మెయన్ ఫీచర్

ప్రజలకు మోదం.. మేధావులకు ఖేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ హయాంలో విశృంఖలంగా పెరిగిన అవినీతికి వ్యతిరేకంగా 2011లో ఓ వైపు అన్నాహజారే నేతృత్వంలో, మరోవైపు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో భారీగా జరిగిన ఉద్యమాలతో ప్రజలు ఎంతగానో మమేకం అయ్యారు. ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వారు అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు, సదస్సులు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఆ రోజుల్లో మీడియా నిర్వాహకులు, టీవీ చానెళ్లను అడ్డం పెట్టుకుని ‘మేధావులు’గా చెలామణి అవుతున్నవారు, అలా చెలామణి కావాలని పరితపించేవారు ప్రజల అభీష్టాలను గుర్తించకుండా- ‘ఈ ఉద్యమాలు సఫలం అవుతాయా? ఫలితాలను ఇస్తాయా?’ అంటూ అనుమాన బీజాలను ప్రజల మనస్సుల్లో నాటే ప్రయత్నం చేశారు. ప్రజల్లో పెల్లుబుకిన ఆవేశాన్ని చానెళ్ల చర్చావేదికల్లో మేధావులు ప్రతిబింబించలేకపోయారు. ఇపుడు 2016లో కూడా మీడియాను నమ్ముకున్న మేధావుల మనస్తత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. జన చైతన్యాన్ని గుర్తించడంలో విఫలమైన ఈ మేధావి వర్గం ‘తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు’ చందాన ప్రవర్తిస్తున్నది. నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన చర్యల్లోని మంచిచెడ్డలను విశే్లషించడం మానివేసి- ‘నల్లధనాన్ని నిర్మూలించడం సాధ్యమేనా?’-అంటూ మళ్లీ సందేహాత్మక ప్రశ్నలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నంలో ఆ మేధావి వర్గం ఉంది. వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్న వేళ కొన్ని ఇబ్బందులు అనివార్యమని తెలిసినా, ‘చిల్లర లేక మటన్ షాపుల్లో ఇబ్బందులు’-అంటూ గంటల తరబడి అవే వార్తలు ప్రసారం చేసే స్థాయికి చానెళ్లు చేరుకున్నాయి.
అవినీతికి వ్యతిరేకంగా 2011, 2016 ఉద్యమాల్లో ప్రధానంగా మూడు పాత్రధారి వ్యవస్థలు కనిపిస్తాయి. అవి 1. ప్రభుత్వం 2.ప్రజలు 3. ప్రసార మాధ్యమాలు. 2011లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రభుత్వంతో ప్రజలు ఘర్షణ పడగా, ప్రసార మాధ్యమాలు అప్పటి పాలకులకు మద్దతుగా నిలిచాయి. ఇపుడు మోదీ సర్కారు సాహసోపేతంగా అవినీతి, నల్లధనం నిర్మూలనకు పోరాటం ప్రకటించగా ప్రజలు అండగా నిలిచారు. అయితే, ప్రజాభీష్టానికి భిన్నంగా ప్రసార మాధ్యమాలు ప్రభుత్వ వ్యతిరేకతనే ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా టీవీ చానెళ్లు మోదీని సమర్ధించాలా? వ్యతిరేకించాలా? అన్నది ఇక్కడ ప్రశ్నకాదు. ఈ ప్రసార మాధ్యమాలు ప్రజల ఆకాంక్షలను, అభిప్రాయాలను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాయి? మేధావులు ఏకపక్ష వ్యాఖ్యానాలే ఎందుకు చేస్తున్నారు? తమ వాదనలే నిజమని చెప్పేలా అసంబద్ధ వాదనలు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
వాషింగ్టన్ కేంద్రంగా వివిధ దేశాల్లో సామాజిక, రాజకీయ అంశాలపై సమగ్ర సర్వేలను నిర్వహించే పి.ఇ.డబ్ల్యూ. రీసెర్చి సెంటర్ ఆసక్తికరమైన అంశాలను తాజాగా ప్రకటించింది. 2011-2013 మధ్య అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన భారత ప్రజలు ఇపుడు మోదీ ప్రభుత్వ చర్యలతో సంతృప్తిచెందారని, వీరి ఆవేశం నేటికి చల్లారిందని చెప్పింది. ప్రజల ఆలోచనాధోరణిని మార్చడంలో మోదీ ప్రయత్నాలు సఫలం అవుతున్నాయని కూడా చెప్పింది. వ్యవస్థల పట్ల సన్నగిల్లుతున్న ప్రజల విశ్వాసాలను తిరిగి ప్రతిష్ఠించేందుకే పెద్దనోట్లను మోదీ రద్దుచేశారని సర్వేలో పేర్కొంది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇన్‌పార్ట్స్’ (గతంలో ‘న్యూస్ ఇన్‌పార్ట్స్’) అనే మొబైల్ యాప్ సంస్థ నిర్వహించిన సర్వేలో 82 శాతం మంది ప్రజలు పెద్దనోట్ల రద్దును సమర్ధించారు. అవినీతిని నిరోధించేందుకు మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని చెబుతున్న వీరిలో 54 శాతం మంది మాత్రం ఎటిఎంల ద్వారా 2 వేల రూపాయలు ఇవ్వడాన్ని అంగీకరించలేదు. ‘పల్స్ ఆఫ్ ద నేషన్’ పేరిట జరిగిన ఈ సర్వేలో 5 లక్షల మంది పాల్గొనగా, ఇందులో 2లక్షల 70వేల మంది మొబైల్ వాడకందారులు నోట్ల రద్దును స్వాగతించారు. నల్లధనాన్ని, పన్నుల ఎగవేతను అరికట్టడానికి మోదీ చర్యలు ఉపయోగపడతాయని యువకులు, పట్టణ ప్రజలు విశ్వసిస్తున్నారని సర్వేలో తేలింది. మన ‘మేధావుల’కు ఈ విషయాలు ఎందుకు అర్థం కావడం లేదన్నది చిక్కు ప్రశే్న. మోదీ తన మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలో 93శాతం మంది ప్రజలు నోట్లరద్దును స్వాగతించారు. నల్లధనం నిర్మూలనకు ఇది మంచి చర్యగా 57 శాతం మంది పేర్కొంటే, ‘నల్లకుబేరులు’ మోదీ చర్యలను అడ్డుకుంటున్నారని 86 శాతం మంది ప్రజలు తెలిపారు.
‘కామ్రేడ్ల’కు కనువిప్పు ఎప్పుడు?
భారతీయ కమ్యూనిస్టులు వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చైనా పత్రికలు చెప్పకనే చెప్పాయి. పెద్దనోట్ల రద్దుపై తీసుకున్న చర్యలను చైనా అధికార పత్రిక సహా ఆ దేశంలోని పలు పత్రికలు సమర్ధించగా, మన దేశంలోని కమ్యూనిస్టులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కాదు. టీవీలో కనపడే మేధావులకు చైనా పత్రికల్లోని వార్తలు ఎందుకు కనపడడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్న. ‘నల్లధనంపై భారత్‌లో జరుగుతున్న పోరాటం నుంచి చైనా అనేక పాఠాలు నేర్చుకుంటుంది’-అని ఆ దేశపు అధికారిక పత్రిక పేర్కొన్నది. మోదీ సంస్కరణలను మెచ్చుకుంటూ చైనాలోని ‘గ్లోబల్ టైమ్స్’ సంపాదకీయం రాసింది. మోదీ విధానాలను పరిశీలించడం వల్ల తాము కొన్ని పాఠాలు నేర్చుకోగలుగుతామని, తమ దేశపు ఆర్థిక వ్యవస్థ, వాటి సంస్కరణలను పునఃసమీక్ష చేసుకోవడానికి మోదీ చర్యలు ఉపయోగపడతాయని చైనా పత్రికలు పేర్కొన్నాయి. ఈ విషయాలు భారతీయ కమ్యూనిస్టులకు, వారి వందిమాగధ గణాలకు అర్థం కావడం లేదా? అర్థం చేసుకోరా? అన్న ప్రశ్నకు సమాధానం కావాలి. చైనా సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తున్న మన కమ్యూనిస్టులు- ‘అవినీతిలో అగ్రగణ్యులైన’ కాం గ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడాన్ని ఒక్క మేధావి కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు?
మోదీకి మద్దతు
పెద్దనోట్ల రద్దుపై నానా యాగీ చేసిన కాంగ్రెస్, శరద్‌పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీలకు మహారాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం నేర్పారు. మహారాష్టల్రో తాజాగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్, పంచాయతీల ఎన్నికల్లో ప్రజలు బిజెపికి బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్, ఎన్‌సిపి, ఇతర విపక్షాలు ఎంతగా విష ప్రచారం చేసినప్పటికీ, సొంతబలం మీద పోటీచేసిన బిజెపికి జనం పట్టం కట్టి ప్రధాని నిర్ణయాన్ని సమర్ధించారు. మహారాష్టల్రో బిజెపి గెలుపుపై మోదీ వ్యాఖ్యానిస్తూ- ‘ఇది పేద ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలకు మద్దతు’ అని అన్నారు. ఇదే రీతిలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఏ మాత్రం విశ్వసించకుండా గుజరాత్ ప్రజలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో మోదీకి తిరుగులేని మద్దతు ప్రకటించారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద గంటలకొద్దీ నిలబడిన ప్రజలే పోలింగ్‌కు వెళ్లి బిజెపికి అనుకూలంగా ఓట్లు వేశారు. బిజెపికి ఇదే రకమైన జనాదరణ వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో లభిస్తుందనడానికి స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం. ఈ ప్రజాస్పందనను మేధావి వర్గం ఎందుకు గుర్తించడం లేదన్నది బేతాళ ప్రశే్న.
