మెయన్ ఫీచర్

శత్రుత్వం లేదు.. సమరం ఆగదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకపక్షాలు ప్రజాభిమానాన్ని పూర్తిస్థాయిలో సాధించుకోవడం ఎంత అవాస్తవమో ప్రజావ్యతిరేకతను పెంపొందించుకోవడం అంతే నిజం. ప్రజాస్వామ్యంలో పాలకపక్షాలే ప్రతిపక్షాలకు జవసత్వాల్ని అందిస్తాయి కూడా! గత 70 ఏళ్లుగా ఈ దేశంలో జరుగుతున్నది ఇదే! ఎన్నికల వేళ మాట్లాడే మాటలకు, అధికారంలోకి వచ్చాక చేసే చేష్టలకు పొంతనే వుండదు. అతికష్టం మీద అయిదేళ్లు పాలన చేయడం కత్తిమీద సాములా మారింది. మళ్లీ గెలిస్తే మరో 5 ఏళ్లు అధికార యోగం. ప్రస్తుత కాలంలో విధానాలు అప్రధానంగా మారి తిరిగి అధికారంలోకి ఎలా వద్దామనే తపన తప్ప, రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన పాలన ఎక్కడా కానరాదు. కొన్నివర్గాలు బలవాల్సినంతకన్నా మరింత ఎక్కువగా బలుస్తుంటే, ఎదగాల్సిన కనీస స్థాయికి కూడా మరికొన్ని వర్గాలు ఎదగడం లేదు.
ప్రజావ్యతిరేక విధానాలే పౌరులను సంఘటితం చేయడం, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, సాయుధ తిరుగుబాటుకు బీజాలు వేయడం జరుగుతున్నది. ఈ తిరుగుబాటు మావోయిస్టులతో మొదలుకాలేదు. మావోయిస్టులతో అంతం కాదు. వలస పాలకుల కాలంలో, అంతకుముందు రాచరిక వ్యవస్థలోనూ ప్రజా పోరాటలు వున్నాయి. నాడు,నేడు పాలకులు పాలితులను తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని చూడడం,తిరుగుబాట్లను అణచివేసినా, అవి మరో రూపంలో బహిర్గతం కావడం జరుగుతూనే వున్నది. ఇలాంటి ఘటనలెన్నో చరిత్ర పుటల్లో నిక్షిప్తమయ్యాయి. నిన్నటి పోరాటాలను, పోరాట యోధుల్ని కీర్తించే నేటి పాలక పక్షాలు, వర్తమానంలో తలెత్తే తిరుగుబాట్లను అదే తీరున అణచివేయడం పాలక పక్ష నైజంగా మారింది.
అల్లూరి, కొమురం భీం, భగత్‌సింగ్‌లా కొందరు వ్యక్తులు నేటి పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటుచేస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నియంతృత్వ విధానాలతో పాలన సాగించడం శోచనీయం. అంతులేని ఈ వ్యధాభరిత గాథలకు శుభం పలకడం అసాధ్యమే అయినా కనీసం విరామాన్ని కల్గించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించపోవడం విషాదం కాదా? పక్కనే గల నేపాల్‌లో జరిగిన పరిణామాల్ని కూడా మనం గమనం లోకి తీసుకోకపోవడం బాధాకరం. మావోయిస్టుల స్థాయిలోనే సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ప్రచండ మన దేశానికి మిత్రునిగా పరిగణింపబడుతుంటే, ఈ దేశం బిడ్డలు ఓ ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం అసువులు బాస్తుంటే పాలకులు కనీసం స్పందించక పోవడం గమనార్హం! ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఎన్నికలకు ముందు ఇలాంటి ఆలోచనలు రావడం జరుగుతూనే వున్నది. నక్సలైట్లు దేశభక్తులని పొగిడిన ఎన్‌టిఆర్ అతి స్వల్పకాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకోగా, నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అంటూ కెసిఆర్ ఉద్యమాన్ని సొంతం చేసుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఇలాంటి మాటలే నక్సల్స్ ప్రభావిత రాష్టాల్లో కొన్ని ఘటనల సందర్భంగా వినవస్తూనే వున్నాయి. ఆయా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం అన్యమనస్కంగా ఇలాంటి ప్రతిపాదనను తెస్తూనే వున్నది. స్వామి అగ్నివేశ్ మధ్యవర్తిత్వంగా యుపిఎ ప్రభుత్వం ఓ దాగుడుమూత ప్రయత్నం చేసి ఆజాద్‌ను ఎన్‌కౌంటర్ చేసింది. ఇదే ధోరణితో వైఎస్‌ఆర్ ఓ ‘అంతర్గత ఎజెండా’తో మావోయిస్టుల్ని చర్చలకు పిలిచి, వారి ఉనికికి భంగం కలిగేలా చేయడంతో ఆ చర్చలకు అర్థం లేకుండాపోయింది.
