మెయన్ ఫీచర్

నల్లబాబులకు కళ్లెం సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సానియామిర్జా వలిమా డిన్నర్ సందర్భంగా భర్త, ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ తన ఇంటిని విద్యుదీకరణ చేసుకుంటానంటే, విద్యుత్ పొదుపు వారోత్సవాల్ని జరుపుతున్న సందర్భమని అనుమతి నిరాకరించింది ఆ ప్రభుత్వం. మన దేశంలో ఇలాంటివి వింతగా తోస్తాయి. పైగా ప్రజావసరాలకై వినియోగించే విద్యుత్‌ను, కోత వున్నా ఇలాంటి దుబారా వినియోగానికి వెనుకంజ వేయవు మన ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలోనే 1977లో ఆంధ్రభూమిలో వచ్చిన కరెంట్‌పై ‘కోత’అనే కథ ఆధారంగా, ‘కరెంట్’అనే హిందీ సినిమాగా తెరకెక్కించి, ఓ సాధారణ రైతు కరెంటు కోసం పడే ఇబ్బందుల్ని కళ్లకట్టినట్లు చూపి, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు విద్యుత్తును ఎలా దుర్వినియోగం చేస్తారో చూపడం జరిగింది.
స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కాగా, పై కథకు నాలుగు దశాబ్దాలు. అయినా ప్రతీ బడ్జెట్‌లో విద్యుత్ లేని గ్రామాలంటూ, నిధుల కేటాయింపు అంటూ మంజూరులు జరుగుతూనే వున్నాయి. రైతులకు 7 గం.లంటూ, 9 గం.లంటూ, నాణ్యతతో కూడిన విద్యుత్ అంటూ రాజకీయ నాయకులు పలవరిస్తూనే వున్నారు. శీతాకాలమైనా, 50వేలకు పైగా ప్రముఖులు హాజరైన గాలి జనార్దన్‌రెడ్డి కూతురు పెళ్ళికి ఏసిలు కావల్సిందే మరి! పెట్టెల్లో మూలిగే డబ్బు దర్పం తెలియాలంటే, ఆహ్వాన పత్రికలుగా టాబ్‌లెట్లను(Hand computer) పంచాల్సిందే! పార్లమెంటుకు హాజరుకాకున్నా, హాజరై నిద్రపోయినా పర్వాలేదుగాని, ఈ పెళ్ళికి హాజరుకాకపోతే ‘రాజకీయతనమే’ ఓ ప్రశ్నార్థకం కాదా!
ఎన్నిసార్లు లెక్కలుపెట్టినా దారిద్య్రరేఖను దిగిరాని దరిద్రులకోసం ఈ దేశంలో ఎన్ని పథకాలో! 1952 లగాయత్ 2014దాకా ఈ జనాల్ని కుబేరుని దగ్గరకు చేర్చడానికై రమారమి 35 పథకాలు వచ్చాయి. మొట్టమొదటి పథకం కమ్యూనిటి డెవలప్‌మెంట్‌తో సహా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక పథకం, యుపిఎ మొదటి దఫాలో గాంధీ పేరున ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం, మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ అభియాన్, జన్‌ధన్ పథకాలు సమాజాన్ని సమూలంగా మార్చాలని రూపొందించినవే! వీటికితోడు ప్రతి రాష్ట్రంలో జన సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలు వందలు కాదు వేలల్లో వుంటాయి. ఆసరా, పెళ్ళి ముబారక్, కార్మిక సంక్షేమం, సన్న బియ్యం అంటూ కెసిఆర్, దీపం పథకం, డ్వాక్రా పథకం, జన్మభూమి, చంద్రన్న సబ్సిడీల పథకమంటూ బాబు బంగారు, స్వర్ణ కలల్ని కంటూనే వున్నారు. ఇక దేశంలోనే ఆదర్శం జయమ్మ పథకాలు. అఖిలేష్‌తో సహా అప్పుల ఊబిలో దించే ఇలాంటి పథకాలు లేని రాష్ట్రం లేదు.
