మెయన్ ఫీచర్

కోవిడ్ వెనుక దుష్టపన్నాగం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో కూడా ఎన్నడూ ప్రపంచం ఇంతలా మూతపడలేదు. ప్రపంచంలోని 150కి పైగా దేశాలు కరోనా వైరస్ వ్యాధి బారిన పడి విలవిలలాడుతున్నాయి. కేవలం దక్షిణాఫ్రికాలోని కొన్ని దేశాలు, గ్రీన్ లాండ్, ఆర్కిటిక్ ప్రాంతం మినహాయిస్తే 195 దేశాలకూ కరోనా సోకింది. వరల్డో మీటర్ లెక్కల ప్రకారం 1,82,725 మందికి ఈ వ్యాధి పాజిటివ్‌గా వచ్చింది. ఇంత వరకూ 7174 మంది మరణించారు. కొత్తగా మరో 95,668 మందికి వ్యాధి ప్రబలింది. వ్యాధి సోకిన తర్వాత ఇంత వరకూ 79,883 మంది కోలుకున్నారు. స్థూలంగా ఈ గణాంకాలను గమనిస్తే ఎక్కవగా ప్రభావితం అయిన దేశాల్లో చైనా , ఇటలీ, ఇరాన్, స్పెయిన్, సౌత్ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, యుఎస్‌ఏ, యుకే, స్విట్జర్లాండ్ ఉన్నాయి. భారత్‌లో ఇప్పటికే నలుగురు చనిపోగా, 129 మందికి పాజిటివ్‌గా తేలింది. వారంతా చికిత్స పొందుతున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఎన్నో వైరస్‌లు వచ్చి వెళ్లిపోయాయి. వైరస్‌లు సోకిన వారు ఎంతో మంది మరణించినా కరోనా వైరస్ ఉత్పాత్తానే్న సృష్టించిందని చెప్పాలి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. లక్షల కోట్లు ఆవిరైపోయాయి. లక్షలాది పారిశ్రామిక సంస్థలు మూత పడ్డాయి. పాఠశాలలు, క్లబ్‌లు, పబ్‌లు, సినిమాహాళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడిన , ఏరోజుకారోజు ఆదాయంతో జీవించే వారు రోడ్డునపడ్డారు. కరోనా నివారణకు తీసుకున్న చర్యల్లో భాగంగా న్యాయస్థానాలు కూడా పనికాలాన్ని నియంత్రించుకున్నాయి. హైకోర్టులు, సబార్డినేట్ కోర్టులు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. కార్యాలయాలకు వచ్చే సందర్శకుల తాకిడిపై కూడా ఆంక్ష లు విధించారు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ ఎవరి అనుభవంలోకి లేని అంశం. ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగిన రోజుల్లో కొంత మేరకు ఆంక్షలు ఉన్నా, మొత్తం సమాజం దుప్పటికప్పుకున్న సందర్భం లేనే లేదు. చైనా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల్లో దారుణ పరిస్థితిని గమనించిన మిగిలిన దేశాలు ముందుగానే మేల్కొన్నాయి. ప్రాప్తకాలజ్ఞత అయినా భారత్ సైతం విస్తృతమైన ప్రచారం చేయడంతో పాటు పౌరులను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ వైద్యసిబ్బందిని, సదుపాయాలను, థర్మల్ గన్స్‌ను, క్వారంటైన్ గదులను, సహాయ ఉపకరణాలను సిద్ధం చేశారు.
కరోనాకు కోవిడ్ అనే పేరుపెట్టారు. కోవిడ్ అంటే కరోనా వైరస్ డిసీజ్ అని అర్థ్ధం. కరోనా వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లోనే గుర్తించారు. అయితే ఆనాడు దీని తీవ్రతను అంచనా వేయలేకపోయారు. రోజురోజుకూ మరణాలు పెరగడంతో ఒకరి తర్వాత మరొకరు మేల్కొన్నారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ మహమ్మారిగా మారింది. రోజరోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తూ, దేశదేశాలకు విస్తరిస్తోంది. విమానయానం, నౌకాశ్రయాల ద్వారానే ఇది వేరే ప్రాంతాలకు మనుష్యుల ద్వారా విస్తరిస్తోంది. ఇదేమీ ఈ ప్రపంచానికి కొత్త కాదు, గతంలో కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌లు ఈ భూమిమీద వ్యాపించాయి. కోట్లమందిని బలితీసుకున్నాయి. మార్‌బర్గ్, ఎబోలా, రాబిస్, హెచ్‌ఐవీ, మసూచి, హంటావైరస్, ఇన్ఫ్లుయెంజ, డెంగ్యూ , రోటావైరస్, సార్స్, సార్స్ కార్, మెర్స్ వంటి వైరస్ జబ్బులు ఎన్నో వచ్చాయి.
