మెయన్ ఫీచర్

జాతీయతకు తావు లేని జెఎన్‌యు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ మోదీ ఎంతకాలముంటాడో చూద్దాం. ఆయన యాభైఏళ్లుంటాడా? ఆ తరువాత మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూ స్తాం,’’ఈ మాటలు మామూలుగా ఎవరంటారు? దౌర్జన్యం, గూండాగిరి చేసే వ్యక్తులు తమ ప్రత్యర్థులనుద్దేశించి అంటారు. కానీ ఢిల్లీలోని పేరు గొప్ప జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో అయితే కొందరు ప్రొఫెసర్లు, స్కాలర్లే అనేస్తారు. ‘‘కాశ్మీర్‌ను, నాగాలాండ్‌ను భారత్ అన్యాయంగా ఆక్రమించింది. భారత్ కబంద హస్తాలనుంచి కాశ్మీరీలను, నాగాలను విడిపించాలి.’’ ఈ మాటలు మామూలుగా అయితే ఏ చైనావాళ్లో, పాకిస్తాన్ వాళ్లో మనల్ని ఉద్దేశించి అంటుంటారు. కానీ పండిట్ నెహ్రూ స్థాపించిన జెఎన్‌యులో మాత్రం ఆ విశ్వవిద్యాలయపు టీచర్లు, విద్యార్థులే అంటారు.
ఇంత ధైర్యం ప్రదర్శించాలంటే రెండు కారణాలుండాలి. మొదటిది వారు చెబుతున్నది నిజమైనా అయ్యుండాలి. రెండవది తాము ఏమి చెప్పినా దాన్ని సమర్థించే బలమైన సాధనాలు, ప్రభుత్వపరంగాను, మీడియాలోను ఉన్నాయని వారు అనుకుంటుండాలి. వాళ్ల ఆలోచనలు, భావజాలంలో సత్యం లేదని, విఫలమైన వాళ్ల కమ్యూనిస్టు సిద్ధాంతమే స్పష్టంగా చెబుతున్నది. అందుచేత రెండవదే కారణమవుతుంది. చరిత్ర పుస్తకాల ద్వారా, పత్రికల్లో వ్యాసాల ద్వా రా, టివి ఛానళ్లలో అసత్య ప్రచారం ద్వారా ప్రజ ల ఆలోచనలను ప్రభావితం చేసి, లబ్ది పొందవచ్చునని ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్లు అనుకుంటున్నారు.
భారత దేశాన్ని, జాతీయ భావాల్ని వ్యతిరేకించే ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా, ఎంత చిన్న వ్యక్తి అయినా వీళ్లకు ఇష్టం. భారత్‌ను సమర్ధించే వ్యక్తి, ఎంతటి మేధావి అయినా వీళ్లకు లోకువే. జెఎన్‌యులో పాఠాలు చెప్పరు. భారత జాతీయవాదానకి, సంస్కృతికి వ్యతిరేకంగా అసత్యాలను, విద్యార్థుల మెదళ్లలో కూ రుతుంటారు. అక్కడ మహాత్మాగాంధీకి, నేతాజీ సుభాష్ చంద్రబోహ్‌కు, వీరసావర్కార్‌కు స్థానం లేదు. రష్యా నియంత జోసెఫ్ స్టాలిన్‌కు ఆయన అనుచరుడు వ్లాదిమిర్ లెనిన్‌లకే అగ్రతాంబూలం. లోకమాన్య బాలగంగాథరతిలక్, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వంటి మహాపురులకు అక్కడ దిక్కు లేదు. కార్ల్ మా ర్క్స్, మావోసేటుంగ్, చేగువేరాలే అక్కడ కులదైవాలు.
