మెయిన్ ఫీచర్

సాంప్రదాయిక విమర్శకుని సామాజిక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనగానే చాలామందికి ఆయన రాసిన ‘రాయలనాటి రసికత, నిగమశర్మ అక్కడ, త్యాగయ్యగారి నాధా సుధారసము’ మొదలైన వ్యాసాలు స్ఫురణకు వస్తాయి. ఆయన స్వాతంత్య్ర పూర్వం నాటి మైసూరు జీవితంలోని సుఖ సంతోషాలు, కవి పండిత గాయకుల దివ్యజ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. అనంతకృష్ణులను పాఠకులు ఒక రస ఋషిగా భావించడం పరిపాటి. ఆయన వ్యాసాల్లో సమకాలీన సంఘంలోని మిట్టపల్లాల్ని, వెలుగునీడల్ని సునిశిత దృష్టితో పరిశీలించాడన్న ఆలోచన ఏ కొద్దిమందికోగానీ తట్టుకోవడం విచారకరం. ప్రస్తుత వ్యాసంలో రాళ్ళపల్లివారి సామాజిక దృక్పథాన్ని స్థూలంగా పరిశీలించడం జరుగుతుంది.
శర్మగారు 1912 నుంచి 1977 వరకు తమ రచనా వ్యాసంగాన్ని నిర్విరామంగా కొనసాగించిన ఘనాపాఠి. ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము’ వ్యాసంలో ప్రత్యేకంగా పామర సాహిత్యంపై చెప్పిన విషయాలు వారి సామాజిక దృక్పథానికి అద్దంపట్టేవిగా ఉన్నాయి. ముఖ్యంగా స్ర్తిలు ఇటువంటి సాహిత్యాన్ని సృష్టించారని, ఈ సాహిత్యం పండితుల సాహిత్యానికి ఏ కోణంలోనూ తీసిపోదని చెబుతూ.. ‘‘ప్రజ్ఞలో, ప్రతిభలో మనమితరులకన్న తక్కువ కాదన్న భరోసాకానీ, ఇంకను మనలో తలయెత్తలేదు’’ (రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు, పుట: 107) ఈ మాటలు మన కర్తవ్యాన్ని మరింత పెంచుతున్నాయి.
రాళ్ళపల్లివారు అక్షరాస్యుల్ని, నిరక్షరాస్యుల్ని ఒక దృష్టితో చూశారనడానికి నిదర్శనమైన వ్యాసం ‘నాటక కళ: నేటి మన నాటకములు’. ఈ వ్యాసంలో సినిమాలకు, నాటకాలకు, స్ర్తిలకు, పురుషులకు, సామాన్యులకు, అసామాన్యులకు మధ్య ఉండే తారతమ్యాలను సంయమనంతో అంచనా వేశారు. ఇందులో వ్యాసకర్త చెప్పిన ప్రతి మాట మనల్నీ ఆలోచింపజేస్తుంది. ఉత్తమ సంస్కారం ఎలా ఉండాలో చెప్పిన తీరును గమనించండి. ‘‘తత్త్వము విచారించితి మేని చాదస్తముల యంతస్తును దాటి లోతుకుదిగి చూడగల్గుటయే ఉత్తమ సంస్కారమునకు గుర్తు. అట్లుచేయలేనిది వట్టి పైపూత.’’ (రా.సా.స. వ్యాసాలు. పుట: 124) అని చెప్పడాన్ని పరిశీలిస్తే శర్మగారి దృష్టిలో ఎవరి పని వారికి గొప్పదన్న సంగతి అర్థమవుతుంది. మేం అంతనీ, ఇంతనీ వట్టి గొప్పలు చెప్పటం కాదు చేసే పని త్రికరణశుద్ధిగా నిర్వర్తిస్తే చాలని ఉద్బోధించారు. మానవ సంబంధాలు రోజురోజుకూ మర్యాదహీనంగా, అస్తవ్యస్తం కావడాన్ని శర్మగారు తప్పుబట్టారు. మనిషి జీవితానికి శ్రద్ధ అనేది అత్యంత అవసరమని నొక్కివక్కాణించారు.
