మెయిన్ ఫీచర్

దైవతత్వం దేదీప్యమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుర్మాసం ముప్పయి రోజులు
కారణజన్మురాలైన గోదాదేవి, అండాళ్ తల్లి శ్రీరంగనాథుని అర్చించి, రోజుకొక పాశురములో ఆరాధించి, మకర సంక్రాంతికి ముందురోజైన ‘్భగి’నాడు వివాహమాడింది. తోటి స్నేహితురాండ్రతో ధనుర్మాసంలో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించింది. ఆ పాశురములే ‘తిరుప్పావై’ ప్రబంధమయింది. ‘తిరు’ అంటే శ్రీపదం, ‘పావై’ అంటే వ్రతము, శ్రీవతం, మార్గళీవ్రతం,
మేలినోముగా ప్రసిద్ధి చెందింది.
**
‘‘యాదృశీ భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశీ’’
భారతీయ సాంప్రదాయంలో పరమాత్మని ఏయే రూపంలో ఆరాధిస్తే ఆయా రూపంలోనే పరమాత్మ భక్తులను అనుగ్రహిస్తాడని చెప్పబడింది. దీని కనుగుణంగానే మనం భాద్రపదమాసంలో వినాయకుణ్ణి, ఆశ్వయుజ మాసంలో అంబికను, కార్తికమాసంలో పరమశివుణ్ణి, మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని, పుష్యమాసంలో (మాఘంలో కూడా) సూర్యుణ్ణి అర్చిస్తాం, ఆరాధన చేస్తాం, ఉపాసిస్తాం. అందుకే ఆదిశంకరాచార్యులు పంచాయతన పూజావిధానాన్ని ఏర్పరచటం జరిగింది.
అలాగే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దత్తాత్రేయుడు మొదలగు అవతారములను, కారణ జన్ములయిన దివ్య పురుషులను ఆరాధిస్తున్నాం. వీరితోపాటు ‘కాలాన్ని’ కూడా పరమాత్మ స్వరూపంగా ఆరాధిస్తున్నాం. కాలాన్ని పురుషాకారంగాను, స్ర్తిరూపంగాను అర్చించి, ఆయా సమయాలలో పండుగలు చేసుకుంటాం, నోములు, వ్రతాలు ఆచరిస్తాం. ఇదీ మన భారతీయ సంస్కృతి.
విష్ణు సహస్రనామములలో ‘ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః; ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః’ అని కాలాన్ని స్థితికారకుడైన విష్ణురూపంగాను, ‘కాలః కలయతామహమ్’- కాల స్వరూపమే నేను అని గీతాచార్యుడు చెప్పినట్లుగా, ‘కాలాయనమః కాల కాలః కృపానిధిః’ అని శివ సహస్రనామ, అష్టోత్తర శతనామావళిలో పేర్కొన్నట్లు కాలాన్ని కూడా పరమేశ్వర రూపంగా భావించి ఆరాధిస్తాం.
అలాగే కాలాన్ని, కాళీమాత స్వరూపంగా స్ర్తిరూపంలోనూ పూజిస్తున్నాం. అందుకే ‘కాలానికి రాణి’ అని కీర్తించాడు కామాక్షీదేవిని కామాక్షీ వరప్రసాది, లయబ్రహ్మ శ్యామశాస్ర్తీ.
‘‘కాలే జాతే జీవతి ప్రియతే చ కాల కర్మవశాత్, కాలాధీనం సర్వం తస్మై నమోస్తు కాలదేవాయ’’ జనన మరణాలు సర్వము కాలాధీనమే. ఆ కాలదేవునికి నమస్కారము. ‘షూణ్ ప్రేరణే సువతి ప్రేరయతి వ్యాపారేషు ఇతి సూర్యః’ మనల్ని ప్రేరేపించి జగద్వ్యవహారమును నడిపేవాడు సూర్యభగవానుడు. సర్వాధారుడు, జ్యోతిర్మయుడు, సర్వవ్యాపక స్వరూపుడు సర్వాన్తర్యామి సకలస్రష్ట సకల దేవతా స్వరూపుడు- శ్రీ సూర్యభగవానుడే కాలదేవుడు.
సూర్యభగవానుడు ఉదయించి అస్తమించి మరల ఉదయించే సమయంలో మనకి మన జీవితంలో ఒకటి పెరుగుతుంది, ఒకటి తరిగిపోతుంది. ఏవిటవి? తరిగిపోయేది ఆయుష్షు, పెరిగేది వయస్సు. జీవులందరూ సూర్యుని ఆత్మస్వరూపులు. కనుక జీవుల జనన మరణాలు సూర్యగమనం మీద ఆధారం. కాలస్వరూపుడు - సూర్యభగవానుడు.