చర్చల సందర్భం వచ్చినప్పుడల్లా భేషరతు అనే మాటకు బదులు- ‘ఆయుధాలను విడిచి...’ అనే మాటను వాడి, చర్చలు జరక్కుండా నేటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా గత పాలకులూ నిబంధన పెట్టడం, చర్చలు జరగకుండా జాగ్రత్తపడడం కేంద్ర ప్రభుత్వం విధానంగా మారింది. దేశరక్షణ, సరిసద్దు భద్రత కోసం ఉపయోగించాల్సిన సాయుధ బలగాలు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో మారణహోమాన్ని సృష్టిస్తున్నాయనే ఆరోపణలను సుప్రీంకోర్టు కూడా గుర్తిస్తున్న తరుణంలో, మావోయిస్టులు ముందుగానే ఆయుధాలు వీడాలంటే, నిజంగా చర్చలు జరపాలనే ఆలోచన ప్రభుత్వాలకు ఉన్నట్లా? ఏ ఉద్యమమైనా ప్రజల సహకారం లేకుండా జరగదు. ఈ విషయం పోలీసులకు తెలుసు. నిజంగా చర్చలంటూ జరిగితే, అతిగా సంతోషించేది పోలీసు, పారమిలటరీ బలగాలే! ఎందుకంటే, ఇందులో పనిచేసే వారిలో అత్యధికులు పొట్టకూటి కోసం ఆరాటపడే అతి సామాన్యులే! తెగింపు, ప్రాణత్యాగం సాయుధ పోరాట నినాదం అయితే, సాధ్యమైనంతవరకు ప్రాణాల్ని కాపాడుకోవాలనే భావన ప్రభుత్వ బలగాలది. అందుకే చాలా సందర్భాలలో నష్టం మావోయిస్టుల వైపు ఎక్కువగా వుంటుంది.
