మెయన్ ఫీచర్

చీకట్లో బాణం.. జనం హాహాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురిచూసి అస్త్రం సంధిస్తే అది లక్ష్యాన్ని తాకుతుంది. అదే చీకట్లో వదిలితే ఎవరికి తగులుతుందో వారి ఆర్తనాదాల తర్వాత మాత్రమే తెలుస్తుంది. పెద్దనోట్ల రద్దు అనంతరం దేశంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. తనకు తాను ఫకీరునని సగర్వంగా ప్రకటించుకున్న మోదీ- ఫకీరేతరులపై చీకట్లో సంధించిన అస్త్రం తాకిడికి దేశ ప్రజ తల్లడిల్లుతోంది. మోదీ పాశుపతాస్త్రానికి ఇప్పటివరకూ 140 మంది వరకూ నేలరాలితే, వందల సంఖ్యలో ‘క్యూ’లోనే క్షతగాత్రులయ్యారు. దర్శక, నిర్మాతగా మోదీ తీసిన ఈ ‘పెద్దనోట్ల రద్దు’ సినిమా ఆయన అంచనా ప్రకారం 50 రోజులు కచ్చితంగా ఆడుతుంది. ఇప్పటి హాహాకారాలు, చావుకేకల తీవ్రత చూస్తే ఈ సినిమా శతదినోత్సవం దాటి, రజతోత్సవం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు! ఇంతకూ మోదీ లక్ష్యం ఏమైనా నెరవేరిందా? అంటే అదీ లేదు. నల్లకుబేరుల పీచమణించేందుకు మోదీజీ అమ్ములపొది నుంచి సంధించిన ఈ అస్త్రం వల్ల నష్టపోయిన నల్లకుబేరుల శాతం కేవలం రెండు శాతమేనట. అసలు దేశంలో నల్లకుబేరులు ఎంతమంది ఉన్నారో మాననీయ విత్తమంత్రి జైట్లీకే తెలియదట. పార్లమెంటుకు స్వయంగా ఆయనిచ్చిన జవాబు ఇది! చీకట్లో మోదీ సంధించిన అస్త్రం నల్లకుబేరులకు బదులు సామాన్య ప్రజానీకానికే వజ్రాఘాతంలా తగిలిందన్నది సుస్పష్టం.
భారతీయులు ఎంత అదృష్టవంతులు?
న్యాయవ్యవస్థపై తప్ప ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేని జైట్లీ ఈ దేశానికి ఆర్ధికమంత్రి. సంస్కరణలు, పారిశ్రామికవేత్తలతో సహవాసం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగిన విశాలమైన ఛాతీ ఉన్న మోదీ మనకు ప్రధాని. వీరిద్దరి సారథ్యంలో మనదేశ ఆర్థిక వ్యవస్థ సామాన్యులను అగచాట్లు పెట్టే ప్రయోగశాలగా మారినందుకు మురిసి ముక్కలవాల్సిందే. పెద్దనోట్ల రద్దే ‘నల్ల’నాగుల కోసమయితే, అలాంటి నల్లనాగులు ఎన్ని ఉన్నాయో కనీస అంచనా కూడా లేకుండా నిర్ణయం తీసుకున్నారంటే అది ప్రజలను పరిహసించడమే. పోనీ సర్కారు దయదలచి వారానికి ఇస్తున్న ఆ ముష్టి 24 వేల రూపాయలైనా సక్రమంగా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. సామాన్యులను తిప్పలు పెట్టి, వారి ఉసురుపోసుకుని, అదే సంస్కరణగా ఆనందిస్తున్న పాలకులు కొత్త కరెన్సీ ‘కట్టలపాము’లను మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. ‘నల్ల’నాగులకు అనే్నసి లక్షల కొత్త నోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయన్న సామాన్యుడి ప్రశ్నకు జవాబు ఇచ్చే దమ్ము సర్కారుకు లేదని వారి వౌనమే చెబుతోంది. భక్తాగ్రేసరుడైన టిటిడి మెంబరు శేఖర్‌రెడ్డి ఇంట్లో అన్ని వందల కోట్ల కొత్త కరెన్సీ ఇచ్చిందెవరు? సామాన్యుడి మాదిరిగా ఆయన ఎన్ని వందల, వేల సంవత్సరాలు క్యూలో నిలబడితే అంత డబ్బు చేతికి వస్తుంది? నగదు పంపిణీ చేసే ఆర్‌బిఐలోనే ఇంటిదొంగలు పట్టుబడితే పరిస్థితి ఏమిటి? రోజూ కొత్త నోట్ల కట్టలతో పట్టుబడుతున్న వ్యాపారులిస్తున్న సంకేతాలేమిటి? మరెందరో మహానుభావుల ఇళ్లలో గుట్టలంత ఎత్తు పెరిగి, బుసలు కొడుతున్న నల్లనాగులను పట్టుకోకపోతే మరి మోదీ సంధించిన ఈ అస్త్రం ఎవరికి తగులుతున్నట్లు? అభం శుభం తెలియని సామాన్యులకే కదా! సామాన్యులు చేసుకున్న పాపమేమిటి? ‘నల్లదొరలు’ చేసుకున్న పుణ్యమేమిటి? ముందు నల్లనాగుల కోరలు పీకేందుకే పెద్దనోట్లు రద్దు చేశామని ప్రచారం చేసుకున్న మోదీ అండ్ కో, జనాగ్రహం తర్వాత ఆ నినాదాన్ని అటకెక్కించి, నగదు రహిత నినాదాన్ని తెరమీదకు తీసుకురావడం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడమే! మోదీ నుంచి బాబు, కేసీఆర్ వరకూ అంతా నగదురహిత రాగం ఆలపిస్తున్నారు. మంచిదే. మరి వారి ఆశలు సాధ్యమా? కానేకాదని స్వయంగా ఆర్థికమంత్రి జైట్లీగారే సెలవిచ్చారు. నగదు రహిత విధానం ప్రత్యామ్నాయ మార్గమేనని చావుకబురు చల్లగా చెప్పారు. అనుభవమైతేనే తత్వం బోధపడటం అంటే ఇదే మరి! ఇంతోటి దానికి రోజూ నగదు రహిత ప్రచారాన్ని ఊదరగొట్టడం ఎందుకు? నల్లధనం సంగతి వదిలేసి, నగదు రహిత నినాదం ఎత్తుకోవడం అంటే ముఖం చాటేయడమే. అయినా అధికారుల ‘మైండ్‌సెట్’ మారినట్లు లేదు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో అసాధ్యమని జైట్లీ చెబుతుంటే, నీతి ఆయోగ్ ఆసాములు మాత్రం పర్సులో పైసలు తీస్తే పన్నులేస్తామని చెప్పటం మతిలేనితనమే. రాజకీయ పార్టీలకు శత్రువులెక్కడో ఉండరు. ‘అధికార వ్యవస్థ’ అనే పడగ వారి పక్కనే ఉంటుంది. ఏసీల్లో కూర్చుని సామాన్యుల రాతను లిఖించే అధికారుల మాటలు పాలకులకు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి. తామెంత తప్పుచేశామన్నది అధికార వియోగానంతరం గానీ వారికి తెలియదు!
ఎన్టీఆర్, జయలలిత వంటి మహానేతలు అధికారుల మాటలు వినకుండా పథకాలు అమలు చేసినందుకే ఇప్పటికీ సామాన్యుల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు. అధికారుల మాటలు విని, వారిని నెత్తినెక్కించుకుని అధికారం కోల్పోయానని ఎపి సిఎం చంద్రబాబు గతంలో కొన్ని డజన్లసార్లు వాపోయారు. మళ్లీ ఇప్పుడు ఆయన పార్టీని మరుగుజ్జును చేసి అధికారులను అందలమెక్కిస్తున్నారు. అనుభవం అయినా ఇంకా తత్వం బోధపడలేదేమో మరి?!
బ్యాంకులకు నగదు పంపిణీ చేయాల్సిన బాధ్యత ఆర్‌బిఐది. వారు ఇచ్చే నగదునే ఖాతాదారులకు ఇస్తారే తప్ప, బ్యాంకు ఉద్యోగులు తమ జేబుల నుంచి సర్దుబాటు చేయలేరు కదా? ఆ సున్నిత అంశం గమనించకుండా, రోజువారీ టెలీకాన్ఫరెన్సుల్లో బ్యాంకర్ల మీద అసంతృప్తి వ్యక్తం చేయడం బాబు వంటి ఆర్థిక మేధావికి తగదు. నగదు రహిత నినాదోద్యమాన్ని మొదలుపెట్టిన బాబు కూడా చివరాఖరుకు అది అసాధ్యమని సెలవిచ్చారు. ఆర్థికరంగం మీద పట్టు ఉన్న ప్రముఖుడిగా దేశంలోనే పేరొందిన చంద్రబాబు కూడా పెద్దనోట్ల రద్దు అనంతర ప్రమాదాన్ని అంచనా వేయడంలో తప్పులోకాలేయడం వింతే! పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజల్లోనే కాదు. ‘కమల దళాల’కూ అసహనం పెరుగుతోంది! ప్రస్తుత పరిస్థితులతో తనకూ అసహనం పెరిగిందని ఏపి బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు నిజాయితీగా ఒప్పుకున్నారు. మోదీ నిర్ణయం మంచిదేగానీ అమలు మాత్రం లోపాలపుట్ట అని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం..‘్ఠఠ్ మీకేం తెలుస’ని ఎంపీలపై గుడ్లురుముతున్నారు. అధికారంలో ఉన్నవారికి కళ్లు ఎక్కడో ఉంటే చివరికి జనమే వాటిని సరిచేస్తారు.
