మెయిన్ ఫీచర్

ఓర్పుని సాధించడంలో నేర్పు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని విద్యలున్నా, ఎన్ని విధాల కష్టించి, ఏం ఆర్జించినా శక్తి సామర్థ్యాలున్నా ఓర్పును కోల్పోతే అన్ని సంపదలు, అన్ని గుణములు కోల్పోయినట్టే అవుతుంది. ఓర్పు, సహనం మనిషికి ప్రధానమైన, విలువున ఆభరణం వంటివి. ప్రాణ సమానమైన ఓర్పు, సహనం కోల్పోడంవల్లనే మనిషి అనేక నిష్టూరాలకి గురికావలసి వస్తోంది. ఓర్పు, సహనం లేకపోతే మనిషి మృగం అవుతాడు. ఆ రెండు గణాలు అలవరచుకుని మానవుడు మాధవుడు కాడానికి ప్రయత్నించాలి. అపుడే జీవితం చరితార్థమవుతుంది. అనేకమంది మహనీయులు తపశ్శక్తి చేత సమస్త శక్తులు సాధించినా, ఓర్పు, సహనం కోల్పోవడం చేత పతనమయ్యారని మనం చరిత్రలో తెలుసుకున్నాం. ఓర్పును, సహనాన్ని కోల్పోడం చేత రాజులు రాజ్యభ్రష్టులు కావడం జరిగింది. సహనాన్ని, ఓర్పును కోల్పోవడం చేత పండితులు, మహామునులు పతనమయ్యారని విన్నాం.
సమస్యలు లేని మనిషి భూమిమీద ఎక్కడా వుండడు. అయితే వచ్చిన సమస్యని సున్నితంగా పరిష్కరించుకుని సరైన మార్గంలో ఆలోచించి మసలుకోవాలి. మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, ఎదుటివారిని సమస్యల్లో ఇరికించి బాధపెట్టకూడదు. ప్రతి నిత్యం మనం పేపర్లో చూస్తున్నాం- ఎన్నో రకాల సమస్యలకి చావునే పరిష్కార మార్గంగా ఎన్నుకుంటున్నారు. వ్యవసాయదారులు, వ్యాపారస్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెళ్లయినవారు, ప్రేమికులు- ఇలా ఒకరనేమిటి, ఎక్కడ చూసినా సమస్యకి తగిన పరిష్కారం దొరకలేదని, ఎదుటివారిని చంపడమో, తాము చావడమో చేస్తూ వున్నారు. తద్వారా తమకు కావలసినవారికి నరకం చూపెడుతున్నారు. సమస్య తలెత్తేముందు ఆ సుమస్యకి తాము ఎంతవరకూ బాధ్యులమో ఆలోచించాలి. మనం అనుకున్నవి అనుకున్నట్టుగా ఎప్పటికీ జరుగదు. అందరికీ ‘జీవితం’ అంటే వడ్డించిన విస్తరి కాదు. సమస్యల్ని చక్కగా పరిష్కరించి నిదానంగా, నిశితంగా ఆలోచించి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుని, తెలివిగా మసలుకోవాలి. మనకన్నా అన్ని విధాలా తక్కువ స్థాయిలో జీవితం గడుపుతున్న వారిని చూసి మనం సంతృప్తిపడాలి. దైవచింతన అలవరచుకోవాలి. ప్రశాంత వాతావరణంలో మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉంచుకుని భగవంతుని స్మరించుకోవాలి.
కోరికలకు కళ్లెంవేసి మనసు మన అధీనంలో వుంచుకుంటే నిరాశ, నిస్పృహలకు తావు వుండదు. మనిషికి కోరికలు, ఆశలు వుండడం సర్వసాధారణం. కాని వాటిని పొందలేనపుడు నిరాశకు లోనై కృంగిపోకూడదు. మంచి మనుషులతో సహవాసం చెయ్యాలి. మంచి పనులు చేయుటకు పూనుకోవాలి. సత్సంగంలో పాల్గొని మహాపురుషుల దివ్యబోధనలు వినాలి. అపుడే మనిషి మంచి మార్గాన నడిచి, మంచి జీవితం పొందగలుగుతాడు. ఎదుటివారు ఏదో సందర్భంలో మనల్ని తూలనాడవచ్చు. అపుడు మనం కాస్త సహనం వహించి ఓర్చుకోవాలి. ఓర్పు కోల్పోతే సర్వం కోల్పోతాము. కాని కొన్ని సమయాల్లో ఓర్పును, క్షమను జాగ్రత్తగా విచారించి వినియోగించుకోవాలి.
ఒక గురువు వద్దకు ఒక విద్యార్థి వచ్చి ఇలా అడిగాడు. ‘‘మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విద్యను నేను ఎలా అయినా సరే నేర్చుకవాలనుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవడానికి నాకు ఎంత సమయం పడుతుంది?’’ అని. ఆ గురువుగారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ‘పదేళ్లు’ అని బదులిచ్చారు. అది విన్న విద్యార్థి, ‘అమ్మో! అంతకాలం నేను ఆగలేను గురుగారూ, కావాలంటే నేను రోజుకు మరింత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను, బాగా కష్టపడతాను, తీవ్రంగా కృషి చేస్తాను. అపుడు ఈ విద్య నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది మాస్టర్’ అని మరలా అడిగాడు ఆ విద్యార్థి. ఇపుడు కూడా క్షణం ఆలస్యం చేయకుండా ‘ఇరవైయేళ్లు’ అని బదులిచ్చారు ఆ గురువుగారు.
