మెయిన్ ఫీచర్

ఆనంద స్వరూపమైన ఆత్మను స్మరించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
ధ్యాన నిథి
379. లక్ష్యేబ్రహ్మణి మానసం దృఢతరం సంస్థాప్య బాహ్యేన్ధ్రియం
స్వస్థానే వినివేశ్య నిశ్చలతనుశ్చోపేక్ష్య దేహస్థితిమ్‌
బ్రహ్మాత్మైక్యము పేత్య తన్మయతయా చాఖండవృత్త్యానిశం
బ్రహ్మానన్దరసం పిబాత్మని ముదా శూన్యైః కిమన్యై ఇర్భ్రమైః॥
దేహస్థితిని విస్మరించి, నిశ్చలముగా ఒక ప్రదేశములో ఆసీనుడవై, బాహ్యేంద్రియాలను వాటి వాటి స్థానములలో స్థిరముగా ఉంచి, లక్ష్యసిద్ధికై పరబ్రహ్మమందే నీ మనస్సును నిశ్చలముగా నిల్పుము. నిర్గుణ బ్రహ్మతో ఆత్మను ఐక్యముచేసి, ఆత్మావలోకనముకొరకు, అఖండ వృత్తితో, నిరంతరము తన్మయుడవై, బ్రహ్మానందరసమును తృప్తిగా ఆస్వాదించుము. ఇతర కార్యములు భ్రమను కల్పించునవి; వాటి ప్రయోజనము శూన్యము.
380. అనాత్మచిన్తనం త్యక్త్వా కశ్మలం దుఃఖకారణమ్‌
చిన్త యాత్మాన మానన్దరూపం యన్ముక్తికారణమ్‌॥
కశ్మల సహితము, అపవిత్రము, దుఃఖహేతువులైన దేహము, ప్రపంచము ఇత్యాది అనాత్మ వస్తువులందు చింతన కట్టిపెట్టి, ఏది ముక్తిని ప్రసాదించునో అట్టి ఆనంద స్వరూపమైన ఆత్మను స్మరించి తరించుము.
381. ఏష స్వయంజ్యోతి రశేషసాక్షీ
విజ్ఞానకోశే విలసత్యజస్రమ్
లక్ష్యం విధాయైన మసద్విలక్షణం
అఖండ వృత్త్యాత్మతయానుభావయ॥
ఈ ఆత్మ స్వయంప్రకాశము. సర్వమును వీక్షిస్తూ సాక్షిగా బుద్ధిగుహలో ప్రకాశిస్తున్నది. ఇతర జడములైన మనోబుద్ధ్యాదులకు అది విలక్షణమైనది. ఆత్మను లక్ష్యముగావించి, ఎల్లవేళల ఏకాగ్రతతో దానియందే మనస్సునునిల్పి, అఖండ వృత్తితో, నీ స్వరూపమైన దానిని సాక్షాత్కరించుకొనుము.
382. ఏతమచ్ఛిన్నయా వృత్త్యా ప్రత్యయాన్తరశూన్యయా
ఉల్లేఖయన్ విజానీయాత్ స్వస్వరూపతయా స్ఫుటమ్‌॥
ఇతర ఆలోచనలకు తావివ్వక, మనస్సుయొక్క వృత్తిని అఖండరూపములో ఆత్మయందే నిలిపి, నిరంతర స్మరణతో స్పష్టముగాను, పరిపూర్ణముగాను, ఆత్మను స్వస్వరూపముగా తెలిసికొనుము.
383. అత్రాత్మత్వం దృఢీకుర్వన్నహమాదిషు సంత్యజన్‌
ఉదాసీనతయా తేషు తిష్ఠే ద్ఘటపటాదివత్‌॥
తత్త్వజ్ఞానార్జనకు, ఆత్మ స్వస్వరూపమనే బుద్ధిని దృఢముచేసికొని, పనికిమాలిన కుండలు, చిరిగిన వస్తమ్రులు ఎట్లు నిరర్థకములో అట్టివే జడములు, క్షతిగ్రస్తమయే ఇంద్రియములు, దేహము మరియు అహంకారమని స్థిరీకరించుకొని, వాటియందు సదా ఉదాసీనతతో (తటస్థముగా) ఉండుము.
