మెయిన్ ఫీచర్

కవిత్వం, విమర్శ ఆయనకు రెండు కళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన ఓ మహామనిషి, సౌజన్యమూర్తి. తెలుగు సాహితీ గగనంలో మెరుపులు చిందించిన అభ్యుదయ ధృవతార అగ్రశ్రేణి విమర్శకుడిగా సాధికార విమర్శలు చేస్తూ, రాస్తూ ఆధునిక తెలుగు సాహిత్య పత్రంపై తనదైన సంతకం చేసిన మహోన్నత సాహితీవేత్త. ప్రగతిశీల మార్గంలో పయనించిన గొప్ప మేధావి, సాహితీ సంచారయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. గజళ్ళకు ఆద్యుడు, పూజ్యుడు. కోకిల కంఠం, ఆరడుగుల ఆజానుబాహుడు మోములో చెదరని చిరునవ్వుతో అందర్నీ యిట్టే ఆకర్షిస్తూ సాహితీ నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన అద్దేపల్లి రామమోహనరావుగారు 1936 సెప్టెంబరు 6న బందరు శివార్లలోని (కృష్ణాజిల్లా) చింతగుంటపాలెంలో అద్దేపల్లి సుందరరావు, రాజరాజేశ్వరి పుణ్యదంపతుల యింటిలోని సాహితీ పూతోటలోని సాహితీ సుగంధ పరిమళాల్ని, సాహిత్యంలోని జిలుగు వెలుగుల్ని, నలుదిశలా వ్యాపింపజేయడానికి సాహితీ మాత ముద్దుబిడ్డగా జన్మించారు అద్దేపల్లివారు. తాతగారు రామస్వామి పౌరహిత్యం చేసేవారు. తండ్రి సుందరరావు బందరు హిందూ కాలేజిలో గుమాస్తాగా పనిచేశారు. వీరి ప్రాథమిక విద్య బందరులోని చింతగుంటపాలెంలో పూర్తిచేశారు. ఉన్నత విద్యని జవారుపేటలోని హిందూ హైస్కూలులో విజయవంతంగా పూర్తిచేశారు. అలాగే తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. అత్యధిక మార్కులతో విజయవంతంగా పూర్తిచేశారు.
బందరు హిందూ కాలేజిలో లెక్చరర్‌గా విధులు నిర్వహించి విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన విద్యను బోధించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. అలాగే కొంతకాలం నందిగామ కాలేజిలో లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 1972లో కాకినాడ వచ్చి అక్కడ స్థిరపడ్డారు. వృత్త్ధిర్మంగా లెక్చర్ ఉద్యోగంచేస్తునే ప్రవృత్తిగా రచనా వ్యాసాంగంలో కూడ తారాజువ్వలా దూసుకువెడుతున్నారు. ఓప్రక్క లెక్చరర్‌గా విధులు నిర్వహించడం దైవసేవగా భావించి, రచనలే మానవ సేవగా భావించి రెండింటికి సమన్యాయం చేకూరుస్తూ 1970లలో శివసాగర్, చెరబండరాజు, నగ్నముని వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి సాహితీ ధృవతారలా వచ్చారు. సమాజమే కుటుంబంగా, అభ్యుదయమే ప్రమాణంగా జీవిస్తూ ప్రాపంచిక కవితా దృక్పథాన్ని, మార్క్సిస్టు దృక్పథంతో మేళవించి అద్భుతమైన రచనలు చేశారు. ప్రపంచ పరిణామలు, మానవీయ విలువలు ఎట్లా కోల్పోతున్నారో ఆయన చాలా శక్తివంతంగా కవిత్వీకరించారు. ప్రపంచ పరిణామాలన్నింటిని చాలావరకు తన కవిత్వంలో ఆవిష్కరించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో రాసిన ‘పొగచూరిన ఆకాశం’ అనే పుస్తకమంతా కూడా ఈ ప్రపంచీకరణవల్ల, ఆధునిక నాగరికతవల్ల