మెయన్ ఫీచర్

సం‘కుల’ సమరాంధ్ర ప్రదేశ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని లేకుండా పుట్టిన ‘నవ్యాంధ్ర’ అనే రెండున్నరేళ్ల శిశువుకు అప్పుడే ‘కులజబ్బు’ పట్టుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ రోగం ఉన్నప్పటికీ అది ఇప్పుడున్నంతగా లేదు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల సామాజిక స్వరూపాలను విశే్లషిస్తే ఆంధ్రలో ఉన్నంత కుల వ్యామోహం తెలంగాణలో కనిపించదు. కాకపోతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి వర్గానికి, తెదేపా ఉన్నప్పుడు కమ్మ వర్గానికి ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలో వెలమ వర్గం చేరినా, ఆ పిచ్చి ఇంకా ప్రజల వరకూ రాలేదు. ఆంధ్ర రాజకీయాలు తొలినుంచీ కులం చుట్టూనే పరిభ్రమించడం పరిపాటి. 1983 నుంచి ఇది ముదురుపాకాన పడి, రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ-రెడ్డి కులాల మధ్య ఆధిపత్యపోరు ఆరంభమైంది. ఒకప్పుడు వ్యాపారాలకే పరిమితమైన కమ్మ వర్గం ఎన్టీఆర్ రాకతో రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది. దాంతో అప్పటివరకూ రాజకీయాలను శాసించిన రెడ్డి వర్గం అధిపత్యానికి కళ్లెం పడినట్టయింది. రాయలసీమలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెడ్డి కులస్థులదే పైచేయి కాబట్టి, తెదేపా ఆవిర్భావం తర్వాత కూడా ఆ వర్గం హవా కొనసాగింది. మిగిలిన సామాజిక వర్గాలను సమన్వయం చేసుకోవడం, ఆత్మీయత ప్రదర్శన కారణంగా మిగతా కులాలు కూడా రెడ్డి వర్గానికి చేరువయ్యాయి. ఈ విషయంలో తాము విఫలమైనట్టు కమ్మ వర్గీయులు అంగీకరిస్తుంటారు. బీసీలు దన్నుగా నిలిచిన పార్టీగా తెదేపాకు ఆవిర్భావంలోనే కొత్త స్వరూపం ఇవ్వడంతో, కమ్మ కులస్థులే కాకుండా తెదేపాకు బీసీలు సంప్రదాయ మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. దీనికి ఎన్టీఆర్ వేసిన పునాదే కారణం కాగా, చంద్రబాబు కూడా దానిని కొనసాగించారు.
ఎన్టీఆర్ హయాంలో తెదేపాపై ‘కులముద్ర’ ఉండగా, బాబు పార్టీ పగ్గాలు చేపట్టాక దానిని మార్చేశారు. బీసీల పార్టీగా బలమైన ముద్రతోపాటు, జిల్లాల వారీగా సామాజిక సమతుల్యం పాటించారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు అన్ని కులాలకు చెందిన పారిశ్రామికవేత్తలను తనతో విదేశాలకు తీసుకువెళ్లేవారు. అయితే, విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వల్ల లబ్థిపొందిన అదే పారిశ్రామికవేత్తలు ఆయన కనిపిస్తేనే పక్కకుతప్పుకుని వెళ్లేవారు. అది వేరే విషయం! బాబు సీఎంగా ఉన్నప్పుడు సొంత వర్గాన్ని ప్రోత్సహించేందుకు భయపడేవారు. చంద్రబాబు నైజాన్ని నిశితంగా పరిశీలించే సీనియర్లు- కులం కంటే అధికారానే్న ఆయన ఎక్కువగా ప్రేమిస్తుంటారని చెబుతుంటారు.
ఇప్పుడు ఎపిలో కులరాజకీయాలు గబ్బువాసన పుట్టిస్తున్నాయి. రాజధాని ప్రాంతమైన విజయవాడ-అమరావతిలో ఇది మరీ ఎక్కువైంది. ప్రస్తుతం కమ్మ సామాజికవర్గంలో కొందరు ‘అత్యుత్సాహం’గా వ్యవహరిస్తున్నారనన్న ఆరోపణలు లేకపోలేదు. ఇది మిగిలిన సామాజికవర్గాల ఏకీకరణకు అవకాశం కల్పిస్తుంది. బాబు తీసుకున్న ముందస్తు సామాజిక వ్యూహం వల్ల తెదేపాను వ్యతిరేకించే బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుతో ఆ పార్టీకి దగ్గరైంది. ఉన్నత చదువులు, వ్యాపారాల కోసం కార్పొరేషన్ ఇస్తున్న రుణాలు వారి జీవన పరిస్థితిని మార్చేస్తున్నాయి. ఇదే రీతిలో కాపు కార్పొరేషన్ నుంచి కూడా ఆ కులస్థులు భారీ సంఖ్యలో రుణాలు పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాయం పొందిన వారికి సహజంగా పాలకులపై విశ్వాసం ఉంటుంది కదా?
