మెయన్ ఫీచర్

తమిళ రాజకీయాల పయనం ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆమె ఎవరు?’.. ఇది ఒక తెలుగు సినిమా పేరు. ఇందులో కథానాయిక జయలలిత. ఆమె స్వరూప స్వభావాలను అనే్వషించటమే మొత్తం కథ. నిజమే.. గత నాలుగు దశాబ్దాల తమిళ రాజకీయ చరిత్ర అంటే జయలలిత స్వరూప స్వభావాల అనే్వషణా చరిత్రయే. ఈ ధృవతార రాలిపోయింది. తమిళనాడులో ఒక రాజకీయ శకం ముగిసింది. ‘పురుచ్చి తలైవి’ దివిజ శైలూషికా హృదయ వేగాన్ని పెంచి తాను గుండె ఆగి మహాప్రస్థానాన్ని పొందింది. ఎటు చూసినా జనం జనం.. ప్రభంజనం.. అన్నాదురై, ఎంజిఆర్‌ల తర్వాత ఇది మూడవ ద్రవిడ సునామీ! ఆమె జీవితం ద్వంద్వాల సమ్మేళనం. ‘చిత్ర’ విచిత్ర చక్రభ్రమణం. రాజకీయ శత్రువులతోనే కాదు.. మృత్యువుతో కూడా ఆమె సుదీర్ఘ పోరాటం జరిపింది. అటువైపు కల్లోలం- ఇటువైపు కల్హారం.. అటు కఠోర ధ్వనులు- ఇటు పరీమళ వనులు- ఇదే ఆద్యంతం జయలలిత జీవితం!
1948 ఫిబ్రవరి 24న జయలలిత మైసూరులోని సంప్రదాయ వైష్ణవ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి జయరామన్ ఆమె చిన్నతనంలో కన్నుమూయగా తల్లి సంధ్య ఆమెను ఉన్నత ప్రమాణాలుగల విద్యాసంస్థలలో చదువు చెప్పించారు. సంధ్య కూడా 1950వ దశకంలో ప్రముఖ చలనచిత్ర నటియే. విద్యాభ్యాసం ముగించుకొని జయలలిత తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలతోపాటు ఓ హిందీ సినిమాలోనూ నటించారు. మొత్తం 300 చిత్రాలల్లో ఆమె కథానాయికగా రాణించారు. ఎఎన్‌ఆర్, ఎన్‌టిఆర్, ఎంజిఆర్, శోభన్‌బాబు లాంటి ప్రముఖ తెలుగు, తమిళ, కన్నడ అగ్రశ్రేణి నటులందరితోను కథానాయికగా నటించి మెప్పించారు. ఎంజిఆర్‌తో నటించే సమయంలోనే ఆమెకు అన్నాడిఎంకె పార్టీ ప్రచార కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. ఇలా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి ఆమె అడుగుపెట్టారు. ద్రవిడ మునే్నత్ర కజగం లోనే కాదు, సొంత పార్టీలోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఎంజిఆర్ భార్య జానకీ రామచంద్రన్ ఒక దశలో జయలలితకు రాజకీయ ప్రత్యర్థి అయింది. జానకమ్మ ముచ్చటగా మూడువారాలు ముఖ్యమంత్రిగా పదవిలో ఉంది. రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో జయలలిత తిరిగి రాజకీయ పురుత్థానం పొందింది. అండిపట్టి నియోజకవర్గం నుండి అఖండ విజయం సాధించి అగ్రపీఠం అధిరోహించింది.
