మెయిన్ ఫీచర్

వ్యామోహం వీడితే బ్రహ్మమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
బుద్ధిలో కల్గిన ఆవరణ, విక్షేప దోషములవలన నీవు, నేను, ఇది, అనే భేదభావము కల్పింపబడుతున్నది. ఏకాత్మక నిర్విశేష పరబ్రహ్మము భేద రహితము. అద్వైతభావనతో సమాధి స్థితిలోనున్న విజ్ఞానవంతుడు, బుద్ధి వికారములు నశించిపోగా, యథార్థ జ్ఞానముతో వికల్పరహితుడై, బ్రహ్మైక్యత పొందును.
356. శాన్తోదాన్తః పరముపరతః క్షాన్తియుక్త స్సమాధిం
కుర్వన్నిత్యం కలయతి యతిః స్వస్వ సర్వాత్మభావమ్‌
తేనావిద్య తిమిరజనితాన్ సాధు దగ్ధ్వా వికల్పాన్
బ్రహ్మాకృత్యా నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్పః॥
అంతరేంద్రియ నిగ్రహముతో మనఃప్రసాదమును పొందగా, బాహ్యేంద్రియ నిగ్రహమును సాధించి, బాహ్యవిషయాసక్తిని పూర్తిగా త్యజించి ఓర్మితో శీతోష్ణాదులను సమభావముతో సహిస్తూ, సమాధి స్థితిలో నిశ్చలంగా స్వస్వరూపమందు బుద్ధినివేశముచేసిన యతి (తత్త్వజ్ఞాన సాధకుడు). సర్వాత్మకతా భావమును పొందును.
ఆ విధముగా, సర్వాత్మకతాభావముతో నిర్వికల్ప సమాధిస్థితికి చేరుకొనగా, అవిద్య కారణంగా ఉద్భవించే సమస్త వికల్పములు జ్ఞానాగ్నిలో దగ్ధమై శేషరహితంగా నశించిపోవును. అందువలన, క్రియాసక్తి శూన్యమై, బ్రహ్మాకారభూతుడై, జీవన్ముక్తిని పొందిన యతీంద్రుడు పరమానందమును అనుభవించును.
357. సమాహితా యే ప్రవిలాప్య బాహ్యం
శ్రోత్రాదిచేతః స్వమహం చిదాత్మని
త ఏవ ముక్తా భవపాశబంధై
ర్నానే్య తు పారోక్ష్య కథాభిధాయినః॥
ఎవరు శ్రోత్రాది బాహ్య విషయములలో ఆసక్తి విడచిపెట్టి అంతర్ముఖులై, అహంకారమును జ్ఞాన స్వరూపమైన చిదాత్మలో విలీనముచేసి, చిత్తవృత్తిని బ్రహ్మాత్మ భావననుండి మరలనీయక మనఃసంలగ్నమై ఉందురో, వారే భవబంధముక్తులు. బాహ్యముఖులై ప్రాపంచిక వ్యామోహముతో, సదాత్మ తత్పరత సాధించకనే వట్టిమాటలు చెప్పేవారు సంసార బంధవిముక్తిని పొందరు.
358. ఉపాధియోగాత్స్వయమేవ భిద్యతే
చోపాధ్యపోహే స్వయమేవ కేవలః
తస్మాదుపాధేః విలయాయ విద్వాన్
వసేత్సదా‚ కల్పసమాధినిష్ఠయా॥
ఉపాధి వశమున అద్వితీయమైన పరమాత్మయే, సమస్త ప్రాణులను ఆశ్రయించి ప్రత్యగాత్మ స్వరూపములో ఉన్నది. ‘‘ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా (శే్వ.ఉ.6-11), ‘‘నేహ నానా‚స్తి కించన’’(బృ.ఉ.4-4-19) ‘‘ఏక ఏవ హి భూతాత్మా భూతే వ్యవస్థితః’’(బ్ర.బిం12), ఇత్యాది పలు శ్రుతులు జీవపరమాత్మలలో భేదములేదని స్పష్టముచేస్తున్నవి. కాని, అవివేకముచే భేదము కల్పించబడుతున్నది. సర్వోపాధులను నిరాకరింపగా పురుషాకృతిలోనున్న జీవాత్మ, పరమాత్మవలె సంగరహితము, నిరవయవి, క్రియాశూన్యము. నిర్గుణ పరబ్రహ్మము ‘‘అసజ్ఞః’’, ‘‘కేవలః’’అని శ్రుతి తార్కాణము (బృ.ఉ.3-8-8). అందువలన, మోక్షేచ్ఛగల విజ్ఞానవంతుడు, భేదభావనకు హేతువైన అహంకారము నశించుటకు, నిర్వికల్ప సమాథి స్థితిలో అహర్నిశలు స్థిరుడై ఉండవలెను.
359 సతి సక్తో నరో యాతి సద్భావం హ్యేకనిష్ఠయా
కీటకోభ్రమరం ధ్యాయన్ భ్రమరత్వాయ కల్పతే
ప్రసిద్ధ భ్రమర కీటక న్యాయమును ఉల్లేఖిస్తూ, తదేకనిష్ఠతో బ్రహ్మ ధ్యానములో వున్న సాధకుడు బ్రహ్మత్వసిద్ధి పొందుట తథ్యమని బోధింపబడుతున్నది. ఒక భ్రమరము (కందిరీగ), చిన్న కీటకమును తెచ్చి చెట్టు తొఱ్ఱలోనో, రాతి కిందనో వుంచి దాని ఎదురుగా నాదము (ధ్వని) చేస్తూ దాని చుట్టూ తిరుగును. భ్రమరనాదముపై తదేక దృష్టి సారించిన కీటకము, భ్రమరముగా పరిణమించును. ఈ దృష్టాంతమును చూపుతూ బ్రహ్మనిష్ఠగలవారు బ్రహ్మస్వరూపమును పొందుట సాధ్యమని తత్త్వవేత్తలు ఉపదేశింతురు.
360.క్రియాన్త మపాస్య కీటకో
ధ్యాయాన్యథాలిం హ్యలిభావమృచ్ఛతి
తథైవ యోగీ పరమాత్మ తత్త్వం
ధ్యాత్వా సమాయాతి తదేక నిష్ఠయా!
కీటకము అన్యక్రియాసక్తిని త్యజించి, భ్రమరమునుండి దృష్టి మరలనీయక, తదేక చింతనలో నిమగ్నమైన కారణముగా తన సంకల్ప ప్రభావమువలన పరిణామము చెంది, భ్రమర రూపమును పొందుతున్నది. అదేవిధముగా, తాను పరమాత్మ స్వరూపమును తప్ప తద్భిన్నము కాదనే ఏకత్వ భావనతో, అన్య విషయములందు ఆసక్తి త్యజించి, తదేక లక్ష్యముతోపరమాత్మ తత్త్వమును ఏకాగ్రతతో ధ్యానించే సాధకుడు, బ్రహైక్యత తప్పక పొందును.
ఇంకా ఉంది