క్షేత్రయ్య మానవతా దృష్టికోణాన్ని ఆవిష్కరింపజేసిన వ్యాసం ‘పదములు- క్షేత్రయ్య’. తెలుగు, కర్ణాటక ప్రాంతాల ప్రజల జీవితాలనుండి పుట్టిన ఈ పదాల్లో భక్తి, శృంగారం కలగలసి ఉండటం విశేషమని శర్మగారన్నారు. ‘‘మారుమూల గ్రామాల్లో ఎక్కడో కనిపించే అచ్చ తెలుగు పదాలుగాని, పండితులు ప్రబంధాల్లో వాడిన క్లిష్టసమాసాలుగానీ వాటి అవసరాన్నిబట్టి క్షేత్రయ్యకి అందుబాటులో నిలుస్తాయని’’ (ప్రముఖ వాగ్గేయకారులు. పుట: 35) అన్నారు. క్షేత్రయ్య స్ర్తిని ఎప్పుడూ అగౌరవ పరచలేదనటం శర్మగారి సహృదయతకు నిదర్శనం. అంతేకాదు సమాజంలో స్ర్తిల అభివృద్ధే నిజమైన సామాజిక ప్రగతికి మూలం. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటూ.. ‘‘ఉపేక్షచే ఏ గర్భగుడిలోనో మురుగవలసి యున్నను వాని యందచందములు ఆఱనివి; శక్తి శుష్కింపనిది.. గమనించి, ఉపాసించి, అనుభవింపని లోపము మనది గాని వానిది గాదు.’’ (రా.సా.స. వ్యాసాలు. పుట: 148)అని వాళ్ళపల్లివారు ఉద్ఘాటించారు.
కందుకూరి వీరేశలింగం పంతులు చేసిన కృషి సమాజానికి ఎంతో చైతన్యం, ఉత్సాహం కలిగించిందని ‘ఆధునికాంధ్ర సాహిత్యపు వేగము’ అనే వ్యాసంలో అనంత కృష్ణశర్మని కొనియాడారు. అంతేకాదు మనం ఎంత కాలమని ఇతరుల సాహిత్యంపై ఆధారపడగలం? మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలన్నారు. మన భాషను, మన యాసను, మన గోసను మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారని ప్రశ్నించారు. ప్రజలు ఎప్పుడూ ప్రభుత్వాలని మార్పు చేస్తుండాలి. అప్పుడు కానీ సమాజం త్వరితగతిన అభివృద్ధిలోకి రాదని రాళ్ళపల్లివారు అభిప్రాయపడ్డారు. ఈ విషయాల్ని 1953లోనే చెప్పారంటే ఆయనకు ఉండే ముందుచూపులో ఎంత సామాజిక బాధ్యత ఉందన్నది అర్థం చేసుకోవచ్చు.
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 1927లో అనంతపురంలో జరిగిన ‘ఆంధ్ర గాయక జనసభ’ అధ్యక్షోపన్యాసం చేస్తూ చెప్పిన అంశాలు నేటి విద్యావ్యవస్థ సంస్కరణకు ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా కళలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఎంతో దార్శనికంగా చెప్పడం చూస్తే సమాజంపై, విద్యావ్యవస్థపై వీరికి ఉన్న భక్తిశ్రద్ధలు తెలుస్తాయి. ప్రధానంగా ఉన్నత విద్యలో చోటుచేసుకొన్న లోపాలను ఈ వ్యాసంలో ఎండగట్టారు. పిల్లలను తల్లిదండ్రులు చిన్నప్పటినుండే క్రమశిక్షణతో పెంచాలి. నాణ్యమైన విద్యాసౌకర్యాలు వారికి అందేలా చూడాలి. పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులే చొరవ తీసుకోవాలి. దీనికోసం ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు కూడా చిత్తశుద్ధితో కృషిచేయాలి. విద్యార్థులు కూడా పెద్దలు చెప్పిన మాటలను శిరసావహించి అభివృద్ధిబాట పట్టాలన్న బాధ్యతను గుర్తుచేశారు.
సంగీత విద్యా సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన స్థితిని శర్మగారి మాటల్లో వింటేనే బాగుంటుంది. ‘‘చదువులో మనకు స్వాతంత్య్రము లేదు: సంధ్యలో నమ్మకము లేదు. సంధ్యను బోధించి దాని విలువ నెఱిఁగించువారు లేరు. చదువు చెప్పువారికి మన సంగీతము తెలియదు, కాఁబట్టదుగూడ.. ఇన్నాళ్లును కళాశాలలు గుమాస్తాలనే తయారుచేయుచుండెడివి. ఇప్పుడు వారికితోడు కూలి వారిని, బేహారులను సృష్టింప మొదలుపెట్టినవి. ఇంతేకాని రసికులను సృజించుట గూడ తన ధర్మమని గుర్తించిన యూనివర్సిటీ మన దేశమందింకను పుట్టవలసి యున్నది.’’ (రా.సా.స.వ్యాసాలు. పుటలు: 278-279.) అని ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలు వింటే కనువిప్పు కలగక మానదు. నేటి చదువులను ఉద్దేశిస్తూ... ‘‘ఇప్పటి చదువునకు ఫలము బ్రదుకు. అనఁగా కాలక్షేపము చేయుట. అంతేకాని మనుష్యుల హృదయమందు పుట్టుచుండు, పుట్టవలసిన రసభావములకు సంబంధించిన కళలకు మన ‘కళాశాల’లలో చోటెక్కడికి? కావుననే లక్షణముగా పద్యమొకటి చదువఁగల విద్యార్థియొకఁడు నేఁడు దొరకుట దుర్లభమైనది.’’ (రా.సా.స.వ్యాసాలు. పుట: 2798) అని విద్యావ్యవస్థలో ఉండే అనేక లోపాలను ఆనాడే తూర్పార బట్టారు.