తమిళనాడు రాజకీయాలు ఆర్య-ద్రావిడ సిద్ధాంతాల చుట్టూ ఒక శతాబ్ది కాలం తిరిగాయి. తమిళనాట రామస్వామి నాయకర్ ద్రవిడోద్యమ నిర్మాతగా పేరొందాడు. కరుణానిధి, అన్నాదురై వంటి వారు ఈ సామాజిక ఉద్యమాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. అప్పటివరకూ చక్రవర్తుల రాజగోపాలాచారి వంటి మేధావుల నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ నడిచింది. స్వాతంత్య్రం వచ్చాక పండిట్ నెహ్రూ మొదటిసారిగా తమిళనాడులో ద్రవిడ కజగం నుండి సవాలును ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు నెహ్రూ కామరాజ నాడార్‌ను రంగంలోకి దింపారు. ఆయన జన బాహుళ్యానికి ప్రియతమ నేతగా ఉన్నమాట నిజమే కానీ ఎంజిఆర్ సినీ గ్లామర్ క్రమంగా తమిళ ఓటర్లను మంత్రముగ్ధులను చేసింది. ఈ పరిణామ దశలోనే ‘అమ్మూ’ అని పిలువబడే అమ్మాయి రాజకీయ ఉపన్యాసాలు చేస్తూ ఎంజిఆర్‌కు సన్నిహితురాలైంది. అప్పటి నుండి తమిళనాడులో సినీ రంగమే రాజకీయ రంగంగా మారిపోయింది. ‘పడిరూపాయి’ అంటూ ఎంజిఆర్ ప్రవేశపెట్టిన ప్రజాదరణ పథకాలను ఎపిలో ఎన్‌టిఆర్ ‘కిలో బియ్యం రెండు రూపాయలు’ అంటూ అమలుచేశారు. ఎంజిఆర్, కరుణానిధి అనేక కారణాల వల్ల విడివడిపోయారు. అప్పుడు ఎంజిఆర్ జనాకర్షక అభినేత్రి జయలలిత ప్రచారంపై కొంత ఆధారపడవలసి వచ్చింది. అన్నాదురై 1955లో ‘నిధి కావాలి.. మెధి కావాలి’ అన్నారు. నిధి అంటే డబ్బు మెధి అంటే మేధోసంపత్తి. ఈ పదాలకు తమిళనాడులో వేరే అర్థాలున్నాయి. నిధి అంటే కరుణానిధి- మెధి అంటే మెధియలగన్ అనే ద్రవిడోద్యమ నాయకుడు. ఒక దశలో వీరిరువురూ కలహించుకున్నారు. ఆ తర్వాత ఎంజిఆర్- కరుణానిధికి దూరమై జయలలితకు చేరువైనారు. ఐతే జానకి, జయలలితల మధ్య మళ్లీ ఒక దశలో స్పర్ధ పెరిగింది. అప్పుడు కొద్దికాలం జయలలిత ఎంజిఆర్‌కు దూరమైనారు. ప్రత్యర్థులు తనను పరిహసించినా ఆమె వౌనంగానే ఉంటూ తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకునేవారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో విపక్షీయులు ఆమె ‘మార్ఫింగ్‌‘ ఫొటోలను ముద్రించి అల్లరిచేశారు. ఓసారి శాసనసభలో మహాభారత కాలం నాటి దుశ్శాసన పర్వం పునరావృత్తమయింది. అందుకు ఆమె అబలగా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. తాను ఎన్నికలలో గెలిచాక కరుణానిధిని అరెస్టుచేసి జైలులో చిప్పకూడు తినిపించి బదులు తీర్చుకున్నది. తాను అనుకున్నది సాధించడంలో ఆమె ఎవరినీ లెక్కచేయలేదు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కోర్టుకు ఈడ్చటంలో అన్నాడిఎంకె పాత్ర ఉందన్న ఆరోపణలే ఇందుకు నిదర్శనం. కొన్ని వివాదాలు చుట్టుముట్టినా జయ ఏమాత్రం కుంగిపోలేదు. జయలలిత తన నెచ్చెలి శశికళ కొడుకు సుధాకర్‌ను దత్తత తీసుకొని అంగరంగ వైభోగంగా జరిపిన పెళ్లి వేడుకలు వివాదాస్పదంగా మారాయి. ఆ తర్వాత జయలలితపై అక్రమాస్తుల కేసు నమోదు చేయబడి కర్ణాటకలో జైలులో ఉండవలసి వచ్చింది. జయ మీద ఈగవాలితే సహించలేని తమిళ పౌరులు ఆమెను జైలులో పెట్టడంతో కర్ణాటక రాష్ట్రంపై ప్రత్యక్ష యుద్ధమే ప్రకటించారు. కొన్నాళ్లకు జయమ్మ జైలు నుండి బయటకు రావటం, కేసులు నీరుకారిపోవడం తదనంతర చరిత్ర. ఆమె రూపం, వాక్కు ఎంత సౌకుమార్యమో ఆమె హృదయం ఒక్కొక్కప్పుడు అంత కఠినంగా ఉండేది. శత్రువుపై దెబ్బకుదెబ్బ తీయటం ఆమె నైజంగా మారింది. కరుణానిధి, స్టాలిన్, అళగిరి, జికె మూపనార్ వంటి విపక్ష నేతలు ఆమె ఎత్తులముందు చిత్తయ్యారు.