ఆత్మదృష్టి
384. విశుద్ధమన్తఃకరణం స్వరూపే
నివేశ్య సాక్షిణ్యవబోధమాత్రే
శనైః శనైర్నిశ్చలతా ముపానయన్
పూర్ణత్వ మేవానువిలోకయే తత్తః॥
సకల తామసరజోగుణాది మనోవికారములను నశింపగా పరిశుద్ధమైన అంతఃకరణమును, కేవలము జ్ఞానస్వరూపము, సాక్షి, స్వస్వరూపమైన ఆత్మలో నిలపవలెను. మెల్లమెల్లగా అభ్యాసముతో ప్రయత్న పూర్వకముగా పూర్ణస్వరూపములో నీవు ఆత్మసాక్షాత్కారము పొందగలవు.
385. దేహేంద్రియ ప్రాణమనో‚ హమాదిభిః
స్వాజ్ఞానక్ల్‌పె్తైరఖిలై రూపాదిభిః
విముక్త మాత్మాన మఖన్డరూపం
పూర్ణం మహాకాశమివావలోకయేత్‌॥
తన అజ్ఞానమువలన సంభవించిన దేహము, ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, అహంకారాదులు సర్వమూ ఉపాధివశమున ఆత్మకు చేరువైనవి. సర్వోపాధులను నిరాకృతిచేసి, చిదాత్మను పరిపూర్ణ స్వరూపముగా, విభువైన మహాకాశమువలె అఖండ రూపములో దర్శించుకొనవలెను.
386. ఘటకల శకుసూల సూచిముఖ్యైః
గగనముపాధిశతై ర్విముక్త మేకమ్‌
భవతి న వివిధం తథైవ శుద్ధం
పరమహమాది విముక్త మేకమేవ॥
ఘటము, కలశము, తట్ట-బుట్ట, సూదిబెజ్జము ఇత్యాది వస్తువులలో నిండియున్న ఆకాశము ఏకమేకాని విభిన్నముకాదు. సూక్ష్మమైనవి, పెద్ద ఆకారముగల వస్తువులు సమస్తము ఎట్లు విభువైన మహాకాశమునకు ఎట్లు ఉపాధులవుతున్నవో, అట్లే ఆత్మదేహాదులకు ఉపాధి అవుతున్నది. ప్రతిబంధకములు తొలగిన ఆకాశము ఏకత్వముతో అఖండాకృతిని ఎట్లు పొందుతున్నదో, అట్లే ఆత్మ అహంకారాది ఉపాధులచే విముక్తిపొంది, పరిపూర్ణముగా అఖండ రూపములో దీప్తినంతవౌను.
387. బ్రహ్మాద్యాః స్తమ్బపర్యన్తా మృషామాత్రా ఉపాధయః
తతః పూర్ణం స్వమాత్మనం పశే్యదేకాత్మనా స్థితమ్‌॥
హిరణ్యగర్భుడు (ప్రజాపతి) మొదలు, అతిసూక్ష్మమైన కీటకమువరకు దేహాద్యుపాధులతో ఈ ప్రపంచములో ఉన్న సర్వము మిథ్యను కల్పిస్తున్న అశాశ్వత రూపములు. యుగాంతములో, పరమాత్మలో సర్వము లయముచెందును. పరిపూర్ణము, శాశ్వతము, పరిణామశూన్యము, సర్వాత్మకమైన పరబ్రహ్మము నాశరహితము. సద్రూపమైన పరబ్రహ్మమును, స్వస్వరూపముగా దర్శనము చేసికొనుము.
ఇంకా ఉంది