మెయన్ ఫీచర్

తాయిలాలు.. తమిళ రాజకీయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందిరాగాంధీ తర్వాత దేశంలో, అందునా దక్షిణాదినుంచి మరో మహిళా ప్రధానిగా అయ్యే అర్హత జయలలితకే వుందంటూ మూడు దశాబ్దాల క్రితం అప్పటి ‘ఆన్ లుకర్’ అనే ఆంగ్ల పత్రిక ఓ కథనాన్ని రాసింది. నేడు కూడా అలాంటి కథనాలకు తలూపే జనాలున్న దేశం మనది. వర్ధమాన నటిగా, రాజకీయ శక్తిగా ఎదుగుతున్న, ఎదిగిన కాలంలో జయలలిత ఇందిర లాగానే రాజకీయ అభిశంసనను, కోర్టు కేసుల్ని కూడా ఎదుర్కోవడం గమనార్హం!
స్వయాన రాజకీయ గురువు ఎంజిఆరే కొన్ని సందర్భాలలో జయలలితను నమ్మని స్థితి నుంచి, ఎంజిఆర్ మరణం తర్వాత అన్నాడిఎంకె కార్యకర్తల నుంచి, మూడువారాలే ముఖ్యమంత్రిగా వున్న ఎంజిఆర్ సతీమణి జానకి నుంచి అవమానాల్ని ఎదుర్కున్నది. అసెంబ్లీ సాక్షిగా డిఎంకె ఎంఎల్‌ఎలచే దుశ్శాసన పర్వాన్ని చవిచూచింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోకూడా మొక్కవోని ధైర్యం, మొండితనం, తన నీడను తానే నమ్మలేని వ్యక్తిత్వం ఆమెను ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేలా చేశాయి. కేంద్రంతో కౌటిల్యుని రాజనీతిని ప్రదర్శిస్తూ, పొత్తు పెట్టుకున్న రాజకీయ పార్టీనే చిత్తు చేస్తూ, తిరిగి పొత్తు పెట్టుకుంటూ, రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శతృత్వం వుండవని అనేకసార్లు రుజువు చేసిన జయలలిత ఎప్పుడూ పైచేయి రాజకీయాల్నే నడిపింది. అందుకే జాతీయ పార్టీలైన కాంగీ, బిజెపిలు ముందు జయతో మంతనాలు జరిపిన తర్వాతనే డిఎంకె పార్టీతో మాట్లాడేవారు. మచ్చలేని రాజకీయవేత్తగా గుర్తింపు పొందిన వాజ్‌పాయ్‌ని ప్రధానమంత్రిగా గద్దెనెక్కించడం, తనకు కలిసిరాక పోవడంతో గద్దె దింపడం కూడా చేసిన శుక్రనీతి.. ఆమె రీతి.
ఇలా వియ్యాన్ని, కయ్యాన్ని బొమ్మా, బొరుసుగా వాడుకున్న జయలలిత తనను అవమానించిన కరుణానిధిని, శపథంతో డిఎంకె ప్రారంభించిన ఉచితాలను బ్రహ్మాస్త్రాలుగా వాడుకుంటూ, గెలుపు ఓటములను చవిచూస్తూ, తాను గడిపిన జైలు గదిలోనే కరుణానిధిని బందీగా చేసింది. డిఎంకె హయాంలో కొత్తగా నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్‌గా మార్చి, గ్రంథాలయంగా మార్చబడిన జార్జ్ఫోర్ట్ పాత అసెంబ్లీ భవనాన్ని 2011లో తిరిగి అసెంబ్లీగా మార్చి తన పంతాన్ని నెగ్గించుకొని, జనాగ్రహానికి గురికాకుండా జాగ్రత్తపడింది.