ప్లేగు వ్యాధి హైదరాబాద్ వాసులకు సుపరిచితమైనదే, చార్మినార్ నిర్మాణం వెనుక ప్లేగు వ్యాధి మహమ్మారి ఉండనే ఉంది. 1346 నుండి 1353 వరకూ ప్లేగు వ్యాధి భారీగా జననష్టానికి కారణమైంది. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల్లో ఇది వేగంగా విస్తరించింది. సుమారు ఏడున్నర కోట్ల మంది ఈ వ్యాధితో మరణించారు. ఈ వ్యాధి ఆసియాలోనే ఎలుకల ద్వారా యూరప్, ఆఫ్రికా దేశాలకు విస్తరించింది,. అపుడు ప్రయాణానికి ఏకైక మార్గం పడవల ద్వారా సాగేది, అవే పడవల ద్వారా ఎలుకలు ఇతర దేశాలకు ఈ వ్యాధిని తీసుకుపోయాయి. అలాగే కలరా వ్యాధి ప్రపంచాన్ని ఇప్పటికే ఏడు మార్లు వణికించింది. 1852 నుండి 1860 మధ్య వ్యాపించిన మూడో కలరా వ్యాధి భయంకరంగా విస్తరించి కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. భారత్‌లోని గంగానది ఒడ్డున ఈ వ్యాధి విస్తరించినట్టు చెబుతారు. తర్వాత ఏషియా, యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాకు ఈ వ్యాధి విస్తరించింది. నీటి ద్వారా ఈ వ్యాధి వ్యాపించిందని లండన్‌కు చెందిన జాన్‌స్నో అనే పరిశోధకుడు గుర్తించాడు. ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటిమందికి పైగా మరణించారు. ఆరో కలరా వ్యాధి 1919లో వచ్చింది. ఈసారి అది భారత్‌లోనే మొదలైంది. సుమారు 8 లక్షల మంది ఈ వ్యాధికి గురై మరణించారు. మధ్య ప్రాచ్య దేశాలు, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరప్, రష్యాల్లో ఈ వ్యాధి విస్తరించింది. దీనిపై అమెరికాలో పరిశోధనలు పెద్ద ఎత్తున జరిగి అక్కడ వ్యాధి ప్రబలకుండా నివారించగలిగారు. ఇక ఫ్లూ వ్యాధి 1889లో విస్తరించింది. ఏషియాటిక్ ఫ్లూ లేదా రష్యన్ ఫ్లూ అని దానిని వ్యవహరించారు. 1889లో మేలో తర్కిస్థాన్, కెనడా, గ్రీన్‌లాండ్‌లలో ఈ వైరస్ గుర్తించారు. అప్పుడపుడే పట్టణీకరణ జరుగుతుండటంతో వైరస్ పట్టణాల్లో ఎక్కువగా వ్యాపించింది. సుమారు 20 లక్షల మంది ఈ ఫ్లూతో అప్పట్లో మరణించారు, ఇంత వరకూ కోటి మందికి పైగానే ఫ్లూతో మరణించారు. ఏషియన్ ఫ్లూ వ్యాధి 1956లో చైనాలో పుట్టింది. ఇది రెండేళ్ల పాటు విజృంభించింది. చైనాతో పాటు సింగపూర్, హాంగ్‌కాంగ్, అమెరికాల్లో ఈ వైరస్ వల్ల ఎక్కువ మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు ప్రకారం 20 లక్షల మంది ఈవైరస్‌కు మృత్యువాత పడ్డారు. అమెరికాలో 69,800 మంది ఈవైరస్‌తో మరణించారు. ఇక హెచ్‌ఐవీ కాంగోదేశంలో 1976లో గుర్తించారు. ఆ తర్వాత ఈ వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. హెచ్‌ఐవీ వల్ల ఇంత వరకూ నాలుగు కోట్ల మందికి పైగా మరణించారు. మరో ఐదు కోట్ల మంది హెచ్‌ఐవీ బారిన పడి జీవిస్తున్నారు. 2005 తర్వాత హెచ్‌ఐవీ ప్రభావం తగ్గినా, వ్యాధి నివారణ కాలేదు.
