మెయన్ ఫీచర్

సమాధానాలు లేని సమీప భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేర్లు బాగున్నాయి. వాటి అర్థాలు బాగుంటాయని ఏ ఒక్కరూ అనుకుని ఉండరు. ఒక పేరు- ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సు. అనగా ‘ఆసియా హృదయ సదస్సు’ అని. మరొక పేరు అమృత్‌సర్ లేదా అమృత సరోవరం. అక్కడ ఈ మధ్య సమావేశమైన అధినేతలు, అగ్ర నాయకుల్లో భారత్, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, రష్యా, చైనా వగైరా దేశాలవారున్నారు. ముందుగానే అనుకున్నట్లు చివరకు ఏమీ జరగలేదు. ఇటువంటి అనేకానేక సదస్సులు, సమావేశాలలో ప్రతిసారి జరిగిన విధంగానే, ఈసారి కూడా ఎవరి మాటలు వారు పునశ్చరించి వెళ్లిపోయారు. టెర్రరిజం గొంగడి ఎక్కడిదక్కడనే ఉండిపోయింది. అందుకు ఎవరినీ నిందించలేము కూడా. ఏది జరిగితే బాగుంటుందో అందరికీ తెలుసు. కానీ, అది ఎట్లా జరగాలో ఎవరికీ తెలియదు. కొందరికి కొన్ని పద్ధతులు సరైనవనిపిస్తాయి. కొందరికవి వీలుపడవు లేదా ఇష్టం ఉండదు. మరికొందరు తమ వ్యూహాల కారణంగా వాదనలేవో చేస్తారు. చివరకు యథావిధిగా ఏమీ తేలదు. ఇదంతా సమాధానాలు లేని గతం. సమాధానాలు లేని వర్తమానం. దృష్టిని కొంత ముందుకు సారిస్తే- సమాధానాలు లేని భవిష్యత్తు అని కూడా అనిపిస్తుంది.
టెర్రరిజంపై ‘అమృతసదస్సు’లో భారత, అప్ఘానిస్థాన్‌లు పాకిస్థాన్‌ను నిలదీసాయి. ఉగ్రవాద సంస్థలు, వాటి కార్యకలాపాలు తమ దేశంలో లేనే లేవని పాకిస్థాన్ నిరాకరించలేదు. చర్యలు తీసుకుంటున్నామని, వాటి కార్యకలాపాల వల్ల తాము కూడా బాధితులమేనని పాక్ విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. భారత, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లతోపాటు స్వయంగా పాకిస్థాన్ కూడా నష్టపోతున్నమాట నిజమే. అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి కూడా నిజమే. కాని అన్నీ చివరకు అబద్ధంతో సమానమవుతున్నాయన్నది సైతం నిజమే. ఇదొక తెగని చిక్కుముడి. దీనిని అర్థం చేసుకోవటం ఎట్లాగన్నది సమాధానం లేకుండా మిగిలిపోతున్నది.
పాకిస్థాన్ కేంద్రంగా జరుగుతున్న టెర్రరిజం వల్ల ఇంత తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ భారత్ స్వయంగా కాని, భారత-అప్ఘానిస్థాన్‌లు కలిసి గాని పాకిస్థాన్‌పై ఎందువల్ల యుద్ధం చేయటం లేదు? కనీసం భారీఎత్తున సైనిక దాడులు ఎందుకు సాగించటం లేదు? ఈ ప్రశ్నలకు అందరూ చెప్పుకునే రొటీన్ జవాబులు కొన్నున్నాయి. పాక్ సైన్యం ఓడినా తగినంత నష్టం చేయగల బలం ఉందని, వారివద్ద అణ్వస్త్రాలున్నాయని, అక్కడి రాజకీయ నాయకత్వం ఆదేశాలను సైన్యం పాటిస్తుందనే హామీలేదని, సైన్యానికి ఇండియాతో రాజకీయాలకు మించిన వైరం ఉందని వగైరా. వీటన్నింటిలోనూ ఒకమేర నిజముంది. ఇవిగాక మరొక వివరణ కూడా తెలిసిందే. అక్కడి మిలిటెంట్ సంస్థలు, మతపరమైన తీవ్రవాద సంస్థలపై ప్రభుత్వానికి నియంత్రణ లేనందున, ఒకవేళ కోరుకున్నప్పటికీ సరిగా నియంత్రించలేక పోతున్నారని. ఆ కారణంగా నష్టాలు పొరుగు దేశాలతోపాటు తమకుకూడా కలుగుతున్నాయని. ఇది కూడా కాదనలేనిదే.