రాజకీయంగా, సమ్మోహన శక్తిగా ఎదుగుతూనే తమిళనాడు వరుసగా రెండో దఫా అధికారాన్ని చేజిక్కించుకోలేని ఆచారాన్ని 2016నాటి మే ఎన్నికల్లో తారుమారు చేసి ముచ్చటగా ఆరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా, నాలుగు నెలలు తిరక్కుండానే ఆసుపత్రికి చేరడం విషాదం. 1996లో మొదటిసారి అరెస్టు అయినప్పుడు, 2011, 2014లలో జైలుకు వెళ్లినప్పుడు, శిక్షలు పడినప్పుడు సెప్టెంబర్ మాసమే కాక, మొన్న హాస్పిటల్‌కు పోవడం సెప్టెంబర్ కావడం గమనార్హం. మొదట హేతువాదిగా వున్న జయలలిత, రాజకీయవాదిగా అనేక నమ్మకాల్ని పట్టించుకుంటూ, పార్టీ అధ్యక్ష పదవి అచ్చిరాదని ఖాళీగా వుంచి, ప్రధాన కార్యదర్శిగానే కొనసాగింది. తన 25 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్క పదవికి ఎన్నికల్ని నిర్వహించలేదు. ఆమె చూపుడు వేళ్ళతోనే పార్టీని, అధికారాన్ని చెలాయించింది. ఈ గుణాలే ఆస్తుల్ని, ఆభరణాల్ని పోగుచేసుకునేలా చేసాయి. ఆడంబరాలకు, ఆధిపత్య రాజకీయాలకు నెలవుగా మార్చాయి. ద్వితీయశ్రేణి నాయకత్వం ఊసురాకుండా కట్టడి చేసాయి. ప్రజాస్వామ్య వాతావరణమే లేని పార్టీ రాజకీయాలకు, అసెంబ్లీ వారసత్వానికి బీజాలు వేసాయి. ఎదురుగానే కాదు- కలలో కూడా జయలలిత ముందు ఎవరు తలెత్తుకొని నిల్చుండే పరిస్థితి లేకుండా చేసాయి. జనాల్ని, కార్యకర్తల్ని, చివరికి కుడి భుజంగా అనుకుంటున్న పన్నీరుసెల్వంను తానో రింగ్ మాస్టర్‌గానే ఆడించింది. ఈ అసాధారణ రాజకీయ పెత్తనాన్ని తాళిబొట్లును, మోపెడ్లను, లాప్‌టాపులను, టాబ్లెట్లను, సిమెంటు బస్తాలను, విద్యుత్తును, ఫ్యాన్లను, రూపాయి నుంచి అయిదు రూపాయలకే ఇడ్లీని, పెరుగన్నాన్ని, సాంబారు అన్నాన్ని అందిస్తూ కాపాడుకుంది. సాధ్యాసాధ్యాల్ని పట్టించుకోని జనాలు ‘అమ్మగా’, ‘అతీత శక్తి’గా కొలవడంలో ఆశ్చర్యమేమిలేదు. ఈ తాయిలాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌కు వ్యాపించాయి. అనేక రాష్ట్ర రాజకీయాలకు అంటువ్యాధిలా అంటుకున్నాయి. ప్రాంతీయ పార్టీలు బలపడేలా, జాతీయ పార్టీలు వీటిపై ఆధారపడేలా చేసాయి, చేస్తున్నాయి.
రాష్ట్ర బడ్జెట్‌లో ఉచితాలకే 37 శాతం నిధుల్ని ఖర్చుచేయడంతో నిధుల వేట ప్రారంభమైంది. దీనికి 1983లో ఎంజిఆర్ స్థాపించిన తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టిఎఎస్‌ఎంఎసి)ను 2003లో చట్టసవరణ గావించి, మద్యం ఫ్రాంచైస్ సంస్థగా రూపాంతరం చెందించారు. దాదాపు 30వేల ఉద్యోగులతో, 41 డిపోలతో 6,800 పైగా మద్యం అమ్మకం కేంద్రాలతో ఉదయం నుంచి రాత్రి 10.గందాకా చిన్నా, పెద్దా, ఆడమగా తేడా లేకుండా ఇవి మత్తెక్కిస్తూనే వుంటాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ మద్యం తయారికి చక్కెర కర్మాగారాల నుంచి లభించే ఇథనాల్‌ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా మద్యం తయారికి వాడుతుంది. ఇలా తయారుచేసి అమ్మే సారాయిద్వారా ఏటా 30వేల కోట్ల ఆదాయం వస్తున్నది. ఈ ఆదాయాన్ని, బడ్జెట్‌లో కేటాయించిన 37 శాతం నిధుల్ని విచ్చలవిడిగా ఉచితాలకు, సబ్సిడీలకు వెదజల్లడం తమిళనాట మామూలైపోయింది.