పెద్ద మొత్తంలో పన్ను వసూళ్ళు
పెద్దనోట్ల రద్దు తర్వాత కల్పించిన వెసలుబాటు కారణంగా దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో పన్నులు భారీగా వసూలయ్యాయి. ఈ విషయాలేవీ మన మేధావివర్గం చర్చించడానికి ఇష్టపడలేదు. దేశంలోని 478 పట్టణాలు, నగరాల సగటును తీస్తే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 268 శాతం అధికంగా పన్నులు వసూలయ్యాయి. గత ఏడాది ఈ మున్సిపాలిటీలు 3,607 కోట్ల పన్నులు వసూలుచేస్తే ఈ ఏడాది 13,192 కోట్ల పన్నులు వసూలయ్యాయి. పన్నుల వసూళ్ళు పెరిగితే ఆదాయం పెరిగి తద్వారా మరిన్ని ప్రజాప్రయోజనకర చర్యలు చేపట్టవచ్చునన్న అంశాన్ని ప్రజలకు తెలియనీయకుండా మేధావివర్గం జాగ్రత్తపడిందనే చెప్పాలి.
వాస్తవాలను తెలిసిన వారికి చెప్పవచ్చు, ఏమీ తెలియని వారికి వివరించవచ్చు. తెలిసి కూడా తెలియనట్లు నటించేవారికి చె ప్పడం మహా దుర్లభం. మన మేధావివర్గం కూడా ఇదే కోవలోకి వస్తుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యాలు, రాబోయే ఫలితాలు, అవినీతి రహిత సమాజ నిర్మాణం, తీవ్రవాదం లేని శాంతియుత సమాజం, పేద ప్రజల ఉన్నతికి దోహదపడేలా వ్యవస్థాగత ప్రక్షాళన తదితర లక్ష్యాలన్నీ వీరికి తె లుసు. అయితే, మంచి కోసం జరుగుతున్న ఒక ప్రయత్నాన్ని ఆహ్వానించలేకపోతున్నారు. మనఃస్ఫూర్తిగా శ్లాఘించలేకపోతున్నారు. కీలక నిర్ణయాల అమలులో కొన్ని ఇబ్బందులుంటాయి. వ్యవస్థలో మార్పులు జరుగుతున్నప్పుడు, నిర్ణయాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు తగిన సలహాలు ఇస్తూ సహకరించడానికి బదులు- ఆ ప్రయత్నాలకు ఓ వర్గం మీడియా, మేధావులు మోకాలు అడ్డుపెట్టడం ఎంతవరకు సబబు? ఎటిఎంల దగ్గర క్యూలో నిలబడ్డ వారిని చూపిస్తూ విధాన నిర్ణయమే తప్పు అంటున్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్, మాయావతి, ములాయం సింగ్‌లను సమర్ధిస్తున్న మేధావులు- మోదీ నిర్ణయాన్ని సమర్ధించిన చంద్రబాబు, నవీన్ పట్నాయక్, నితీశ్‌కుమార్, కెసిఆర్‌ల అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? మోదీని తిట్టడం మినహా వ్యవస్థను మార్చేందుకు మేధావుల చర్యలేమిటి? ఒక్క విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ప్రజల మనోభావాలను పసిగట్టడంలో, వాటిని అర్థం చేసుకుని ప్రతిబింబింపచేయడంలో మీడియాతోపాటు మేధావులుగా చెలామణి అవుతున్నవారు ఘోరంగా విఫలమవుతున్నారు. ఇటువంటి పరిస్థితులు ప్రజస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తాయి. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయ ప్రయోజనాలను పక్కకుపెట్టి మేధావి వర్గం చిత్తశుద్ధితో పనిచేయకపోతే నష్టం అపారం. తర్కబద్ధమైన విమర్శలు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత అవసరం. ఈ అవసరాన్ని తీర్చాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉన్నది. *

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113