మెయన్ ఫీచర్

ఉమ్మడి పౌరస్మృతి.. వీడని చిక్కుముడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో ముస్లిం మతానికి చెందిన స్ర్తిలు అనాదిగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించాలంటే అది అనంతంగానే ఉంటుంది. సిద్ధాంత రీత్యా చెప్పాలంటే హిందూ మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు చెప్పుకోదగ్గట్టుగానే వున్నాయి. అన్ని సమయాల్లో కాకపోయినా, కొన్ని సందర్భాల్లోనైనా హిందూ మహిళలు చట్టపరమైన రక్షణను పొందుతున్నారు. ఈ విషయంలో ముస్లిం స్ర్తిల పరిస్థితి దయనీయంగా ఉందనడంలో భిన్నాభిప్రాయాలకు తావులేదు. మతపరంగా ఎన్నో నిబంధనలున్నాయే తప్ప, చట్టపరమైన రక్షణ ముస్లిం స్ర్తిలకు లేదు. హిందూ, ముస్లింలకు వర్తించే ఒకే విధమైన చట్టం లేకపోవడం ఇందుకు కారణం. దేశంలోని ప్రజలందరికీ ‘ఉమ్మడి పౌరస్మృతి’ లేకపోవడం మరో కారణం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఈ విషయమై ఎన్ని ప్రయత్నాలు చేసినా ముస్లిం మతపెద్దల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే వుంది. ఉమ్మడి పౌరస్మృతిని పక్కన పెడితే, ముస్లిం మహిళలను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకున్నా అవి కంటితుడుపు వ్యవహారాలు లాగానే మిగిలిపోయాయి. ఉమ్మడి పౌరస్మృతి వ్యవహారం జోలికి వెడితే- అది ‘కదిపిన కందిరీగ తుట్టలా’ తయారవుతుందని రాజకీయ పార్టీల నేతలందరికీ భయమే! పురుషాధిక్య సమాజంలో మహిళల అణిచివేతకు సంబంధించి ఎన్నో విప్లవాత్మకమైన భావాలు వెలువరించిన గాంధీజీ- ‘మహమ్మదీయ మహిళలు ‘పరదా’ను ధరించడం ఒక దుష్ట సంప్రదాయమ’ని చెప్పడం మినహా అంతకుమించి మాట్లాడలేదు.
బ్రిటిషువారు పరిపాలించే రోజుల్లోనే ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ‘వ్యక్తిగత పౌరస్మృతులు’ (‘పర్సనల్ లా’) వున్నాయి. అందులో చాలా ప్రధానమైనది ‘ముస్లిం పర్సనల్ లా’ (ముస్లింల వ్యక్తిగత పౌరస్మృతి). కుల, మత, వర్గ రహితంగా దేశంలోని ప్రజలందరికీ ఒకే విధమైన పౌరస్మృతి వుండాలని- అధికారంలో వున్నా లేకపోయినా, భారతీయ జనతాపార్టీ భావిస్తోంది. ఇప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలో వున్నది కాబట్టి, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగేందుకు అవకాశం వుంది.
మన దేశంలోని ‘లా కమిషన్’ ప్రస్తుతం ఈ విషయమై అభిప్రాయ సేకరణ చేస్తూండడంతో- ‘ముస్లిం పర్సనల్ లాబోర్డు’ నేతలు దీనిని మరింతగా ఖండిస్తున్నారు. ఈ సమస్య తేలితే గాని, ముస్లిం మహిళలకు రక్షణ లభించదని హేతుబద్ధంగా ఆలోచించే మేధావులు అభిప్రాయపడుతున్నారు. ‘ముస్లిం పర్సనల్ లా’ ప్రకారం ఆ మతంలో భార్యకు భర్త మూడుసార్లు ‘తలాక్’ చెప్పి విడాకులు ఇచ్చే అవకాశం వుంది. భర్త తనపై ఎంత క్రూరంగా ప్రవర్తించినా, తిండి పెట్టకపోయినా, కాపురం చెయ్యకపోయినా అన్నింటినీ భరించాలే తప్ప భార్య విడాకులు ఇవ్వడానికి పనికిరాదు. విడాకులు ఇవ్వబడిన మహిళకు ఆమె మాజీ భర్త మూడు నెలలు మాత్రమే పోషణ నిమిత్తం ‘ఇద్దత్’ ఇస్తారు. వివాహ సమయంలో పుచ్చుకున్న కట్నకానుకలు తిరిగి ఇచ్చేస్తాడు. అంతకు మించిన బాధ్యతలేవీ ఆమె విషయంలో అతనికి వుండవు. ఇక, ఈ మతంలో బహు భార్యత్వం అనే సంప్రదాయం ఉండనే ఉంది. ఇలాంటి మతాచారాలే ముస్లిం మహిళలను అణచివేతకు గురిచేస్తున్నాయని మానవతావాదుల అభిప్రాయం. ‘ముస్లిం పర్సనల్ లా’ ప్రకారం మహిళలకు ఆస్తిలో వారసత్వం లేకపోవడం ఒక దురాచారంగా కొనసాగుతోంది. ‘ముస్లింలకు ప్రత్యేక చట్టం’ అనే దానిని సృష్టించింది బ్రిటిషువారే. బ్రిటిష్ ప్రభుత్వం 1937లో ‘ది షారియట్ అప్లికేషన్ యాక్ట్’ను రూపొందించారు. ఈ మతస్థుల్లో ఒక్కో తెగవారు ఒక్కో సంప్రదాయాన్ని పాటిస్తున్నారు గనుక ముస్లింలందరినీ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చట్టం చేశారు. ఆస్తి వారసత్వం, స్ర్తిల ఆస్తి, వివాహం , విడాకులు.. ఇలా అనేక అంశాల్లో దేశంలోని ముస్లింలందరికీ ఇది వర్తిస్తుందని చట్టంలో పేర్కొన్నారు.