అసలేమిటీ ఈ వైరస్‌ల గోల అనిపించొచ్చు. వైరస్ అంటే టాక్సిన్ లేదా విషం. ఈ వైరస్‌లు కూడా జీవులే. ఇవి ఒకొక్కటీ 15 నుండి 600 నానోమీటర్లు ఉంటాయి. ఇవి ఇతర జీవ కణాలపై దాడి చేసి వ్యాధులను కలిగిస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్ధేశ్యం వైరస్‌లు తమ సంతతిని పెంచుకోవడంతో ముడిపడి ఉంటుంది. వైరస్‌లు తమంతట తాము విభజన చెందలేవు, విభజన చెందాలంటే మరో జీవకణం అవసరం. వైరస్‌ల వల్ల వచ్చే వివిధ రకాల వ్యాధులు మానవజాతిని తరతరాలుగా పీడిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఎయిడ్స్, ఆటలమ్మ, మశూచి, తట్టు, పోలియో, ఎల్లో ఫీవర్, రేబిస్ వ్యాధి వంటివి ముఖ్యమైనవి. 1717లో ఒట్టోమన్ రాజ్యంలో ప్రజలకు ఆటలమ్మకు వ్యతిరేకంగా తమ పిల్లలను వ్యాధికారకాలకు గురిచేయడాన్ని ఒక బ్రిటిష్ రాయబారి భార్య మేరీ మాంటెగు అనే ఆవిడ గమనించింది. 18వ శతాబ్దంలో ఎడ్వర్డ్‌జెన్నర్, సారానెల్మ్స్ అనే పాలవ్యాపారిని పరీక్షిస్తుండగా ఆవిడకు అంతకుముందు మశూచి రావడం వల్ల ఆ తర్వాత మశూచి రాలేదని కనుగొన్నారు. ఆ తర్వాత జెన్నర్ 1879లో మొట్టమొదటి టీకా ను వాడారు. వైరస్‌లపై చార్లెస్ బాంబర్లాండ్, దిమిత్రి ఇవనోవ్‌స్కీ, డచ్ సూక్ష్మ శాస్తవ్రేత్త మార్టినస్ బెంజెరింక్ అనేక పరిశోధనలు చేశారు. వైరస్‌లకు బాక్టీరియాపై దాడి చేసే గుణం ఉందని ఫ్రెడరిక్ థ్వార్ట్ కనుగొన్నాడు. 1935లో పెండెల్ స్లాన్లీ, ఎర్నెస్ట్ విలియం గుడ్ ఫాశ్చర్, జాన్ ఫ్రాం కిన్ ఎండర్స్, 1949లో థామస్ హెచ్ వెల్లర్,ఫ్రడరిక్ చాప్మన్ రాబిన్స్‌లు మరిన్ని పరిశోధనలు చేశారు. ఈ వైరస్‌లు చాలా రకాలుగా వ్యాధులు కలుగజేయగలుగుతాయి. కణాలపై వీటి ప్రభావం వల్ల కణ విచ్ఛేదనం జరిగి కణాల మరణం సంభవిస్తుంది. బహుకణ జీవుల కణజాలాలపై వైరస్‌లు దాడి చేసినపుడు ఇలా కొన్ని అవసరమైన కణాలు మరణిస్తే దాని ప్రభావం మొత్తం జీవిపై పడుతుంది. చాలా వైరస్‌లు ఆరోగ్యకర సమన్వయాన్ని చెడగొట్టే వ్యాధులను కలిగిస్తాయి. కొన్ని వైరస్‌లు ఎలాంటి హాని కలుగజేయకుండానే శరీరంలో జీవిస్తాయి. వైరస్‌లు ప్రత్యుత్పత్తికి జీవుల జన్యుపరికరాలపై ఆధారపడటం వల్ల ఆ జీవికి ఎటువంటి హానీ కలుగకుండా నివారించడం కొద్దిగా కష్టమైనపని. ప్రాముఖ్యత పొందిన వైద్య విధానం, టీకాల ద్వారానే ఈవ్యాధులను నివారించాలి.