ఉదాహరణకు పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో అక్కడి ఉగ్రవాద మత సంస్థలకు బలికావటం, జనరల్ ముషార్రఫ్‌పై అధ్యక్షునిగా ఉన్నపుడు పలుమార్లు హత్యాప్రయత్నాలు జరగటం తెలిసిందే. రాజకీయ, సామాజిక ప్రముఖులు అనేకులు హత్యకు గురయ్యారు. సైనిక కేంద్రాలు కూడా వారి దాడులకు అతీతం కాలేదు. గత అక్టోబర్ చివరి వారంలో క్వెట్టాలోని పోలీస్ అకాడమీపై జరిగిన ఉగ్రదాడిలో 60మందికి పైగా శిక్షణార్థులు చనిపోయారు. అదే విధమైన తీవ్రస్థాయి దాడులు అంతకుముందూ జరిగాయి. పాకిస్థాన్ అంతర్గత పరిస్థితులతో పరిచయం లేని వారికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. టెర్రరిజం వల్ల స్వయంగా పాకిస్థాన్ కూడా నష్టపోతున్నది గనుక, ఆ ‘సానుభూతి’ భావంతో, టెర్రరిస్టు కార్యకలాపాల వల్ల తమకు హాని జరిగినా పొరుగుదేశాలు మిన్నకుండలేవుగదా. ఇదే ఆలోచనతో అమెరికా ఒకవైపు ఇస్లామాబాద్‌పై దౌత్యపరంగా వత్తిడి చేస్తూనే పాక్ వాయవ్య ప్రాంతంలో డ్రోన్ దాడులు సాగించటం లేదా? భారత ప్రభుత్వం ఇతరులందరికన్నా ఎక్కువ నష్టపోతూ కూడా అదే పని చేయనిది ఎందువల్ల?
అణ్వస్తక్రోణం కాదనలేనిది. పాకిస్థాన్‌కు అణ్వస్త్రాలు లేకముందు ఇండియా యుద్ధాలు చేయటం నిజం. ఆ తర్వాత ఆ కారణం ఒక అవరోధం కావటం కూడా నిజం. కాని విషయం అంతమాత్రమేనా? అట్లా తోచదు. భీకరమైన సైనిక దాడులు జరిపినా, యుద్ధం చేసి పాకిస్థాన్‌ను చిత్తుచేసినా టెర్రరిజం కొంత బలహీన పడవచ్చు గాని సమసిపోయే అవకాశం కన్పించదు. సమస్య మరింత వికృతం అయినా కావచ్చు. అపుడిక పాక్ టెర్రరిస్టు సంస్థలతో భారత భద్రతాదళాలు తన భూభాగం నుంచి మాత్రమే గాక, ఆ లోపలకు ప్రచ్ఛన్నంగా ప్రవేశించి నిరవధికంగా పోరాడవలసి రావచ్చు. ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నట్లయితే ఆ సమస్య తీవ్రత మరొక రూపంలో వెన్నాడుతుంది తప్ప, సమస్య అంటూ వౌలికంగా తేలదు.
