మెయిన్ ఫీచర్

లోకోపకారానికీ ఓ వ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రజలకు ఉపకారం చేయాలి’అనే నియమాన్ని నిత్యవ్రతంగా ఆచరించటమే ‘లోకోపకార వ్రతం’ కృత, త్రేత, ద్వాపరయుగాల నుండీ భరత వర్షంలో ఎందరో మహర్షులు, ఋషులు, రాజులు, చక్రవర్తులు, పండితులు, వేదవిదులు ప్రజలకోసం ఎంతో ప్రయోజనం చేకూర్చే శుభకార్యాలు లోకోపకారంకోసం నిర్వహించారు. వారు నిర్వహించిన యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, హోమాలు, తపస్సులు, జపాలు సుఖశాంతులకోసం, దేశం సుభిక్షంగా పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించేవారు. ఆ దిశగానే సత్కార్యాలు నిర్వహించారు.
మానవ జన్మ ఉత్తమమైనదని, ఆ జన్మను సద్వినియోగం చేసుకొని జీవితంలో సత్యం, త్యాగం, ధర్మం, ప్రేమతో ప్రకాశించాలని తాపత్రయపడేవారు. కృతయుగంనుంచీ ప్రపంచమంతా లోకోపకార వ్రతానికి ముడిపడి వుంది. లోకోపకారానికి అంకురార్పణ చేసిన మహర్షి నారదులవారు. నారద మహర్షి, మహర్షులు, ఋషులు, దేవతలు, దేవుళ్ళు, రాక్షసులు, యక్ష కినె్నర కింపురుష గంధర్వులు మొదలైనవారితో చర్చించి, సంభాషించి, ఒప్పించి, సమాధానపరచి దుష్టశిక్షణ, శిష్టరక్షణగావించి విశ్వకళ్యాణానికి మార్గం సుగమం చేశాడు. నారద మహర్షి తన జీవితాన్ని లోకోపకారానికి అంకితంచేసి మానవాళికి శాంతిని స్థాపించాడు.
ఇతిహాస గ్రంథాలైన రామాయణ, భారత, భాగవతముల ద్వారా వాల్మీకి వ్యాస మహర్షులు ఆదేశాలను, ఉపదేశాలను, సందేశాలను, సూచనలు ప్రజలకు అందించి లోకోపకారం చేశారు. భారతంలోని విష్ణుసహస్ర నామ పారాయణ, భగవద్గీత. రామాయణంలోని ఆదిత్య హృదయ స్తోత్రము, భాగవతంలోని నారాయణ కవచం, రుద్ర గీతాలు, హంస గీతాలు, ఉద్ధవ గీతాలు, విదుర- మైత్రి సంవాదం, కపిల- దేవహుతి సంవాదం- ఇట్లా అనేక సంవాదాలు, సద్విషయాలు, సందేశాలు లోకోపకారం కోసం చేసినవే. దానిని గుర్తించిననాడు మానవీయ విలువలు, నైతిక విలువలు, మానవ సంబంధాలు, సత్ప్రవర్తన, ధార్మిక, ఆధ్యాత్మిక సందేశాలను ఆచరించుటకు మానవాళికి అవకాశమేర్పడింది.
ఋషుల చరిత్ర మహావిజ్ఞాన సంపద. ఋషుల చరిత్రలు మనచరిత్రతో సమన్వయం చేసుకుంటే ఇంకా ఎన్నో విలువైన విషయాలు మనం తెలుసుకోవచ్చు. తద్వారా మన జీవన విధానాన్ని లోకోపకార వ్రతంగా చేసుకుంటే మార్పుకు అవకాశమేర్పడుతుంది. మహర్షులు లోకానికి అందించిన సేవలను ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన అవసరం ఉంది.
ఉదాహరణకు- గౌతమ మహర్షి బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. సప్తఋషులలోనూ ఒకడు. ఈ మహర్షి వ్రాసిన ‘‘గౌతమ ధర్మ సూత్రములు’’ లోకంలో ప్రసిద్ధిచెందాయి. గౌతముడు తపస్సు చేస్తుండగా బ్రహ్మ ప్రత్యక్షమై ‘‘గౌతమా! ఎందుకు తపస్సు చేస్తున్నావు? ఏదైనా వరం కోరుకో?’’అని ఆదేశించాడు.