‘షారియట్’ అంటే పవిత్ర ఖురాన్‌లో చెప్పబడిన న్యాయ సూత్రము అని అర్థం. కానీ, ఇవాళ ముస్లింల వ్యక్తిగత చట్టం (ముస్లిం పర్సనల్ లా)లో చెప్పబడినవన్నీ వారి మతగ్రంథంలో ఆదేశింపబడినవే అని చెప్పడానికి వీలులేదు. సున్నీలు, షియాలు అనే తెగలు ఈ మతంలో ఉన్నాయి. ఈ రెండు తెగల్లో కూడా అనేక ఉప తెగలున్నాయి. ఒక్కొక్క తెగకు ఒక్కో సంప్రదాయం వుంది. ‘షారియట్ చట్టం’ ముస్లింలందరికీ వర్తింపచేసేలా రూపొందించారని అంటున్నా- ఇందులోనూ చాలా లొసుగులున్నాయి. బ్రిటిష్ వారు చేసిన ఈ చట్టం గోవా, డయ్యు, డామన్, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్‌లోని ముస్లింలకు వర్తించే అవకాశం లేదు. ఈ చట్టం లోని లొసుగులను ఆసరాగా తీసుకుని- పూర్వపు పద్ధతిలోనే- తమ సంప్రదాయాల ప్రకారం తమదైన రీతిలో ముస్లింలు వ్యవహరిస్తూ వచ్చారు. ఫలితంగా ఆ మతంలోని మహిళలకు అనాదిగా అన్యాయం జరుగుతోంది.
‘విభజించి పాలించు’ అనే సూత్రాన్ని అనుసరించిన అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం ‘ముస్లిం పర్సనల్ లా’ను యధాతథంగా వుంచుతూ, మహిళలకు న్యాయం చేస్తామంటూ 1939లో ‘ముస్లిం వివాహ రద్దు చట్టా’న్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ముస్లిం మహిళలకు వివాహాన్ని రద్దుచేసుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే, అది కొన్ని షరతులకు పరిమితమై వుంటుంది. ఈ చట్టం కూడా సరిగా అమలు కావడం లేదు. ఇట్లాంటి సందర్భంలో భర్త క్రూరత్వాన్ని భరించలేని ముస్లిం మహిళకు ఒకే ఒక మార్గమున్నది. ఇస్లాం మతం నుండి మరో మతానికి మారిపోతే వివాహం రద్దయిపోతుంది. కానీ- భుక్తికి మార్గం ఎక్కడ దొరుకుతుంది? పోషణకు మూడు నెలల ‘ఇద్దతే’ కూడా భర్త నుంచి లభించదు.
ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తేనే ముస్లిం మహిళలకు సమస్యల నుంచి విముక్తి సాధ్యమవుతుంది. అయితే- అలాచెయ్యడం ఒకనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి గాని, ఆ తర్వాత దశాబ్దాల తరబడి అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి గాని ఇష్టం లేదు. 1931లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ- ‘పర్సనల్ లాలు రక్షించబడతాయి’- అని స్పష్టంగా ప్రకటించడాన్ని చూచినా, 1936లో జవహర్‌లాల్ నెహ్రూ మహమ్మదాలీ జిన్నాకు రాసిన లేఖలో ఏ మతానికి చెందిన ‘పర్సనల్ లా’లోనూ జోక్యం కలిగించుకోవాలని కాంగ్రెస్ కోరుకోదు’ అనడాన్ని చూచినా, ఒకప్పటి దేశ న్యాయశాఖ మంత్రి జిఎస్ పాథక్ 1966లో ‘పర్సనల్ లా అనేది మతపరమైన నమ్మకాలతో ముడిపడిన విషయం- మతపరమైన ఆచార వ్యవహారాలపై మన భావాలను బలవంతంగా రుద్దలేం’ అనడాన్ని విశే్లషించినా ఇది సుస్పష్టం.
