మెయన్ ఫీచర్

ఆంధ్రాలో ‘కరోనా’ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వమంతా కరోనా భయంతో వణికిపోతుంటే, దక్షిణ భారతంలో తెలుగు రాష్ట్రాల్లో అధికార, విపక్ష పార్టీలు కరోనాను కేంద్రంగా చేసుకుని విమర్శలు చేసుకుంటున్నాయి. కరోనా సృష్టిస్తున్న విధ్వంసం కొనసాగుతోంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్, అమరావతి వరకు అన్ని ప్రభుత్వాలు శక్తివంచనలేకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాయి. మన ప్రధాని మోదీని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో ప్రశంసించాలి. కరోనా తీవ్రతను తక్కువ చేసి చెప్పేందుకు, మీడియాలో చూపినట్లుగా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసేందుకు, కరోనా మన రాష్ట్రప్రజలను ఏమి చేయదని చెప్పేందుకు కేసీఆర్, జగన్‌లు చేసిన వ్యాఖ్యలను బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు.
కరోనాపై ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ప్రకటించాయంటే, ఆ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, ఆ ప్రజల అలవాట్లు, సంస్కృతి కారణం. అక్కడి ప్రజలు సాథారణ హెచ్చరికలకు లొంగరు. ఇక్కడ పుకార్లకే జనం భయపడిపోయి ఎందుకైనా మంచిదని జాగ్రత్తపడుతుంటారు. కరోనా ముసుగులో రాజకీయ విమర్శలు పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్‌ను గవర్నర్ కోరితే, కరోనా ఉందని చెప్పి ఈ నెల 26 వరకు స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీలో కరోనాను అరికట్టేందుకు ముందస్తు చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ, కరోనా కంటే కాంగ్రెస్ దేశానికి ప్రమాదకరమైదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందిస్తూ అసలు కరోనా కేసీఆర్ అని పేర్కొన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో కరోనా తీవ్రతపై ఆందోళన చెందిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రిటైర్డు ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎకాఎకిన ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. తాను కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడానని, దేశంలో నెలకొన్న పరిస్థితులను మదింపు వేశానని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై రాజకీయంగా, సామాజికంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేయడమే కాకుండా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత ఎన్నికల కమిషనర్ ప్రధాన కార్యదర్శి లేఖకు బదులిచ్చారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిరోజూ ప్రెస్‌మీట్లు పెడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని, కరోనాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
భారత రాజ్యాంగం పార్ట్ 9లో 243 ఏ నుంచి 243 ఓ వరకు 15 అధికరణల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై స్పష్టంగా నిర్వచించారు. 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్లను ఏర్పాటు చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఎన్నికలు నిర్వహించాలి. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఏర్పాటయ్యాయి. 243కే, 243జడ్‌ఏ అధికరణల ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్లపై స్పష్టంగా వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2016 ఏప్రిల్ 1వ తేదీన నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం 2021 మార్చి 31వ తేదీతో ముగుస్తుంది.
రాజ్యాంగం ప్రకారం చూస్తే రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా చీఫ్ సెక్రటరీ స్థాయి ఉండే అధికారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించవచ్చును. రమేష్ కుమార్ ఐఎఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలోనే కీలకమైన ఈ పదవిలో నియమితులయ్యారు. రాష్ట్రప్రభుత్వం సిఫార్సుపై గవర్నర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను నియమిస్తారు. ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. ఈ పదవి హైకోర్టు జడ్జిహోదాతో సమానం. ఒకవేళ ఎన్నికల కమిషనర్‌ను తొలగించాల్సి వస్తే పార్లమెంటు ఉభయ సభలు తీర్మానం చేసి అభిశంసన చేసి తీర్మానాన్ని రాష్టప్రతికి పంపి తొలగించాల్సి ఉంటుంది. సభలో హాజరైన వారిలో 2/3 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలి.