ఇరువది ఏడు నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి నాల్గు పాదములు వెరశి నూట ఎనిమిది. గ్రహములు తొమ్మిది, రాశులు పనె్నండు. నూట ఎనిమిది పాదాల్ని పనె్నండుతో భాగిస్తే, తొమ్మిది. ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదములుంటాయి. ఆ విధముగా మేషాది మీన రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసం ఉండి తరువాత రాశిలో ప్రవేశిస్తాడు. ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి పేరు మీద ఆ నెలని పిలుస్తారు. ఉదాహరణకు, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన లగాయతు ఆ మాసాల్ని ‘మేషమాసం’ అంటారు. అలాగే వృశ్చిక రాశిని వదలి ధనుర్రాశిలో ప్రవేశించిన మాసాన్ని ధనుర్మాసమంటారు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేషముంటుంది.
రవి, మిధునరాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశించేరోజు- కర్కాటక సంక్రమణం- దక్షిణాయన పుణ్యకాలం అని పిలుస్తారు. రవి, ధనుర్రాశి నుండి మకరరాశిలో ప్రవేశించే సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం, మకర సంక్రమణం అని పిలుస్తారు. ఆ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ రెండూ కాలగమనంలో చాలా ప్రాముఖ్యత వహిస్తాయి.
‘్ధనురాయనం’ అనగా..
ఈమధ్యలో వచ్చేది ‘్ధనురాయనం’- అనగా, రవి కర్కాటక రాశిని వదలి, సింహ కన్య తుల వృశ్చిక రాశులను దాటి ధనుర్రాశిలో ప్రవేశించే రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్రాశిని వీడి మకర రాశిలో ప్రవేశించేవరకు 30 రోజులు ధనుర్మాసం.
ఈ ధనుర్మాసం, మార్గశిరమాసం మధ్య నుంచి పుష్యమాసం సగం వరకు ఉంటుంది. ప్రకృతంలో ధనుర్మాసము గూడా సంధికాలమే. మానవులకు రాత్రింబవళ్ళు వున్నట్లుగా దేవతలకు కూడా ఉన్నాయి. మన ఉత్తరాయణం ఆరు నెలలు అనగా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పటినుండి మిధునరాశిని వదలిపెట్టేవరకు, దేవతలకు పగలు. దక్షిణాయనం ఆరు నెలలు అనగా సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటినుండి ధనుర్రాశిని వదిలేవరకు దక్షిణాయనం, వారికి రాత్రి. మనకు రాత్రింబవళ్ళ సంధికారం- సంధ్య అయినట్లు వారికి కూడా వారి రాత్రింబవళ్ళు సంధికాలమే సంధ్య. దక్షిణాయనము ఆరు నెలలు పూర్తికాగా, వృశ్చికరాశిని దాటి సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించు సమయం దేవతల రాత్రి అవసాన సమయం. సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలో ప్రవేశించు సమయం దేవతలకు ప్రాతఃకాలము. మనకు, సూర్యోదయానికి పూర్వం రెండు గంటలు ఉషఃకాలము, బ్రాహ్మీకాలము, బ్రాహ్మీముహూర్తము, పరమ పవిత్రమైన సమయం. ఈ ధనుర్మాసం దేవతలకు ఉషఃకాలము, సంధ్యాకాలము. కనుకనే తెల్లవారు ఝామునే లేచి స్నాన సంధ్యాదులు భగవత్కైంకర్యములు నిర్వర్తించుకునే ఆచారం అమలులోకి వచ్చింది.
నెల రోజులూ పర్వదినాలే..
ధనుర్మాసం నెల రోజులు పర్వదినాలే, పండుగలే. ఇళ్ళముందు కలాపి చల్లి, రంగవల్లులు తీర్చిదిద్దుతారు. హరిదాసులు హరినామస్మరణతో మనస్సు ప్రశాంతత చెందుతుంది. రంగవల్లుల మధ్యలో గోమయంతో చేసిన గొబ్బిలమ్మలను పసుపు కుంకుమ పూలతో అలంకరించి ఉంచుతారు. ధనుర్మాసం ముప్పయి రోజులు కారణజన్మురాలైన గోదాదేవి, అండాళ్ తల్లి శ్రీరంగనాథుని అర్చించి, రోజుకొక పాశురములో ఆరాధించి, మకర సంక్రాంతికి ముందురోజైన ‘్భగి’నాడు వివాహమాడింది. తోటి స్నేహితురాండ్రతో ధనుర్మాసంలో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించింది. ఆ పాశురములే ‘తిరుప్పావై’ ప్రబంధమయింది. ‘తిరు’ అంటే శ్రీపదం, ‘పావై’ అంటే వ్రతము, శ్రీవతం, మార్గళీవ్రతం, మేలినోముగా ప్రసిద్ధి చెందింది.