నిజానికి తమిళనాడు, దేశంలో ఆర్థికంగా పుష్టికలిగిన రెండో స్థానమున్న రాష్ట్రంగా రూ.13,842 బిలియన్ల ఆదాయంతో (ఎస్‌జిడిపి), మూడువేల తలసరి జిడిపితో వుంటూ, దాదాపు 50శాతం పట్టణీకరణను కలిగి వుంది. విదేశీ పెట్టుబడులకు ఆలవాలంగా వుంటూ, వస్తు, మొబైల్ ఫోన్లు, ఆటోమొబైల్, ద్విచక్ర, వాహనాలు ట్రాక్టర్ల తయారికి ప్రసిద్ధిగాంచింది. సూరత్ తర్వాత గార్మెంట్ రంగానికి పేరెన్నికగాంచింది. ఈ అభివృద్ధి సనాతనంగా సాగుచేస్తున్న వ్యవసాయాన్ని పట్టించుకోకుండా చేయడంతో సంప్రదాయ, కుల వృత్తులు దెబ్బతిన్నాయి. అందరు ఉపాధికై ఎదురు చూసేలా చేసాయి. అనేక పట్టణాల్ని మురికి కూపాలుగా మార్చాయి. 19 రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో, 29 డీమ్డ్ యూనివర్శిటీలతో, 562 ఇంజనీరింగ్ కళాశాలలతో, 28 ప్రభుత్వ, 16 ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో విలసిల్లినా, అందించే విద్య అంతంత మాత్రమే! ఈ రాష్ట్రంలో అమ్మని డిగ్రీ లేదు. కొనుక్కోని ఇతర రాష్ట్రాల వ్యక్తులు లేరు. ఈ విధంగా నియంత్రణ కరువైన విద్య, ఉన్నత విద్య యువతను నిరుద్యోగులుగానే మార్చింది. ప్రతీ ముగ్గురిలో ఒకరు నిరుద్యోగి కాగా, రాష్ట్రంలో 90 లక్షల మంది వున్నారు. ఇందులో 13.5 శాతం ఉన్నత విద్యను అభ్యసించినవారే!
దారిద్య్రరేఖ పరంగా చూసినా, జాతీయ సరాసరి 21.92 శాతం కాగా, 10వ స్థానంతో రాష్ట్రం 11.28 శాతాన్ని మాత్రమే కలిగి వుంది. ఓవైపు ఆర్థిక పుష్టి, మరోవైపు అతి తక్కువ మంది పేదలున్న రాష్ట్రంలో ఈ ఉచితాల అవసరం ఎందుకో ఏ ఆర్థికవేత్తకు అర్ధం కాదు. అక్కడి రాజకీయవాదులకు అంతుపట్టదు. ప్రత్యర్థుల్ని చిత్తుచేసి, ఎన్నికల్లో గెలవాలంటే, కోట్లాది రూపాయల్ని ‘తిరుమంగళం’ అనే పేరున పంపిణి చేయాల్సిందే! మొన్నటి ఎన్నికల సందర్భంగా అన్నాడిఎంకె కార్యకర్తల దగ్గర దొరికిన డబ్బే 30 కోట్లు కావడం గమనార్హం! ఇలా ఇచ్చే ఉచితాలతో 9 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు వున్నా తలకు మించిన భారంగా వీటిని ఏ రాజకీయ పార్టీ తమిళనాట భావించవు. ఈ జనాకర్షణ పథకాలకు, ముఖ్యంగా మద్యం మత్తుకు అడ్డుకట్ట వేయాలనే వారు వున్నా వారి సంఖ్య, ఉద్యమాలు చాలా తక్కువనే. గత సంవత్సరం ఆగస్టులో వైకో తల్లిగారైన మరియమ్మల్ స్వంత ఊరు కలింగపట్టిలో తస్మాక్ దుకాణాల్ని తగలబెట్టింది. అంతకుముందే జులైలో శశి పెరుమాళ్ అనే పౌరుడు సెల్ టవరెక్కి మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా దూకి చనిపోయాడు. అదే సంవత్సరం అక్టోబర్ 30న మద్యాన్ని నిషేధించాలంటు ప్రచారం చేస్తున్నాడనే నెపంతో కోవన్ అనే జానపద గాయకున్ని జయ ప్రభుత్వం అరెస్టుచేసింది. ఈ పరిణామాలతోటే, డిఎంకె తనకు తిరిగి అధికారాన్ని అప్పజెప్పితే పూర్తి మద్య నిషేధాన్ని అమలు చేస్తానని ప్రకటిస్తే, తనకే తిరిగి అధికారానిస్తే దశల వారిగా మద్య నిషేధం అమలు చేస్తానంటూ, స్వయంగా జయలలిత నటించిన ‘నీన్గనల్లా ఇరుక్కనుం’ అనే సినిమా ద్వారా ప్రచారం చేయించింది. అయినా ఎంజిఆర్ విగ్రహం నీడనే తాగే దృశ్యాలు అక్కడ సర్వసాధారణం.
ఏ కోవలో చూసినా, చైతన్య పూరితంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జనాల్ని ఎదిరించని వ్యవస్థ తమిళనాడుది. కుటుంబాలుగా, వ్యక్తులుగా ఆస్తుల్ని పోగుచేసుకోవడమే కాదు, అవే పరిమితులతో రాజకీయాల్ని చెలాయిస్తూ వ్యక్తి ఆరాధనకే పెద్దపీట వేయడం అన్నాదురై శకం ముగిసిన తర్వాత ఎంజిఆర్‌తోనే ప్రారంభమైంది. వీటిని నియంత్రించే రాజకీయం, రాజకీయ వ్యక్తులు వెతికినా కానరాదు, కానరారు. స్వంతగా టీవి చానెళ్ళను పెట్టుకొని ప్రచారం చేసుకోవడం అక్కడి రివాజు. డిఎంకెది కుటుంబ పాలన కాగా, జయలలితది ఒంటెత్తు పాలన. కోట్లాది రూపాయల స్థిర, చర ఆస్తుల్ని, మోయలేనంత బంగారాన్ని, ఎత్తలేనంత వెండిని, తొడగలేనన్ని చెప్పుల్ని, కట్టలేనన్ని చీరల్ని పోగు చేసుకుంది. ఇవి ఎలా పోగుపడ్డాయో, ఎందుకు పోగుపడ్డాయో అర్ధంకాని వ్యవస్థ మనది. అందుకే కర్ణాటక సిబీఐ ప్రత్యేక కోర్టు 4 సం.లా జైలుశిక్ష, రూ.100కోట్ల జరిమానా విధించినా, హైకోర్టుచే నిర్దోషిగా బయటకు రాగలిగింది.
వీటన్నింటిని ప్రజాస్వామిక ప్రతీకలని నమ్మితే, ప్రచార సాధనాలు పదే పదే వీటినే చూపితే, అమ్మ మరణాన్ని జీర్ణించుకోలేని అన్నార్థుల వేదనాభరిత తమిళుల బాధ దేశ బాధ కావల్సిందే! ఉద్యోగుల హక్కుల్ని ఉక్కుపాదంతో నలిచినందుకు సుప్రీంకోర్టు చేతనే శభాష్ అనిపించుకున్న ఉక్కు మహిళ నిజానికి ప్రధానమంత్రి కావల్సిందే! పెరియార్, అన్నాదురైలతో సహా ఇందిరాగాంధీ మళ్లీ పుట్టి ‘పురుచ్చితలైవి’ నుంచి
గుణపాఠాలు ేర్చుకోవాల్సిందే!

- జి.లచ్చయ్య సెల్: 94401 16162