మెయన్ ఫీచర్

‘నల్లదొరల’ పల్లకీ మోస్తున్న విపక్ష బోయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గనుల సామ్రాజ్యం’ అధిపతి గాలి జనార్దనరెడ్డి తన కుమార్తె పెళ్లికోసం ఖర్చుచేసిన డబ్బు అక్షరాలా ఆరువందల యాభై కోట్లు. కర్నాటక సిఎం సిద్ధరామయ్య చేతి గడియారం ఖరీదు ఎనభై లక్షలు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నాలుగు కోట్ల విలువైన కారులో వచ్చి నాలుగువేల రూపాయల కోసం పార్లమెంటు స్ట్రీట్‌లోని బ్యాంక్‌వద్ద ‘క్యూ’లో నిలబడ్డాడు... ఈ సన్నివేశాలన్నీ దేనిని తెలియజేస్తున్నాయి? పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ- ‘రండి మనమంతా కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుదాం’ అంటూ వామపక్షాలతో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయడం ఏమిటి? దేశ సరిహద్దుల్లో మన సైనికులను పాకిస్తాన్ సేనలు ముక్కముక్కలుగా నరికి శవాలను ‘ఎల్‌ఓసి’ వద్ద పడేస్తుంటే- ఆ వీర సైనికుల కుటుంబాల వద్దకు వెళ్లి ఈ విపక్ష నేతలు సానుభూతి చెప్పరెందుకు? ఇపుడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విపక్ష నేతలంతా ఎవరికి బినామీలుగా వ్యవహరిస్తున్నారు?
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకుంటే- సంఘీభావం ప్రకటించడానికి బదులు విపక్షాలు రాజకీయ కోణంలో రభస చేస్తున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడు ఆనందశర్మ చర్చను ప్రారంభిస్తూ- ‘మాతో చెప్పకుండా రాత్రికిరాత్రి నిర్ణయం తీసుకున్నందుకు మోదీ క్షమాపణ చెప్పాలి’ అన్నారు. నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో దాచుకున్న వారి పేర్లు బయటపెట్టండని కూడా ఆయన సవాలు విసిరారు. ఆయన అంత నిర్భయంగా డిమాండ్ చేశారంటే- స్విస్ బ్యాంకులో ఉన్నవి బీనామీ పేర్లేనని తెలుస్తున్నది. మరి పనామా, మీలన్ బ్యాంకుల మాటేమిటి? నల్లధనాన్ని విదేశీయ బ్యాంకులకు తరలించే దేశాల్లో ఇండియా మూడవ స్థానంలో ఉంది. నల్లధనం ఎంతగా బ్యాంకుల్లో జమ అయితే ఆ మేరకు నగదు చెలామణిలోకి వస్తుంది. ఆ డబ్బుతో దేశంలోని పేదలకు విద్య, వైద్యం, ఉపాధి, రోడ్లు, ఇళ్లు వంటి వౌలిక సదుపాయాలు సమకూరుతాయి. 1969లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తీసుకున్న ఇలాంటి చర్యల వల్లనే అప్పుడు ఆ దేశ ఆర్థికవ్యవస్థ వేగాన్ని పుంజుకున్నది. ‘మేము ఖర్చుచేసే ప్రతి రూపాయిలోను 20 పైసలు మాత్రమే లబ్ధిదారునికి చేరుతున్నది’ అని లోగడ రాజీవ్‌గాంధీయే స్వయంగా ప్రకటించటం రాహుల్ గాంధీ గుర్తుచేసుకోవాలి. లెక్కలోకి రాకుండా మన దేశంలో ఎన్నికల ఖర్చుకోసం ఉపయోగించే డబ్బు 30వేల కోట్లు అని ఒక అంచనా. ఇలాంటి గణాంకాలేవీ ప్రజలకు చెప్పకుండా- ‘క్యూలో ఒకడు సొమ్మసిల్లాడు.. మరొకరికి గుండెపోటు వచ్చింది’వంటి వార్తలు కొన్ని టీవీ చానళ్లు అదేపనిగా ప్రసారం చేస్తున్నాయి.
పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్, బిఎస్పీ, సమాజ్‌వాదీ, ఆర్‌జెడి, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించగా, బిహార్ సిఎం నితీశ్‌కుమార్ వంటి నేతలు సమర్థించారు. 1947లో రూపాయికి ఒక డాలరు వచ్చేది. 1954లో 4 రూపాయలకు ఒక డాలరు విలువగా మారింది. నేడు డాలరు విలువ 60 రూపాయలు. దీనికి ఎవరు బాధ్యులు? మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా 36వేల కోట్ల నల్లధనం విదేశాలకు తరలిపోయింది. బ్యాంకు రుణాలు, పన్నులు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్‌మాల్యాల వంటివారికి రుణమాఫీ జరిగింది. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు తమ నల్లధనాన్ని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. విదేశాల్లో పోగుపడిన అరవై ఐదు లక్షల కోట్ల నల్లధనం ఇండియాకు చేరేదెప్పుడు? నల్లడబ్బు అంటే- లెక్కలు చూపని సంపాదన, పన్ను ఎగవేసిన డబ్బు. ఇక నకిలీ డబ్బు అంటే దొంగనోట్లు. ఈ రెండింటినీ మన పాలక పక్షాల మద్దతుతో లోగడ చైనా ప్రేరేపిత, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రవేశపెట్టారు.
మన దేశంలో నల్లధనం పోగుపడడానికి ‘ప్రపంచీకరణ’ అవకాశం కల్పించింది. 2012లో వాల్‌మార్ట్ సంస్థ రిటైల్ వ్యాపార రంగంలో భారత్‌లోకి ప్రవేశించింది. అందుకు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అనుమతినిస్తూ ‘రూపాయలు చెట్లకు కాయవు’ అని ఒక కవితా మయమైన వ్యాఖ్యానం చేశారు. అమెరికా ఉభయ సభల్లో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు ఇండియాలోని రాజకీయ నాయకులు దళారీలకు ముడుపులు ఇచ్చిన విషయం నిర్ధారింపబడింది. ప్రపంచీకరణ పేరుతో ముడుపుల నల్లధనం ఎలా దేశంలో ప్రవేశించిందో తెలిపేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. నల్లధనం అంటే నగదు రూపంలో ఉన్నది మాత్రమే కాదు. బంగారం, స్థిర చరాస్తులు, ఫాం హౌస్‌లు వంటివన్నీ ఈ ఖాతాలోకి వస్తాయి.
పెద్దనోట్ల రద్దు వల్ల ప్రస్తుతం దండకారణ్యం, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో మావోయిస్టుల వద్ద గుట్టలుగా పేర్కొన్న వేల కోట్ల రూపాయల నల్లధనం చిత్తుకాగితాలుగా మారుతుంది. అందువల్ల వారు ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించాల్సి ఉంటుంది. అంటే వారు ఇకపై వంద, యాభై రూపాయల నోట్లపై దృష్టిపెడతారు. పాకిస్తాన్ నుండి ఇక నకిలీ రెండువేల రూపాయల నోట్లు ఇండియాలోకి ప్రవహిస్తాయి. పెద్దనోట్ల రద్దు ఫలితంగా ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంటున్నారు. ఐతే- ఉల్లిధర కిలో పది రూపాయల నుండి ముప్పది రూపాయలకు ఎందుకు పెరిగిందో ఆర్థిక నిపుణులు చెప్పాలి.
ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా గాలి జనార్దన రెడ్డి ఖర్చు చేసినట్లు 650 కోట్లు అవసరం కాకపోవచ్చు కానీ- కనీసం ఐదారు లక్షలైనా కావాలి. ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికే లక్షలు తీసుకుంటున్నారు. భోజనాలు, కట్నాలు, లాంఛనాలు, ఇతర ఖర్చులు సరేసరి. అలాంటప్పుడు పెళ్లికి ఆర్‌బిఐ ఇస్తామంటున్న 2.5 లక్షలు ఎటూ చాలవు. దీనికి పరిష్కారం ఏమంటే- ప్రజలలో వౌలికంగా ధనదాహం తగ్గాలి. కరక్కాయ పొడితో నయం చేసుకోదగ్గ జ్వరానికి కార్పొరేట్ హాస్పటల్‌కు వెళ్లి లక్షల్లో బిల్లు చెల్లించటం ఎందుకు? ఇక- ఎవరైనా అన్నం తినకపోతే చనిపోతారు. కానీ సినిమా చూడకపోతే ప్రాణం పోదు. ప్రజల బలహీనతను రూపాయల కిందికి మార్చుకొని సినీనటులు దోచుకుంటుంటే- వారి నుంచి నల్లధనాన్ని బయటకు తీసుకురావలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. చైనా నుండి వచ్చే నల్లధనం మీద కమ్యూనిస్టు పార్టీలు తమ అస్తిత్వం కాపాడుకుంటున్నాయి. పాకిస్తాన్, ఇతర ముస్లిం దేశాల డబ్బుతో సిమీ వంటి ఉగ్రవాద సంస్థల, మతోన్మాద పార్టీల ఉనికి ఆధారపడి ఉంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల నుండి వచ్చే వేల కోట్ల డాలర్లతో క్రైస్తవ మత ప్రచారకుల మనుగడ సాగుతున్నది.
ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళనకు పెద్దనోట్ల రద్దు ఒక చిన్న చర్య మాత్రమే. దీనికి తదనంతర చర్యలు చాలా ఉన్నాయి. అప్పుడే కేజ్రీవాల్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీల నోళ్లు మూతపడుతాయి. మొదటి చర్యగా పనామా, మారిషస్, సింగపూర్ బ్యాంకుల్లో ఎకౌంట్లు బయటపెట్టాలి. స్విట్జర్లాండ్‌కు వెళ్లిన టూరిస్టులలో కేవలం సగం మంది కూడా నిజమైన యాత్రికులు కాదు. అధిక సంఖ్యాకులు నల్లధనం దాచుకునేందుకు వెళుతున్నవారే. సినిమా షూటింగుల పేరుతో విదేశాలకు వెళ్లిన నటుల, అధ్యయనం పేరుతో వెళ్లిన రాజకీయ నాయకుల ఆర్థిక లావాదేవీల వివరాలేమిటి? మన దేశంలో కార్పొరేట్ ఆస్పత్రులు ప్రతి రోజూ బ్యాంకుల్లో జమచేసే మొత్తం 5 కోట్ల నుండి 15 కోట్ల వరకు ఉంటుంది. ఒక సర్జరీకి 5 నుండి 30 లక్షల వరకు చార్జిచేస్తున్నారు. కొంతమంది సినీ నిర్మాతలతోను, పారిశ్రామికవేత్తలతోను సంబంధాలు పెట్టుకొని వారికి ఈ డబ్బు సరఫరా చేస్తున్నారట! అందుకు 30 నుండి 40 శాతం వరకు కమీషన్ ఇవ్వవలసి వస్తుంది. అందుకని ప్రస్తుతం ఇన్‌కంటాక్స్ అధికారులు కార్పొరేట్ ఆస్పత్రులు, సినీ నిర్మాతల మీద దృష్టి సారించారు. ఈ పని మన మహా నగరాల్లో ఎక్కువగా చేయవలసి ఉంది. అలా చేస్తే బినామీల బాగోతం బహిర్గతం అవుతుంది. షిరిడీలో, ప్రముఖ బాబాల ఆశ్రమాల్లో ఎకౌంట్‌లోకి రాని డబ్బును వెలుగులోకి తెచ్చే ధైర్యం ఎవరికి ఉంది? లక్షలు, కోట్లలో పాతనోట్లు ఇచ్చి కొత్తనోట్లను సునాయాసంగా పొందుతున్న వారికి ఎవరు సాయం చేస్తున్నారు? లలిత్ మోడీ, విజయ్ మాల్యాలు ఇండియాకు తిరిగి వస్తారా? కొందరు ఘరానా పెద్దలు వారి ఫాంహౌస్‌ల్లో దాచిన డంప్‌లు బయటపడతాయా? ‘డబ్బు పాపిష్టిది అని మెట్ట వేదాంతం చెప్పేవారంతా డబ్బులేనివారే’ అన్నాడొక విశే్లషకుడు. నోట్లరద్దును వ్యతిరేకించే వారంతా బ్లాక్‌మనీ ఉన్నవారేనని గ్రహించాలేమో!
