మెయన్ ఫీచర్

నాయకత్వ సంక్షోభంలో భాజపా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నాయకత్వం సంక్షోభాన్ని ఎదుర్కొం టున్నది. మీడియా సమావేశాలకు, కొన్ని గోడల మధ్య జరిగే సమావేశాలు జరపడం తప్పా జనం మధ్యకు వెళ్లి పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులను ఉత్తేజ పరచే నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీ పరిస్థితి ఎక్కడకు వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నది. జనసంఘ్ రోజులలో కూడా ఇంత దుస్థితిలో పార్టీ లేకపోవడం గమనార్హం.
ఫిరాయింపుదారులు, ఎప్పుడు ఏ పార్టీలో ఎందుకు ఉంటారో తెలియని వారిని కాకుండా, సొంతంగా నాయకత్వాన్ని పెంపొందింప చేసుకొనే ప్రయత్నం జరగడం లేదు. అందుకనే రెండు నెలలకు పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకం జరగడం లేదు. స్థానికంగా గల పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను బట్టి కాకుండా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాల నుండో, ఢిల్లీ నాయకత్వం నుండే పార్టీ అధ్యక్షులను రుద్దే ప్రయత్నం చేయడం మినహా పార్టీలో విస్తృత మద్దతు గల నాయకత్వానికి ప్రోత్సాహం లేక పోతూ ఉండడంతో గత దశాబ్దానికి పైగా పార్టీ ఎదుగు బొదుగూ లేకపోతున్నది.
మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్రలు జరపమని పార్టీ అధిష్టానం పిలుపిస్తే తెలంగాణలో అసలు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సైద్ధాంతికంగా, విలువల పరంగా గాంధీజీతో ఏ మాత్రం పోల్చలేని నాయకుల సారథ్యంలో, కూలీకి తీసుకొచ్చిన వారితో ఫోటో యాత్రలు జరిపి నవ్వులపాలయ్యారు. ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపలేక పోయారు.
మీడియా సమావేశాలలో తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులపై విమర్శల వర్షం కురిపిస్తున్న పలువురు నాయకులు లోపాయికారిగా వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారనే విమర్శలు భాజపా వర్గాల నుండే వస్తుండటం గమనార్హం. కొందరు నేతలయితే అధికార పక్షపు అధికార ప్రతినిధులా అనే అనుమానాలను పార్టీ నేతలకే కలిగిస్తున్నారు. పార్టీలో సైద్ధాంతిక అంశాలపై ఎటువంటి సమాలోచనలు జరపక పోవడం, వాటి పట్ల దృష్టి సారించక పోవడంతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగలేక పోతున్నది.
పార్టీలో చేరిన ఒక మహిళా నేత దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతా వాదం గురించి పలు సార్లు చదివి అర్థం చేసుకోలేక, పార్టీలో ఎవరైనా అర్థం అయ్యేటట్లు చెబుతారా అని చూసారు. కానీ ఆమెకు తీవ్ర అసంతృప్తి మిగిలింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్టీలో కొందరు నాయుడు మద్దతు దారులుగా, మరో కొందరు నాయుడు ప్రత్యర్థులు లేదా జగన్ మద్దతు దారులుగా గుర్తింపు పొందారు. కానీ పార్టీ ప్రయోజనాల కోసం నిలబడిన వారు చాలా అరుదు. అందుకనే ఒక విధంగా పార్టీ గుర్తింపు సమస్యను ఎదుర్కొంటున్నది.
మరో పార్టీలో చేరడం కోసం సిద్ధమై, ఇంటి చుట్టూ ఆ పార్టీ జెండాలను అలంకరించిన నేతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం రాజకీయ జీవనంగల కన్నా లక్ష్మీనారాయణ ఒక వంక ప్రజలలో చులకన అయ్యారు. మరో వంక భాజాపా కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బ తిన్నది. అందుకనే గత ఎన్నికలలో చరిత్రలోనే ఆ పార్టీకి అతి తక్కువగా ఓట్లు వచ్చాయి. ఏపీలో పార్టీకి 28 లక్షల మంది సభ్యులు ఉంటే, అందులో పది శాతం కూడా అన్ని నియోజకవర్గాలలో కలిపి ఓట్లు రాలేదు.