రాష్ట్ర స్థాయిలో మనకు మానవ హక్కుల సంఘం, లోకాయుక్త, విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లకు కూడా చైర్మన్లు ఉంటారు. వీరంతా హైకోర్టు రిటైర్డు జడ్జిలే. కొంత మంది రిటైర్డు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉంటారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషనే్ల విద్యుత్ చార్జీలను ఖరారు చేస్తాయి. విద్యుత్ కొనుగోళ్లపై ఈ కమిషన్ల సిఫార్సుల మేరకు నడుచుకోవాలి. అధికారంలో ఉండే ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీలను బట్టి రెగ్యులేటరీ కమషన్లు విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఆమోదం తెలుపుతాయి. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లలో విద్యుత్ చార్జీలు పెంచే రోజు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే సందేశం, నివేదిక కోసం నిరీక్షిస్తారు. రాష్ట్రప్రభుత్వ పరిధిలో రాజ్యాంగ బద్ధమైన పదవులు చాలా ఉంటాయి. ఈ పదవుల్లో తమకు కావాల్సిన వారిని అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం నియమించుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కీలకమైన ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లడంలో తప్పేమీలేదు. అలాగే అత్యవసరంగా అన్ని పార్టీల ప్రతినిధులను పిలిచి అఖిలపక్ష సమావేశం నిర్వహించవచ్చును. ఒక వేళ సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వడం ఎందుకనుకుంటే, గవర్నర్‌కు తెలియచేయవచ్చును. కరోనా వైరస్ తీవ్రతపై తనకు తెలిసిన సమాచారాన్ని రాజకీయ పార్టీలకు తెలియచేయవచ్చును. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం ఎన్నికల కమిషనర్‌కు విస్తృతమైన అధికారాలు ఉన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సి ఉంటుంది. కరోనా తీవ్రతపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో తెలుసుకునేందుకు ఎన్నికల కమిషనర్ హోదాలో ఆరోగ్య శాఖ కార్యదర్శిని, అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తమ కార్యాలయానికి విచ్చేసి వివరించాలని ఆదేశించే అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమినర్ తెలుగేతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తెలుగువారే. దాదాపు మూడు దశాబ్థాలకుపైగా వివిధ హోదాల్లో పాలనానుభవం ఉన్న ఉన్నతాధికారి. ఇప్పటికే అధికారంలో ఉన్న వైకాపా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మధ్య ఉన్న వైరం, సామాజిక సమీకరణలు, వర్గవైషమ్యాలు సామాన్యుడికి కూడా తెలుసు. ఈనేపథ్యంలో ఎన్నికల కమిషనర్ తనకు రాజ్యాంగా పరంగా సంక్రమించిన అధికారాలను చలాయించే అధికారాలు కలిగి ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యవిలువలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వీలుగా సత్సంప్రదాయాలను పాటించి ఉండే బాగుండేదని జనం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరడం వల్ల ధర్మాసనం ఇచ్చే ఆదేశాలే ముఖ్యం. అంతవరకు అధికార, విపక్ష పార్టీలు రాజ్యాంగ వ్యవస్థలను విమర్శించకుండా ఉంటే మంచిది.
స్థానిక సంస్థలకు మార్చినెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించని పక్షంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయన్న ఆంధ్రరాష్ట్రప్రభుత్వ ఆందోళన నూటికి నూరుపాళ్లు నిజం. ఇప్పటికే విభజనతో, ఐదేళ్ల చంద్రబాబుపాలనలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం దారినపడుతోంది. సంక్షేమంతో పాటు, అభివృద్ధి రంగంలో ఆంధ్రాను పరుగులుపెట్టాలనే తాపత్రయంతో యువనాయకుడు జగన్ ఉన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందేమో, నిధులు రావేమోనన్న ఆందోళన సీఎం జగన్ ప్రెస్‌మీట్‌లో వ్యక్తం చేశారు.
రాజకీయాధికారంలో పరిపాలన, రాజకీయాలు వేరు. ఈ రెండు ఎప్పుడూ కలవవు. మంచిపరిపాలన అందింవచ్చును. కానీ చతురతతో కూడిన రాజకీయాలు, చాణక్యనీతిని ప్రదర్శించే ఎత్తుగడలు లేకపోతే రాజకీయ కదన రంగంలో ఎదురుదెబ్బలు తప్పవు. రెండు నెలల వ్యవధిలో ఏపీ సీఎం రెండు ఎదురుదెబ్బలు తిన్నారు. ఇవేమీ జగన్ పాపులారిటీని, రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేవి కావు. కాని అనుకున్న నిర్ణయాలు అమలు చేయడానికి అలస్యమవుతుంది. ఆ ఆలస్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తాయి. సత్య హరిశ్చంద్రుడినని మడికట్టుకుని కూర్చుంటే అపరచాణక్యుడు, దేశాన్ని సంక్లిష్టపరిస్థితుల పడకుండా రక్షించిన పీవీ నరసింహారావు ఐదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపేవారా? తెలంగాణ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు బ్రూట్ మెజారిటీ ఉంది. టీఆర్‌ఎస్‌లో చేరాలనుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చట్టంలో ఉన్న సౌలభ్యాన్ని ఉపయోగించుకుని టీఆర్‌ఎస్‌లో వీలీనం కాలేదా ? దీని వల్ల కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పోయింది. శత్రు శేషం, రుణ శేషం ఉండరాదని ధర్మ శాస్త్రాలు చెప్పినవే ప్రజాస్వామ్యంలో జరుగుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ అధికార వికేంద్రీకరణ చేయాలన్న విధానం మంచి నిర్ణయమే. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు శాసనమండలిలో తనకు ఉన్న బలాన్ని ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. అనంతరం పరిణామాల్లో జగన్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానంచేసి కేంద్రానికి పంపారు. పార్లమెంటు ఆమోదం పొందే వరకు శాసనమండలి సజీవంగా ఉన్నట్లే. విపక్ష పార్టీగా బలహీనమైనా తనకున్న పరిమిత శక్తితో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించవచ్చును. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే జరుగుతోంది. కరోనా తీవ్రతతో అతలాకుతలమవుతుంటే, వాయిదా వేశామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థలు వాయిదాపడుతాయని ఊహకు అందని సమాచారమేమీ కాదు. దీనిని పసిగట్టడంలో ప్రభుత్వం, పార్టీ అంతరంగిక విభాగం విఫలమైందా? కోర్టు పరిధిలో ఉన్న రాజ్యాంగపరమైన అంశమిది. ఇక ఈ అంశాన్ని రాద్ధాంతం చేయడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం శ్రేయస్కరం కాదు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా గెలిచే సత్తా ఉన్న వైకాపా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించడం మంచిది.

- కె. విజయశైలేంద్ర, 98499 98097