మెయన్ ఫీచర్

విమానంలో విందు.. విందులో బొద్దింక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో మాట్లాడితే చెడ్డపేరు వచ్చేస్తుందన్న భయం దాదాపు అందరి ముఖాల మీద తాండవిస్తున్న అనుభూతి కలిగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఎగరబోతున్న ఆ ప్రభుత్వేతర రంగపు గగన శకటంలో ఒక రోజున దృశ్యమానమైన విచిత్రం ఇది. ఒక రోజున ఏమిటి? ప్రతిరోజూ ఇదే దృశ్యం మన దేశపు అన్ని విమానాలలోను, విమానాశ్రయాలలోను పునరావృత్తం అవుతుండడం ‘వాణిజ్య ప్రపంచీకరణ ప్రభావం’! ‘ఎయిర్ ఇండియా’ ఒక్కటే ప్రభుత్వరంగ సంస్థ. ఎయిర్ ఇండియా వారి విమానంలోని శాకాహారపు విందు భోజనంలో ‘కాక్రోచ్’ బయట పడిందని నవంబర్ పదహారవ తేదీన ధ్రువపడిన తరువాత ఈ భయం మరీ ఎక్కువైందట! ‘ఈ భయం’ అని అంటే.. తెలుగు మాట్లాడితే అపకీర్తి చుట్టుకుంటుందన్న భయం. ఎందుకంటే ఈ ‘బొద్దింక భోజనం’ గురించి విమానాశ్రయం లోపల వేచి ఉన్నవారు చర్చించారట! విమానం ఇంకా ఎక్కలేదు కాబట్టి కొంతమంది గొంతులు తగ్గించి తెలుగు మాట్లాడారు. గట్టిగా మాట్లాడితే పొట్టి ‘స్కర్టు’లను, ‘బర్మడా’లను, పెదవులకు ఎఱ్ఱటి రంగును ధరించిన, ముఖాన బొట్టులేని ‘సిబ్బంది’ విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే విమానాలలో పనిచేసే ఈ పొట్టి ‘బర్మడా’ల భారతీయులలో అత్యధికులు తాము అమెరికన్లు అయినట్టు కృత్రిమ అనుభూతిని పొందుతున్నారు. అందువల్ల తెలుగునేల నడిబొడ్డున ఉన్న శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు వినబడదు. తెలుగు మాట్లాడినట్టయితే తమకు ‘ఆంగ్లం’ రాదని ‘సిబ్బంది’ సహా అక్కడి వారంతా భావిస్తారన్న భయం ప్రయాణీకులను ఆవహించి ఉంది! అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలో ‘కాక్రోచ్’ గురించి చర్చ జరగాలన్నది ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- నెలకొల్పిన రీతి, ‘బొద్దింక’ అని పలికి ప్రాంతీయ ‘సంకుచిత ప్రృవత్తి’ని ప్రదర్శించరాదట. కానీ, ఇది తెలియని కొంతమంది భోజనంలో ‘బొద్దింక’ వచ్చిందని పక్కవారితో అన్నారట! ‘బొద్దింక అంటే ఏమిటి మమీ?’- అని రెండో తరగతి విద్యార్థిని వాళ్లమ్మను కొంచెం గట్టిగానే అడిగేసింది. ‘కానె్వంటు ఇంగ్లీషు’ నెత్తికెక్కినా ‘వ్యవహారం’ గురించి పాపకు తెలీదు మరి! అమ్మగారు కూడా తరచూ విమానాలలో అమెరికా వరకు వెళ్లివచ్చారు. కానీ గృహిణి కాబట్టి బొద్దింక అంటే ‘కాక్రోచ్’ అన్న ఆంగ్ల పదం ఆమెకు వెంటనే స్ఫురించలేదు.. తెలియక కాదు పాపం! అందువల్ల ఆమె సమాధానం చెప్పేలోగా బొద్దింక అంటే ‘కాక్రోచ్’ అని పక్కనున్న మరో మహిళ చెప్పేసింది! దాంతో అవమానం పొందిన అమ్మగారు లేచి పాపను చేయి పట్టుకొని బరాబరా ఈడ్చుకొంటూ పోయి మరోచోట కూచుందట! బొద్దింక సమస్య కంటే ఈ భాషా సమస్య ఆ తరువాత విమాన ప్రయాణీకుల చర్చకు ఎక్కువగా గురైంది!
