మెయన్ ఫీచర్

మార్క్సిస్టు హేతువాదం దిశ మారుతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి నారాయణుని వద్దకు సిపిఐ నారాయణుడు వెళ్లటం ఒకింత విమర్శకు, అంతకుమించి ఒక సీరియస్ చర్చకు దారితీయవచ్చుననే ఆశాభావం కొద్దిరోజులపాటు కలిగింది. అయితే, ఎలాంటి చర్చ జరగకపోవటం ఆశ్చర్యకరంగా ఉంది. మరికొంత ఆలోచించిన మీదట ఇందులో ఆశ్చర్యపడాల్సింది బహుశా ఏమీ లేదనేమోననిపిస్తోంది. ఇవన్నీ ఒక విధంగా ఈ దశకు సంబంధించిన సహజ స్థితులు కావచ్చు. మరొక విధంగా చెప్పాలంటే, ఇవి సహజ స్థితులేనని అనినిపించే దశ వచ్చిందేమో. ఈ మాట చాలామందికి అనిపిస్తుండి ఉండాలి. సిపిఐ నేత నారాయణ మొదలుకొని ఆయన పార్టీకి, ఇతర కమ్యూనిస్టులకు, బయటి అభిమానులకు, ఇంకా సాధారణ ఆలోచనాపరులకు కూడా. లేనట్లయితే ఇది అందరికీ ఒక నవ్వి వదిలేయదగ్గ ‘నాన్-ఈవెంట్’గా ఎందుకు మిగిలిపోయినట్లు? ఇదంతా నారాయణను గాని, తక్కినవారినిగాని విమర్శించేందుకు కాదు. విషయాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం తప్ప విమర్శించటం, దాడి చేయటం కాదు. ఒకవేళ అర్థం చేసుకోవటంలో భాగంగా చర్చాపూర్వక విమర్శలు సాగితే అందువల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకు భిన్నంగా దాడివల్ల జరిగేది ఏమీ ఉండదు. విచిత్రమేమంటే దాడి, విమర్శ, చర్చ ఏమీ కన్పించటం లేదు. ఎవరి అవగాహనను పెంచేది ఏమీ జరగటం లేదు.
అంతా గిడసబారినట్లు, మొద్దుబారినట్లు, జడం అయిపోయినట్లు, జీవం అంతా చనిపోయినట్లు, పేలవంగా మారినట్లు, స్తంభించిపోయినట్లు.. ఇటువంటి మాటలు ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు. అన్నింటి భావం సారాంశంలో ఒక్కటేనని తెలిసి కూడా వెతికి వెతికి ఉన్న మాటలన్నీ అనాలని ఎందుకు అనిపిస్తున్నట్లు? ఇది కూడా పరిస్థితి ప్రతిఫలనాలలో ఒకటి అయి ఉండవచ్చునా? అంతా మనకు తెలియనైనా తెలియకుండానే.
బహుశా తిరుమలకు నారాయణుడు వెళ్లటం కూడా ఆ నారాయణునికి తెలయకుండానే జరిగిందేమో! అదొక అచేతన స్థితిలో. మొత్తం దశ అన్నదే అచేతనంగా మారినపుడు లేదా మారుతున్నట్లు కన్పిస్తున్నపుడు, అందులో భాగమైన వ్యక్తి అచేతనత సహజ స్థితి కదా. అవును, మొత్తం దశ అన్నదే. అందుకే కదా పైన చెప్పుకున్నది. నారాయణుని వద్దకు నారాయణుడు వెళ్లటం విమర్శలు చర్చలు, దాడులు ఏవీ లేని ఒక ‘నాన్ ఈవెంట్’గా అందరికీ ఎందుకు మిగిలిపోయినట్లు? దశ అన్నదే ఆ విధంగా మారుతున్నందుకు. ఇటువంటి మార్పు ఎందుకు? ఈ మార్పులో, దశలో తాత్త్వికత ఏమైనా ఉన్నదా? అది నారాయణ లేదా మరొకరనే వ్యక్తులకు పరిమితమైంది గాక విస్తృతంగా మారుతున్నదా? బహుశా ఈ ప్రశ్న అర్థం లేనిదేమో! విస్తృతం అవుతుంటేనే గదా మార్పు అని, దశ అని అనేది. అపుడే గదా ఇది నాన్ ఈవెంట్‌గా, నవ్వి వదిలివేయదగినదిగా మిగిలేది.
