మెయన్ ఫీచర్

గాయపడిన మనసుకు ఓదార్పు ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒంటరిగా వున్న వ్యక్తి ఒంటరితనం కారణంగా ఉన్మాదావస్థకు లోనవుతాడు. మానసిక స్వాస్థ్యాన్ని వివిధ ఉన్మాదాల సంయోగంగా అభివర్ణించవచ్చు-’’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త బెర్‌ట్రాండ్ రసెల్ తాను రచించిన ‘‘ప్రసిద్ధ వ్యక్తుల పీడకలలు’’ (నైట్‌సోర్స్ ఆఫ్ ఎమినెంట్ పెర్‌సన్స్) అనే గ్రంథంలో.
మనిషిలో వున్న శతకోటి కోరికలు, బలహీనతలు, కారణంగా - ప్రతి మనిషిలోనూ- అసాధారణ ప్రవర్తన, సాధారణ ప్రవర్తనకు భిన్నమైన ప్రవర్తనాశైలి, ఒక్కొక్కప్పుడు కొన్ని కారణాల వలన చోటుచేసుకుంటుంది. కొంత కుంగుబాటు, అసాధారణమైన రీతిలో ఆగ్రహ వ్యక్తీకరణ, వస్తువులను విసిరెయ్యడం ఇలాంటి ప్రవర్తనలు వుంటాయి. ఇది నిస్సందేహంగా ఉన్మత్త చర్యలే. ఇవి తాత్కాలికంగా వచ్చి, కొంతసేపటి తర్వాత మనిషి సాధారణ స్థితిలోనికి రావచ్చు. లేదా- అదే స్థితిలో కొంతకాలం వుండవచ్చును.
మనిషికి శారీరక అనారోగ్యం చేసినట్టుగానే, పరిస్థితుల ప్రభావంవల్ల మనసుకు కూడా అస్వస్థత కలగవచ్చు. శారీరక అనారోగ్యానికి ఆస్పత్రులు వున్నట్టుగానే, మానసిక రుగ్మతకు కూడా ఆస్పత్రులు వున్నాయి. ఆమధ్య బెంగుళూరులోని జాతీయ మానసిక వైద్య అధ్యయన సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైనె్సస్- ‘ఎన్.ఐ.ఎమ్.హెచ్.ఎన్.ఎస్’) నివేదిక ప్రకారం ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరికి మానసికమైన చికిత్స అవసరమవుతున్నది. ప్రతి అయిదుగురిలో ఒకరు ‘కుంగుబాటు’ (డిప్రెషన్)కు గురి అవుతున్నారు. 0.9 శాతం మంది ఆత్మహత్య చేసుకోవాలని తలపోస్తున్నారు. కొద్దిపాటి దయ, మానవత్వం, వారి మనసుకునచ్చే సలహా ఇలాంటివి సమాజం- ఇంటిలోనివారు, మిత్రులు వారికి ఇవ్వగలిగితే- వారిలో చాలామంది ఉన్మాదవస్థ అంచులవరకూ వెళ్లినా త్వరగా బయటకు రాగలుగుతారు. మామూలు వ్యక్తులుగా జీవించగలుగుతారు. అలా జరిగే అవకాశం లేనప్పుడు సైకియాట్రిస్టుల సలహా, మందుల వాడకం, అవసరమవుతాయి.
మనిషి మనస్తత్వం అనేది సముద్రంమీద తేలియాడే ‘ఐస్‌బర్గ్’ (మంచుగడ్డ) వంటిది అంటారు మనస్తత్వ శాస్తవ్రేత్తలు. పైకి కనబడేది ఒక వంతు అయితే, - కనబడకుండా నీటలో వుండేది మూడు వంతులు. ఆ మూడు వంతుల భాగంలోనే ‘అసలుకథ’ అంతా వుంది. దీనిని వెదికి పట్టుకోవడంలోనే మనస్తత్వ శాస్తవ్రేత్తల ప్రజ్ఞవున్నది. 1900 సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘‘ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్’’ వెలువడిన కాలంనుండీ మనస్తత్వశాస్త్రం నానాటికీ కొత్తపుంతలు తొక్కుతూ మానసిక రుగ్మతలను తగ్గించడంలోనూ, తొలగించడంలోనూ విశేషమైన కృషిచేస్తున్నది.
మానసిక వైద్యంపై నిర్లక్ష్యం
మన దేశంలో 6000 మందికి పైగా సైకియాట్రిస్టులు వున్నారు. మనం దేశంలోని వివిధ వైద్యకళాశాలల్లో ఏడాదికి నాలుగువందల మంది సైకియాట్రిస్టులకు శిక్షణనిస్తున్నాం. 600మంది సైకియాలజిస్టులకు కూడా శిక్షణనిస్తున్నాం. కాని, మన దేశంలో మానసిక వైద్యం బీదవారికి, సాధారణ పౌరులకు, అందవలసిన విధంగా అందడంలేదు. శారీరక రుగ్మతల కంటే ఘోరంగా మానసిక రుగ్మతకు సంబంధించిన వైద్యం నిర్లక్ష్యానికి గురి అవుతున్నది.
ఆమధ్య ఒక ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. వాస్తవంగా జరిగిన ఆ ఉదంతం ప్రకారం- ఒక ఆమె భర్త ఆమెతో ఏడాది కాపురం చేసి, బిడ్డకు తల్లిఅయిన తర్వాత వదిలిపెట్టేసి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాడు. ఈ సంఘటనతో ఆమె మానసికంగా కుంగిపోయి (డిప్రెషన్) మానసిక వ్యాధికి గురిఅయింది. ఈ వ్యాధి కారణంగా ఆమె తన బిడ్డను, తండ్రిని, సోదరీసోదరులనూ అందరినీ ద్వేషించేది. పెద్ద అరుపులు అరవడం, సామానులను ధ్వంసంచెయ్యడం చేసేది. ఈ పరిస్థితిలో కుటుంబం సభ్యులు ఆమెను వదిలివేయకుండా చికిత్స అందించారు. వ్యక్తిగత సైకాలజిస్టును ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఆమె కోలుకున్నది. కాపురం చక్కబడిందికూడా.
ఇవాళ ప్రపంచంలోనూ, భారతదేశంలోనూ మానసిక రుగ్మతలకు లోనవుతున్న వారి సంఖ్య- మానసిక రుగ్మతల కారణంగా ఆత్మహత్యా ప్రయత్నం చేసేవారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. పరిస్థితుల కారణంగా వచ్చిన ‘ఏంగ్జయిటీ’ (ఆందోళన), డిప్రెషన్ (కుంగుబాటు), ఎపిలిప్సీ (మూర్ఛవ్యాధి)లతో బాటుగా, డెల్యూజన్ (భ్రాంతి- తాను చాలా గొప్పవాడిననుకునే భ్రాంతిని ‘డెల్యూజన్ ఆఫ్ గ్రాండియర్’ అంటారు. తనకేదో పెద్ద ఆపద రాబోతున్నదనుకునే భ్రాంతిని ‘డెల్యూజన్ ఆఫ్ పెర్సిక్యూషన్ అంటారు.)- ఆటిజమ్, షిజోఫ్రెనియా, ఇలాంటి ఎన్నో వ్యాధులు మనిషిని మానసికంగా స్వస్థత లేకుండా చేస్తున్నాయి. ఇలాంటివెన్నో రకాల మానసిక వ్యాధుల్లో వ్యక్తికి ఏ వ్యాధి వున్నదో తెలుసుకోడమూ, దానికి తగిన సలహాయివ్వడమూ (కౌనె్సలింగ్), మందులు వాడడమూ చాలా ఓపికతో, మానవతాదృక్పథంతో చెయ్యాలి. ఇందుకు కావలసిన ప్రభుత్వ మానసిక వైద్యశాలలు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కావాలి. కుటుంబ సహకారం కావాలి. కాని, యివన్నీ ఇవాళ తగువిధంగా లేవు. ఇక మానసికమైన ఎదుగుదల లేనివారి (మెంటల్లీ రిటార్డెడ్) విషయం చెప్పనక్కరలేదు.
మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు, బ్రిటిష్ ప్రభుత్వం మానసిక వైద్యశాలలను స్థాపించింది. మొదటిలో ఇవి మద్రాస్, బెంగుళూరులలో మాత్రమేవున్నా, ఆ తర్వాత అవి విస్తరించి, స్వరాజ్యం వచ్చేనాటికి దేశం మొత్తంమీద ఇలాంటి ఆస్పత్రులు 35-40దాకా ఏర్పాటయ్యాయి. వీటికి ఆనాటి ప్రభుత్వం కావలసిన నిధులను కూడా ఇచ్చేది. కాని, స్వాతంత్య్రం వచ్చాక, ప్రభుత్వం ఆరోగ్యానికి కేటాయించే మొత్తాలు, అందునా-మానసిక వైద్యశాలలకు కేటాయించే మొత్తాలు తగువిధంగా పెరగలేదు.
రోగులు ఎక్కువ..సౌకర్యాలు తక్కువ
ఇవాళ మన దేశంలోమానసిక రుగ్మత కలిగినవారు ఒక అంచనాప్రకారం పది లక్షల మంది వున్నారు. కాని,-దేశంలోని ప్రభుత్వ మానసిక రోగుల ఆస్పత్రులలో 20,000 వేల పడకలు మాత్రమే వున్నాయి. వాటిల్లో 8,000 పడకల్లో తీవ్ర మానసిక వ్యాధితో బాధపడుతూ ఎక్కువ కాలం ఆస్పత్రిలో వుండవలసిన రోగులు వుంటున్నారు. దేశంలోని మానసిక రోగుల సంఖ్యకూ, ప్రభుత్వ ఆస్పత్రులలోని పడకల సంఖ్యకూ పోలిక ఎక్కడ?- ఉన్న ఆస్పత్రులలో కూడా సైకియాట్రిస్టులకు, నర్సులకు, సైకాలజిస్టులకు, సామాజిక సేవకులకు, తీవ్రమైన కొరత వుంది. ప్రభుత్వ మానసిక వైద్యశాలలో సిబ్బందికొరత ఒక ముఖ్యమైన సమస్య. ఆస్పత్రుల సంఖ్య పెంచడమనేది ఊహకు అందని విషయం. గత పదేళ్లలో చైనాలో 500 కొత్త ప్రభుత్వ మానసిక వైద్యశాలలను స్థాపించారు. అన్నింటిలోనూ చైనాతో పోటీపడాలని చూచే మనం ఈ విషయంలో ఎందుకు పోలిక తెచ్చుకోము?-
నిధుల కేటాయింపు స్వల్పమే
ఆరోగ్య విషయంగా ప్రభుత్వం చేసే వ్యయం 2010- 2014 సంవత్సరాల మధ్య కాలంలో- మొత్తం స్థూల జాతీయోత్పత్తి విలువలో (జి.డి.పి.) 4.3 శాతం నుండి, 4.7శాతం వరకు మాత్రమే పెరిగింది. మొత్తం వైద్యరంగంపై చేసే వ్యయం 0.4 శాతం మాత్రమే పెరగగా- మానసిక వైద్యం గురించి చేసే వ్యయం అత్యల్పం కాకుండా ఎలా వుంటుంది?- ప్రభుత్వ రంగంలో - మానసిక వైద్య సిబ్బంది బాగా తక్కువగా వున్న దేశాలలో భారతదేశం ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలపుతున్నది. ఈ పరిస్థితుల్లో మానసిక రోగుల ప్రయివేటు మానసిక వైద్యశాలలో వుండడమో- అందుకు తగిన ఆర్థిక స్తోమత లేకపోతే కుటుంబ పర్యవేక్షణలో వుంటూ ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకుని వైద్యం చేయించుకుంటూ వుండడమో చెయ్యాలి. సంఘంలోనే కాదు ఇంటిలో కూడా మానసిక రోగులపై చిన్నచూపు వుంది. వారి వైద్యం పట్ల శ్రద్ధ వహించకపోవడమో చేస్తారు.