ఆరోజున ఆ ప్రభుత్వేతర విమానంలోని ప్రయాణీకులంతా ఊపిరి బిగబట్టి వౌనం వహించడానికి నేపథ్యం ఈ చర్చ! కానీ హఠాత్తుగా ఒక కళాశాల విద్యార్థిని సెల్‌ఫోన్‌లో గడగడా తెలుగులో మాట్లాడేసింది! ఐదు నిముషాలు అనర్గళంగా సాగిన ఈ ప్రసంగం ఆ చిన్న విమానంలోని వారందరినీ ఆశ్చర్యచకితులను చేసింది! ‘ఉబర్ క్యాబ్’లో దిగి ఎయిర్‌పోర్ట్‌లోకి ‘ఎంటరై’నప్పటినుంచి తెలుగుకు నోచుకోని ఒక పల్లెటూరి తరహా ప్రయాణీకుడు ‘మొత్తానికి తెలుగు వినిపించావమ్మా!’అని ప్రశంసించబోయాడు! చిన్నబుచ్చుకున్న కళాశాల విద్యార్థిని ‘గ్రాండ్ మదర్ కాల్చేసింది అంకుల్.. అందుకని..’ అని అర్ధాంతరంగా వౌనం వహించింది! ‘నాయనమ్మతో మాట్లాడాను కాబట్టి తెలుగును ఉపయోగించాను..’అన్న సంజాయిషీ ఆ విద్యార్థిని వౌనంలో ధ్వనించింది. ‘తెలుగు కేవలం నాయనమ్మల భాష..’ అన్నది ‘ప్రపంచీకరణ’ ప్రభావ ధ్వని ప్రకంపనం! భూమార్గం పట్టని ప్రగతి భూకంపాన్ని పుట్టిస్తోంది!
ఎందుకంటే ప్రగతి విమానాలనెక్కి ఆకాశంలో విహరించడం ప్రపంచీకరణ! 1950వ దశకంలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘దమయంతీ స్వయంవరం’ నవల వ్రాశాడు. ‘ప్రపంచంలో ఒక నాగరికతా తరంగంలో జాతీయత అని ఉంటుంది. ఆ తరంగం వెళ్లిపోయి ఇంకొక తరంగం వచ్చింది. దీని పేరు అంతర్జాతీయత. మరీ ఈ తరంగం మన దేశం మీదనే పడ్డది. ఇతర దేశాలలోని పెద్దవాళ్లందరూ మన దేశం వంటి దేశాలను మోసం చేసేందుకు దీన్ని-అంతర్జాతీయతను- వాడుతుంటారు. మనవాళ్లు నిజంగా ఆచరిస్తారు..’-అని ఆ నవలలోని కథానాయకుడు వాపోయాడు. ఆ కథానాయకుడు ‘విమాన ప్రేమ’ గురించి, విమాన భోజనం గురించి కూడా వివరించాడు, ‘.. కలకత్తాలో వైకౌంట్ ఎక్కాడు, ఢిల్లీలో దిగాడు. తొమ్మిదిన్నరకు దారిలో ఆవిడ వార్తాపత్రిక తీసుకువచ్చి ఇచ్చింది. బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది. కాఫీ కావాలా? అని అడిగింది.. ఎంత అందంగా అడిగింది! చెవిదగ్గర నోరుపెట్టి అడిగింది, చిరునవ్వుతో అడిగింది. ఆవిడ పెదవికి రాసిన ఎఱ్ఱరంగు మందార పూరేకులు చిదిమి వీడి మొహాన కొట్టిందా? అన్నట్టు అడిగింది.. ఇలాంటి సన్నివేశాలు వ్రాస్తే గొప్ప? ‘వైకౌంటు’ గొప్ప. రెండువందల రూపాయల టిక్కెట్టు గొప్ప, ఆ పరుపులు గొప్ప..’ అప్పటి రెండువందల టిక్కెట్టు ఇప్పుడు పదివేల రూపాయలకు పెరగడం ప్రపంచీకరణ.