చర్చలంటూ జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు ‘సిద్ధమా?’ అనే ప్రశ్న ఉదయించవచ్చు! కొలంబియా అధ్యక్షుడు జుయన్ మాన్యుయల్ సాంటోస్, ఆ దేశ విప్లవ గెరిల్లాలతో జరిపిన శాంతి చర్చల్లా కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరిపి శాంతి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని గత నెల 21న సుప్రీం కోర్టు చేసిన సూచనలకు లోబడి చర్చలు జరిగినా, నక్సలైట్ల డిమాండ్లు ఏ స్థాయిలో వుంటాయనేది ప్రశ్న కావచ్చు! ఉన్న ఫళంగా ఢిల్లీలో రాజ్యాధికారాన్ని కావాలని మాత్రం వారు కోరరన్న విషయం- వారి ఉద్యమాన్ని విశే్లషించేవారికి తెలుసు, పాలకులకు తెలుసు. అయినా పాలకులకెందుకు గుబులు? కారణం- మావోలు ప్రశ్నించే వౌలిక సమస్యలు పాలకుల్ని పార్లమెంటులో కూర్చోనీయకుండా చేస్తాయి కాబట్టి. మొదటి అంశం రాజ్యాంగబద్ధ పాలన సాగాలనేది కాగా, ప్రజలందరికీ ముఖ్యంగా ఆదివాసులకు రాజ్యాంగబద్ధంగా రక్షణ కావాలని కోరడం రెండో అంశంగా వుంటుంది. మూడోది అభివృద్ధి పేరున, ప్రాజెక్టుల పేరున ఆదివాసుల్ని, పల్లెవాసుల్ని నిర్వాసితుల్ని చేయడాన్ని నివారించాలని వుంటుంది. ఈ విషయాన్ని ‘నేషనల్ ట్రిబ్యునల్’ కూడా గుర్తిస్తున్నదే కాగా, గతంలో కేంద్ర పర్యావరణ మంత్రులు మాట్లాడిన అంశాలే! దేశ సంపద, ఖనిజ వనరులు ఈ దేశ అవసరాలకే పరిమితంగా వాడాలనేది మరొకటి కాగా, దునే్నవాడికే భూమి అన్నది మరో నినాదం. ఈ నినాదం కూడా భూసంస్కరణలోనిదే కావడం గమనార్హం! భూ పంపిణీ జరక్కపోగా, భూదానోద్యమం ద్వారా, కొంతలో కొంత భూసంస్కరణల ద్వారా లభించిన భూమి చేజారగా, కాళ్ళకింద భూమి కదిలిపోతుంటే, భూసమస్య ప్రధాన ఎజెండాగా మారింది. ఆయా సందర్భాలలో, పాలకులు అంటున్న మాటలు ఇవి. వీటిని ఆచరించడం నేటి పాలకులకు సాధ్యం కాదు కాబట్టే, చర్చల ప్రక్రియను ప్రభుత్వం మోసపూరితంగా ముందుకు తెస్తున్నది.
ఎందుకంటే ప్రజాస్వామ్య పాలనలన్నీ బహుళజాతి సంస్థల కనుసన్నల్లో, వారికి అనుగుణంగానే సాగుతున్నాయి కాబట్టి. బహుళజాతి సంస్థలే ఆయా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది కాబట్టి. జాతీయ పెట్టుబడిదారీ వర్గం స్వయంగా, పార్లమెంటేరియన్ అవతారం ఎత్తితే, విద్య, వైద్యం, ఉపాధి అందకుండా పోవడమేకాక, జీవించే హక్కుకే భంగం వాటిల్లుతుంది కాబట్టి! 1860లోనే అహ్రం లింకన్ ఈ విషయమై మాట్లాడుతూ, పాలనా వ్యవస్థలో కార్పొరేట్ సంస్థలు పాగా వేసాయని, దీనితో ఉన్నత స్థాయిలోని పాలకుల్లో అవినీతి శకం ఆరంభమైందని, సంపద కొద్దిమంది చేతుల్లో పోగుపడి, ప్రజల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని ధనశక్తే అధికారాన్ని చెలాయిస్తుందని, ఇది గణతంత్ర భావాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. అమెరికా సహా భారత్ లాంటి దేశాల్లో జరుగుతున్నది ఇదే! శతాబ్దన్నర తర్వాత కూడా లింకన్ మాటలు అక్షరసత్యాలు కాగా, దీని వ్యతిరేక పోరాటాలు అంతే మోతాదులో కొనసాగడం గమనార్హం!