మనదేశం గురించి ఎవరైనా రెండు మంచి మాటలు చెబితే, వాళ్లకు అక్కడ నూకలు చెల్లినట్టే. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వ పథకాలైన ‘మేకిన్ ఇండియా’, ‘రైతు బీమా’లను ప్రశంసిస్తూ వ్యాసం రాసిన ఒక విద్యార్థిని ఫెయి ల్ చేశాడు అతని లెఫ్టిస్టు గురువు! దేశాన్ని, జాతీయ భావనలను ఎగతాళి చేయడం బాధ కలిగించిందన్న ఒక మహిళా విద్యార్థినిని, ఆమె పుస్తకాలు, లగేజీతో పాటు హాస్టల్ నుంచి గెంటివేస్తూ ‘ఖబడ్దార్’ అని హెచ్చరించారు వామపక్ష భావజాల విద్యార్థులు! ఒకవేళ జెఎన్‌యులో మార్క్సిస్టు మేధావులు, కొందరు ప్రొఫెసర్లు చేస్తున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలు బయటపడితే, వెంటనే దానికి మసిపూసి మారేడుకాయను చేసి, వాస్తవాన్ని పక్కదారి పట్టించడంలో ఎవరైనా కమ్యూనిస్టు మేధావుల తరువాతే! ఉదాహరణకు జయతి ఘోష్ అనే ప్రొఫెసర్ జెఎన్‌యులో పనిచేస్తున్నారు. ఆమె ఇలా అంటుంది, ‘‘మొన్న ఫిబ్రవరి 9వ తేదీన జెఎన్‌యులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు అధికారులే (ఇంటెలిజెన్స్ బ్యూరో) దేశ వ్యతిరేక నినాదాలిచ్చి ఆ తప్పును, విద్యార్థులు, నిర్వాహకులపై నెట్టి, ఆ నెపంతో అమాయక విద్యార్థులను, ప్రదర్శనకారులను పోలీసులు అరెస్టు చేశారు.’’
సిబిఐ, ఇబి, సైన్యం, పోలీసు విభాగాల్లో తమ మాదిరిగా తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవారు, జన్మనిచ్చి, జీవితాన్నిచ్చి, జీతాన్నిచ్చిన మాతృభూమికే హాని తలపెట్టేవారు ఎక్కడో ఒకరిద్దరు ఉంటారేమో కాని, జెఎన్‌యులో లాగా అడుగడుగునా ఉండరని జయతీ ఘోష్ లాంటి వ్యక్తులు తెలుసుకోవాలి. ఆమె చేసిన ఈ ప్రకటన మనకు కొన్ని కఠోర వాస్తవాలను చెప్పకనే చెప్పింది. ఎన్నికలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో చర్చిలమీద దాడులు జరిగాయని కట్టుకథలల్లి, దేశంలో అసహనం పెరిగిపోతోంది, మైనారిటీ పౌరుల్లో అభద్రతాభావం నెలకొంది, హిందూ మతోన్మాదంతో దేశానికి ప్రమాదమని ప్రతి వామపక్ష మేధావి, నాయకుడు అరచి గగ్గోలు పెట్టాడు. ఆ పాటకు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్లు శృతి కలిపారు. కానీ విచారణలో తేలిన వాస్తవాలు ఏమిటి? చర్చిలపై దాడి చేసింది కొందరు తాగుబోతులు, వస్తువులు, డబ్బులు ఎత్తుకెళ్లడానికి వచ్చిన దొంగలు. పశ్చిమ బెంగాల్‌లో క్రైస్తవ నన్‌పై అత్యాచారం జరిగిందని, ఆ పాపాన్ని కూడా హిందూ జాతీయవాద సంస్థలపై రుద్దా రు. చివరకు బయటపడిన వాస్తవమేంటి? బంగ్లాదేశ్ నుండి మమతా బెనర్జీ గారి బెంగాల్‌లోకి అక్రమంగా చొరబడిన ఇస్లామిక్ ఉగ్రవాదులు అని. గత వారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఒక చర్చి పై దాడి చేసిన వారు ‘జై శ్రీరాం’ అని నినాదాలిచ్చారని, కాబట్టి వారు భజరంగదళ్ లేదా ఇతర హిందూ జాతీయవాద సంస్థల వ్యక్తులు అయి ఉంటారని ఆరోపించారు. జయతీ ఘోష్ మాటలను బట్టి తెలుస్తున్నదేమంటే, దాడులు చేసే వ్యక్తులు ఏ నినాదాలివ్వాలో, ఎవరిపై అనుమానం కలిగేలా ప్రవర్తించాలో ముందే వారికి తెలియజేయబడుతున్నదన్నమాట. పథకం అర్థమవుంతోంది కదా!