వెంటనే గౌతముడు బ్రహ్మతో ‘‘నేను విత్తనం చల్లితే ఒక ఝాములో పంట పండాలి, వెంటనే దాని ఫలం ఇవ్వాలి’’అని కోరుకున్నాడు. బ్రహ్మ ‘తథాస్తు’అని దీవించాడు. కొద్దికాలానికి కరువువచ్చింది. పనె్నండు సంవత్సరాలు వానలు లేవు. ఆయన తపోబలంతో యజ్ఞంచేసి, గుప్పెడు ధాన్యం సృష్టించి తన చుట్టూవున్న భూమిమీద చల్లేడు. రెండు గంటల్లో మొలకెత్తి పంటంతా చేతికొచ్చింది. అప్పటికప్పుడు ఆ ధాన్యం వండి వడ్డించారు. ఆహార సృష్టికి ఆద్యుడుగా గౌతమ మహర్షి లోకోపకారం చేశాడు. ఆరోజునుంచి భూలోకం స్వర్గమైంది. లోకానికి అన్నదానం చేసిన ఘనత గౌతమ మహర్షిదే.
ఆకాశ గంగను భూమిమీదకు తీసుకురావటానికి గౌతముడు అనేక సంవత్సరములు తపస్సుచేసి శివుని అనుగ్రహంతో గంగను భూలోకానికి తీసికొచ్చాడు. అదే గౌతమీ నది అయింది. ఆ నదే గోదావరి నదిలో ఒక పాయగా మారి ‘‘గౌతమీ నది’’ పేరుతో ప్రవహిస్తోంది. దీనినే రాజమహేంద్రవరము వద్ద గౌతమి నదితీరాన్ని గోష్పాదక్షేత్రంగా ప్రవహిస్తోంది. ఈ విషయం శివ పురాణంలోని జ్ఞాన సంహితలోనూ, వరాహ పురాణంలోనూ ఉంది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పొలాలను సస్యశ్యామలంగా పండింపచేసిన ఘనతగూడ గౌతమ మహర్షిదే.
చ్యవనమహర్షి ‘‘చ్యవన ప్రాశ’’పేరుతో ఆయుర్వేద ఔషధాన్ని లోకానికి అందించి మహోపకారం చేశాడు. ఈ కోవలోకి చెందినవారే పతంజలి. పునర్వసు (చరకుడు); శుశృతడు మొదలైనవారు. అదే విధంగా భరద్వాజ మహర్షి; వశిష్టమహర్షి మతంగ మహర్షి, కాశ్యప మహర్షి; కర్దమహర్షి శుక మహర్షి, అంగీరస మహర్షి మొదలైన ఎందరో మహర్షులు లోకోపకారంచేసి మానవాళికి ఎంతో మేలుచేశారు.
ప్రస్తుత కలియుగంలో ప్రజలు ఆచరించే శుభకార్యాలు అన్నీ మహర్షులు మనకు అందించిన ఉపదేశాలు. ఆనాటి మహర్షులను ఆదర్శంగా తీసుకొని లోకోపకారం, లోక క్షేమం, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, పీఠాధిపతులు, దేవాలయ సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, వేద పండితులు- యాగాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు నిర్వహిస్తున్నారు.
ఆదిశంకరాచార్యులు సర్వమత సారాన్ని ఆకళింపుచేసుకున్న విశ్వవిజ్ఞానవేత్త. ఆయన భావాలను అర్ధంచేసుకోటానికి మెదడు ఒక్కటి సరిపోదు. హృదయం కావాలి. ఆయన భౌతికంగా గతించి 1200 సంవత్సరములు అయినా ఇంకా సజీవుడు గానే, నిత్య నూతన చైత్నయ స్వరూపుడుగా ఉండటం ఎవరికైనా విస్మయానికి గురిచేస్తుంది. ఆదిశంకరులు సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమనే భావన నేటికీ ప్రచారంలో ఉంది. కలియుగానికి జగద్గురువులు ఆదిశంకరులు. అందువలన, ఆయన అఖిల భారతీయులకు ఆరాధ్యదైవం. ఆదిశంకరులు కొన్ని వందల గ్రంథాలు రచించి ఆధ్యాత్మిక, ధార్మిక, వేదాంత, భక్తిజ్ఞానాన్ని భారతీయులకు అందించి లోకోపకారం చేసిన మహనీయుడు.
లోకోపకార వ్రతం నిత్యవ్రతంగా భావించి నిర్వహించిన వారికి మహర్షుల ఆశీస్సులు నిత్యం ప్రసరించి మానసిక ప్రశాంతత, మోక్షప్రాప్తి లభిస్తుందనుటలో సందేహం లేదు.

- చివుకుల రమాకాంతశర్మ