అందువల్లనే భారత సైన్యం భారీఎత్తున దాడులు గాని, యుద్ధం గాని చేయటం లేదనుకోవాలా? జాగ్రత్తగా ఆలోచించినపుడు ఈ అభిప్రాయాన్ని కొట్టివేయటం తేలిక కాదు. సమస్యకు మూలం పాకిస్థాన్ ఒక విఫల రాజ్యం కావటంలో ఉంది. ‘విఫలరాజ్యం’ అన్న మాటకు అర్థం కేవలం పరిపాలనా వ్యవస్థ కాదు. అక్కడి సమాజం, జాతి నిర్మాణం, ఈ వ్యవస్థలన్నింటి సుస్థిరతలు, ఎదుగుదల అనే అర్థాలలో కూడా ఆ మాటను వాడుతున్నాము. అదే సరైనది కూడా. వీటన్నింటి వైఫల్యానికి, ఈ తీరున తీవ్రవాదం పెరుగుదలకు, దానిని రాజ్యవ్యవస్థలోనే ఒక వర్గం పెంచి పోషించటానికి, మొత్తం మీద ప్రభుత్వం పరిస్థితిని అదుపుచేయలేక పోవటమేగాక స్వయంగానూ అందుకు నష్టపోయే దశ వచ్చేసింది. అటువంటి స్థితి సున్నితమైనది, ప్రమాదకరమైనది కూడా అయినపుడు దానితో చాకచక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. టెర్రరిజం వల్ల ఎదురవుతున్న నష్టాలు ఎంతమాత్రం ఆమోదించదగ్గవి కాకపోయినా, తీవ్ర ప్రతిచర్యలు తీసుకోక తప్పనివి అయినా, భారత ప్రభుత్వం ఒకస్థాయి చర్యలు తీసుకుంటూనే చాకచక్యంతో ఓపికగా వ్యవహరించటానికి కారణం ఇదేనని భావిస్తే పొరపాటు కాబోదు. ఇటువంటి వ్యవహరణే గత ప్రభుత్వాలు చూపాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా చూపుతున్నది.
అమృతసర్ సదస్సులో కచ్చితంగా ప్రతిఫలించిన పరిస్థితులు ఇవే. తమపై టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతున్న సంస్థలపై పాక్ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవటం లేదని- ఒక స్థాయిలో రాజకీయంగా అనటం గతం నుంచి ఉన్నప్పటికీ వివరాలలోకి వెళితే కనిపించేవి కొన్నున్నాయి. రాజకీయ ప్రభుత్వం పనుపున కాకపోయినా, సైన్యంలోని ఒక వర్గం ప్రోద్బలంతో ఈ చర్యలు సాగుతున్నాయనే మాట వాటిలో ఒకటి. దీనిని స్టేట్ యాక్టర్స్, నాన్-స్టేట్ యాక్టర్స్ పేరిట కొంత తేడాగా చూసారు. చర్యలైతే తీసుకుంటున్నారు గాని కొన్ని సంస్థలపై తీసుకుని మరికొన్నిటిని మినహాయిస్తున్నారనేది రెండవ మాట. ఈ రెండవ మాట ఇపుడు అమృత్‌సర్‌లో మళ్లీ విన్పించింది.
ఈ వివరాలన్నీ ఎట్లున్నా అవి పాకిస్థాన్ అంతర్గత పరిస్థితి. వాటి ప్రభావాలను ఆమోదించవలసిన అగత్యం పొరుగు దేశాలకు ఉండదని పదే పదే చెప్పుకోవలసిన అవసరం లేదు. పైగా ఈ సంవాదాలు, ధర్మసందేహాలు గతం నుంచి ఉన్నవే. కావలసింది సమస్యకు పరిష్కారం ఏమిటన్నది. స్పష్టమైన, శాశ్వతమైన పరిష్కారాలు కనుచూపుమేరలో కన్పించటం లేదు. చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉండటం ఒకటే మార్గం. దౌత్యపరంగా, ఆర్థికంగా, నైతికంగా, అంతర్జాతీయంగా, ఆ వత్తిడులు, చర్యలు అక్కడి ప్రభుత్వంపై, రాజకీయ నాయకత్వాలపై, సైన్యంపై, ఉగ్రవాద సంస్థలపై, సమాజంపై ఉండాలి. ఈ విధమైన వత్తిడులను వీలైనంత స్థాయిలో నిరంతరం కొనసాగిస్తూపోవటం తప్ప సమీప భవిష్యత్తులో మార్గాంతరం కన్పించదు.