‘్ధన్యతే - ప్రార్థ్యతే- ఇతి ధనుః’ అనగా ప్రార్థింపబడువాడు, ప్రార్థింపబడునది ‘్ధనుః’ అని చెప్పబడినది. సర్వకాల సర్వావస్థలలో ప్రార్థింపబడు పరమేశ్వరుడు ‘్ధనుష’ అని పిలవబడుతున్నాడు.
‘్ధనుర్థరో ధనుర్వేదో దండో దమయితా దనుః’ అన్నది విష్ణు సహస్రనామములు. శ్రీరామచంద్రుని రూపంలో కోదండమనే విల్లు చేపట్టిన శ్రీమహావిష్ణువు ధనుర్థరుడని ఆదిశంకరాచార్యులు వ్యాఖ్యానించారు. ‘ప్రణవో ధనుః’ ధనుస్సు అంటే ప్రణవం- ఓంకార ప్రణవనాదం. ఓంకారం నుంచి వచ్చినవి వేదములు. ‘్ధనురేవ వేదః’ ధనుస్సే వేదము, వేదమే ధసుస్సు. జీవిత లక్ష్యాన్ని సిద్ధింపజేసేది ‘వేదములు’, ధనుర్మాసం.
ఓంకార రూపమైన ధనుస్సును శ్రీరామచంద్రులు భగ్నం చేయగా ‘ఓం’ అనగా అ, ఉ, మ్ అని మూడు వేదములుగా లోకంలో ప్రసారమయినాయి. భంగమంటే ‘తరంగ’మని కూడా అర్థముంది. కావున, వేదములు శబ్ద తరంగములుగా ప్రసారమయినాయని అర్థం. ఇదే సీతాకల్యాణము. అదే లోక కళ్యాణము. అందుకే నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి. ‘సీతాకల్యాణ వైభోగమే’ అని శంకరాభరణ రాగంలో కీర్తించారు.
సీతాకల్యాణం- ధనుర్భంగము జరిగితేగాని జరుగదు. అలాగే ధనుర్మాస భంగము జరిగితేనే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. వాతావరణంలో శీతము భగ్నమై ఉష్ణము ప్రసరిస్తుంది. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలము వస్తుందన్నది దీని అర్థం.
‘మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా’ అన్నది లలితా సహస్రనామము. జగన్మాత చేతిలోని ఇక్షు కోదండము- మానవాళి మనస్సూ బాణములు పుష్పరూపములు. చంచలమైన మనస్సును ఏకాగ్రమొనర్చుటలో ఆ మనస్సును సున్నితముగా కూల్చు కోదండమే లలితా పరమేశ్వరీ దేవి హస్తమునందున్నది. ఇది ధనుర్మాసానికి స్ఫూర్తినిస్తుంది.
రవి, ధనుర్రాశిలో ప్రవేశించినపుడు వచ్చేది- ధనుర్మాసం. ధనూరాశికి అధిపతి - బృహస్పతి. బృహస్పతి- విద్యా ధన కుటుంబ గృహ వాహన కారకుడు. జ్ఞానప్రదాత, ‘చదువులలోని మర్మమెల్ల ఎఱిగించే’వాడు. ధనుర్మాస వ్రతంతో యివన్నీ చేకూరుతాయి.
‘కోటి నదులు ధనుష్కోటిలో నుండగా, ఏటికి తిరిగేవే ఓ మనసా’ యోగలు ధనురాకారముగానున్న కనుబొమల మధ్య స్థానమునే ధనుష్కోటియని, నదులలాగా ప్రవహించు నాడీ ద్వారముల కిది కేంద్రమని, ధ్యానయోగ లక్ష్యమని భ్రూమధ్య స్థానమును భావిస్తారు. కనుక ఓ మనసా కోటీనదులు ధనుష్కోటి భ్రూమధ్య స్థానమందే ఉండగా ఎందుకే తిరుగుతావని హెచ్చరిస్తూ, తోడి రాగంలోని త్యాగయ్య కీర్తన ధనుర్మాసానికి సంపూర్ణ దీప్తినిస్తుంది.
మానవ శరీరమే ఒక ధనుస్సు. ఆ ధనుస్సు లక్ష్యం- ఓంకార స్వరూపుడైన పరమాత్మను చేరడమే. అందుకోసం, మనస్సు అనే బాణాన్ని ఆత్మ లక్ష్యంవైపు గురిచూడాలని, దానితో సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సు కలుగుతుందని, వీటితో తనలో ఉండే పశు, రాక్షస గుణాన్ని అణచి, మానవతా విలువలను తెలిసికొని అంకురించే దైవతత్త్వాన్ని దేదీప్యమానంగా ప్రజ్వలింపజేసికొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది ధనుర్మాసం.

- పసుమర్తి కామేశ్వర శర్మ (9440737464)