మెయన్ ఫీచర్

చిరంజీవి బాలమురళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రస్థానం సమాప్తమయింది. ఎనభై ఏళ్లు దాటినా పేరులోని ‘బాల’ శబ్దాన్ని సార్థకం చేస్తూ నిత్యనూతనంగా పలికిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గళం నిశ్శబ్దమయింది.
‘నేను సంగీతం పలికించే పరికరాన్ని’ అనే వారు ఆయన. తల్లిదండ్రులిద్దరూ సంగీత ప్రియులూ, సంగీత విద్వాంసులు కావడం - బాలమురళికి పుట్టుకతో లభించిన వరం. అయితే - తల్లి చిన్నతనంలోనే మరణించడంతో బాలమురళిని పెంచి పెద్దచేసే బాధ్యత తండ్రి పట్ట్భారామయ్య మీద పడింది. బాలమురళికి సంగీతంలో తొలి పాఠాలు నేర్పిన పట్ట్భారామయ్య కొడుకులోని ప్రతిభను గుర్తించి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గరికి తీసుకువెళ్లారు. రామకృష్ణయ్య పంతులు బాలమురళిని శిష్యుడుగా స్వీకరించారు. పంతులుగారు బాలమురళికి గాత్ర సంగీతమూ, వయొలిన్ వాదనమూ నేర్పసాగారు. పసితనంలోనే తిరువయ్యూరులో శ్రీ త్యాగరాజ స్వామి సమాధి వద్ద గానంచేసి ‘పిట్టకొంచెం పాట ఘనం’ అనిపించుకున్నారు బాలమురళి. తొమ్మిదేళ్ల వయసులోనే మూడు గంటల కచేరీ చేసిన బాలమురళి అప్పటికే పల్లవిగానంలో నిపుణులుగా ప్రసిద్ధి గడించారు.
కచేరీలకు అవకాశాలు పెరగడంతో బాలమురళి బడి చదువు మూణ్ణాళ్ళ ముచ్చట అయింది. ‘నేను బడికి వెళ్లింది మూడు నెలలే’ అన్నది బాలమురళి జ్ఞాపకాలలో ఒకటి. అయితే స్వయంకృషితో తెలుగు, సంస్కృతం, ఆంగ్లం నేర్చుకొన్నారు. తమిళంలో కృతులు రాసేంత ప్రావీణ్యం గడించారు. గాత్ర సంగీతంలోనూ, వయొలిన్ వాదనంలోనూ నైపుణ్యం సంపాదించిన బాలమురళి స్వయంకృషితో మృదంగం నేర్చుకున్నారు. బాల్యంలోనే - అరియకుడి రామానుజ అయ్యంగార్, జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం మొదలైన ప్రముఖులకు వయొలిన్ సహకారం అందించారు. గురువుగారి కచేరీలలో మృదంగం వాయించేవారు. ఇరవై రెండేళ్ల ప్రాయం నాటికే అంతకుముందు కర్ణాటక సంగీత వాగ్గేయకారులు ఎవరూ చేయని ఘనకార్యం చేశారు బాలమురళికృష్ణ.
డెబ్భై రెండు మేళకర్త రాగాలలో కృతులు రాసి వాటిని స్వర ప్రస్తారాలతో 1952లో ‘జనక రాగ కృతిమంజరి’ పేరిట ప్రచురించారు. విజయవాడ సంగీత కళాశాలలోనూ, ఆకాశవాణి- విజయవాడ, మద్రాసు కేంద్రాలలోనూ సంగీత సంబంధమయిన ఉద్యోగాలు చేసిన బాలమురళి ఆ తర్వాత చెన్నపురిలో స్థిరపడి సంగీతమే జీవితంగా, జీవితమే సంగీతంగా జీవితయాత్ర సాగించారు.