నారాయణ చాలా సీనియర్ నాయకుడు. తన సిద్ధాంతం పట్ల త్రికరణశుద్ధిగా నిబద్ధతగలవాడు. అందుకు సంబంధించిన వైఖరులను నిర్భయంగా తీసుకోగల మనిషి. అంతేకాదు, వ్యక్తిగా ఉత్తముడు. కపటత్వం లేనివాడు. ఈ లక్షణాలన్నీ కలగలిసిన కమ్యూనిస్టు నాయకులు మనకు ఈ రోజున తెలుగు భూమిలో అరుదుగా తప్ప కన్పించరు. తిరుపతికో మరొక ఆలయానికో వెళ్లినంత మాత్రాన ఆయన చిత్తశుద్ధిని తక్కువ చేయటం పొరపాటు అవుతుంది. విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేని తొందరపాటు అవుతుంది. చేయవలసింది నారాయణ తిరుపతి వెళ్లడమనే ఒక ‘ఈవెంట్’ను, అది అందరికీ ఒక ‘నాన్-ఈవెంట్’గా మిగలటమనే దశను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవటం. ఈ ప్రయత్నం చేయనివారు తాము కూడా ఒక పొరపాటు చేస్తున్నారన్న మాట. ఇక ఆయనపై దాడి చేసినట్లయితే అది అవివేకంతో కూడిన దారుణమవుతుంది. ఒక స్థితిని, దానితో నిమిత్తం గల పరిణామ గతులను పైపై చూపులకు పరిమితం చేయటమవుతుంది. అందువల్ల ఉపయోగం లేకపోగా మన అవగాహనకు మనమే హాని చేసుకోవటమవుతుంది.
ఇంతకూ నారాయణ తిరుపతి ఎందుకు వెళ్లినట్లు? ఇది మొదటి ప్రశ్న. ఈ ఘటన తన పార్టీ సహా అందరికీ ఒక నాన్ ఈవెంట్‌గా ఎందుకు మిగిలినట్లు? ఇది రెండవ ప్రశ్న. ఈ రెండు ప్రశ్నల్లో మొదటిదానికి వస్తే, స్వయంగా తను చెప్పింది ఏమీ లేనట్లు లెక్క. తనకు ఒకపుడు భగవంతుని పట్ల నమ్మకం ఉండేదన్నారు. తర్వాత అది పోయింది అని గాని, పోలేదనిగాని మనకు స్పష్టత ఏదీ రాని విధంగా ఒకటి రెండు మాటలను నారాయణ అన్నారు. తన కుటుంబ సభ్యులకు దేవుడి పట్ల నమ్మకం ఉందని చెప్పారు. వారితో పాటు తాను ఆలయానికి వెళ్లానన్నారు. ఆయన చెప్పిన మాటలు పత్రికలలో బహుశా పూర్తిగా వచ్చి ఉండవు. ఇది ఇంత ముఖ్యమైన ఘటన అయినందున నారాయణ స్వయంగా తన ఆలోచనలను వివరిస్తూ ఒక రచన చేస్తే బాగుండేది. ఆ పని ఇప్పటికైనా చేయవచ్చు, చేయాలి కూడా.