ఆధునిక వస్తువ్యామోహంవల్ల మనుష్యుల మధ్య ఎట్లా ఎడం ఏర్పడుతుందో చెప్తూ మనుష్యులు వస్తువుల చుట్టూ తిరుగుతూ మానవీయ విలువలు ఎట్లా కోల్పోతున్నారో ఆయన చాలా శక్తివంతంగా, అద్భుతంగా కవిత్వీకరించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఈ పొగచూరిన ఆకాశం కవితా సంపుటికి మద్రాసు చిన్నప్పభారతి సంస్థ నుంచి సాహిత్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
అద్దేపల్లివారు అభ్యుదయ భావాలను, ప్రజాస్వామ్య దృక్పథాలను మేళవించి రచనలు చేశారు. అలాగే ప్రజాస్వామ్యవాదాన్ని, దోపిడి, సామాజిక దురన్యాయాలను, అసమానతలను, విమర్శలను చాలా శక్తివంతంగా తన రచనల ద్వారా ప్రతిఘటించినటువంటి గొప్ప కవి పుంగవుడు. తెలుగులో ప్రగతిశీల సాహిత్యం పరిఢవిల్లడానికి పురాణ పురుషులుగా నిలబడ్డవాళ్ళలో అద్దేపల్లివారు ప్రముఖులు. అలాగే వీరు ఇటు ప్రాచీన సాహిత్యాన్ని, అటు ఆధునిక సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనేక కవితాప్రక్రియల మీద అభిరుచి వున్న వీరు ఆధునిక కవితారూపాలను ఆకళింపు చేసుకోవడంలో కాని, అందరికి వాటి మాధుర్యాన్ని అందజేయడంలో చురుకైన పాత్ర పోషించారు. ఇంకా శ్రీశ్రీ, కుందుర్తి, తిలక్, ఆరుద్ర, బైరాగి, అబ్బూరి, పట్ట్భా, సినారె, దాశరథి, కాళోజిలతోపాటు ఆ తరం, ఈతరం కవులందర్ని ప్రేమించారు. వారితో కలిసి సాహితీ సభల్లో పాల్గొన్నారు. కొత్తతరం, పాతతరం కవులకు మధ్య వారధిగా నిలిచి వారి మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొన్నారు.
అద్దేపల్లివారు చక్కని భావుకుడైనటువంటి కవి. అందుకే కవిత్వం, విమర్శ ఆయనకు రెండు కళ్ళు. ప్రజలే ఆయన కవితలకు పునాదిరాళ్ళు. బాగా చిత్తశుద్ధితో, నిష్కల్మషమైన మనస్సుతో విమర్శచేసేటువంటి గొప్ప విమర్శకుడు. ఒక రచనను విమర్శించడమంటే కత్తిమీద సాములాంటిది. విమర్శకులకు, ఎక్కువగా రచయిత రచనలోని పాజిటివ్ గుణాల్ని తీసుకొని విమర్శచేసేవారు. అలాగే దోషాలు చెప్పేటప్పుడు ఇది రాసినవాడు కవేంటి, వాడికేం తెలియదు’ అనే మాట ఏ మాత్రం విమర్శలో రాకుండా జాగ్రత్తపడేవారు. అలాగే తోటివారిని పాజిటివ్‌గా చూడలేనివాడు. ఉత్తమ విమర్శకుడు కాలేడు అని చెప్పి వాడు తనలాంటి కవే అని ఒక్కసారి ఆత్మవిమర్శచేసుకొని నాకిది లోపంగా అనిపిస్తుందీ, నా అభిప్రాయంలో ఇలా రాస్తే బావుంటుంది’ అని చెప్పే మార్గం చాలా మంచిదని అనుకొని చాలా సాత్వికమైన మార్గంలో విమర్శచేస్తు ఆ రచనలోని గుణాలు, దోషాలు వుంటే చాలాజాగ్రత్తగా సున్నితంగా, కవి మనస్సు నొప్పించకుండా ఓ మంచి ఫ్రండ్‌లాగా చెప్పేవారు. అందుకే ఆయన సాహితీ వినీలాకాశంలో అగ్రశేణి విమర్శకుడిగా ఓ వెలుగు వెలిగారు. అందుకే తెలుగు విశ్వవిద్యాలయంవారు 2011లో ఉత్తమ సాహితీ విమర్శకునిగా ప్రతిభా పురస్కారాన్ని అందజేసి ఆయన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశారు.
