మెయిన్ ఫీచర్

సప్తనదీ సంగమంలో సంగమేశ్వరాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమశివుడే మామగారైన దక్షుడు పాలించిన పట్టణమే నేటి సంగమేశ్వరాలయం. త్రిమూర్తులను సైతం వదలిపెట్టని విష్ణుమాయ ఒకసారి దక్షుణ్ణి ఆవరించింది. దాంతో దక్షునిలో అహంకారం పొటమరించడం కాదు మహావటవృక్షంలా పెరిగిపోయింది. అది ఎంతంటే సర్వవ్యాపి అయిన పరమశివుణ్ణే నువ్వెంత అనేంతగా ఎదిగిపోయింది. తాను అందరికన్నా అధికుడినని విర్రవీగుతూ ఉన్నాడు. అన్నింటికి అతీతుడైన గరళకంఠుడు చిరునవ్వుతో దీనంతా చూస్తున్నాడు. లోకకల్యాణకారుడైన నారదుడు మాత్రం ఓహో ఈ దక్షునికేమి ఇంత అహంకారం? దీనివలన ఎవరికి లాభం కలుగుతుందో చూద్దామని దక్షుని దగ్గరకు వెళ్లాడు. దక్షుణ్ణి పొగడుతూ వెళ్లాడు. మరి నీవు ఏదైనా యజ్ఞయాగాదులు చేస్తేకదా నీ గురించి ముల్లోకవాసులకు తెలిసేది అన్నాడు. పాపం దక్షుడు నిజమేననుకొని గొప్పయాగాన్ని చేయసంకల్పించాడు. ఋత్వికులను పిలిపించాడు. సర్వులనూ పిలిచాడు. కాని భిక్షమెత్తుకునేవాడు, స్మశానాలల్లో నివసించేవాడు నా అల్లుడు చాలా చిన్నవాడు అతనిని పిలవనక్కర్లేదు అనుకొన్నాడు. తన కూతురుఅల్లుణ్ణి తప్ప అందరినీ పిలిచాడు. దక్షుని భార్య చెప్పింది. అల్లుడుగారిని పిలవమని కాని దక్షుడునేను పిలవడం కాదుకదా ఒకవేళ పిలవకపోయినా ఆ శివకుటుంబం వస్తే వారిని అవమానించి పంపించమని ఆజ్ఞాపించాడు.
లోపల బాధపడినా భర్తమాట జవదాటని ఆ దక్షుని ఇల్లాలు మిన్నకుండిపోయింది. ఏ ఉపద్రవం వస్తుందోనని ఆందోళన పడసాగింది. యాగం ఆరంభమైంది. ఈ సంగతిని అర్థనారీశ్వరుడైన పరమశివునికి నారదుడు చేరవేశాడు. పాపం జగన్మాత తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలని ఉత్సాహపడింది. ‘ఇపుడు నీవు నాభార్యవు. ఆ దక్షుని ఇల్లు సైతం నీకు పరాయిదే అవుతుంది. పిలవని పేరంటానికి వెళ్లకూడదు’అని సర్వమెరిగిన కైలాసవాసి అన్నాడు. ‘అంతాచోద్యం! తండ్రి దగ్గరకు తనయ వెళ్లేందుకు అనుమతులెందుకు? నేను వెళ్లి అందరూ చూచే ఆ యాగాన్ని నేను కాసేపు చూచి వచ్చేస్తాను ’అంది ఆ సర్వమంగళ. వౌనవహించిన భర్తను చూచి వౌనం అర్థాంగీకారం అనుకొంటూ తండ్రి దగ్గరకు వెళ్లింది ఆ అపర్ణ.