ఇంగ్లీషులో ‘ద మ్యాన్ అండ్ హిజ్ టైమ్స్’ అనే మాట ఒకటుంది. ఒక వ్యక్తిని తన సమకాలీన పరిస్థితులలో భాగంగా చేసి, చూసి అర్థం చేసుకోవటమన్నమాట. అర్థం చేసుకోవవటం ఆ వ్యక్తిని మాత్రమే కాదు, ఆ పరిస్థితులను, వ్యక్తిపై పరిస్థితుల ప్రభావాన్ని, పరిస్థితులపై వ్యక్తి ప్రభావాన్ని, ఈ రెండింటి పరస్పర ప్రతిక్రియలతో ఆయా ఘటనలు, పరిణామాలు ఏ విధంగా చోటుచేసుకుంటాయనే విషయాలన్నింటినన్నమాట. అటువంటి అవగాహనకు మాత్రమే మనకు సమగ్ర స్వరూపాన్నిస్తుంది. దానినుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు పోగలం. ప్రపంచ ప్రసిద్ధ హంగేరియన్ దర్శకుడు జోల్టాన్ ఫ్యాబ్రీ, ‘బేలింట్ ఫేబియన్ మీట్స్ గాడ్’ అనే సినిమా తీశాడు. అందులోని కథాంశానికి ప్రస్తుత ఉదంతంతో పోలిక అంటూ లేదు గాని, రెండు ప్రపంచ యుద్ధాల ప్రభావాలు, తన వంటి రైతు సమాజం ఛిన్నాభిన్నమైన తీరు, కుటుంబ విధ్వంసం, ఇవన్నీ తన సైద్ధాంతిక విశ్వాసాలపై చూపిన ప్రభావం ఏమిటనే శక్తివంతమైన చిత్రీకరణ అందులో ఉంది.
నారాయణ విప్లవకారుడు కాదు. తన పార్టీ విప్లవ పార్టీ కాదు. గనుక ఆయనను విప్లవకారుడు కాదనటం ఒక స్థితిని సూచించేందుకే తప్ప నిందాపూర్వకంగా కాదు. అయితే పైన అన్నట్లు ఆయన తన సిద్ధాంతం పట్ల త్రికరణశుద్ధితో కూడిన నిబద్ధతగలవాడు. వీటితోపాటు మంచితనం గలవారు సున్నిత మనస్కులవుతారు. తమ చుట్టూ జరుగుతున్న వాటిపట్ల పైపైన మాత్రమే గాక వారిలో అంతర్గత మథనాలు చాలా ఉంటాయి. అవి అసాధారణంగానూ వ్యక్తీకృతమవుతుంటాయి. బేలింట్ ఫేబియన్‌కు వలె. తను యుద్ధంలో ఇటాలియన్ శత్రు సైనికుడిని బయొనెట్‌తో పొడిచి చంపగలడు. నిజ జీవిత మథనాలతో భగవంతుడి గురించి ఆలోచించగలడు. ఒక విధంగా చెప్పాలంటే అతనొక సాధారణ మానవమాత్రుడు. అర్థం చేసుకోదగినవాడు. ప్రేమించవలసినవాడు. కాని నిస్సహాయుడు.
నారాయణ ఈసారి తిరుపతి నారాయణుడనే ఒక పెద్ద దేవుని వద్దకు వెళ్లాడుగాని, ఇంతకుముందు కూడా కొద్దిసార్లు కొందరు చిన్న దేవుళ్ల వద్దకు పోయినట్లు గుర్తు. నిజానికి సిపిఐ నుంచి నక్సలైట్ల వరకు దైవ సంబంధమైన ఏదో ఒక అంశాలవైపు చూసినవారు, చూస్తున్నవారు తక్కువ కాదు. చర్చించాలంటే చర్చించవచ్చుగాని, అవి ఒక స్థాయిలో మార్క్సిస్టు హేతువాద దృష్టికి విరుద్ధాలవుతాయనే, మరొక స్థాయిలో వారి మార్క్సిస్టు నిబద్ధతకు, కార్యాచరణకు ఆటంకం కాకుండా దూరంగానే ఉంటున్నాయి. నారాయణను కూడా ఇదే శ్రేణిలో చేర్చేందుకు అభ్యంతరం ఉండనక్కరలేదు. వాస్తవానికి మార్క్సిస్టులు దైవభావన, మతం గురించి, మనిషి జీవితంలో మతం స్థానం గురించి శాస్ర్తియమైన విశే్లషణలు గొప్పగా చేశారు కాని, వీటికి