రాజ్‌దీప్ సర్దేశాయి, ప్రణయ్ రాయ్, బర్కాదత్ లాంటి మీడియా వ్యక్తులు ఆ దృశ్యాలను, వార్తలను రోజుల తరబడి తమ ఛానళ్లలో చూపిస్తారు. అమర్త్యసేన్, నోమ్‌చాంస్కీ లాంటి మేధావులు దాన్ని అంతర్జాతయ వేదికల మీద చర్చించి, భారత దేశ ప్రతిష్ఠను మసకబారుస్తారు. ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేజ్రీవాల్ తనకు తెలిసిన ఒకే ఒక విద్య అయిన ధర్నా చేస్తాడు. వెకేషన్‌లపై విదేశాలు తిరుగుతూ, అకేషనల్‌గా ఇండియాలో ఉండే రాహుల్ దీన్ని బూచిగా చూపి, పార్లమెంటు జరగకుండా అడ్డుపడతాడు. బిల్లులు పాస్ కావు. పెట్టుబడులు రావు. ఉద్యోగాలు పుట్టవు. ధరలు తగ్గవు. మోదీ విఫలమయ్యాడు. ఆయ న్ను దింపాలి. ఇప్పుడు భారత్‌లో, భారత్‌పై కొందరు భారతీయులే చేస్తున్న ప్రాక్సీవార్ ఇది.
ఫిబ్రవరి 9వ నాటి సంఘటనపై కొంత విచారణ తర్వాత కన్హయ్ కుమార్ అనే జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడికి బెయిల్ మంజూరైంది. అంతమాత్రం చేత అతన్ని పూర్తిగా నిరపరాధి అనలేము. బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తులు తమ ఉత్తర్వులో ఏమన్నారో చూడండి: ‘‘కన్హయ్ కుమార్ లాంటి విద్యార్థులు దేశ వ్యతిరేకత అనే రోగంతో ఇన్‌ఫెక్ట్ అయి ఉంటారు.’’ జెఎన్‌యు లో జరుగుతున్న జాతివ్యతిరేక, దేశద్రోహ కార్యకలాపాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా యో అర్థం చేసుకోవడానికి ఈ వాక్యం ఒక్కటీ చాలు. ఈ నేపథ్యంలో కన్హయ్ కుమార్ ఆలోచనలు, ప్రకటనలు ఎంత వివాదాస్పదంగా ఉన్నాయో చూద్దాం.
* ఫిబ్రవరి 9న తలపెట్టిన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీయొచ్చని ఊహించి, జెఎన్‌యు రిజిస్ట్రార్ అందుకు అనుమతి నిరాకరిస్తే, ఆయన నిర్ణయాన్ని కుమార్ వ్యతిరేకించాడు.
* ఉమర్ ఖలీద్, అతని స్నేహితుల దేశద్రోహ కార్యకలాపాలను కన్హయ్ కుమార్ ఏనాడూ ఖండించలేదు. పైగా వారందరికి సహకరించాడు కూడ.
* జాతీయతా భావాల్ని సమర్థించే ఏ కార్యక్రమానికైనా కన్హయ్, అతని మిత్రులు అడ్డు తగిలేవారు.
* ఎన్‌కౌంటర్లలో మరణించే మావోయిస్టులను దేశ సైనికలతో పాటు సరిసమానంగా చూడాలట! మరి మావోయిస్టుల చేతిలో చనిపోయే అమాయక జనం, పోలీసులు, జవాన్ల సంగతేంటి?
* భారత ప్రభుత్వం నుండి ‘ఆజాదీ’ కావాలంటాడు కుమార్. వీళ్ల దృష్టిలో ఆజాదీ అంటే ఏమిటి? పేదరైతు కొడుకైనా, జెఎన్‌యు దాకా వచ్చాడంటే ‘ఆజాదీ’ ఉన్నట్టా? లేనట్టా? కొన్ని ఏళ్లుగా ఉపకార వేతనం, వసతి ప్రభుత్వం నుంచి పొందుతున్నారు. ఆజాదీ లేకుంటే ఇది సాధ్యమై ఉండేదా?
* చదువు, శోధన పక్కకు పెట్టి మూడు నెలలు బిహార్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీకి ప్రచారం చేయడానికి కుమార్ వెళ్లాడు. ‘ఆజాదీ’ లేకుంటే వెళ్లగలిగేవాడా?