మాయామోహితుడైన దక్షుడు ఎదురువచ్చిన కూతుర్ని పలుకరించలేదు. ఎవరినీ పలుకరించనివ్వలేదు. పైగా యాగవిశేషాలను చూడడానికి వచ్చిన అతిథులతో పరమశివుణ్ణి గూర్చి అవాకులు చెవాకులు పేలుతున్నాడు. భర్తను అవమానించే తండ్రిని ఎక్కువసేపు ఉపేక్షించలేకపోయింది ఉమాదేవి. కాసేపు ఊరుకున్నా అదేపనిగా ఆక్షేపిస్తున్న తండ్రిని గౌరవించలేక శివనింద విన్న ఈ చర్మతిత్తి నాకు అక్కర్లేదంటూ ఆ యాగకుండంలోనే దూకేసింది. అంతటా హాహాకారాలు చెలరేగాయి. దక్షుడు అహంకారం అణిగిపోయింది. తన కూతురు దేహత్యాగం దక్షుణ్ణి ఆలోచింపచేస్తోంది. మ్రాన్పడిపోయిన అతిథులు దక్షుడు ఆయన కుటుంబం తేరుకోకముందే పరమశివునకు ఈ విషయం తెలిసింది. తన సతి తన అర్థాంగికి జరిగిన అన్యాయం భరించలేని శివుడు తన జటాజూటం నుంచి ఒక శిఖనుపెరికి నేలకువేసి కొట్టగానే అందుండి భైరవస్వామి పరుగెట్టివచ్చి శివాజ్ఞతో దక్షుని యాగప్రదేశానికి వెళ్లాడు. దక్షుని మెడను నరికివేశాడు. అంతలో ఆగ్రహోద్రగుడైన పరమశివుడు పరుగెత్తి వచ్చాడు. కాలి పోతున్న తన సతి శరీరాన్ని తన చేతులపై వేసుకొని వేగంగా బయలుదేరాడు. అలా బయలుదేరిన ఆ శివుని చేతుల మీదుగా సతి శరీరభాగాలన్నీ పడిన వివిధ చోట్లల్లో వివిధ శక్తిపీఠాలు అంకురించాయి. అవే అష్టాదశ పీఠాలుగా వర్థిల్లుతున్నాయి.
అసలు ఆ దక్షయజ్ఞం జరిగి, సతీదేవి నివృత్తిజరిగిన ప్రాంతమే నేటి సంగమేశ్వర ప్రాంతం. ఇక్కడే పరమశివుని ఆగ్రహం తగ్గాలని దక్షుడు తపస్సుచేశాడట. ఈ ప్రాంతంలోనే పాండవులు తిరుగుతూ ఇక్కడ ఆ పరమేశ్వరుని ప్రతిరూపమైన శివలింగాన్ని నెలకొల్పాలని ధర్మరాజు తలపోశాడట. కృష్ణుని ఆజ్ఞతో కాశీకి వెళ్లి శివలింగం తేవడానికి భీముడు బయలుదేరి వెళ్లాడట. భీముడు తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని ధర్మరాజాదులు ఎదురుచూస్తుంటే మూహూర్తం మించిపోయినా భీముని జాడలేదట. పెద్దల సూచన మేరకు మూహూర్తం మించిపోకుండా అక్కడున్న వేపకాండంతో శివలింగాన్ని మలిచి ధర్మరాజు ప్రతిష్టించాడట. అంతలో రావల్సిన భీముడు శివలింగంతో వచ్చాడట. కాని జరిగిన విషయం తెలుసుకొని కోపోద్రిక్తుడై తాను తెచ్చిన శివలింగాన్ని అక్కడే పారే నదిలో విసిరకొట్టాడట. భీముని కోపాన్ని తెలుసుకొన్న ధర్మరాజు కృష్ణునితో కలసి వెళ్లి భీముని ఆగ్రహాన్ని శాంతింపచేసి నదీ గర్భానికి వెళ్లిన శివలింగాన్ని పైకి తెచ్చి అక్కడ నదీతీరంలోనే మరలా ప్రతిష్టించారట. పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకొన్న భీముడిని ఆశీర్వదిస్తూ పరమశివుడు ‘‘నీవు ప్రతిష్టించిన ఈ లింగ దర్శనం తర్వాతనే ధర్మరాజు ప్రతిష్టించిన లింగం దర్శనం చేసుకొంటారు భక్తులు. అట్లా చేసినవారికే నా అనుగ్రహం కలుగుతుంది’’అని భీమునికి వరం ఇచ్చాడట భోళాశంకరుడు. అందుకనే ఇప్పటికీ ముందు భీమేశ్వరలింగాన్ని ఆ తరువాత సంగమేశ్వర లింగాన్ని భక్తులు దర్శించి పూజిస్తారట.