పార్టీ అభ్యర్థుల ఎంపిక గురించి నేరుగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వద్దకు ఫిర్యాదులు వెళ్లాయి. సీట్లు అమ్ముకున్నారని, పార్టీకి ఢిల్లీ నుండి వచ్చిన ఎన్నికల నిధుల్ని దుర్వినియోగం చేసారని పత్రికలలో కథనాలు వచ్చినా పార్టీ అధిష్ఠానం నుండి స్పందన లేకపోవడం చూస్తే ఇదేనా - విభిన్నమై.... రాజకీయ పక్షం అంటూ చెప్పుకున్నది అనే అనుమానం కలుగక మానదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా గత ఎన్నికలలో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులలో సగం మందికి పైగా ఇప్పుడు పార్టీలో లేరు. ఉన్నా క్రియాశీలకంగా లేరు అంటే ఎటువంటి వారిని, ఎందుకోసం ఎంపిక చేశారో అర్థం అవుతుంది.
దేశంలో మరెక్కడా, ఏ పార్టీలో జరుగని విధంగా ఇతర పార్టీల నుండి ఫిరాయింపులను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఒక కమిటీని, కాంగ్రెస్ నుండి వచ్చిన నేతలతో వేశారు. వీరంతా కలిసి చేసినది ఏమిటంటే ఇతర పార్టీల నుండి కీలకమైన నేతలు ఎవ్వరు పార్టీలో చేరకుండా చూడడం. మరెవరైనా వస్తే తమకు పోటీ అవుతారనే భయమే కారణం. ఇతర పార్టీల నుండి, ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగుదేశంల నుండి చాలామంది ప్రముఖులు పార్టీలో చేరినా, వారితోపాటు చెప్పుకోదగిన వారెవ్వరూ చేరక పోవడం గమనార్హం.
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్న కొందరితో సహా పలువురు శాసనసభ్యులు భాజపాలో చేరాలని విఫల ప్రయత్నం చేసినవారే. తన విలక్షణమైన రాజకీయ వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు ఉంచవలసిన స్ఫూర్తిప్రదమైన నాయకత్వం అవసరం ఇప్పుడు పార్టీకి ఉంది. రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రెండు ప్రధానమైన కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం తెలిసిందే. అందుకనే జనసంఖ్యరీత్యా అందరికన్నా ఎక్కువమంది ఉన్నా, రాజకీయ గుర్తింపు కోసం ఆరాటపడుతున్న మరో ప్రధానమైన కులానికి రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించడం ద్వారా బలమైన పునాది ఏర్పాటు చేసుకొనే ఒక విఫల ప్రయత్నం చేశారు. ఈ అనుభవం నుండి పార్టీ నాయకత్వం గుణపాఠం గ్రహించిందా?
కాంగ్రెస్ ముక్త భారత్... నినాదంతో నరేంద్ర మోదీ దేశంలోనే ఒక మహత్తరమైన రాజకీయ శక్తిగా పార్టీని మలిచారు. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌కు ప్రతిరూపంగా పార్టీ మారడంతో ఒక విధంగా ప్రజల నిరసనకు గురవుతున్నది. రాష్ట్ర ప్రజలలో పార్టీ పట్ల ఏర్పడిన అనూహ్యమైన సానుకూలతను ఒక అవకాశంగా చేసుకొని పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నం జరగడం లేదు. పార్టీలో సమిష్టి నాయకత్వం కూడా మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ విషయంలో రాష్ట్రంలో పార్టీకి బాధ్యత వహిస్తున్న కేంద్ర నాయకుల వైఫల్యం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పవలసిందే.
అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టగానే ఇప్పటి వరకు పార్టీ అధికారంలోకి రాని ఏడు రాష్ట్రాలలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యం అని 2014లో ప్రకటించారు. ఆ ఏడు రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాంలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిల్లో అస్సాంలో అధికారంలోకి రాగా, పశ్చిమ బెంగాల్ లో గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. కానీ మిగిలిన రాష్ట్రాలలో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించడం లేదు.