ధరల విషయంలో ప్రభుత్వపుప్రమేయం లవలేశం కూడా లేకపోవడం స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ-మార్కెట్ ఎకానమీ- స్వభావమట! చైనా నియంతృత్వ ప్రభుత్వం వారు ధరలను నియంత్రించడంలో కొంత జోక్యం చేసుకుంటున్నారట! అందువల్ల చైనాను ‘స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ’గా గుర్తించడానికి మన దేశం సహా అనేక ప్రపంచ దేశాలు సిద్ధంగా లేవట! మనదేశం మాత్రం ‘స్వేచ్ఛా విపణి’గా మారిపోయింది. ‘గిరాకీ’ని బట్టి వస్తువుల, సేవల ధరలు వాటంతట అవే పెరగడం, తగ్గడం స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ స్వభావమట! ఈ సూత్రం విమాన సేవల రంగంలోను, ఇతర రవాణారంగంలోను గొప్పగా వ్యవస్థీకృతమైపోయింది. భాగ్యనగరం నుంచి ఇంద్రప్రస్థానానికి విమానంలో వెళ్లినవారికి ఈ ‘స్వేచ్ఛా విపణి’ స్వభావం బాగా అనుభవం. ఇంద్రప్రస్థమంటే ఢిల్లీ! హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లినప్పుడు నాసిరకం విమానంలో ఎనిమిది వేలకు పైగా వసూలుచేస్తారు. తిరిగి వచ్చినప్పుడు మాత్రం ప్రయాణ వ్యయం అయిదువేల లోపే! అదే నాసిరకం-ఎకానమీ- తరగతి విమానయానం. అవే సౌకర్యాలు వెళ్లినప్పుడు, వచ్చినప్పుడు కూడా. మరి ‘శుల్కం’లో ఎందుకు తేడా? గిరాకీని బట్టి ‘శుల్కం’ వసూలు చేశారట! వెళ్లేటప్పుడు ‘గిరాకీ’ ఎక్కువ అట, వచ్చినప్పుడు ‘గిరాకీ’ తక్కువట! చలనచిత్ర ప్రదర్శనశాలవారు కృత్రిమంగా కొరతను సృష్టించి ‘టిక్కెట్ల’ను అధిక ధరలకు నల్లదళారీలతో అమ్మించడం పాతకథ. ‘స్వేచ్ఛా విపణి’ వ్యవస్థలో విమానాల సేవల యజమానులు ఇలా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ప్రయాణం వ్యయాన్ని పెంచుతున్నారు. ‘ప్రపంచీకరణ’ ఇదే మరి. ఈ గిరాకీ ఒక్కొక్కసారి తలకిందులు కావచ్చు. అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లినప్పుడు ‘శుల్కం’ తగ్గి, వచ్చినప్పుడు పెరగవచ్చు! ఈ దోపిడీని నియంత్రించడానికి కాని, నిరోధించడానికి కాని ప్రభుత్వం జోక్యం కల్పించుకొనక పోవడమే ‘మార్కెట్ ఎకానమీ’ గొప్పతనం. ఈ దుర్మార్గం గురించి జనానికి తెలీదు. గిరాకీ పెరగదు. తగ్గదు. కానీ శని,ఆది వారాలలో గిరాకీ పెరుగుతుందన్న భ్రాంతిని కల్పిస్తున్నారు. ‘గిరాకీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు’కూడా అనే్న ‘సీట్లు’ అమ్ముతున్నారు. ‘సొమ్ము’ మాత్రం ఒకటి కాదు!
అన్ని మహానగరాలలోనూ ‘విమాన స్ఫూర్తి’తో టాక్సీల కంపెనీలు ఇలానే దోచుకుంటున్నాయి. హైదరాబాద్‌లో మనకు రోడ్డుమీద ‘క్యాబ్’- కారు- దొరకదు. స్మార్ట్ఫోన్ ద్వారా మాత్రమే ఈ ‘క్యాబ్’లను ‘బుక్’ చేయాలి! ఈ ప్రక్రియ ద్వారా ‘స్మార్ట్ఫోన్’- లావణ్య వాణిల-కు గిరాకీ పెంచారు. ఢిల్లీలో ఇటీవల కాలుష్యం పెరిగింది. కాలుష్యం పొగ నిండింది. వాణిజ్య సంస్థలు రంగంలోకి దిగి కాలుష్య నిరోధక పరికరాల ధరలు పెంచేశారు. ఇదీ స్వేచ్ఛా వాణిజ్యం! ఉబర్, ఓలా అన్న దళారీ ముఠాలు హైదరాబాద్‌లో మాత్రమే కాదు దేశమంతటా ఉన్న టాక్సీ-క్యాబ్-లను నియంత్రిస్తున్నాయి. ఈ సంస్థలకు ఫోన్ చేస్తే అవి మనకు ‘క్యాబ్’ను కేటాయిస్తాయి. నిన్న ‘క్యాబ్’లో విమానాశ్రయానికి వెళ్లినప్పుడు మూడువందలు చెల్లించినవాడు నేడు అదే ‘క్యాబ్’లో విమానాశ్రమానికి వెళ్లాడు. కానీ ‘మీటర్’ తొమ్మిదివందల రూపాయలు.. ‘అదేమయ్యా?’అని అడిగితే ‘నిన్న గిరాకీ లేదు. ఈరోజు గిరాకీ ఉంది’ అన్నది దోపిడీ సంస్థల సమాధానం! ‘ఉబర్’ ‘ఓలా’ దళారీ ముఠాల దోపిడీని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే ‘స్వేచ్ఛా వాణిజ్యం’- మార్కెట్ ఎకానమీ!