బాలమురళి ఎంత మధుర గాయకులో అంత వయొలిన్ విద్వాంసులు. వయొలిన్ కాక వయోలా, మృదంగం, కంజీర మొదలైన వాద్యాలూ వాయించేవారు. తమ గానానికి తామే వయొలిన్, మృదంగం వాయించి రికార్డు చేసి రికార్డు సృష్టించారు. కర్ణాటక సంగీతంలోనే గాక లలిత సంగీతంలో తమదే అయిన ముద్ర వేశారు. ఆకాశవాణి జాతీయ కళాకారులుగా గౌరవం పొందిన బాలమురళి - ఆకాశవాణి అత్యుత్తమ శ్రేణి (టాప్‌గ్రేడ్) కళాకారులు. అందులోనూ తొమ్మిది విభాగాల్లో అత్యుత్తమ శ్రేణి సాధించారు ఆయన. సినిమా సంగీతంలో గాయకులుగా, సంగీత దర్శకులుగా జాతీయ పురస్కారాలు అందుకొన్న అరుదైన ఘనత ఆయనది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బంగ్లా, ఒడియా భాషల చిత్రాలలో నేపథ్యగానం చేశారు ఆయన. వెండి తెరమీద నారదపాత్రనూ, రేడియో కోసం త్యాగరాజు పాత్రను పోషించారు. ఫ్రాన్స్ దేశంలో పర్యటిస్తున్న బాలమురళిని - ఒక ఫ్రెంచి సంగీత విద్వాంసుడు ఆ భాషలో పాట పాడగలరా? అని అడిగితే - బాలమురళి అందుకు అంగీకరించి, ఆ పాట విని కొంత సేపట్లో ఆ ఫ్రెంచి భాష పాటపాడారు. ‘ఈ పాట వయొలిన్‌పై వాయించగలరా?’ అని అడిగితే వెంటనే ఆ పనీ చేశారు బాలమురళి. ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను ‘షెవాలియర్’ గౌరవంతో సన్మానించింది. ‘మనకు సంగీతం వస్తే ఏ సంగీతమయినా పాడవచ్చు’ అన్నది ఆయన అభిప్రాయం. దేశ విదేశాలలో బాలమురళి పొందిన గౌరవాలు ఎన్నో. వివిధ సంస్థలూ, విశ్వవిద్యాలయాలూ ఆయన ప్రతిభను గుర్తించాయి. మన భారత ప్రభుత్వమూ ఆయనను సముచితంగా గౌరవించింది. ఎన్నో బిరుదులూ, సత్కారాలూ ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి.
మూడు స్థాయిలలోనూ గాంభీర్యమూ, మాధుర్యమూ చెడకుండా పాడడం బాలమురళీకృష్ణ ప్రత్యేకత. ఆ గళం క్షణాలలో సంగీత సౌధాలు నిర్మించేది. వివిధ విన్యాసాలు చేసి రాగాల ఇంద్రధనుస్సులు వెలిగించేది. శాస్ర్తియ సంగీతంలో సంగీతమే ప్రధానమనీ, సాహిత్యం అప్రధానమని భావించే సంగీత విద్వాంసులు కొందరు. కొందరి ఆలోచనకు భిన్నమయింది బాలమురళీకృష్ణ పద్ధతి. భావయుక్తంగా పాడితే శాస్ర్తియ సంగీతం ఎంత మధురంగా ఉంటుందో ఎంతటి రసస్ఫూర్తిని కలిగిస్తుందో తెలియజేసిన వారిలో అగ్రగణ్యులు ఆయన. ఆకాశవాణి కోసం పాడిన భక్తిగీతాలు, రామదాసు కీర్తనలు, శ్రీ త్యాగరాజ స్వామివారి ఉత్సవ సంప్రదాయ కీర్తనలు - ఆయన సంగీత ప్రతిభకు మధురస్మృతులు.
సంప్రదాయాన్ని విస్మరించకుండానే కొత్త రాగాలను సృష్టించడం బాలమురళి ప్రతిభలోని ఇంకొక పార్శ్వం. థిల్లానాల సంయోజనలో తమదే అయిన ప్రత్యేకతను ఆ రచనలను తమ దస్తూరిలోనే ప్రచురించడం ద్వారా ప్రదర్శించారు ఆయన. సంగీత కార్యక్రమాల మధ్య శ్రోతలు సభ నుంచి లోపలికీ బయటకు వెళ్లడం గమనించి కచేరీల మధ్య విరామం ప్రకటించి కొత్త పద్ధతిని ప్రారంభించారు. చాలా సందర్భాలలో తాము పాడే కృతుల వివరాలూ ప్రకటించేవారు.
బాలమురళికృష్ణది అనితర సాధ్యమైన ప్రతిభ. కొన్నాళ్లు సంగీతంతో వైద్య చికిత్స గురించి పరిశోధనలు కూడా చేసిన ఆయనది - అరుదైన సంగీత వ్యక్తిత్వం. ఆ గానసుధాకరుడు అందించిన అమృత రాగాల వెనె్నలలు ఎన్నో. ప్రపంచ సంగీత చరిత్రలో బాలమురళీకృష్ణ వంటి ప్రతిభావంతులు అరుదుగా కనిపిస్తారు. ఆయన లేని వెలితి తీరేది కాదు. ఆయన మిగిల్చి వెళ్లిన వేలాది మధుర గీతికల ద్వారా ఆయన చిరంజీవిగా వర్ధిల్లుతూ రాబోయే తరాల వాళ్లకూ సంగీతానందం పంచుతూ ఉంటారు. ‘బాలమురళీకృష్ణ మావాడు’ అని తెలుగు వాళ్లు గర్వపడడానికి కారకుడయిన - ఆయన ఎన్నటికీ వెలుగుతూ ఉంటాడు.

- పి.ఎస్. గోపాలకృష్ణ, 9492058970