జనవరి, 2015లో హైదరాబాద్, విజయవాడలలో పర్యటించిన అమిత్ షా 2019 నాటికి ఈ రెండు రాష్ట్రాలలో భాజపాను అధికార పార్టీగా మారుస్తామని భరోసా వ్యక్తం చేశారు. అందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ రాష్ట్రాలలో పర్యటనలు జరుపుతామని చెప్పారు. కానీ ఇక్కడి నాయకత్వ తీరుతెన్నులతో విసుగు చెందిన ఆయన అటువంటి ప్రయత్నం చేసినట్లు కనబడటం లేదు.
గత ఎన్నికలలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా 151 సీట్లతో గెలుపొందడానికి భాజపా శ్రేణులు ప్రత్యక్షంగా సహకరించడమే కారణం అని చెప్పక తప్పదు. నరేంద్ర మోదీపై ధిక్కార ధోరణితో వ్యవహరిం చిన చంద్రబాబునాయుడుపై కోపంతో ఈ విధంగా వ్యవహరించారు. భాజపాలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చివరి క్షణం వరకు ఎదురు చూసిన సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణను కేవలం జగన్‌కు కోపం వస్తుందనే పార్టీలో చేర్చుకోలేదు. భాజపా దివాలాకోరు రాజకీయాలను ఈ ఉదంతమే వెల్లడి చేస్తుంది. కానీ రాష్ట్రం మొత్తం మీద భాజపాకు వచ్చిన ఓట్ల కన్నా విశాఖపట్నంలో ఆయనకు జనసేన అభ్యర్థిగా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆయనకు సీట్ ఇచ్చి ఉంటే ఆయనతో పాటు, కొద్దిమంది ఎమ్యెల్యేలుగా కూడా గెలుపొందేవారని ఈ సందర్భంగా జరిగిన విశే్లషణలు స్పష్టం చేస్తున్నాయి.
వాస్తవానికి ఇప్పుడు ఏపీలో ఒక విధమైన రాజకీయ శూన్యత నెలకొన్నదని చెప్పవచ్చు. ఎన్నికలు జరిగిన తొమ్మిది నెలలకే అధికార పక్షం పట్ల ప్రజలలో నిరాశ వ్యక్తం అవుతుండగా, ప్రధాన ప్రతిపక్షం సహితం తన తప్పిదాలను గ్రహించి, సరిచేసుకొని ప్రయత్నం చేయడం లేదు. రెండు పార్టీలు అనుసరిస్తున్న ప్రతికూల రాజకీయాలు, వ్యక్తిగత దూషణలకు దిగడం, పరస్పరం విద్వేష రాజకీయాలకు పాల్పడటాన్ని ప్రజలు హర్షించడం లేదు. ఇటువంటి సమయంలో ఒక నూతన నాయకత్వంతో ప్రజల ముందుకు వెళ్లేందుకు భాజపాకు ఒక సువర్ణావకాశం కాగలదు.
ఉదాహరణకు రాజధాని విషయమై అమరావతి రైతులు నిరసన ఆందోళన చేపట్టినప్పుడు మొదటి పక్షం రోజులు నరేంద్ర మోదీ, అమిత్ షాల ఫోటోలు పెట్టుకొని ఉద్యమాలు చేశారు. మొదట్లో చంద్రబాబునాయుడు సహితం వారిని పట్టించుకోలేదు. కానీ వారి ఉద్యమం ఉధృతం అవడాన్ని గమనించి పక్షం రోజుల తర్వాత చంద్రబాబునాయుడు స్వరం విప్పారు. అప్పటి వరకు ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చిన భాజపా నాయకత్వం ఆ తర్వాత వారికి మద్దతు తెలిపినా ప్రయోజనం లేకపోయింది. వారితో కలసి ఉద్యమంలో పాల్గొనడం అని చెప్పడమే గాని అప్పుడప్పుడు వెళ్లి, మీడియా ముందు మద్దతు తెలపడం తప్ప జనంతో కలసి ఉద్యమం సాగించే నాయకత్వం లోపించడంతో తగు ప్రభావం చూపలేక పోయారు.