‘పర్సనల్ లా’లో మార్పులు చేసి, ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలంటే ముస్లిం మతపెద్దలతో చర్చించి వారిని ఒప్పించి చెయ్యాలి గానీ, బలవంతంగా ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని ఉపయోగించరాదు. ‘పిచ్చి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వమూ అలా చెయ్యదు’ అని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా అభిప్రాయపడ్డాడు. అందుకే ‘పిల్లిమెడలో గంట కట్టడం’ అన్ని పార్టీలకు సమస్యగా మారింది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లిం మహిళలకు న్యాయం చేద్దామనే ఉద్దేశంతో 1986లో ‘ది ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవోర్స్ యాక్ట్’ (విడాకుల విషయంలో ముస్లిం మహిళల హక్కులను రక్షించే చట్టం) అనే దానిని అమలుపరచారని చూశారు గానీ, దానివల్ల కూడా సత్ఫలితాలు రాలేదు. ఈ చట్టం ప్రకారం - భర్త వదిలేసిన ముస్లిం మహిళలకు ‘ఇద్దతే’లో పేర్కొన్నట్టు మూడు మాసాల జీవనభృతి లభిస్తుంది. ఆ తర్వాతి కాలంలో ఆమె బాధ్యతను బంధువులు తీసుకోవాలి. ఆమె బంధువులు బీదవాళ్లయితే ఆ బాధ్యతను ‘వక్ఫ్’ బోర్డులు తీసుకోవాలి. మన దేశంలోని ‘వక్ఫ్’ బోర్డులు ఈ పనిని సక్రమంగా చెయ్యలేవనే విషయం అందరికీ తెలిసిందే!
మన దేశంలోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్-125 ప్రకారం- భార్యను భర్త వదిలిపెడితే ఆమెకు అతను జీవనభృతి ఇవ్వాల్సిందే. అయితే- నిరక్షరాస్యులైన మహిళలు తమ ‘పర్సనల్’లాకు వ్యతిరేకంగా ఇది అమలవుతుందా? లేదా? అని గ్రహించలేరు, గ్రహించినా న్యాయపోరాటం చేయలేరు. భోపాల్‌కు చెందిన షాబానో అనే 60 ఏళ్ల మహిళ- తనకు 43 ఏళ్ల వయసులో భర్త విడాకులిచ్చినా ఏ విధమైన జీవనభృతి ఇవ్వడం లేదని, తనకు జీవించడం కష్టంగా ఉన్నందున భరణం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టులో కేసువేస్తే సుదీర్ఘ విచారణ తర్వాత, కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు దేశంలోని ముస్లిం మహిళందరికీ మహదానందం కలిగించింది. ముస్లిం పెద్దలకు మాత్రం ఆగ్రహాన్ని తెప్పించింది. ఇది తమ పర్సనల్ లాలో జోక్యం చేసుకోవడమేనని వారు సుప్రీం కోర్టులో కేసు వేశారు. వారి అప్పీలును సుప్రీంకోర్టు నిరాకరించింది. షాబానోకు న్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో ముస్లింల్లో ఆగ్రహాన్ని తగ్గించడం కోసమే- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ముస్లిం మహిళలకు వర్తించకుండా 1986లో అప్పటి ప్రభుత్వం ఓ చట్టాన్ని తెచ్చింది.
ముస్లిం మహిళల హక్కులను కాపాడాలంటే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం ఒక్కటే మార్గం. ఇది పార్లమెంటులో మెజారిటీ ఉన్నంత మాత్రాన బలవంతంగా చెయ్యాల్సిన విషయం కాదు. ముస్లిం మతపెద్దలను ఒప్పించి చట్టం తీసుకురావాలి. ఇందుకు ‘ముస్లిం పర్సనల్ లా’ తీరును పరిశీలించి, వారి ఆచార వ్యవహారాలను సమన్వయం చెయ్యాల్సి వుంది. ఇలాంటివేవీ జరగకుండా ముస్లిం మహిళలను చట్ట ప్రకారం రక్షించాలంటే అది జరగని పని. దేశంలో ప్రస్తుత చర్చనీయాంశాన్ని బట్టి, ‘ముస్లిం పర్సనల్ లా’ విషయమై న్యాయ నిపుణులు, మేధావులు మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఇలాంటి ‘పర్సనల్ లా’లు- వివిధ మతాలు, ప్రాంతాలకు సంబంధించి మన దేశంలో చాలా ఉన్నాయి. నాగాలాండ్‌లో నాగాలకు సంబంధించిన ‘పర్సనల్ లా’ వంటివి అమలులో ఉన్నాయి. వీటన్నింటి విషయంలో ఒకే దృష్టి అవసరం. దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేలా మోదీ ప్రభుత్వం ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది శేషప్రశే్న!

-కోడూరి శ్రీరామమూర్తి 93469 68969