్యాని ప్యాకెట్లు అందలేదని, సారా ప్యాకెట్లు అందలేదనో, మద్యం అందలేదనో వివాదపడేవారు, తర్వాత వాటిని వదిలేసి డబ్బు పంపిణీ పెరిగింది, ఇపుడు ఈ వ్యవహారం ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా, ముందే జరిగిపోతోంది. ఎన్నికలకు వారం ముందు తేలుకుట్టినట్టు ఎవరికి వారు వౌనంగా ఉంటున్నారు. డబ్బు పంపిణీ అలికిడి ఎక్కడా ఉండటం లేదు. వ్యవహారం నిశ్శబ్దంగా ఉందంటే దానర్ధం మొత్తం పనులు ఏడాది ముందే అయిపోయాయని అర్ధం. ఇంతటి అక్రమాలకు బరితెగిస్తున్న రాజకీయ పార్టీలు నేరచరితులను ఎలా వదులుకుంటాయి? ఈ దురవస్థను గమనించే సుప్రీంకోర్టు ఎన్నికలకు సంబంధించి ఎన్నో మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక వేళ రాజకీయ పార్టీలు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టుయితే దానిని న్యాయస్థాన ధిక్కారణగా భావించి సుప్రీంకోర్టు దృష్టికి ఎన్నికల కమిషన్ తీసుకురావాలని, అదే సమయంలో ఆయా పార్టీలపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని కూడా ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు అభ్యర్థులంతా తమ నేర చరిత్ర వెల్లడించాల్సిందేనని శాసించింది.
ఏడీఆర్ నివేదిక ప్రకారం దేశంలో కనీసం 25వేల మంది ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు, మాజీ నేతలపై కేసులున్నాయి. ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సైతం నేరమయ రాజకీయాలకు అడ్డుకట్టవేసేందుకు ఎన్నో చర్యలను తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఎమికస్ క్యూరీగా వ్యవహరించిన విజయ్ హన్నారియా, స్నేహ కాలిట రూపొందించిన నివేదిక ప్రకారం 4896 కేసులున్నాయి. ఇందులో 2324 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలుపై ఉండగా, మిగిలిన కేసులు మాజీలపై ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం అంటే 1991లో దాఖలైన కేసులో సైతం నేటికీ నేరారోపణ జరగలేదంటే సమాజ నిస్తేజం, వ్యవస్థల పనితీరు అద్దం పడుతోంది. 264 కేసులపై హైకోర్టు స్టే ఉంది. మిగిలిన కేసుల్లో నాయకులు తమదైన శైలిలో జాప్యం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 505 కేసులు సెషన్స్ కోర్టుల్లోనూ, 1928 మెజిస్ట్రేట్ కోర్టుల్లోనూ, 33 స్పెషల్ కోర్టుల్లోనూ ఏళ్ల తరబడి మగ్గుతున్నాయి. దీంతో ఎంపీ, ఎంఎల్‌ఏలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి. వీటికి తోడు రాజకీయ నాయకుల ఎంపిక చేసిన కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. అవి కూడా కేసులను అనుదినం విచారిస్తున్నాయి. ఈ క్రమంలో 1650 కేసులను స్పెషల్ కోర్టుకు బదలాయించారు. రాష్ట్రాల వారీ కేసులను చూస్తే యూపీలోనే రాజకీయ నాయకులపై 992 కేసులున్నాయి. ఇవన్నీ అలహాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. ఇందులోనూ 395 కేసులకు సంబంధించి నేటికీ నేరారోపణలు జరగలేదు. ఇందులో చాలా కేసులు యావజ్జీవం లేదా ఉరిశిక్ష పడేవే. కొన్ని కేసులు 1982లో నమోదైనవే, అయినా వాటి ఉలుకూ పలుకూ లేదు.
