మెయిన్ ఫీచర్

సాధనతో నిశ్చలమనస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
అతీవసూక్ష్మం పరమాత్మతత్త్వం
న స్థూల దృష్ట్యా ప్రతిపత్తు మర్హతి
సమాధినాత్యన్త సుసూక్ష్మ్మ వృత్త్యా
జ్ఞాతవ్య మార్యైరతి శుద్ధ బుద్ధ్భిః
పరమ శ్రేష్ఠమైన ఆత్మతత్త్వము అత్యంత సూక్ష్మమైనది. స్థూలదేహముతో సన్నిహిత సంబంధమున్న అహంకారాదులచే కలుషితమైన అంతఃకరణ వృత్తిచే ఆత్మగ్రాహ్యము కాదు. నిర్మలమైన బుద్ధి నివేశముగలవారు, సన్మార్గగాములు, సచ్చిదానంత స్వరూపమైన ప్రత్యగాత్మ చింతనలో నిరంతరము అంతర్ముఖులై ఉన్నవారికి మాత్రమే ఆత్మదర్శనము కలుగును.
‘కశ్చిద్ధీరః ప్రత్యగాత్మాన మైక్షదావృత్త చక్షురమృతత్వ మిచ్ఛన్’ (అంతర్ముఖుడై అమృతత్వమును పొందే ఇచ్ఛతో ప్రత్యగాత్మను దర్శించుకొనును) ‘వాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య భాగో జీవః స విజ్ఞేయః స చానంత్యాయ కల్పతే’ (తల వెంట్రుక చివరి భాగాన్ని నూరు భాగములు చేయగా నూరవ భాగమంత సూక్ష్మమైనది జీవాత్మ. అదియే తెలిసికొనదగినది. దాని శక్తి అపారము, అనంతమని తెలిసికొనవలెను).
362. యథా సువర్ణం పుటపాకశోధితం
త్యక్త్వా మలం స్వాత్మగుణం సమృచ్ఛతి
తథా మనః సత్త్వ రజస్తమోమలం
ధ్యానేన సంత్యజ్య సమేతి తత్త్వమ్
పుటం పెట్టిన బంగారము ఎట్లు మలినములను వీడి, తన సహజ గుణమును పొంది తళతళ మెరయునో, అట్లే సత్త్వరజస్తమో గుణములతో సంక్రమించిన సమస్త కల్మషములను, ధ్యానములో నిమగ్నమైన మనస్సు విడచిపెట్టి, బ్రహ్మతత్త్వమును (బ్రహ్మత్వమును) పొందును. ప్రకృతి జనితములైన సత్త్వ రజస్తమోగుణములు మూడింటినీ అతిక్రమించిన మనిషే బ్రహ్మత్వ సిద్ధిని పొందునని స్మృతి బోధిస్తున్నది.
‘గుణా నేతా నతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్
జన్మమృత్యుజరాదుఃఖైః ర్విముక్తో మృతమశ్నుతే
దేహోత్పత్తికారణములైన ఈ మూడు గుణములను అధిగమించిన వాడు, జన్మ మృత్య జరా దుఃఖమలనుండి విముక్తుడై, మోక్షమును పొందుతున్నాడు.
363. నిరన్తరాభ్యాసవశాత్తదిత్థం
పక్వం మనోబ్రహ్మణి లీయతే యదా
తదా సమాధిః సవికల్పవర్జితః
స్వతో ద్వయానన్దరసానుభావకః
నిరంతరము అభ్యాసము చేయగా, మనస్సు నిశ్చలమై బ్రహ్మైక్యత పొందినపుడు, అద్వితీయ బ్రహ్మానంద రసానుభవము ముముక్షువుకి లభించును. బ్రహ్మము సిద్ధ వస్తువు, నిత్యము ఉన్నదే కావున సిద్ధ వస్తువును పొందుటకు తత్త్వజ్ఞానము, కఠోర సాధన తప్ప అన్యమార్గము లేదు.
‘నాన్యః పంథా విద్యతే యనాయ’ - ఆత్మజ్ఞాన సాధన తప్ప కైవల్యసిద్ధికి వేరొక మార్గం లేదు.

364. సమాధినా నేన సమస్త వాసనా
గ్రన్థిర్వినాశో ఖిలకర్మనాశః
అన్తర్బహిః సర్వత ఏవ సర్వదా
స్వరూప విస్ఫూర్తి రయత్నతః స్యాత్
నిర్వికల్ప సమాధిలో బ్రహ్మతత్పరుడై వున్న సాధకునిలో సమస్త వాసనా గ్రంథులు నశించును. తత్కారణంగా, వాని సుకృతదుష్కృత కర్మఫలము శేషరహితముగా అంతమైపోవును. ప్రశాంత మనస్కుడై ఆ ముముక్షువు, స్వస్వరూపదర్శనమును పొంది, లోప ల, వెలుపల, అంతర్బాహ్య విశేషము లేక, సర్వత్ర, ఎల్లవేళల, పరిపూర్ణ ఆత్మ తేజస్సుతో స్వభావసిద్ధముగా, అప్రయత్నముగనే విరాజమానమై ఉండును.
365. శ్రుతేః శతగుణం విద్యాన్మననం మననాదపి
నిదిధ్యాసం లక్షగుణం అనన్తం నిర్వికల్పకమ్
శ్రుతి యొక్క శ్రవణముకంటె నూరు రెట్లు అధిక గుణము కలది మననము, మననముకంటె లక్ష రెట్లు అధిక గుణము కలది నిదిధ్యాసనము
366.నిర్వికల్పక సమాధినా స్ఫుటం
బ్రహ్మతత్త్వ మవగమ్యతే ధ్రువమ్
నాన్యథా చలతయా మనోగతేః
ప్రత్యయాన్తర విమిశ్రీతం భవేత్
నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండుటవలన పరబ్రహ్మతత్త్వము స్పష్టముగా అవగతమగుట నిశ్చయము. ఇంకొక విధముగా యథార్థ జ్ఞానము పొందబడదు. మనస్సు అత్యంత చంచలము; దాని గతి క్షణకాలములో మారిపోవును. ఇతర ఆలోచనలతో మనస్సు మిశ్రీతమైన, సమాధి స్థితికి భంగము వాటిల్లును.
ఇంకా ఉంది