చైనాలో మొదలైన కొత్త వైరస్ కరోనా వైరస్‌ల కుటుంబానికి చెందింది. ఈ వైరస్‌లు సార్స్ , మెర్స్ అనే శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. ఈ వైరస్ జంతువుల నుండి వచ్చినట్టు భావిస్తున్నారు. చాలా జంతువులు ప్రమాదరకమైన వైరస్‌లకు వాహకాలు. ఈ వైరస్‌లు చాలా మటుకు మనుష్యులకు పాకవు. అత్యధిక సందర్భాల్లో ఒక జీవజాతి నుండి మరో జీవజాతికి వైరస్‌లు వ్యాధులు సంక్రమించకుండా చేసే సహజమైన వ్యవస్థ వల్ల జంతువుల నుండి మనుష్యులకు ఈ వైరస్‌లు వ్యాపించలేవు. కొన్ని అరుదైన సందర్భల్లో లేదా మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా బలహీనపడినపుడు మరైదైనా ముఖ్యకారణం వల్ల ఇతర జీవుల నుండి మనుష్యులకు ఈ వైరస్‌లు వ్యాపిస్తుంటాయి. చాలా వరకూ వైరస్‌లలో జన్యుపరివర్తన వల్లనే ఈ ప్రమాదం ఏర్పడుతుంది. మరో జీవజాతిలో ఎదిగేందుకు వీలుగా వైరస్ తనను తానుమార్చుకున్నపుడు సమస్య తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కరోనా వైరస్ మనుష్యుల్లో వ్యాపిస్తూ సమస్యను పెంచింది. పిల్లుల నుండి, ఒంటెల నుండి గబ్బిలాల నుండి ఈ వైరస్‌లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. దాదాపు నాలుగు నెలల అనంతరం కరోనా వైరస్ భారత్‌కు సోకింది. భారత్‌లో కరోనా వ్యాధి ప్రబలడంపై సర్వోన్నత న్యాయస్థానం సహా అనేక హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ చేయడమేగాక, పలు సూచనలను చేసింది. అందులో ప్రధానమైంది విద్యాసంస్థలను మూసివేయడం, ఎక్కువ మంది యువకులు, పిల్లలు ఉంటారు కనుక వారికి ఈ వ్యాధి ప్రభావం పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు ఈ వైరస్ ఎందుకు పుట్టింది? ఎవరికోసం పుట్టిందనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశే్న. కోవిడ్ వైరస్ ప్రబలి వందల మందిని బలికొనడం వెనుక వికటించిన చైనా జీవ ఆయుధ ప్రయోగాలే కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. మరో పక్క అలాంటిదేమీ లేదని శాస్తవ్రేత్తలు కొట్టిపారేస్తున్నారు. ప్రపంచంలో భారీ ఆయుధాలను వినియోగించి యుద్ధాలు సాగించే రోజులు ముగిశాయి. ఎవరి కంటికీ కనిపించని జీవాయుధాలను వినియోగించి ప్రపంచాన్ని గడగడలాడించే నవీన యుద్ధ తంత్రాలను అమెరికా, చైనా, జపాన్, కొరియా, రష్యా వంటి దేశాలు రచిస్తున్నాయనేది నిర్వివాదాంశం. గతంలోనే కొన్ని దేశాలు వైరస్‌లను వినియోగించి జీవాయుధాలను ప్రయోగించడం మనకు కొత్త కాదు. యుద్ధోన్మాదులు, ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసేవారు వీటిని ఉపయోగిస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్రీస్తు పూర్వం ఆరువందల సంవత్సరంలో క్రిసాను ముట్టడించిన సమయంలో రాజు సోలోన్, కటుక రోహిణీ అనే పుష్పాల నుండి తీసిన రసాయనాన్ని ప్రయోగించి వ్యాధులు కలిగించినట్టు చరిత్ర చెబుతోంది. 1155లో రాజు బార్బొసా ఇటలీలోని టొరంటోలోని నీటి బావులను కలుషితం చేసినట్టు, 1495లో ఫ్రెంచి సైనికులను హతమార్చేందుకు కుష్టు వ్యాధి గ్రస్తుల రక్తాన్ని కలిపినట్టు,1710లో రష్యన్ చక్రవర్తి స్వీడన్ పట్టణాల్లో ప్లేగుతో మరణించిన శవాలను ఫిరంగులకు కట్టి పడివేసినట్టు చరిత్ర చెబుతోంది. 1763లో అమెరికాలో గిరిజనులను దెబ్బతీసేందుకు బ్రిటిష్ పాలకులు మశూచి సోకిన వ్యాధి గ్రస్తులు వాడిన దుప్పట్లు పంపిణీ చేసినట్టు, నెపోలియన్ చక్రవర్తి 1797లో ఇటలీ మంటువాలో మలేరియాని వ్యాపింపచేసినట్టు, అంతుర్యుద్ధ సమయంలో అమెరికాలోని బానిస వ్యవస్థను కోరుకోని తిరుగుబాటు రాష్ట్రాలు యూనియన్ సైనికులకు మశూచి వస్త్రాలను విక్రయించినట్టు తెలిసిందే. ఇవన్నీ సామ్రాజ్యవాదుల దుష్టచరిత్రకు తార్కాణం. అసలు ఏంజరిగిందనేది కాలమే చెప్పాలి. అంతవరకూ ముందుజాగ్రత్తే పరిష్కారం. ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సిన్‌లూ అందుబాటులో లేవు కనుక.

- బీవీ ప్రసాద్, 9963345056