ఇన్ని పథకాల్ని లబ్దిపొందుతున్న జనాల ఆర్థిక స్వావలంబనలో ఏమైనా మార్పుజరిగిందా అంటే, జరిగిందని చెప్పాల్సిందే! ఎందుకంటే, 1973-74లో దారిద్య్రరేఖ కింద 55.9 శాతంగా వున్న జనాభా 1993-94 నాటికి 36 శాతంకు పడిపోయారు. రెండు దశాబ్దాలలో 20శాతం తగ్గడం గొప్ప విషయమే! కాని, దశాబ్దం తిరగకుండానే, 2004-05లో తెండూల్కర్ దీన్ని 37.2 శాతంగా నిర్ధారిస్తే, 2014లో సి.రంగరాజన్ 40 శాతంకు పైగానే అని సెలవిచ్చారు. మోడీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం మరో విషయం. పోతే, ఇంతటి సువిశాల దేశంలో, పొంతన లేని సమాధానాల్ని చెప్పే ప్రజల వాస్తవస్థితిని అంచనావేయడం కత్తిమీద సాములాంటిదే! ఈ తికమక గణాంకాల్ని పట్టించుకోవద్దంటే, సంపదల్ని లెక్కించే సర్వేలపై కూడా మన దృష్టిని సారించాల్సిందే! ఇందులో మాత్రం సూపర్ దేశాల సరసన భారత్ డూపర్‌గా వెలిగిపోతూనే ఉంది. 2014లో ఫర్బ్స్ సర్వే ప్రకారం దేశంలో వందకు పైగా బిలియనేర్లేనని, వీరి ఆదాయం 346 బి.డాలర్లని తేల్చింది. ఇందులో పై పది స్థానాల్లో మొదటి వ్యక్తిగా 23.6 బి.డాలర్లతో ముఖేష్ అంబాని నిలవగా, రెండో స్థానంలో 18.6 బి.డా.తో దిలీప్ సంఘ్వి, మూడో స్థానంలో 16.4 బి.డా.తో అజీమ్‌ప్రేమ్‌జీలుండగా, పదో స్థానంలో 7.8 బి.డా.లో సునీల్ మిట్టలు వున్నారు. క్రితం సంవత్సరంతో పోలిస్తే వీరి సంపద పెరుగుదల బిలియన్లలోనే ఉండడం గమనార్హం. 2015లో జరిగిన గ్లోబల్ వెల్త్ సర్వే ప్రకారం, పది కోట్ల డాలర్లు, (640కోట్లు), అంతకుమించి సంపదలు గల కుటుంబాల జాబితాలో భారత్‌కు నాల్గవ స్థానం దక్కింది. ఇదే సంవత్సరంలో ఆసియా- పసిఫిక్ వెల్త్ సర్వే ప్రకారం అధిక సంపద గలిగిన (High net worth individuals) భారతీయ కుటుంబాలు 26.3 శాతం పెరుగుదలతో లక్షా 98వేలకు చేరుకున్నట్లు తెలిపింది. వీరి ఆదాయం 28.2 శాతం పెరుగుదలతో 785 బి.డా.కు పెరిగింది. ఇదే కాలంలో చైనా 17.5 శాతం కుటుంబాల పెరుగుదలతో, 19.5 శాతం ఆదాయపు అభివృద్ధితో వున్నట్లుగా పోల్చింది.
ఈ కథనాలు ఇలా వుంటే పై 2015 సంవత్సరంలోనే మానవాభివృద్ధి, మానవ వనరుల వినియోగంలో వివిధ దేశాల స్థాయిలని గుర్తించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) రిపోర్టు ప్రకారం భారత్ 100వ స్థానంలో వుంది. 124 దేశాలను గణకంలోకి తీసుకోగా, ఎప్పటిలాగానే ఫిన్‌లాండ్, నార్వే, స్విడ్జర్, కెనడా, జపాన్, స్వీడన్, డెన్మార్క్, నెథర్‌ల్యాండ్స్, న్యూజీలాండ్, బెల్జియంలు వరుసగా ముందు నిలవగా, మనతో కలిసి ఏర్పడిన బ్రిక్స్ దేశాలైన రష్యా (26), చైనా (64), బ్రెజిల్ (78), ద.ఆ. (92)వ స్థానాల్లో వుండడం గమనించాలి. చివరికి మన చుట్టూవున్న భూటాన్, బంగ్లా, శ్రీలంక లాంటి చిన్న దేశాలు మనకు పైన వుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నినాదంగా మోడీ ముందుకు తెచ్చిన నల్లధనం వెనక్కి తెప్పించడం, దేశంలోని నల్లధనాన్ని తవ్వి తీయడానికై ఉద్దేశించిన రెండు బిల్లుల్ని 2015 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమోదించడం తెలిసిందే! అయినా అక్రమఆర్జన ఓ హక్కుగా మారిన ఈ దేశంలో ఏది ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలేదనేది తెలిసిందే!
ఈ అతి ధనవంతులతో దేశానికి ఉపయోగం లేదా? అంటే చెప్పడం కష్టమే! కాని, దేశంలోని 17 ప్రధాన జాతీయ బ్యాంకులనుంచి కోట్లాది రూపాయల్ని వారి వ్యాపార లావాదేవీలకై అప్పులుగా తీసుకున్న వైనాన్ని, ఎగవేతదారుల్ని, వారి విలాసవంతమైన జీవితాల్ని చూస్తే మన బ్యాంకుల పాత్ర, నిర్వహణ ఎంత విలక్షణంగా వుందో తెలుస్తున్నది. దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా విరాజిల్లుతున్న యస్‌బిఐ మొండి బకాయిల జాబితాలోని మొదటి పది స్థానాల్లోని ఎగవేతదారుల అప్పులే రూ.4,631 కోట్లకు పైగానే అని బ్యాంకే ప్రకటించడం జరిగింది. ఇందులో కింగ్‌ఫిషర్ కింగ్ విజయమాల్యానే రూ.1201 కోట్లు కాగా, మరో 90 మంది ఎగవేతదారులని కలుపుకుంటే ఎగవేత సొమ్ము రూ.7,016 కోట్లని తేల్చింది. ఇదే బ్యాంక్ గత జూన్ 30నాటికి 48వేల కోట్ల రూపాయల్ని రుణ రద్దు(Right off)గా ప్రకటించడం, ఈ విషయం ప్రస్తుత పార్లమెంట్‌లో చర్చకు రాగా, స్వయాన అరుణ్‌జైట్లే వివరణ ఇవ్వడం కూడా తెలిసిందే! మొన్నటి సెప్టెంబర్ చివరినాటికే ఈ బ్యాంకు నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఎ) రూ.1.05 లక్షలు కాగా, బ్యాంకు అందించిన మొత్తం రుణాల్లో ఈ సొమ్ము రూ.7.14 శాతం కావడం మరో ఆశ్చర్యకర విషయం. తర్వాతి స్థానాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు నిలిచాయి. ఇలా మొత్తం 17 బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (అప్పులిచ్చిన సొమ్ము) ఎన్ని వందల కోట్లో తేలడం కూడా కష్టమే.
విజయ మాల్య లాంటి బడా బాబులంతా విదేశాల్లో కొందరుంటే మరి కొందరు ఈ దేశంలోనే మన పార్లమెంటేరియన్లతో చట్టపట్టాలేసుకొని తిరగడం జరుగుతూనే వున్నది. ఏడాది దాటినా, విజయమాల్యా కోటు బటన్‌ను కూడా ఊడదీయని మన విదేశీ విధానం మన బుర్రలకే అర్ధంకాదు. ఇక దేశంలో జరిగే కుంభకోణాలు, అక్రమార్జనలకు సంబంధించిన కేసులు 2015లోనే అత్యధికంగా నమోదుకావడం జరిగింది. 2014లో కేవలం 52గా గల సిబిఐ కేసులు 2015లో 2,200కు చేరాయి. ఇందులో ఎంపి నవీన్ జిందాల్, ఎ.రాజా, వీరభద్రసింగ్ లాంటి రాజకీయ నాయకులతో సహా బడా స్థాయి ప్రభుత్వ అధికారులు కూడా వుండడం గమనించాలి. ఇక ఆయా రాష్ట్ర స్థాయిలలో ముఖ్యమంత్రులతో సహా రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఉన్నత స్థాయి అధికారులు, ఉద్యోగులు జిల్లా స్థాయి పాలక పక్ష రాజకీయ నాయకుల అవినీతి బాగోతం రోజు పత్రికల్లో చూస్తూనే వున్నాం. ఇలాంటి వారందరికి పెద్ద నోట్ల రద్దు నిజంగానే మింగుడు పడదు. దేశాన్ని, వ్యవస్థనే శాసించే వీరికి ఆచరణాత్మక సంస్కరణలు అసలే గిట్టవు.
రాజకీయ నాయకులు బహిరంగంగా విభేదించుకుంటూ, అంతర్గతంగా కలిసి వుంటారనేది ఓ రాజకీయ సూత్రం. ఈ సూత్రమే పార్టీలకతీతంగా రాజకీయ నాయకుల్ని ఏకం చేస్తుంది. మోడీ మంత్రాన్ని అంతర్గతంగా విభేదించే ఆయన పార్టీ పార్లమెంటేరియన్లకే గిట్టరనేది బహిరంగ రహస్యమే! అందుకే, నన్ను తగలేసినా, ఉరి తీసినా ఆర్థిక సంస్కరణలు ఆగవంటూ, గోవాలో మోడీ ఆవేశంగా మాట్లాడి వుంటాడు. ఈ ఆవేశం చివరివరకు కొనసాగుతుందా అంటే, అనుమానమే! సమగ్రతతో కాకుండా, పైపైన జరిపే ఏ సంస్కరణ సత్ఫలితాల్ని ఇవ్వదనేది ఓ సామాజిక నీతి.
ఓవైపు నల్లధనంపై కొరడా ఝళిపిస్తున్నామంటున్న కాలంలోనే డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలకు తగ్గి (16/11న) 76.94కు చేరుకోవడం, చూస్తుంటే పెట్టుబడుల స్థితి, ఉత్పాదక శక్తి, ప్రభుత్వ నియంత్రణ ఎలా వుందో తెలుస్తున్నది. నిజానికి ఇలాంటి సంధి కాలంలో రూపాయి విలువ పెరగకున్నా కనీసం తగ్గకుండా వుండాలి. ఇదే కాలంలో (11/11న) గుజరాత్‌లోని కాండ్లా పోర్టుట్రస్టు అధికారులిద్దరు 2.9 లక్షల రూపాయల్ని లంచంగా తీసుకుంటు పట్టుబడడం ఓ వింత కాకున్నా, అవన్నీ కొత్త 2000 రూపాయల నోట్లు కావడం గమనార్హం! ఇలాంటి బాపతుగాళ్ళున్న ఈ దేశంలో ముందుగా జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదా...?

- డా. జి.లచ్చయ్య 94401 16162