రాళ్ళపల్లివారు ‘గంగిరెద్దు’ కావ్యానికి పీఠిక రాస్తూ, ఆనాటి గ్రామీణ జీవితాలను అద్దం పట్టించారు. కవిత్వంగాని, వ్యాసంగానీ రాసేవారు పట్టణాల్లో ఉండటం వల్లా గ్రామీణ పరిస్థితులను పట్టించుకోరన్న మాటను అపోహగా వ్యాసకర్త తలిచారు. పట్టణంలో ఉండేవారిలో ఎక్కువమంది పల్లెనుంచి వచ్చిన వారేనని గుర్తుచేశారు. అంతేకాదు రాజులవద్ద ఉండే కవులు సామాజిక విషయాలపై దృష్టిపెట్టరన్న మాటను కూడా శర్మగారు సరికాదని అన్నారు. కవులుగాని, రచయితలు గానీ సామాజిక దృక్పథం లేనిదే రచనలు చేయరని పునరుద్ఘాటించారు. శర్మగారు మాటలు నేర్చిన మానవుల బాధల్నే కాదు, మాటలు రాని మూగజీవుల మనస్తత్వాల్ని కూడా ఎరిగిన మృదుస్వభావిగా కనబడతారు. గంగిరెద్దులు వాళ్ళు ఆ పశువులు పెట్టే ఇబ్బందులు అంతా ఇంతకాదు. ఆ మూగజీవులవల్ల మనిషి ఎంత లబ్ధి పొందుతున్నాడో ఒక్కసారి ఆలోచించండన్నారు.
అధికార, వయోవృద్ధులు, విద్యావృద్ధులందరూ అనుసరిస్తున్న పద్ధతుల్లోఉన్న లోపాలను తప్పుబట్టడం ‘వదరుబోతు’ గ్రంథం లక్ష్యమన్నారు శర్మగారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రజలు చేసిన పోరాటాలను మనం ఎప్పటికీ మరవకూడదు. సమాజంపై బాధ్యతతోనే ఈ వదరుబోతు వ్యాసాల్లో రచయిత కొనసాగారన్నది అక్షర సత్యం. ఆనాడు సమాజంలో ఉన్న కుళ్ళుకుతంత్రాలను కడిగిపారేయ్యాలనే ఈ వదరుబోతు వ్యాసాలు ఉద్భవించాయని అంటారు.
అనంతకృష్ణశర్మ ‘పెనే్నటి పాట’ పీఠికలో రాయలసీమ ప్రాంత దుస్థితిని లోతైన దృష్టితో పరిశీలించారు. రాయలసీమలో చెఱువులు ఎండిపోవటం, వర్షాలు రాకపోవటం, అధికారులు నిర్లక్ష్యంగా పరిపాలించటం, ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తులై ఉండకపోవటం, కాగా ఈ ప్రాంతంలో జనులు చదువుసంధ్యలు లేక అనాగరికులుగా ఉండటంలాంటి ఎన్నో విషయాల్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.
వేమన ఎప్పుడూ స్వార్థబుద్ధితో ఆలోచించినవాడు కాదని ‘వేమన’ (1929) గ్రంథంలో శర్మగారు అన్నారు. వేమన తనచుట్టూ ఉన్న ప్రజలను మేల్కొలిపే విధంగా కవిత్వం రాశాడేకానీ, చెడగొట్టే కవిత్వం రాయలేదని బాహాటంగా చెప్పారు. ఇలాంటి సామాజిక దృక్పథంతో కవిత్వం రాసేవారిని చూసి సమాజం హేళన చేయడం తగదన్నారు. ‘సమాజ సంస్కరణ నిమిత్తం కవిత్వం రాసిన వేమనకు మనమందరం ఎన్ని చందాలైనా ఎత్తీ, ఎంతమంది వేశ్యలను సమర్పించినా తప్పులేదని ఉగ్గడించారు.’ (పుట: 56) సాధారణంగా సమాజంలో వేమన లాంటివారు చాలా అరుదుగా ఉంటారు. ఒకవేళ ఉన్నా ఇంత నిష్పాక్షికంగా ఆలోచించి రాసే ప్రయత్నం చేయగలరా? అని శర్మగారు ప్రశ్నించారు. మనిషిగా జన్మించి మృగంలా ఆలోచించడాన్ని వేమన సూటిగా తప్పుబట్టిన క్రమాన్ని రాళ్ళపల్లివారు మార్పుకు చిహ్నంగా భావించాలన్నారు.