గమనించదగిన ముఖ్యమైన విషయం ఏమంటే, పాకిస్థాన్‌లోని వివిధ రంగాలు ఏవీ ఇపుడున్న స్థితినుంచి బయటపడి సాధారణ ప్రజాస్వామిక స్థితికి చేరగల అవకాశాలు ఇప్పట్లో లేవు. ముందుగా రాజకీయాలను చూస్తే అక్కడి ప్రధాన పార్టీలైన పీపుల్స్ పార్టీకి, ముస్లిం లీగ్‌కు ప్రజలలో స్వంత పునాదులు బలంగానే ఉన్నాయి గాని, సైన్యం ప్రాబల్యం కారణంగా స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం లేదు. మొదటి నుంచి గల ఈ పరిస్థితి మారే అవకాశం కనుచూపుమేరలో లేదు. అదే పద్ధతిలో, స్వయంగా తన ప్రాబల్యం, ఇండియా అంటే దేశ విభజన నాటినుంచే గల భయం, అది ఇప్పటికీ కొనసాగుతున్న స్థితి వంటి కారణాల వల్ల సైన్యం మారబోదు. పాకిస్థాన్‌లో మూడవ ముఖ్యమైన భాగం అక్కడి సమాజం. అక్కడి ప్రజలు వివేకవంతులు, చైతన్యవంతులనటంలో సందేహం లేదు. వారు ఇతర దేశాల ప్రజలకు వలెనే అభివృద్ధిని, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛలను కోరుకుంటున్నారు. మత భావనలు సహజ రీతిన ఉన్నాయి తప్ప మతతత్త్వవాదులు కారు. తీవ్రవాద మత సంస్థలకు, టెర్రరిజానికి ఆదరణ పరిమితంగా ఉండటం అందువల్లనే. కాని స్వతంత్రమైన సామాజికోద్యమాలు, సంస్థలు లేనట్లే లెక్క. అవి ఏర్పడినా భద్రతాదళాల కారణంగా మనుగడ సాగించలేవు. ప్రధాన రాజకీయ పక్షాలు కూడా వాటిని అంగీకరించవు. ఈ విధంగా మూడవశక్తి లేదా ప్రత్యామ్నాయం అంటూ ఏదీ పాకిస్థాన్ సమాజంలో లేదు. అది రూపు తీసుగోగల అవకాశం కనుచూపు మేరలోలేదు.
పాకిస్థాన్ పరిస్థితి ఈవిధంగా మారటానికి మూలాలు దేశ విభజన నాటి నుంచే ఉన్నాయి. అంతకుముందు నుంచి ఉన్నాయి. వాటి చర్చకు ఇది సందర్భం కానందున అట్లుంచితే, తర్వాతి కాలంలో తమ దేశ భవిష్యత్తును, అభివృద్ధి అవసరాలను, మారుతున్న ప్రపంచాన్ని, భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని పాకిస్థాన్ రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, సైన్యం అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించి ఉంటే పరిస్థితులు క్రమంగా మారేవి. పాకిస్థాన్ చరిత్ర మరొక విధంగా ఉండేది. ఆ ప్రభావం పాక్- భారత్ సంబంధాలపైనే గాక మొత్తం దక్షిణాసియాపై సానుకూలంగా ఏర్పడేది. దశాబ్దాలు గడిచినా అది జరగకపోగా అనేకానేక ప్రతికూల పరిణామాలతో పాకిస్థాన్ ఒక విఫల రాజ్యంగా మారింది. ఈ సుదీర్ఘ నేపథ్యంలో జరిగిన అమృత్‌సర్ ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సులో ఇంతకన్న ఒరిగేది ఏమిటి?
*

టంకశాల అశోక్ 98481 91767