మధ్యప్రదేశ్‌లో 168 కేసులు నమోదు కాగా, అదనపు సెషన్స్ జడ్జి హోదా అధికారితో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. మహారాష్టల్రో 31 కేసులను ముంబైలో మెజిస్ట్రేట్ హోదాలో ఏర్పాటు చేసిన స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. ఢిల్లీలో 38 కేసులను ఏడీజే స్థాయి స్పెషల్ కోర్టుకు, మరో 86 కేసులను మెజిస్ట్రేట్ స్థాయి కోర్టుకు బదిలీ చేశారు. ఏపీలో 109 కేసుల్లో 38 ప్రత్యేక న్యాయస్థానాలకు బదిలీ చేశారు, అలాగే తెలంగాణలో 99 కేసుల్లో 66 కేసులను ప్రత్యేక న్యాయస్థానాలకు బదిలీ చేశారు.
పార్టీల పరంగా చూస్తే 116 మంది బీజేపీ అభ్యర్ధులు, 29 మంది కాంగ్రెస్, 13 మంది జేడీయూ, 11 మంది ఎస్‌హెచ్‌ఎస్, 10 మంది డిఎంకే. 10 మంది వైఎస్‌ఆర్‌సీపీ, 9 మంది ఎఐటీసీ , ఆరుగురు ఎల్‌జేపీ, ఐదుగురు బిఎస్పీ, ముగ్గురు టీఆర్‌ఎస్, ఇద్దరేసి చొప్పున ఎఐడిఎంకే, సీపీఎం, ఐయూఎంఎల్, ఎన్‌సీపీ, ఎఐఎస్‌యు, అప్నాదళ్, బిజేడీ, జేకే ఎన్‌సీఆర్, ఆర్‌ఎస్‌పీ, ఎస్‌ఏడీ పార్టీల వారున్నారు. కేవలం కేసులను ఎదుర్కొంటున్న వారివి మాత్రమే ఈ వివరాలు, వాస్తవానికి కేసులు నిర్ధారణ అయిన వారి వివరాలు తేలాల్సి ఉంది.
పాత కేసులు తేలలేదు. కొత్తగా నేరచరితులు ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్నారు. అంటే కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల సంగతే చూసుకుంటే 2004లో 24 మంది ఎంపీలు, 2009 ఎన్నికల్లో 30 మంది, 2014లో 34 మంది, 2019లో 43 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. అదే ఏడీఆర్ నివేదిక తీసుకుంటే ప్రతి ముగ్గురు పార్లమెంటు సభ్యుల్లో ఒకరు నేరచరితులేనని తేల్చింది.దానికి ఆధారంగా ఆయా అభ్యర్ధులు సమర్పించిన అఫిడవిట్లేనని ఏడీఆర్ పేర్కొంది. పార్లమెంటులో కనీసం 43 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులున్నట్టు ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొంది. అంటే నేరచరితుల డాటాలోనూ సారూప్యత లేదని, గణాంకాల్లో గందరగోళం ఉందని స్పష్టమవుతోంది. 2018 అక్టోబర్ 10వ తేదీన ఫారం -28లో కొన్ని మార్పులు చేస్తూ నేర చరిత్ర వివరాలు అందించాలని రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు ఎన్నికల కమిషన్ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ఈవిషయంలో ఎన్నికల సంబల్ ఆర్డర్ 1968లో గానీ, ఎన్నికల నిబంధనావళిలో గానీ తగిన మార్పులు చేయకపోవడం వల్ల 2018 అక్టోబర్ నాటి నోటిఫికేషన్‌కు న్యాయబద్ధత లేకుండా పోయిందని అశ్వినికుమార్ ఉపాధ్యాయ తరఫున న్యాయవాది గోపాల్ శంకరనారాయణ్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న తర్వాతనే సర్వోన్నత న్యాయస్థానం అభ్యర్ధుల నేర చరిత్ర అందరికీ తెలియజేయాలని స్పష్టం చేసింది. తద్వారా నేరమయ రాజకీయాలకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

- బీవీ ప్రసాద్ 9963345056