మీడియా సమావేశాలకు పరిమితం కాకుండా, ప్రజల మధ్యకు వెళ్లి, అన్ని వర్గాల ప్రజలకు చేరుకోగల నాయకత్వం అవసరం. ఫిరాయింపు రాజకీయాలను నేడు దేశవ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకొంటున్నారని గమనించాలి. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు మారి పోటీ చేసిన చాలామందిని ప్రజలు తిరస్కరించడం తెలిసిందే. ఇప్పుడైనా విలక్షణమైన నాయకత్వంతో ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో ధన రాజకీయాలను సహితం ప్రజలు హర్షించక పోవడం ఢిల్లీలో నిరూపితమైనది. ఉన్నత విద్యావంతులు, ముఖ్యంగా బడుగు వర్గాలతో కలిసిపోగల నూతన నాయకత్వం నేడు పార్టీకి అవసరం.
రాష్ట్ర రాజకీయాలలో ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్న ప్రధాన కులాలకు చెందిన వారిని ఆకట్టుకోవడం సాధ్యం కాదని స్పష్టం అవుతుంది. అందుకనే రెండు ప్రధాన పార్టీలు తమను విస్మరిస్తున్నాయని అసంతృప్తితో ఉన్న బడుగు వర్గాలు - షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బలహీన వర్గాలకు చెందిన నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా సరికొత్త ప్రయోగం చేస్తే అనూహ్యమైన ఫలితాలు లభించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా బంగారు లక్ష్మణ్‌కు జరిగిన పరాభవం దృష్ట్యా భాజపా పట్ల బడుగు వర్గాలు నమ్మకం ఉంచలేక పోతున్నాయి. వారిని దరి చేర్చుకొని ప్రయత్నాలు తర్వాత కూడా జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బిసి నేతలను అలంకారప్రాయంగా ఉంచుతున్నారని, పార్టీలో చెప్పుకోదగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి నెలకొంది.
ఉదాహరణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో జరిగిన తొలి సమావేశంలో గాని, రాజకీయ వ్యూహరచన కోసం ఢిల్లీ, హైదరాబాద్‌లలో తరచూ జరిగే ముఖ్య నాయకుల సమావేశాలలో గాని ఈ వర్గాలకు ఎటువంటి ప్రాధాన్యత లభించడం లేదు. అందుకనే కొత్త వర్గాలను పార్టీ ఆకర్షింపలేక పోతున్నది. ఈ అంశాన్ని గుర్తించి, నిరాదరణకు గురవుతూ తమకంటూ రాజకీయ గుర్తింపు కోసం అల్లాడుతున్న వర్గాలను దరిచేర్చుకొనే ప్రయత్నం చేయాలి. ఉన్నత విద్యావంతులై, సామాజిక సేవా రంగంలో తగు గుర్తింపు పొందినవారికి నాయకత్వం అప్పగిస్తే రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులకు బలమైన సాధనంగా పార్టీ మారే అవకాశం ఉంది.
షెడ్యూల్డ్ కులాల్లో ప్రధానమైన రెండు కులాల వారు రెండు పార్టీలకు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఏ పార్టీ పట్టించుకోని ఉపకులాల వారు అనేకమంది ఉన్నారు.
సుదీర్ఘకాలం తెలుగు దేశంతో ప్రయాణించి, నిరాదరణకు గురైన బీసీలలో గణనీయ సంఖ్యలో గత ఎన్నికలలో జగన్‌కు ఓటు వేశారు. అయినా వారింకా మొత్తం మీద అనామకంగానే ఉంటున్నారు. అదే భావన ఎస్టీలలో కూడా ఉంది. వీరందరిని సమీకరించుకోగల నాయకత్వాన్ని భాజపా ఏర్పర్చుకోగలదా?
క్షేత్ర స్థాయిలో అధికార పక్షాలపై నిప్పులు చెరుగుతూ, ఢిల్లీలో మాత్రం వారిని దువ్వే రాజకీయాల ద్వారా భవిష్యత్ రాజకీయ అవసరాలకు వారిని ఉపయోగించుకోవాలనే ఆలోచనలను పార్టీ అధిష్టానం సహితం స్వస్తి పలకాలి. పార్టీ పునాదులను విస్తరింప చేసుకొనేందుకు దీర్ఘకాల వ్యూహాత్మకంగా ముందడుగు వేయాలి. అటువంటి అడుగు ఇప్పుడు వస్తే 2024 నాటికి రాష్ట్రంలో బలీయమైన రాజకీయ శక్తిగా ఎదగడం కష్టం కాబోదు.

- చలసాని నరేంద్ర