కవి సమ్రాట్ చెప్పిన కథ వర్తమానానికి కొంతవరకే అన్వయం అవుతుంది! ఎందుకంటే విలాస విమానాలలో మాత్రమే ఉచితంగా ‘చాక్లెట్లు’ ఇస్తున్నారు. ఎక్కువ మంది ఎక్కి ఎగిరివెళ్లే నాసిరకం- ఎకానమీ క్లాస్- విమానాలలో భోజనం మాత్రమే కాదు, మంచినీరు కూడా కొనవలసిందే! ‘ముందు వరుస’లో కూర్చునే వారివద్ద కొంత అదనపు ‘శుల్కం’ వసూలు చేయడం దోపిడీలో మరో ఎత్తుగడ. ఈ ‘ఎత్తుగడ’ను తెలుగు రాష్ట్రాల రోడ్డురవాణాలోనూ అమలుచేస్తూండడం భూమి, ఆకాశం పట్టనంతగా విస్తరించిపోతున్న స్వేచ్ఛా వాణిజ్యానికి నిదర్శనం.
అందువల్ల ‘నాసిరకం’ విమానం ఎక్కినవాడు మూడువందల రూపాయలు పెట్టి ‘ఉప్మా’ కొని తినవలసిందే! అదే అతి తక్కువ ధర ఉన్న ఆహారం! ‘ఉప్మా’ను ‘ఉప్మా’ అనరు. అంటే అది అవమానకరం! ఇంకేదో విచిత్రమైన పేరుతో పిలుస్తారు! బెంగళూరు నుండి, చెన్నయి నుంచి, ముంబయి నుంచి, హైదరాబాదు నుంచి ఈ ‘ఎకానమీ’ తరగతిలో వెళ్లేవారు ఆ ‘ఉప్మా’వంటి విచిత్ర పదార్థాన్ని కొని తినరు. కొని తినేవారు ‘కంపెనీల ఖర్చుతోప్రయాణం చేసేవారు’. తిన్నవారి అనుభవం ప్రకారం ఆ ‘మిక్స్’ ఉడికీ ఉడకని ఉప్మా! ఒక ‘ప్లాస్టిక్ డిప్ప’లో రవ్వ-ఉప్పు-కారం- పోపుకలిసిన మిశ్రమాన్ని నింపుతారట! ఆ ‘డిప్ప’లోకి వేడి నీరు పోస్తారు. అదే ఉప్మా! ఇలాంటి ‘ఉప్మా’ను ‘చెంచా’తో తింటున్న ఒకాయన గత నవంబర్‌లో ‘డిప్ప’లోనుంచి ‘బొద్దింక పార్ధివ శరీరాన్ని’ వెలికి తీశాడట! ‘ఎయిర్ ఇండియా’ విమానంలో జరిగిన ఈ ‘బొద్దింక’ మృతదేహ ఆవిష్కరణ సంచలనాన్ని సృష్టించింది. ‘ఎయిర్ ఇండియా’ వారు ఈ ‘్భజనం’ సరఫరా చేసిన వ్యాపారికి లక్ష రూపాయల జరిమానా విధించారట! ఐరోపాలో చలికి గడ్డకట్టిపోయేవారు చేతులకు ‘తొడుగులు’ ధరిస్తారు, అందువల్ల ‘చెంచాల’తో తినాలి! చేతులున్న మనవారు కూడా ‘చెంచాల’తో తినడం అంటే- ‘అంతర్జాతీయ స్థాయికి ఎదగడం’! *

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352