ఎంత దూరంలో.. ఎంత సమీపంలో ఉండాలి? వాటితో ఎట్లా వ్యవహరించాలి? అన్న ప్రశ్నలపై ఆచరణాత్మక స్పష్టతలను సాధించలేకపోయారు. ఇది ఎంతమాత్రం తేలికైన విషయం కాదు. బహుశా అసాధ్యమేమో కూడా. సెక్యులరిజం గురించిన అస్పష్టతలు కూడా ఇందువల్లనే. ఎందుకంటే ఈ భావనలు అనాదిగా, అనేక విధాలుగా, మనిషి జీవితాన్ని, ఆలోచనా క్రమాన్ని, మేధస్సును, మనస్సును చేతనాచేతన స్థితులను, ఆచరణను, విశ్వాసాలను అలముకొనిపోయాయి. ఇవి వౌలికంగా ఫలానా దైవం, మతం, సంప్రదాయం, ఆరాధనా విధానం, గురువు అనేవన్నీ ఆ తర్వాత సందర్భవశాత్తు వచ్చే స్థితులు మాత్రమే. గమనించదగిన విషయమేమంటే, ఇవేవీ కూడా మనిషి తన వస్తుగతమైన (మెటీరియల్) బాగోగుల కోసం చేయదలచుకున్నది చేయటానికి ఆటంకం కాలేదు. ఈ భావనలతో అటువంటి ఆటంకాలు సృష్టించేందుకు కొందరు స్వప్రయోజనపరులు ప్రయత్నించవచ్చు. ఒక మేరకు సఫలం కావచ్చు. కాని చరిత్రనంతా పరిశీలించినపుడు అది ఒక చిన్న భాగం మాత్రమే. కనుక, ఈ భావనలకు ఒక స్థానం నిశ్చిత రూపంలో ఉంటూనే, మనిషి తన వస్తుగత బాగోగులకోసం ప్రయత్నాలు, పోరాటాలు ఆపలేదు. అయితే ఈ రెండింటి మధ్య సంతులనం పాటించటం ద్వారా ప్రజలను తమ వెంట ఉంచుకోవటం ఏ విధంగానన్న ప్రశ్న మార్క్సిస్టులకు తేలుతున్నట్లు లేదు. కనుక మతం మత్తుమందు అని, అది దోపిడీ వర్గాల ఆయుధమని రెండు పడికట్టు మాటలతో కొట్టివేసి సరిపుచ్చుకున్నారు. అది వారికి సైద్ధాంతిక సంతృప్తిని కలిగించినట్లున్నది గాని, నిత్య జీవితాలు, సామాజిక వాస్తవాలకు అది సమాధానం చెప్పలేకపోయింది. అందుకు కారణం వారి ఉద్దేశాలు, విశే్లషణలు, లక్ష్యాలలోగల లోపం అనలేం. కాని వాస్తవాలను గుర్తించటం, అందుకు తగినట్లు వ్యవహరించటమనే వ్యూహంలోగల లోపాలు అందుకు కారణమయ్యాయి.
నారాయణుని వద్దకు నారాయణుడు గతంలో వెళ్లకపోవటం, ఇపుడు వెళ్లటం, ఈ రెండు వైఖరులకు మూలం ఏమిటో వివరించకపోవటం లేదా వివరించలేకపోవటం, ఈ పరిణామాలపై కొద్దిమంది మాత్రమే స్పందించటం, అత్యధికులు దానినొక నాన్ ఈవెంట్‌గా పరిగణించి మిన్నకుండే దశ ఒకటి ఏర్పడటం, అర్థవంతమైన చర్చ ఎక్కడా కనిపించకపోవటం మొదలైనవన్నీ కూడా ప్రతిఫలిస్తున్నది ఈ స్థితినే. ఈ లోపాలు, వైరుధ్యాలు, భావనాత్మక ఘర్షణలనే ఈ దశ ఇపుడు నారాయణ తిరుపతి సందర్శనతో మొదలైంది కాదు. ఈ ధోరణికి ఆయన ఆద్యుడు కాడు, చివరివాడు కాడు. ఆ స్థితికి ఆయన ఒక లక్షణం మాత్రమే. అందువల్ల జరగవలసింది ఒక అర్థవంతమైన, విస్తృతమైన చర్చ. అందుకు స్వయంగా నారాయణ వంటి ఒక సైద్ధాంతిక నిబద్ధుడు, కపటం లేనివాడు ఒక ఆరంభం చేయగలిగితే అవగాహనలు పెరుగుతాయి. ఉపయోగాలుంటాయి.
*

టంకశాల అశోక్ 98481 91767