ప్రధానంగా వేమన కవిత్వంలో ఉండే స్వతంత్ర బుద్ధి, సామెతలు, నీతులు, హాస్యం, సమాజ సంక్షేమం, హేతువాదం మొదలైనవాటిని ఎంతో లోతుగా పరిశీలించారు. వేమన్నను గొప్ప మానవతావాదిగా, ప్రజాకవిగా నిరూపించారు. వేమన సంస్కరణాదృక్పథం ఏ సమాజానికైనా, ఏ కాలానికైనా వర్తిస్తుందని చెప్పారు. వేమనను గొప్ప దార్శనికునిగా, మహాకవిగా తెలుగు పరిశోధన రంగంలో నిలబెట్టిన ఘనత రాళ్ళపల్లి వారికి దక్కుతుంది. ఇప్పటివరకు వేమనమీద ఎంతోమంది ఎన్నో పరిశోధనలు చేసి ఆయా అంశాల్ని బయటపెట్టారు. కానీ రాళ్ళపల్లివారు తెలుగు పరిశోధకుల్లో కవి జీవిత రచనను విమర్శనాత్మక దృష్టితో పరిశీలించిన తొలి వ్యక్తి కావడం విశేషం.
ప్రతి విషయాన్ని హేతువాద దృష్టితో యోచించే అలవాటు కలిగిన గొప్ప కవి వేమన. సమాజంలో పాతుకుపోయిన మూఢ నమ్మకాలను పారద్రోలడానికి వేమన నిత్యం పరితపించాడు. అందుకే ఏ పద్యం చదివినా దానికి ఓ కార్యకారణ సంబంధాన్ని జోడించి చెప్పడానికి పద్యాన్ని ఆయుధంగా మార్చుకొన్నాడు. ఉదాహరణకు కింది పద్యాన్ని చూడండి. ‘‘ఎరుకలేని దొరల నెన్నాళ్ళు కొలిచిన/ బ్రతుకులేదు వట్టి భ్రాంతిగాని/ గొడ్డుటావుపాలు గోఁకితే చేపునా?’’ (వేమన.. పుట: 65) ఇలా ఏది చెప్పినా దానికి తగిన హేతువును చూపించే పద్ధతి వేమనకే సాధ్యమని శర్మగారు చెప్పారు.
వేమనపై పరిశోధన చేసినవారు అనేక వివాదాంశాలను లేవనెత్తారు. శర్మగారు ఏ వివాదాల జోలికిపోకుండా వేమన జీవితంనుండి సమాజం ఏమి నేర్చుకోవాలనే కోణంలో ఆయా అంశాల్ని కూలంకషంగా తమ పరిశోధనలో వెల్లడించారు. విద్యార్థుల్లో నైతిక విలువలూ, సంస్కరణ భావాలూ, అలవడాలంటే వేమన పద్యాల్ని తప్పకుండా చదివి అర్థంచేసుకోవాల్సి ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సమకాలీన సమాజం వేమన జీవించిన కాలంనాటి పరిస్థితులను అర్థంచేసుకొని, భవిష్యత్తు కార్యాచరణకు పూనుకోవాల్సిన మార్గాన్ని రాళ్ళపల్లివారు నిర్దేశించారు.
కావ్య గగనంలో విహరిస్తున్న రాళ్ళపల్లి వారిని భూమార్గం పట్టించిన ఘనత కట్టమంచి రామలింగారెడ్డిగారిది. ఆయనతో కొనే్నళ్ళపాటు సాహిత్య చర్యలు చేసిన రాళ్ళపల్లివారు వెనకటి సమాజాన్ని సమకాలీన సాంఘిక పరిస్థితులనూ, లోతుగా చూసే దృష్టిని అలవరచుకున్నారు. కట్టమంచివారి ‘అర్థశాస్తమ్రు’(1914) ప్రూఫులు చూడడంలో భాగంగా అక్కడక్కడ కొన్ని వాక్యాలు సరిదిద్దడం వల్ల రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సామాజిక దృక్పథం విశాలంగానూ, హేతుపూర్వకంగానూ ఏర్పడగలిగింది.
*
*11న రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వర్థంతి

- డాక్టర్ బడిగె ఉమేశ్, 9494815854