ఒక కొండలో రెండు బండరాళ్ళు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఒకనాడు ఒక శిల్పి వాటిని చూసి, ఉలి, సుత్తి తీసుకుని చెక్కడానికి ప్రయత్నించగా ఒక రాయి ఆ సుత్తి దెబ్బలు తట్టుకోలేక వద్దు వద్దు అని ఆక్షేపణ తెలియజేసింది. శిల్పి ఆ రాయిని వదిలి రెండవ రాయిని చెక్కడం మొదలెట్టాడు. ఆ రెండవ రాయి ఓర్పుతో, సహనంతో ఆ సుత్తి దెబ్బలు తింటూ వౌనంగా ఉంది. ఆ ప్రక్రియలో ఆ బండరాయి ఒక దేవతా విగ్రహంగా మారింది. ఒక ఆలయంలో దేవతగా సకల పూజలు అందుకుంటూ సుఖంగా ఉంది. ఆ రెండో రాయిని తెచ్చి అదే ఆలయంలో కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారు. ఆ రాతిమీదే కొబ్బరికాయలు నిరంతరం కొడుతూనే వున్నారు. అపుడు ఆ రాయి అనుకుంది, ఆహా! నేను కూడా అప్పుడే కొంచెం వోర్మి, సహనం కలిగివుంటే నాకీ దెబ్బలు తప్పేవి కదా! నేనూ దేవతనయ్యేదాన్ని కదా! అనుకుంటూ నిత్యం విచారిస్తూ వుంది. ఇపుడు విచారించి ఏమి లాభం. జీవితాంతం దుఃఖమే.
జెన్ కథలు ఎంత సామాన్యంగా అనిపిస్తాయో, అంతే జ్ఞానపు లోతులను కూడా కలిగివుంటాయి. మరో మాటలో చెప్పాలంటే అనంత భావగర్భితంగా వుంటాయి. నిజానికి పై కథ మనకు అందించే నీతి ఏమంటే, సృష్టిలో ప్రతి అంశంలోను రావలసిన పరిణామానికి కొంత నిర్ణీత సమయం అనేది వుంటుంది. ఒక మొక్కకు నాటిన రోజునే 100 కుండల నీళ్ళు పోస్తే, అది వెంటనే చెట్టై, పువ్వులు పూచి, కాయలు కాయడం ఎన్నటికీ సాధ్యం కాదు. అదే మొక్కకు ప్రతిరోజు కావలసినంత నీటిని అందిస్తూ, రక్షణ అందించినట్లయితే కొంతకాలం అయ్యాక అది పూలు పూచి కాయలు కాయడానికి సిద్ధం అవుతుంది. ఇక్కడ కథలోని విద్యార్థి తాను విద్య నేర్చుకోవడానికి, దానికై ఎంత శారీరక శ్రమ చేయడానికైనా సద్ధిపడ్డాడు కానీ, కాలం విషయంలో సంయమనాన్ని, ఓర్పును ప్రదర్శించలేకపోయాడు. కొన్ని విద్యలను నేర్చుకోవడానికి నేర్పుతోపాటు ఓర్పు కూడా ఆవశ్యకమై వుంటాయి. అంచేత ఏదేని విద్య నేర్చుకుందామని భావించేవారు మార్పును సహజం చేసుకుని సహనంగా మార్చుకోగలగాలి. ఆపై గురువుపై విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆ విద్యను పొందడానికి తగిన కృషి సల్పాలి. అపుడే ఆ విద్య పట్టుబడుతుంది.
జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎంతో కష్టపడాలి. విజయాలు సాధిస్తున్నపుడు జీవితం ఎంతో సంతోషదాయకంగా అనిపిస్తుంది. అదే పరాజయాల బాటలో నడుస్తున్నపుడు జీవితం విషాదమయంగా బాధల సుడిలో వున్నట్లు అన్పిస్తుంది. అయినప్పటికీ మనం చేసే పని అద్భుతంగా చేసి తీరాలి. దీనికి మానసిక ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏం కోల్పోయినా ఫర్వాలేదు కానీ మానసిక ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. మానసిక ధైర్యమే దీర్ఘకాలిక విజయాలను చేకూర్చి పెడుతుంది. బాధలను ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి. చేసే పనులలో ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు ఉంటాయి. అపుడే మానసిక ధైర్యం కావాలి. బాధల్ని, కష్టాల్ని, ఆర్థిక సమస్యలనూ అధిగమించడానికి మనం చేయాలనుకునే పనులను ఉన్నతంగా చేయడానికి ప్రయత్నించాలి. వీటి ఫలితం నూటికి నూరు శాతం వ్యతిరేకంగా వచ్చినా ధైర్యాన్ని సడలిపోనివ్వకూడదు. మానసిక ధైర్యమే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగిస్తుంది.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి