మెయన్ ఫీచర్

హేతుబద్ధత లేని పాఠ్యపుస్తకాల రచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్ ప్లాన్ ఈజ్ హాఫ్ డన్ (well plan is half done) ) అనేది ఓ ఆంగ్ల సామెత! ఓ ఆచరణాత్మక ఆలోచన పది కాలాలపాటు కొనసాగాలంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కావాలి. దేశం, ఓ రాష్ట్రం ప్రణాళికా రహితంగా మన జాలదు. ప్రతి వ్యవస్థ ప్రణాళికాబద్ధంగా రూపొందాల్సిందే. ఈ వ్యవస్థల్లో విద్యారంగం అతి కీలకమైనది. ఓ ఇంటి రీతిని వాకిలి తెలిపినట్లు ఒక ఆవాసంలో వుండే పాఠశాల ఆ ఆవాస సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలకు అద్దంపడుతుంది. ఇదే సూత్రీకరణ యావత్ దేశానికి వర్తిస్తుంది. లోపభూయిష్టమైన విద్యావ్యవస్థ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించలేదు. గత 70 సం.గా, మన దేశంలో ప్రజాతంత్ర విద్యావ్యవస్థ రూపుదిద్దుకోకపోగా, ఇంకా భూస్వామ్య, వలస వాద నీతినే అవలంబిస్తున్నది.
మన విద్యావ్యవస్థ రూపురేఖల గూర్చి, విధి విధానాల గూర్చి గతంలో అనేక కమిటీలు విలువైన సిఫారసులు చేసాయి. పైపైవి కొన్ని ఆచరణలోకి రాగా, చాలా అంశాలు నివేదిక పుటల్లోనే మిగిలిపోతున్నాయి. విద్యాహక్కు చట్టంతోపాటు జాతీయ విద్యాప్రణాళికా చట్రం దశాబ్దకాలం క్రితమే మెరుగైన సూచనల్ని చేసింది. విద్యారంగం ఉమ్మడి జాబితాలోవున్నా, 2005నాటి విద్యాప్రణాళికా చట్రం రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. తదనుగుణంగా పాఠ్య ప్రణాళికల్ని రూపొందించుకోవాలని తెలిపింది. ఈ కోవలోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2011లో ఓ పాఠ్య ప్రణాళికా చట్రాన్ని తయారు చేయించింది కూడా! దీనికి లోబడి పుస్తకాల రూపకల్పన జరిగినా, ఏ పుస్తకమూ ఓ వార్షిక సంవత్సరానికి దాటి కొనసాగించలేదు. నిజానికి ఓ పాఠ్య పుస్తకం దాదాపు దశాబ్దకాలంపాటు కొనసాగుతుంది. మారిన కాల పరిస్థితులకు అనుగుణంగా చేర్పులు మార్పులతో జరగడమో, కొత్త పుస్తకాలు రూపొందించేవారు. ఏది జరిగినా నిబంధనలకు లోబడి జరగాల్సిందే!
దీనికి విరుద్ధంగా ఆరేడు సంవత్సరాలుగా ఏదో కారణం చూపుతూ పాఠ్య పుస్తకాల్ని సమూలంగా మార్చుతున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం అని, బోధనా పద్ధతుల్లో మార్పని, విద్యాచక్రానికి లోబడి అంటూ, పాలన మారిందంటూ పుస్తకాల్ని మార్చుతున్నారు. ఇలా మార్చిన పుస్తకాలు విద్యార్థుల్లో పఠనాశక్తిని, విజ్ఞానాన్ని పెంపొందించాయా అంటే, అసర్ (Aser) సర్వేతోపాటు, న్యూపా (NEUPA) లాంటి కేంద్ర ప్రభుత్వ అధ్యయన సంస్థలు పెదవి విరుస్తూనే వున్నాయి. ఇక తరగతి గది ఉపాధ్యాయులది గళమెత్తని పాత్రనే! మార్చిన పుస్తకాన్ని వల్లెవేయడం, ఎత్తి చదవడమేగాని విమర్శనాత్మక దృష్టితో ఏనాడు చూసింది లేదు. పుస్తకాల మార్పు పదే పదే ఎందుకు జరుగుతున్నదో వారికి తెలుసుకునే ఓపికా లేదు.
2011నుంచి ఉమ్మడి రాష్ట్రంలో, 2015 నుంచి తెలంగాణలో ఇలాంటి అపశ్రుతులే చోటుచేసుకుంటున్నాయి. భాషా బోధనకు ఓ తార్కిక దృక్పథాన్ని అవలంబిస్తారు. అక్షర, పద, వాక్య పద్ధతిలో బోధన అనేది ఒకటి కాగా, గతంలో ఒకటి, రెండు తరగతులు మాతృభాషా పుస్తకాల బోధన అచ్చుల (స్వరాల) పరిచయంతో సాగేది. దీనికి అనుగుణంగానే అభ్యాసాలు వుండేవి. ఉపాధ్యాయ శిక్షణలో కూడా ఈ విధానం పాటిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో మారుతున్న ఆలోచనా విధానాలకు లోబడి అంటూ, హోలిస్టిక్ అప్రోచ్ పేరున, వ్యక్తివాద (Behavioristic) స్థానంలో, తల్లిగర్భంలోనే శిశువు జ్ఞాన సము పార్జన(cognitive) జరుగుతుంధనే ఆధునిక ఆలోచనా విధానానికి లోబడి భాషా పుస్తకాలు తయారు చేసామంటూ, పుస్తకాల్ని అతి సంక్లిష్టంగా మార్చారు. ఉదాహరణకు, జాబిలి పేరున రూపొందించిన ఒకటో తరగతి పుస్తకం అచ్చుల పరిచయాన్ని కాదంటూ హల్లులకు ప్రాధాన్యతనిచ్చారు. దీనికి గల హేతుబద్ధత ఏమిటో ఎక్కడా వివరించలేదు. అలాగే ఆంగ్ల భాషా పుస్తకాల్లో విభిన్న ప్రక్రియల్లో భాష వినియోగించబడుతుందంటూ (Discourse Oriented Pedagugy) తరగతి గధిలో ఆచరణ సాధ్యంకాని అనేక భాషా ప్రక్రియల్ని చొప్పించారు. ఈ బోధనా విధానాల పట్ల ఉపాధ్యాయ శిక్షణలో తర్ఫీదు లేకపోగా, ఇన్‌సర్వీసులో ఇచ్చిన శిక్షణ పొంతన లేకుండా వుండడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఈ లోపాల్ని, బలహీనతల్ని ఏనాడు విద్యాశాఖ సమగ్రంగా పట్టించుకోకపోగా, ఉపాధ్యాయులు విధిగా ఆచరించాలనే ఆదేశాల్ని పదే పదే ఇస్తున్నారు. నిజానికి కొత్తగా తయారు చేసిన ఏ పుస్తకమైనా క్షేత్ర స్థాయిలో పరీక్షించాలి. వచ్చిన సూచనల్ని, సలహాల్ని స్వీకరించి చేర్పులు, మార్పులతో సరిచేసి పాఠశాలలన్నింటికి వర్తింపజేయాలి. కాని, ఈ విధానం ఎక్కడా కానరాదు. బోధించే ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులకు ఈ పుస్తకాల పట్ల అవగాహన లేకపోగా, విద్యారంగాన్ని సమూలంగా మార్చాలంటూ నినదిస్తున్న ఉపాధ్యాయ సంఘాలకు పట్టడం లేదు. పాఠ్యపుస్తకాల రూపకల్పన ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి విద్యార్థుల స్థాయి, బోధనాంశాల ఎంపిక, వీటి ప్రామాణికత కాగా, బోధనాంశాల ఎంపిక సరళం నుంచి క్లిష్టత వైపు, స్థానికతనుంచి విశ్వస్థాయికి కొనసాగాలి. సామాజిక సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ దృక్కోణంతో భాషకు భాషేతర విషయాలకు నిచ్చెన మెట్లలా పాఠ్యాంశాల ఎంపిక జరగాలి.
ఈ ఎంపిక రాజ్యాంగానికి లోబడి లౌకిక, హేతువాద భావాల్ని, శాస్ర్తియ దృక్పథాన్ని పెంపొందించేవిగా వుండాలి. కుల, మత, వర్గ, లింగ భేద దొంతర్లను తగ్గించేవిగా వుండాలి. ప్రజాస్వామిక భావజాలాన్ని, మానవీయ కోణాల్ని ఆవిష్కరించగలగాలి. కాని, ఇవన్నీ ఉపోద్ఘాతాలకు, పీఠికలకే పరిమితమైపోయాయి. ప్రస్తుతం ఉనికిలో వున్న ఏ పాఠ్యపుస్తకాన్ని చూసినా ఈ లోపాలు కొట్టొచ్చినట్లు కనపడుతాయి. పుస్తకాల రచన ఆషామాషీగ కాకుండా ఆశ్చర్యం కలిగించేలా కొనసాగడం గమనార్హం.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సంస్కృతికి, చరిత్రకు ప్రాధాన్యం వుండాలనే తపనతో 2015లో ఒకటి నుంచి పదో తరగతి దాకా తెలుగు పుస్తకాల మార్పు జరిగింది. వీటి రూపకల్పన కోసం రచయితలతోపాటు విద్యానిపుణుల పేరున జాబితా చూస్తే ముక్కుపై వేళ్లు వేసుకోవలసి వస్తుంది. ఒక్కో తరగతి పుస్తకానికి రచయితలు (11-24- 11నుంచి 24) 11నుంచి-24 మంది కాగా, విద్యావేత్తలు, విషయ నిపుణులు 15 మంది చొప్పున వున్నారు. వీరికితోడు విశ్వవిద్యాలయ స్థాయివారు 8 మంది, విషయ నిపుణులు ఇద్దరు, ప్రచురణ సమితి ముగ్గురు, క్షేత్రస్థాయి వ్యక్తులుగా ఏడుగురు, సంపాదక మండలిగా 4నుంచి- 10 మంది చొప్పున వున్నారు. 6,7 తరగతుల చిత్రకారులైతే 10 మంది చొప్పున వున్నారు. ఇలా ఒక్కో తరగతి పుస్తకం తయారీకి సరాసరి 65 మంది మేధావి వర్గంగా ఏర్పడి రూపొందించడం గమనార్హం. ఇలాంటి జుంబో వర్గం రూపొందించిన యూనిట్లు 1,2 తరగతులకు 25, 20 కాగా, 3-5 తరగతులకు 14, 6-10 తరగతులకు 12 చొప్పున 144 పేజిలనుంచి 174 పేజీల పుస్తకాలను తయారు చేయడం ఆశ్చర్యమే. అంటే, ప్రతి యూనిట్‌కు సరాసరి ఐదుగురు చొప్పున, మూడు పేజీలకు ఒక వ్యక్తి చొప్పన పాఠ్యపుస్తక రచన చేశారన్నమాట. బహుశా దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఓ సాధారణ పాఠ్యపుస్తకానికి ఇంతమంది రచయితలు, నిపుణులు వుండకపోవచ్చు! నిజంగా వీరు పాల్గొన్నారా, లేక ముఖస్తుతి కొరకు వీరి పేర్లను చేర్చారా అనేది ప్రభుత్వానికి, ఆయా వ్యక్తులకే తెలియాలి. వీరి పేరున తయారైన పుస్తకాల్ని వీరిలో ఎంతమంది చూశారనేది మరో ప్రశ్న. ఇలా ప్రహసనంగా తయారైన పాఠ్యపుస్తకాలు నాణ్యతనే కాదు, ప్రామాణికతను కోల్పోవడమే కాక, అనేక తప్పులకు తావిచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించిన పాఠ్యపుస్తక రచన నిపుణురాలు, పూర్వపు ఉన్నత స్థాయి విద్యా అధ్యయన సంస్థ (ఎఐఎస్‌ఇ) ఆచార్యులు ప్రొ.బి.సరోజన గారు ఆంధ్రభూమిలోనే వ్యాసాల్ని రాయడమే కాక, గత మార్చిలో లోకాయుక్తలో లోపభూయిష్టమైన తెలుగు పుస్తకాల రచనపై, విధి విధానాలపై, మార్చాల్సిన ఆవశ్యకతపై ఓ పిటిషన్‌ను కూడా వేశారు. అంతకుముందే రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి వ్యక్తిగతంగా తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇదే కోవలో ఈ వ్యాస రచయిత కూడా పలు వ్యాసాల్ని ఇదే పత్రికలో రాయడం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళగా, పదో తరగతి సాంఘిక శాస్త్ర పుస్తక రచయితల్లో ఒకరు భుజాలు తడుముకున్నారు, నేటికి ఆ పుస్తకంలో దొర్లిన తప్పులు, తప్పుడు భావనలు సరిదిద్దపడకపోవడం శోచనీయం!
నిజానికి పాఠ్యపుస్తక రచన పిల్లల విద్యపై (Pedagogy) ) ఫట్టున్న నిష్ణాతులచే జరగాలి. వీరికి వివిధ బోధనా విధానాలపై పట్టుండాలి. విస్తృతమైన విషయ అవగాహన వుండాలి. ఓ ప్రాపంచిక దృక్పథం వుండాలి. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వారని, పని చేశారని, రచనా వ్యాసంగాల్లో ఆరితేరారని హాజీలను, మాజీలను గొలుసుకట్టుగా వీరి పేర్లను పాఠ్యపుస్తకాల్లో నాలుగైదు పేజీల్లో ప్రస్తావించడం గతంలో ఎప్పుడు, ఎక్కడా జరగలేదు. పోనీ, వీరంతా పాల్గొన్నారా అంటే, చాలామందికి, తామో పాఠ్యపుస్తక రచయితలమని, సూచన, సలహాదారులమని, సంపాదకులమని తెలుసా అనేది ఓ చిక్కుముడి ప్రశ్ననే!
ఇలాంటి స్థితిలో పాలమూరు సైన్సుఫోరం, రంగారెడ్డి జిల్లా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయ సంఘం కోరాయని ప్రస్తావిస్తూ, పాఠ్యపుస్తకాలపై సూచనల్ని, సలహాల్ని ఉపాధ్యాయులు, మేధావులు రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి ఈనెల 30నాటికి తేవాలంటూ డిసెంబర్ 3న రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణాసంస్థ సంచాలకులు ఒక సర్క్యులరును జారీచేయడం గమనార్హం! గతంలో వచ్చిన సూచనల్ని, సలహాల్నిగాని, ప్రొ.బి.సరోజనగారి ప్రస్తావనను ఈ లేఖలో పేర్కొనకపోవడం ఈ సందర్భంగా గమనించాలి. ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ సర్క్కులరుకు విస్తృత ప్రచారాన్ని కలిగించాలని సూచించినా, నేటికి ఉమ్మడి రాష్ట్రంలోగాని, తెలంగాణలో గాని ఒక్క డిఇవో కూడా ఓ పత్రికా ప్రకటన ఇవ్వని స్థితినిబట్టి, పాఠ్య పుస్తకాల తీరుపై ఎంత నిబద్ధత వుందో తెలుస్తుంది. గతంలో వచ్చిన సూచనల్ని, సలహాల్నే పట్టించుకోని ప్రభుత్వ విద్యావ్యవస్థ సలహాలంటూ వస్తే ఇప్పుడు పట్టించుకుంటుందా అనేది మరో ప్రశ్న. ఏదో కంటి తుడుపు చర్యగా ఇచ్చిన సర్క్యులరుకు ఎంతమంది స్పందిస్తారో తెలియదు గాని, ఇప్పుడున్న గొలుసుకట్టు రచయితల, విషయ నిపుణుల చేతనే ఓ కమిటీని వేసి పాఠ్యపుస్తకాల్ని సమీక్ష చేయిస్తే రంగు బయటపడక మానదు. ఇదన్నా జరగాలని ఆశిద్దాం! *

- జి.లచ్చయ్య సెల్: 94401 16162