జయలలిత జనాదరణకు కేవలం ఆమె సినీ జీవితమే కారణం కాదు. ఆమెకు సామాన్య తమిళ గృహస్థు నాడి తెలుసు. అమ్మ నీళ్లు, అమ్మ సిమెంటు, అమ్మ క్యాంటీన్, అమ్మ కూరగాయలు, మేకలు, గొర్రెలు, పింఛన్లు, గృహవసతి, స్కాలర్‌షిప్పులు.. ఇలా విద్యార్థులు, మహిళలు, రైతులు, నిరుద్యోగులకు అనేకానేక సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టారు. అన్ని దేవాలయాల్లోనూ ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేటట్లు చేసి, కొన్ని ప్రముఖ ఆలయాలకు ఏనుగులను సైతం దానం చేశారు. ఆమె నిర్ణయాలు పాదరసంలా అనూహ్యంగా ఉండేవి. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని ఆదరించేదో, ఎవరిపై వేటు వేసేదో తెలిసేది కాదు. 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జయలలితతో సత్సంబంధాలు ప్రారంభించారు. ఏకీకృత పన్ను విధానాన్ని జయలలిత వ్యతిరేకించినా మోదీ మాత్రం సంయమనం పాటించి దక్షిణాదిలో ఆమె పలుకుబడిని గౌరవించారు.
జయలలిత మరణానంతరం తమిళనాట రాజకీయాలు ఇకపై ఎలా ఉంటాయన్నది ప్రస్తుతం చర్చగా మారింది. ఆమెకు పరమ భక్తుడైన పన్వీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలాంటి ఛరిష్మా లేనివాడు పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నడపగలడన్న అనుమానాలు ఇపుడు చెలరేగుతున్నాయి. ఇన్నాళ్లూ జయలలిత చుట్టూ పార్టీ నిర్మాణం జరిగింది. వ్యక్తుల మీద ఆధారపడిన పార్టీలు ఆ వ్యక్తులతోనే నశిస్తాయి లేదా బలహీనపడుతాయి. కమ్యూనిస్టు పార్టీలు, బిజెపి వంటి పార్టీలు వ్యక్తుల కన్నా సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఇచ్చి పార్టీ నిర్మాణం చేసుకున్నాయి. ఈ పరిస్థితి తమిళనాడులో లేనందున భవిష్యత్తులో అక్కడ ఒక రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. డిఎంకె వేసే ఎత్తుగడలను ఎదుర్కొని పన్నీర్ సెల్వం తన ఎమ్మెల్యేలను కాపాడుకోగలరా? అన్నాడిఎంకె ఎంపీలు ఇపుడు ఏం చేస్తారు? వీరు బిజెపిలో విలీనమయ్యే ప్రశ్న ఉత్పన్నం కాదు. అలాగని స్టాలిన్‌కు సన్నిహితంగా ఉండలేరు. జయలలితను పోలిన జనప్రియ నేత అన్నాడిఎంకెలో ఎవరు ఉద్భవిస్తారు? ఇది వేచి చూడవలసిన అంశం. కాంగ్రెసు పార్టీ ఒకప్పుడు తమిళనాడులో అప్రతిహతంగా వెలిగింది. ఇవ్వాళ ఆ పార్టీకి అక్కడ ఆఫీసు తాళాలు తీసే కార్యకర్తలు కూడా లేరు. ఎంత శ్రమించినా బిజెపిని ‘ఉత్తరాది ఆర్యుల పార్టీ’గా తమిళనాడులో భావిస్తారు.
