మెయిన్ ఫీచర్

జ్ఞాన నేత్రోన్మీలనముతో సాక్షాత్కారము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
323. న ప్రమాదాదనర్థో‚ న్యో జ్ఞానినః స్వస్వరూపతః
తతోమోహ స్తతో‚ హంధీ స్తతోబన్ధ స్తతోవ్యథా॥
మోక్షాసక్తిగల జ్ఞానికి స్వస్వరూప ధ్యానమునకు భంగము కలిగించే పరాకుతనముకంటె మించిన అనర్థము వేరొకటి లేదు. సాధకుడు, పరధ్యానం చేత ఏకాగ్రత కోల్పోవును. ఏకాగ్రత కోల్పోయిన, మోహము ఉత్పన్నవౌను. మోహము వలనే ‘నేను’ అనే భ్రాంతి అసద్వస్తువైన అహంకారములో కలుగును. భ్రాంతి చేత యథార్థతను విస్మరించుట వలన, దేహముతో బంధము అంతము కాదు. ఈ విధముగా, జనన మరణ వలయములో చిక్కుకున్న విద్యావంతుడు కూడ దుఃఖమును అధిగమించి శాశ్వత సుఖమును పొందజాలడు.
324. విషయాభిముఖం దృష్ట్యా విద్వాంసమపి విస్మృతిః
విక్షేపయతి ధీదోషైః యోషా జారమివ ప్రియమ్‌॥
పరస్ర్తిమోహములో పడిన జారునివలె, విద్యావంతునిలోను బ్రహ్మవిస్మృతి చపలతను కలుగజేస్తుంది. విషయాసక్తిని ప్రేరేపించి, బహిర్ముఖుని గావించి వాని బుద్ధిని కలుషితము చేస్తుంది. స్థిరత్వము కోల్పోయి విచలితుడైన విద్యాసంపన్నుడు అంతర్ముఖుడు కాలేడు. ప్రత్మగాత్మను, సూక్ష్మదర్శి మాత్రమే జ్ఞాననేత్రోన్మీలనముతో సాక్షాత్కారము చేసుకొన శక్యమని శ్రుతి నిర్ధారిస్తున్నది.
‘‘కశ్చిత్ ధీరాః ప్రత్యగాత్మానమైక్షదావృత్తచక్షురమృతత్వమిచ్ఛన్’’
(బహుకొద్దిమందిలో ఒక కృతనిశ్చయుడైన ప్రాజ్ఞుడే, అమృతత్వము పొందే ఇచ్ఛతో ప్రత్యగాత్మను దర్శించుకొనును- క.ఉ.2-1-1)
325. యథాపకృష్టం శైవాలం క్షణమాత్రం న తిష్ఠతి
ఆవృణోతి తథా మాయా ప్రాజ్ఞం వాపి పరాఙ్మఖమ్‌॥
తొలగించిన నాచు స్వల్ప వ్యవధిలోనే కోనేరును ఆవరించి పరిశుభ్రమైన నీటిని కప్పివేయును. అట్లే, ‘నేతి నేతి’ అనే ప్రక్రియలో, ఇది బ్రహ్మము కాదు ఇది బ్రహ్మపదార్థము కాదు అని దేహాంతర్గత కోశాదులను ప్రాజ్ఞుడు నిషేధించినా, మాయ బహిర్ముఖుడై ఉన్నవాని స్వరూపమును ఆవరించి, వాని చైతన్యశక్తిని సంకుచితము చేయును.
326. లక్ష్యచ్యుతం చేద్యది చిత్తమీషద్
బహిర్ముఖం సన్నిపతేత్తతస్తతః
ప్రమాదతః ప్రచ్యుతకేలికన్దుకః
సోపానపంక్తౌ పతితో యథా తథా॥
చేతిలోనున్న బంతి ప్రమాదవశమున జారి మెట్లపై నుండి దొర్లిపడినట్లు, పరాకుతనమువలన చిత్తము స్వల్పముగా చలించినా, బ్రహ్మైక్యత లక్ష్యము తప్పిపోవును. బాహ్యవిషయములందు ఆసక్తి పెరిగిపోవును. ఆ సమయములో బుద్ధి అహంకారాదులను రెచ్చగొట్టును.
327. విషయేష్వావిశచ్చేతః సంకల్పయతి తద్గుణాన్‌
సమ్యక్ సంకల్పనాత్కామః కామాత్ పుంసః ప్రవర్తనమ్‌॥
వ్యాఖ్యానము రానున్న శ్లోకంతో కలిపి వ్రాయబడినది.
328. తతః స్వరూప విభ్రంసో విభ్రష్టస్తు పతత్యధః
పతితస్య వినా నాశం పునర్నారోహ ఈక్ష్యతే॥
సంకల్పం వర్జయే త్తస్మా త్సర్వానర్థస్య కారణమ్‌
అపథ్యాని హి వస్తూని వ్యాధిగ్రస్తో యథోత్సృజేత్‌॥
ఇంద్రియ ప్రేరిత విషయములందు చిత్తములో ఆసక్తి కలిగిన, భోగములపైకి దృష్టిమరలి వాటి ఆలోచనలు పెల్లుబుకును. అవి ఉద్ధృతమై వాటిని పొందుటకు సంకల్పించును. కోరికలను తీర్చుకొనే సంకల్పమే, ప్రయత్నమునకు దారితీయును. దానితో ప్రవర్తన మారిపోవును. ఆకారణంగా, బ్రహ్మాత్మభావన తొలగిపోయి స్వస్వరూప విస్మృతి కలుగును. స్వస్వరూప విస్మృతితో భ్రష్టుడై దిగజారును. పతితుడైన వ్యక్తి బ్రహ్మనిష్ఠ కోల్పోయి సద్గతి పొందడు.
అధోగతిపాలైన వ్యక్తికి దుఃఖప్రాప్తి తప్పదు. జరావ్యాధులు అధిగమించబడవు. వ్యాధిగ్రస్తుడు, తినకూడని పదార్థములను ఎట్లు త్యజించవలెనో, అట్లే బ్రహ్మనిష్ఠకు భంగకరము, దుర్గతికి మూలమైన సంకల్పములకు తావు ఎన్నడూ ఈయరాదు. పరాకుతనము, మోహము దేహాత్మభావనకు ప్రధాన కారణములు. అందువలన, ఏకాగ్రతకు విఘాతము కలిగించే ఆలోచనలు రానీయక, ముముక్షువు అప్రమత్తతో సదా ప్రవర్తించవలెనని పై రెండు శ్లోకములలో ఉపదేశించబడినది.
329. అతః ప్రమాదాన్న పరో‚స్తి మృత్యుః
వివేకినో బ్రహ్మవిదః సమాధౌ
సమాహితః సిద్ధిముపైతి సమ్యక్
సమాహితాత్మా భవ సావధానః॥
తొలుత సనత్సుజాతుని హితబోధ ఉల్లేఖిస్తూ పరాకుతనమే మృత్యువని ఏది చెప్పబడిందో, అదియే ఈ భాగముయొక్క ఉపసంహారములో చెప్పబడుతున్నది. విద్యావంతుడైన ఆత్మజ్ఞాని నిరంతరము బ్రహ్మభావనతో సమాధిస్థితిలో ఉన్నప్పుడే తప్పక ముక్తిని పొందును. ప్రమాదవశమున, బ్రహ్మనిష్ఠ కోల్పోయినా, పునర్జన్మ, వినాశము, అనివార్యవౌనని మోక్షాకాంక్షగల శిష్యునకు మరొక పర్యాయము ఉద్బోధించబడినది.
ఇంకా ఉంది