సుప్రీంకోర్టు శాంతి చర్చల ప్రక్రియ ప్రతిపాదనను ముందుకు తెచ్చిన వారం రోజులు తిరక్కుండానే, ఎఓబిలో ఎన్‌కౌంటర్ జరగడం, ఊహించిన దానికన్నా ఎక్కువ నష్టం మావోయిస్టులకు జరగ్గా, ఇంత భారీ ఎన్‌కౌంటర్ జరగడం బాధాకరమన్న ఎపి డిజిపి సాంబశివరావు నక్సలైట్లు తమ శత్రువులు కారని అనడం గమనార్హం. పోలీసులు తమ వర్గ శత్రువులు కారని మావోయిస్టులు అంటారు. ప్రతి సంఘటన ఒకరిది పై చేయిగా నిలుపుతున్నది. చర్య, ప్రతిచర్యలో ప్రాణాలు పోతున్నది సాధారణ కుటుంబాలవారే. ఆస్తుల్ని పోగుచేసుకుంటూ పాలకులు హాయిగానే వుంటున్నారు. వీరికి రక్షణ కల్గిస్తున్నది కూడా పోలీసు శాఖలో ఉన్న సాధారణ వ్యక్తులే!
గత ఏడు దశాబ్దాలుగా ఏ లక్ష్యం నెరవేరిందో తెలియని అయోమయం. విద్య, వైద్యం, ఉపాధి ‘కార్పొరేట్’ మయమైంది. ప్రజల హక్కుగా వుండే ఈ అంశాలు బిచ్చంగా మారాయి. ప్రభుత్వాల బాధ్యత- రాయితీలిచ్చే స్థితికి దిగజారింది. దేశ సంపద, ఖనిజ సంపద విదేశీ హస్తగతం అవుతున్నాయి. ప్రజలు పరాధీనతకు గురౌతున్నారు. స్వదేశంలోనే కాందిశీకులౌతున్నారు. సరిహద్దు భద్రత, అంతరంగిక భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కులవ్యవస్థ మరింత బలోపేతమైంది. రూపం మారినా, ఆధిపత్య ధోరణి అప్పుడు, ఇప్పుడు ఒకరికే పరిమితంగా వుంటున్నది. ఒక వర్గం ప్రయోజనాలే ప్రామాణికంగా గుర్తించబడుతున్నాయి. ప్రజల హక్కులకు పరిమితులు గీస్తున్నారు. అభివృద్ధి కవచాన్ని తొడుగుతూ చీకట్లను సృష్టిస్తున్నారు. న్యాయ వ్యవస్థ కుంటి నడకనే సాగుతోంది. అవినీతిపరులు, అసాంఘిక శక్తులు, గూం డాలు, అక్రమంగా ఆర్జించినవారే చట్టసభల్లో పాగా వేస్తున్నారు. వీరే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. విదేశీవస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా స్థానంలో విదేశీ వస్తు వ్యామోహం, వెల్‌కమ్ టు ఇండియాగా రూపాంతరం చెందాయి. విదేశీ సంస్థల్ని, పెట్టుబడుల్ని, అప్పుల్ని ఆహ్వానించడమే నేటి పాలకుల ఎజెండాగా మారింది. దీనికి అంతం కనపడకపోగా, ఇదే నిజమైన అభివృద్ధి అంటూ ఓ నినాదాన్ని ముందుకు తెస్తున్నారు.
మొన్న సౌదిలో ఆ దేశ యువరాజును ఉరి తీశారు. ఓ వ్యక్తి మృతికి కారకుడైన ఆ యువరాజే స్వయంగా పోలీసులకు లొంగిపోవడం, విచిత్రం కాగా, ఆ దేశ చట్టం మరణశిక్ష విధించడం గమనార్హం. న్యాయానికి నాలుగు పాదాలని నిరూపించిన ఆ ఘటన మన దేశం ఆదర్శంగా తీసుకుంటే గనుక- మన అసెంబ్లీ, పార్లమెంటు సగానికి సగం ఖాళీ అవుతాయనడంలో సందేహం లేదు. ఇదే జరిగితే- చర్చలతో కంటే ముందు.. మావోయిస్టులు వారి ఆయుధాల్ని ఇండియా గేటు దగ్గర పెట్టరా..?

-డా.జి.లచ్చయ్య 94401 16162