చిన్ననోట్ల కష్టాలపై గుండెలవిసేలా అరుస్తూ, నోట్లమార్పిడిలో అవినీతి జరుగుతోందని నోరుపెట్టుకుని మాట్లాడుతున్న కాంగ్రెస్, జెడియు, ఎస్‌పి, ఎన్‌సీపీ వంటి పార్టీల మహానుభావులే- కమీషన్లు ఇస్తే పాత నోట్లు మార్చేస్తామని నిర్లజ్జగా చెప్పిన వీడియో టేపులొక్కటి చాలు. ఆ అంశంపై వారికి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పడానికి! మొబైల్ బ్యాంకింగ్, నగదు రహిత వ్యవస్థపై రోజూ తెగ మాట్లాడుతున్న నేతాశ్రీలు- వాటిలో చిప్ తయారీ చేసే క్వాల్‌కామ్ అనే దిగ్గజ సంస్థ చేసిన హెచ్చరిక ఓ గుణపాఠం. యాప్‌లు హార్డ్‌వేర్ సెక్యూరిటీ ఫీచర్లను వినియోగించడం లేదని, కాబట్టి అవి సురక్షితం కాదని తేల్చేసింది. కేంద్ర ఐటి శాఖ కూడా నగదు లావాదేవీల కోసం వినియోగించే యాప్‌లు సురక్షితం కాదని నిర్మొహమాటంగా చెప్పింది. పైగా మన గ్రామీణ ప్రజలకు మొబైల్ బ్యాంకింగ్ మీద అవగాహన శూన్యం. వారిని మోసం చేయడం బహు సులభం. కొన్ని నెలల క్రితం వరకూ దేశంలో 30 లక్షల డెబిట్‌కార్డులు హ్యాకింగ్‌కు గురయ్యాయని నగదు రహిత విప్లవకారులకు తెలియకపోవడం విస్మయకరం. వారినలా పక్కకుపెడితే ఏపి ఐఏఎస్ మహనీయులే, వాటిని 20 శాతానికి మించి వాడటం లేదంటే మరి సర్కారు సూక్తులు ఎవరి కోసం? అంటే అసలు ఇలాంటి మతిలేని ఆలోచనలు వచ్చే ఐఏఎస్‌లకే..మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ విధానంపై ఆసక్తి, అవగాహన లేకపోతే సామాన్యుల నుంచి దానిని ఆశించడం అన్యాయం కదా? కళ్లెదుట ఇన్ని కఠోర నిజాలు, వాస్తవ నివేదికలు కనిపిస్తున్నా బ్యూరోక్రాట్లు నగదు రహిత విధానానికి, బంపర్ ఆఫర్ల ప్రకటన కొనసాగించడం అహంకారమా? అమాయకత్వమా? సామాన్యుడు చచ్చీచెడి 2 వేలు సంపాదించేందుకే ఆపసోపాలు పడుతుంటే నల్లకుబేరులకు అన్ని వందల కోట్లు ఎలా వస్తున్నాయన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు సర్కారు బెల్లం కొట్టిన రాయి అయింది. సుప్రీం కోర్టు జడ్జిలే పెద్దమనసుతో తమ ఖర్చులు మానుకుని సిబ్బందికి ఏటిఎంల వెసులుబాటు కలిగించాల్సిన దుస్థితి. ఐదేళ్ల పరిమిత అధికారమే దక్కించుకుని, మరో రెండున్నరేళ్లలో జనం ముందు ఓట్లకు దేబిరించాల్సిన పార్టీలకు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే అధికారం, నైతిక అర్హత ఉందా?
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144