ఆయన కవిత్వాన్ని రాయడమే కాదు. అలా రాసిన కవిత్వాన్ని మృదుమధురంగా తేనెకన్నా తీయనైన చక్కని వాక్కుతో మృధుమధురమైన కంఠంతో కవిత్వాన్ని, పద్యాలని ఎంతో హృద్యంగా ఆలపిస్తారు. అందర్నీ అలరిస్తారు తన గాత్రంతో. అలాగే ఆయన గజల్స్ ప్రక్రియ మీద కూడ ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. ఎన్నో గజల్స్‌ని రాశారు. తన మృదుమధురమైన గాత్రంతో అందర్నీ అలరించి గజల్ గాయకునిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంకా ఉర్దూలోని పలు గజల్సుని వాటి ఆత్మ చెడకుండా అదే ట్యూన్‌తో తెలుగులోకి అనువదించిన గొప్ప గజల్ ప్రేమికుడాయన.
తెలుగులో మినీ కవితా ప్రక్రియను చేపట్టినవారిలో అద్దేపల్లివారు ప్రముఖులు. ఆరోజుల్లో మినీ కవితలు చాలాతక్కువగా వినిపిస్తుండేవి. రాసేవారు కూడ చాలా తక్కువగా వుండేవారు. అతి తక్కువ పదాలతో చక్కని భావం స్ఫూరించేవిధంగా కవిత వుండాలి. అప్పుడు ఆ మినీ కవిత జనంలోకి చాలాలోతుగా వెడుతుంది. చిన్ని కవిత అనేటప్పటికి ఎక్కువమంది సాహిత్యాభిమానులు చదువుతారు. ఇంత అందమైన మినీ కవితాప్రక్రియల్ని కూడ అద్దేపల్లివారు ఎంతో అర్థవంతంగా, అందంగా మలచిన ఆద్యులు. అలాగే ఆయన ఎన్నో కవితా సంపుటాలకు, ఇతర రచనలకు లెక్కకుమిన్నగా ముందుమాటలు రాశారు. ఆయన ముందుమాట ఎంత అద్భుతంగా రాస్తారంటే ముందుమాట చూస్తేనే కవితా సంపుటి మొత్తాన్ని ఇట్టే చదివెయ్యాలి అన్నంత గొప్పగా రాస్తారు. అందుకే ఆయన బహుముఖప్రజ్ఞకు మారుపేరుగా నిలిచారు. అలాగే ఆయన సానుకూల దృక్పధంతో ప్రతి ఒక్కరిని చూస్తు ప్రేమిస్తారు. యువకవులు ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈతరం కవులు రచనలు చేస్తున్నారంటే అద్దేపల్లివారి ప్రభావం ఎంత గొప్పగా వుందో మనం అర్థం చేసుకోవచ్చు.
సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను లెక్కకుమిన్నగా బిరుదులు పురస్కారాలు అందుకొన్నారు. ఉమర్ ఆలీషా అవార్డు, సరసం, తిలక్ అవార్డులు, ఆంధ్ర సారస్వత సమితి జీవనసాఫల్య పురస్కారం, తంగిరాల, జాషువా, పులికంటి లాంటి ఎన్నో పురస్కారాలు అందుకొన్నారు. అలాగే సాహితీ సంచారయోధుడు బిరుదునందుకొని ఆ బిరుదుతో బాగా వినుతికెక్కారు. ఇంకా వీరి సతీమణి అన్నపూర్ణ, పిల్లలు ఉదయభాస్కర్, ప్రభాకర్, రాధాకృష్ణ, రాజశేఖర్ అందరూ తండ్రి చూపిన బాటలో పయనిస్తూ వారి రచనలను మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే కాకుండా అద్దేపల్లివారి స్మృతి చిహ్నంగా ప్రతియేటా పుర ప్రముఖులకి బిరుదులని, పురస్కారాలని అందచేస్తు తండ్రిమీద వున్న ప్రేమని చాటుకొంటున్నారు. అలాగే అద్దేపల్లివారు మధుజ్వాల, గోదావరి నా ప్రతిబింబం, రక్తసంధ్య, జాషువా కవితా సమీక్ష లాంటి ఎన్నో మరెన్నో గొప్ప రచనలని సాహితీ ప్రియులకందించారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి విమర్శకునిగా వినుతికెక్కి ఈ సాహితీ సంచారయోధుడు 13 జనవరి, 2016లో భువి నుండి దివికేగారు.

- పింగళి భాగ్యలక్ష్మి