* అసహనం పెరుగుతోంది ‘మా భావాలు చెప్పడానికి ఆజాదీ లేదని’ అంటున్నాడు కుమార్. ఈనెల 7న అదే జెఎన్‌యులో మకరంద్ పరాంజపీ అనే ప్రొఫెసర్ (కవి కూడా), కుమార్ అతని మిత్ర బృందపు ప్రకటనల్లో ఉన్న అసత్యాన్ని సవరించే ప్రయత్నం చేస్తే, ప్రొఫెసర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ, టీచర్ అనే గౌరవం లేకుండా ఆయన్ని దుర్భాషాలాడారు. ఇది కూడా‘ఆజాదీ’ కిందికే వస్తుందా?
* కన్హయ్ తరహా భావజాలమున్న వామపక్షీయులు ‘జ్యుడీషియల్ మర్డర్’ అంటూ తీవ్ర పదజాలంతో భారత న్యాయ వ్యవస్థను తీర్పులను విమర్శిస్తుంటారు. కానీ వీరు ఆరాధించే ఆనాటి కమ్యూనిస్టు రష్యాలో 1920 నుంచి 1950 దాకా అంటే 30 ఏళ్ల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి నందుకు ప్రభుత్వం చేత చంపబడిన వాళ్ల సంఖ్య ఎంతో తెలుసా? 7,79,553!!
* నరేంద్ర మోదీని కేవలం 31 శాతం మంది భారతీయులే ఎన్నుకున్నారు. అంటే 69 శాతం మంది ఆయన్ను సమర్ధించలేదన్నమాట అని కుమార్ అన్నాడు. ఈ కుమార్ సెప్టెంబర్ 2015లో జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆనాడు పోలైన ఓట్లు 8000. కుమార్‌కు వచ్చినవి కేవలం 1057! అంటే 13.27 శాతం మాత్రమే. ఇప్పుడు 87 శాతం విద్యార్థులు కుమార్‌ను సమర్ధించలేదనేగా? అంతేకాదు కుమార్ అరెస్టు,బెయిల్ అనంతరం ‘దైనిక్ జాగరణ్’ అనే ప్రసిద్ధ హిందీ దినపత్రిక జెఎన్‌యులో సర్వే నిర్వహించింది. అందులో 69 శాతం విద్యార్థులు ‘మేం కుమార్ ఆలోచనలను సమర్థించడం లేదు’ అని చెబితే మరో 14 శాతం మంది విద్యార్థులు ‘మాకు కన్హయ్ కుమార్ ఎవరో కూడా తెలియదు’ అని బదులిచ్చారు. దీనె్నలా అర్థం చేసుకోవాలి?
* ‘నాకు ఆదర్శం వేముల’ అన్నాడు కుమార్. మరి రోహిత్ బతికున్నప్పుడు కమ్యూనిస్టు నాయకుడైన సీతారాం ఏచూరి లాటి వారు చేసిన తప్పుల్ని విమర్శించాడు. రోహిత్‌కు డాక్టర్ అంబేద్కర్ అంటే ఎంతో గౌరవం. కానీ 1952 ఎన్నికల్లో సెంట్రల్ బోంబే నియోజకవర్గం నుండి అంబేద్కర్ పోటీ చేస్తే, బ్యాలట్ కాగితాలు చింపనైనా చింపండి కానీ, అంబేద్కర్‌ను గెలవనీయకండి అని సిపిఐ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీపాద అమృత డాంకే పిలుపునిచ్చాడు కదా. ఇప్పుడు కన్హయ్ ఆ సిపిఐని సమర్థిస్తాడా?
* ‘నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాను’ అన్నాడు కుమార్. స్వతంత్య్రం వచ్చిననాటి నుంచి నేటి వరకు, చరిత్రలో అత్యంత అవినీతికర సమయమేదంటే సోనియాగాంధీ నాయకత్వంలో యుపిఎ అధికారంలో ఉన్న పదేళ్ల కాలం (2004-2014). మరి అప్పుడు కన్హయ్ కుమార్ ఒక్కమారూ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడలేదేం?
కాబట్టి కన్హయ్ కుమార్ లాంటి వారికి ఒక మనవి: స్టాలిన్, మావోలనో, అఫ్జల్ గురు, యాకూబ్ మెమెన్‌లనో కాదు,నీతికి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనాలైన పుచ్చలపల్లి సుందరయ్య, అచ్యుత్ పట్వర్థన్, తరిమెల నాగిరెడ్డి, మాణిక్ సర్కార్, శంకరన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి. వీళ్లే కమ్యూనిస్టులు.

- పి. సతీష్ ఫోన్ : 08554-242691