ఇప్పుడు తమిళనాడు భవిష్యత్తు ఏమిటి? జాతీయ రాజకీయాల్లో తమిళనాడును విస్మరించడానికి వీలులేదు. ఇక్కడి పరిస్థితులపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తమిళనాడు మీదుగా జాఫ్నా నుండి ఎర్ర చందనం చైనాకు చేరుతున్నది. ఉగ్రవాద జీహాదీ స్థావరాలు తమిళనాడులోనూ ఉన్నాయి. పక్కనే ఉన్న కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం చైనాప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలను ఉపేక్షిస్తున్నది. అంటే దేశం అఖండతకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలు సవాలుగా మారబోతున్నాయి. ఈ ముప్పును తప్పించేందుకు కేంద్రం తీవ్ర నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. శ్రీలంకలోని త మిళ-సింహళ జాతుల మధ్య ‘ఎథ్నిక్ వార్’ తిరిగి చెలరేగే అవకాశం ఉంది. తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడితే దాన్ని భర్తీ చేసేవారు ఎవరు? రాజకీయ, సినీ రంగాల నుంచి కొత్తగా ఎవరైనా వచ్చి జయలలితలా ప్రభంజనాన్ని సృష్టించగలరా? ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడా? వైగో వంటి నేతలు బలం పెంచుకుంటారా? బిజెపిలో చేరిన జయంతి నటరాజన్ వంటివారు ‘కమల వికాసాని’కి ఎంతవరకు తోడ్పడగలరు?
1964లో అన్నాదురై మరణించినపుడు తమిళ ప్రజలు ఉన్మత్తుల మాదిరి ప్రవర్తించారు. ఇప్పుడు అదే ‘మాస్ హిస్టీరియా’ తమిళనాడు మొత్తం చూశాం. ఇందిరాగాంధీ తర్వాత అంతగా ప్రజలను ప్రభావితం చేసిన మహిళా నాయకురాలుగా జయలలిత ఆధునిక భారత చరిత్రలో మిగిలిపోతుంది. చరిత్రను రాసేవారు కొందరైతే, చరిత్రను సృష్టించేవారు మరికొందరు. బాలీవుడ్‌లో మీనాకుమారి, తెలుగులో సావిత్రి, తమిళంలో జయలలిత చరిత్రను సృష్టించారు. వీళ్లు లెజండరీస్.. ‘రీల్ హీరోయినే్ల’ కాదు. రియల్ హీరోయన్స్ కూడా! రాబోయే తరాలవారికి వీరి జీవితాలు పాఠాలు, గుణపాఠాలు నేర్పే పుస్తకాలు. 1948 ఫిబ్రవరిలో మొదలైన జయలలిత శకం 2016 డిసెంబరుతో ముగిసింది. 68 ఏళ్ల జీవన యానంలో హిమాలయ శిఖరాలు, లోయలు రెండూ ఆమె చూసింది. తమిళ ప్రజలంతా శోకసంద్రంలో మునిగి ఉండగా పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఇక మీదట స్వపక్ష, విపక్షాల నుండి వచ్చే ఒత్తిడులకు పన్నీరు సెల్వం కన్నీరు పెట్టుకుంటే రాజకీయ అస్థిరత తప్పదు. అలాంటిదేమీ ఉండదని వైగో లాంటి నేతలు ధైర్యం చెప్పినా, బుకాయించినా- తమిళనాట పాలన సజావుగానే జరగాలన్నది అందరి ఆకాంక్ష.

- ముదిగొండ శివప్రసాద్