ఇక, ఆస్పత్రులలో వున్నవారి పరిస్థితి కూడా అత్యంత దయనీయంగానే వుంది. వారికి బట్టలు ఇస్తే చించి వేస్తారనో లేక అవతలికి విసిరేస్తారనో నెపంపెట్టి- చాలామందిని దిగంబరంగానే వుంచుతారు. గొలుసులు వేసి కట్టేస్తారు. ఆమధ్య ఒక ఆస్పత్రిని పరిశీలించడానికి వెళ్లిన ఒక స్వచ్ఛంద సంస్థ అక్కడి బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌లను, చూచి ఆశ్చర్యపోయింది. పారిశుద్ధ్యం ఘోరం. సైకియాట్రిస్ట్ లేదా డాక్టర్ వారానికోసారి వచ్చి అలా ఒకసారి ముఖం చూపించి వెళ్లిపోతారంతే! మానసిక రోగుల బంధువులు ఆస్పత్రిలో చేర్పించేటప్పుడు తప్ప మళ్లీ వచ్చే సందర్భాలు తక్కువే. స్ర్తి మానసిక రోగులపై అత్యాచారాలు జరిగిన సందర్భాలు వున్నా యి. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం మానసిక ఆస్పత్రులకు విశాల ప్రాంగణం వున్న సందర్భాలలో ఆ స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్సులు, హౌసింగ్ కాంప్లెక్స్‌లు కట్టుకోడానికి విక్రయించిన సందర్భాలు వున్నాయి. అమృత్‌సర్ మెంటల్ హాస్పిటల్, థానే మెంటల్ హాస్పిటల్ మొదలైన వాటిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
2001 సంవత్సరంలో తమిళనాడులోని ‘ఎర్వాడీ’లోని మానసిక ఆస్పత్రిలో గొలుసులు కట్టివున్న 26 మంది మానసిక వ్యాధిగ్రస్తులు తాము బంధించబడి వున్న గదిలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో బయటకు వెళ్లే మార్గంలేక కాలి బుగ్గి అయిపోయిన ఉదంతం అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది! ఆ తర్వాత నుండీ మానసిక వ్యాధిగ్రస్తుల పరిస్థితిలో మార్పుతెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఈ వ్యాసంలో ఉదహరించిన ఉదంతాలు పశ్చిమ బెంగాల్‌లోని బెర్‌హామ్‌పూర్ మానసిక వైద్యశాలకు సంబంధించిన పరిశీలన నుండి తీసుకోబడినవి. అన్ని ఆస్పత్రుల పరిస్థితీ ఇలా వుండకపోవచ్చు. కాని, అందుకు పూర్తిగా భిన్నంగా వుందని చెప్పలేము.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘‘క్రొత్త మెంటల్‌కేర్ బిల్లు’’ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అది ఆమోదించబడి, లోక్‌సభ ఆమోదంకోసం ఎదురుచూస్తున్నది. ఆ బిల్లులో పేర్కొన్నట్టుగా- మానసిక వైద్యం పౌరుల హక్కు కావడమూ, మానసిక వ్యాధులకు కూడా ఇన్స్యూరెన్స్ విధానం అమలుచెయ్యడమూ, వాంఛనీయమేగాని- మానసిక ఆస్పత్రుల సంఖ్య పెంచకుండా, సిబ్బందిని పెంచకుండా, మానసిక వైద్యంపై చేసే వ్యయం పెంచకుండా, ‘హక్కు’అని చెప్పినంత మాత్రాన లక్ష్యం నెరవేరదు!

కోడూరి శ్రీరామమూర్తి - 93469 68969