దాదాపు ప్రతి సామాజిక వర్గానికి మేలు చేస్తూ వారికి దగ్గరవడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఆయన సొంత సామాజికవర్గం ప్రదర్శిస్తున్న దూకుడు మిగతా వర్గాలను దూరం చేసేలా ఉందని తెదేపా నేతలే ఆందోళనతో ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పరుగులు తీస్తున్న ఒక వీడియో మిగిలిన వర్గాల్లో కొత్త ఆలోచనకు కారణమవుతోంది. కమ్మ కులమే గొప్పదని, బ్రహ్మ కూడా ఆ కులం వాడు కాబట్టే అన్ని తెలివితేటలు వచ్చాయని, వచ్చే జన్మలో తమను కూడా ఆ కులంలో పుట్టించాలని మిగతా కులాల వారు కోరుకుంటున్నట్లు ఒక ప్రముఖుడు విద్యార్థులకు సందేశమిస్తున్న వీడియో ఇపుడు చర్చనీయాంశమయింది. నిజానికి అది పాత వీడియోనే. కానీ అది ఇప్పుడు విస్తృతంగా చెలామణిలో ఉంది. గతంలో ఇలాంటివి నాలుగుగోడల మధ్య నిర్వహించుకున్నా ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతి నట్టింట్లోకి రావడంతో ఇకపై ఏదీ రహస్యం కాదు.
* * *
కాపునేత ముద్రగడ పద్మనాభం తాను తలపెట్టిన పాదయాత్ర విషయంలో అనుసరిస్తున్న మొండి వైఖరి విజ్ఞులకు విస్మయం కలిగించేదే. ఈ దేశంలో రాష్టప్రతి నుంచి సగటు పౌరుడి వరకూ అందరూ చట్టాలను, కోర్టులను పాటించాల్సిందే. ఒక కులమో, ఒక మతమో ఈ చట్టాలకు, రాజ్యాంగానికి అతీతమని భావిస్తే అది భ్రమ. తన కులస్థుల హక్కుల సాధన కోసం పాదయాత్ర చేయాలనుకోవడం తప్పుకాదు. పాదయాత్ర కోసం అనుమతి కోరబోనని ముద్రగడ భీష్మించడం రాజ్యాంగాన్ని, కోర్టులను అవమానించడమే. వాటికంటే వ్యక్తులు గొప్పవారు కాదు. ఉదాహరణకు ఎవరైనా చెప్పాపెట్టకుండా ముద్రగడ ఇంట్లోకి వెళితే ఆయన వారిని అనుమతిస్తారా? వారు కూడా తాము ముందుగా చెప్పి లోపలికి వచ్చే అలవాటు లేదని భీష్మిస్తే ఆయన వౌనంగా ఉంటారా? మరి ముద్రగడ వంటి నాయకుడు పాదయాత్ర చేస్తే, అందులో ఎలాంటి ‘శక్తులు’ ఉంటాయో, వారివల్ల ఆయనతోపాటు మిగిలిన కులాలకూ ఎంత హాని ఉంటుందో చూడాల్సిన బాధ్యత పోలీసులదే కదా? రేపు ఏదైనా అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? ర్యాలీలు, యాత్రల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగితే తమదే బాధ్యత అని అఫిడవిట్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఒక పౌరుడిగా గౌరవించాల్సిన బాధ్యత ముద్రగడ వంటి నేతకు లేదా? రేపు ఇలాంటి ధిక్కార స్వరానే్న ప్రతి ఒక్కరూ వినిపిస్తే శాంతిభద్రతల మాటేమిటి? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడంలో ముద్రగడకు వచ్చిన నష్టమేమిటో ఎవరికీ అర్థం కాదు. ఈ విషయంలో ముద్రడ వ్యవహారశైలి ఎవరినీ మెప్పించడం లేదు. ఉద్యమకారుడిగా, సమర్థుడైన నేతగా ఆయనపై ఉన్న గౌరవం వంటివి ఇలాంటి వైఖరితో కొట్టుకుపోతుందని ఎందుకు ఆలోచించడం లేదు? ప్రస్తుతం కాపువర్గం ఎప్పుడూ లేనంత గందరగోళంలో ఉంది. ఎన్నికల హామీ ప్రకారం తమను బీసీల్లో చేర్పించే ప్రక్రియ మొదలై, కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి రుణాలిస్తున్నందుకు బాబుకు బాసటగా ఉండాలా? లేక ముద్రగడ వెంట వెళ్లాలా? ఇదీ వారి అంతర్మథనం. నిజానికి కాపులది అందరినీ నమ్మే మనస్తత్వం. ఎందుకు ఎవరిని ద్వేషిస్తారో, ఎందుకు ప్రేమిస్తారో వారికే తెలియదన్న వ్యాఖ్యానాలు లేకపదోలేదు. కులాభిమానంతో చిరంజీవి పార్టీని ఆదరించిన అదే కాపులు కాంగ్రెస్‌లో ‘ప్రజారాజ్యం’ విలీనం తర్వాత ‘మెగాస్టార్’ను ద్వేషించారు. చిరంజీవి ఎపిసోడ్ తర్వాత వైఎస్, బాబులను వీరు కొన్నాళ్లు నమ్మడం మానేశారు. ఇప్పుడు మళ్లీ ముద్రగడ వారిలో మరో గందరగోళానికి తెరలేపారు.
* * *
ఇలా కులరాజకీయాలు రాజుకుంటే నవ్యాంధ్ర అభివృద్ధి ఎప్పటికయ్యేను? కులాల పేరిట సమాజం చీలిపోతే ఆ ప్రభావం రాష్ట్రంపై పడక తప్పదు. ఇది ఇంకా విషమిస్తే పెట్టుబడులు పెట్టేందుకు ఇతర సామాజికవర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చే ధైర్యం చేస్తారా? బాబునో, జగన్‌నో, ముద్రగడనో లక్ష్యం చేసుకుని కులరాజకీయాలు చేస్తే నవ్యాంధ్ర ఎప్పటికి అభివృద్ధి చెందుతుంది? ఇది సగటు మనిషి వేస్తున్న ప్రశ్న. దీనికి జవాబు చెప్పేదెవరు? *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144