ఈ ప్రాంతంలో ప్రవహించే నదుల ప్రవాహ ఒరవడికి ఈ ఆలయాన్ని కేవలం ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శించగలరు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంగమేశ్వరాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలంటారు శివభక్తులు. నమఃశివాయ అని తలచినంతనే కోరిన వరాలనిచ్చే పరమశివుడు సప్తనదీ సంగమంగా పిలువబడే ఈ ప్రాంతంలో సంగమేశ్వరుడుగా స్తుతించబడే ఈ సంగమే శ్వరుని ఎల్లవేళలా దర్శించడానికి వీలుగా శ్రీశైలప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత ‘‘సంగమేశ్వరాలయము’’ కూడలి నుండి తొలగించి అలంపురము పట్టణంలో పునఃనిర్మించారు.
పూర్వకాలంలో భద్ర, క్రిష్ట, వేణి, భీమ , మలాపహ, భవవాసి అనే ఏడు నదులు కలిసి ప్రవహించేవని స్థానికులు చెబుతారు. ఇలా ఏడు నదులు కలిసి ప్రవహించే ఈ పరమోత్తమైన ప్రదేశంలో ఉన్న సంగమేశ్వరుని దర్శనం కోటి జన్మల పాపాలను సైతం భస్మీపటలం చేస్తుందని భక్తుల నమ్మకం. కనుక శివభక్తులు సంగమేశ్వరుని దర్శించడానికి తహతహలాడుతుంటారు.
ఇలా సంగమించిన ఈ ఏడునదులలో భవవాసి అనే నది మాత్రమే తూర్పునుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులు పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఇక్కడ కలిసిన ఈ నదులన్నీ శ్రీశైలాన్ని తాకుతూ ప్రవహించి చివరకు సముద్రంలో కలసిపోతాయి. ఇట్లా నదుల సంగమప్రదేశం కనుక ఈ ప్రాంతానికి సంగమేశ్వరం అనీ ఇక్కడ కొలువైన ఈశ్వరుడికి సంగమేశ్వరుడన్న నామం ప్రఖ్యాతి పొందింది. నేడు ఘనమైన పూర్వచరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని కాపాడాలన్న ధ్యేయంతో అలంపూరులో ఆలయ నమూనాను తయారుచేశారు. నేడు కూడా అలనాడు ధర్మరాజు ప్రతిష్టించిన వేపదారువుతో చేసిన శివలింగం, భీముడు తెచ్చిన కాశీ శివలింగం భీమలింగంగా అర్చనలందు కుంటునే ఉంది. అంతేకాక ఇంత నీటిప్రవాహంలో ఉన్నా వేపదారువు నేటికీ చెక్కు చెదరలేదు. ప్రవాహవేగం తగ్గిన వెంటనే భక్తులంతా భీమలింగాన్ని వేపలింగాన్ని దర్శించడానికి వేలాదిగా తరలివస్తారు. పూర్వపుణ్యబలం వల్లనే ఈ సంగమేశ్వర దర్శనం కలుగుతుందని శివభక్తులు అంటారు. గర్భాలయంలోని శివుని వెనుక వైపున శ్రీ లలితాదేవి, వినాయకుణ్ణి దర్శించుకోవచ్చు. ఇపుడు తగ్గుతున్న నీటి మట్టం రాబోయే ఫిబ్రవరికి మరింత తగ్గి సంగమేశ్వరుని దర్శనం దొరుకుతుందని శివభక్తులంతా ఆతురతతో ఎదురుచూస్తున్నారు. నేడు సంగమేశ్వరానికి చేరడానికి తెలంగాణ జిల్లానుంచి సోమశిల ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్న తరువాత అక్కడనుంచి ప్రైవేటు, ఆర్టీసీ వాహనాలు లభ్యమవుతాయ. అట్లాకాక ఆత్మకూరు చేరుకుంటే అక్కడి నుంచి ఆటోలల్లాంటి వాహనాలు సులభంగా దొరుకుతాయ. అదేకాక ఆర్టీసీవారు బస్సు ప్రయాణి కులకు వసతి సౌకర్యాన్ని కల్పిసున్నారు.

- వై. వి. కృష్ణారెడ్డి