పెద్దనోట్ల రద్దు ‘సర్వరోగ నివారిణి’ కాదు. ఆ మాటకొస్తే బ్యాంకుల్లో జమ చేయబడే ధనం కన్నా ఇంకా చాలా డబ్బు బయటే ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను ఐదువేల కుటుంబాలు నియంత్రిస్తున్నాయని వామపక్షాలు చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? భారత అర్థనీతిని రష్యా, అమెరికా, చైనాలు నియంత్రిస్తున్నాయి. 1947కు ముందు ఇక్కడి నుండి పత్తి, ఇనుము ముడి పదార్థాలు బ్రిటన్‌కు వెళ్లేవి. గ్లాస్గో, మాంచెస్టర్‌ల నుండి బట్టలు దిగుమతి చేసేవారు. తద్వారా ఇండియాలోని చేనేత కార్మికులు సజీవ సమాధి అయినారు. స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ విదేశీ వ్యామోహం ఫలితంగా మన ఆర్థిక వ్యవస్థపై రష్యా, చైనాల ప్రత్యక్ష ప్రమేయం పెరిగింది. ఇక రక్షణ అవసరాలకు అగ్రరాజ్యాల మీద ఆధారపడవలసి వచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థ విదేశీయుల చేతిలోకి వెళ్లిపోయింది. ఒక దశాబ్దకాలం నుండి స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు విదేశీ వస్తువులను ప్రోత్సహించరాదని ఆందోళన మొదలుపెట్టాయి. మన నూనెలు, మన సబ్బులు, మన టపాకాయలు మనమే ఉత్పత్తి చేసుకొని ఉపయోగించుకోవాలని వీరు ఉద్యమిస్తున్నారు.
చైనా నుంచి మనకు దిగుమతులు పెరగడంతో శివకాశి నుండి జలంధర్, అమృతసర్ వరకు మన పరిశ్రమలు మూతపడ్డాయి. మనదేశం నుండి ముడి పదార్థాలను చైనా దిగుమతి చేసుకుని ఉత్పాదక వస్తువులను మనకు పంపి ఈ దేశ కార్మికుల పొట్టలుకొడుతున్నది. పరిశోధనలకు మన బడ్జెట్‌లో కేటాయింపులు తక్కువే. స్వంత పరిశ్రమల కోసం ప్రయత్నించకుండా విదేశీ సాఫ్ట్‌వేర్ రంగానికి అమ్ముడుపోవటమో లేదా టాటా బిర్లాల కంపెనీల్లో ఉద్యోగాల కోసం వెంపర్లాడటమో కనిపిస్తున్నది. భారత ఆర్థికవ్యవస్థ ఇలా అనేకవిధాలుగా కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఆర్థిక రంగాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు వంటి సంస్కరణలను అమలు చేస్తున్నారు. వీటి ఫలితాలను త్వరలోనే మనం చూడబోతున్నాం.

- ముదిగొండ శివప్రసాద్