మెయన్ ఫీచర్

కఠోర నిర్ణయాలకు తరుణం ఇదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును.. ఇది నమ్మలేని నిజం.. అది- దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీ కొలువుదీరే కుర్చీలకు అవతల- తారిక్ సిద్ధిఖీ అనే నేత ఈనెల 13న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటూ నిఘా కెమెరాలకు చిక్కాడు. దీనికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారు? సిద్ధిఖీ ఒక్కడే కాదు.. మరికొన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఘరానా నేతలు సైతం కరెన్సీ నోట్లను మార్చుకుంటూ కెమెరా కంటికి దొరికిపోయారు.. వీరేంద్ర యాదవ్ (బిఎస్పీ), టుంటూ యాదవ్ (సమాజ్‌వాదీ), రవికుమార్ (ఎన్‌సిపి), సతీశ్ (జెడి-యు).. ఈ ‘నల్లదొర’లందరూ వీలు చిక్కినప్పుడల్లా రాజకీయాల్లో విలువల గురించి గొప్పలు చెప్పేవారే. దిల్లీలోనే కాదు, దేశంలో గల్లీ గల్లీలోనూ ఎందరో నేతలు, వ్యాపారులు, దళారీలు కరెన్సీ కట్టలతో పట్టుబడుతూనే ఉన్నారు. తమిళనాడులో అన్నాడిఎంకెతో అంటకాగిన కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి వద్ద దొరికిన నోట్లకట్టలు, బంగారం కడ్డీలు చూసి ఐ.టి అధికారులకే నోట మాట పోయింది. రాజకీయ నాయకులకు అత్యంత సన్నిహితులైన ఘరానా వ్యక్తుల బండారం ఇపుడు బయట పడుతోంది. నిజానికి ఈ డబ్బు, స్థిర చరాస్తులు ఎవరివి? నేతలకు, కాంట్రాక్టర్లకు, దళారులకు ఉన్న సంబంధం ఏమిటి? ఇంత భారీగా వీరు సంపదను ఎలా పోగుచేసుకున్నారు? ఈ పాపంలో అధికారులకు వాటా లేదా?
మరోవైపు- పెద్దనోట్ల రద్దుతో నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద ఇప్పటికీ సామాన్య, మధ్య తరగతి జనం పడిగాపులు.. బ్యాంకుల వద్ద ‘క్యూ’లకు అంతం లేదు. కోరలు లేని కొండచిలువలా మెలికలు తిరుగుతూ బ్యాంకులకు ‘క్యూ’లు చుట్టుకుంటున్నాయి. ఈ చక్రభ్రమణాలు, వక్రభమణాలూ ఇంకెన్నాళ్ళు? ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ ఇక వజ్రాయుధాన్ని సంధిస్తాడా? పెద్దనోట్ల రద్దుపై గొడవ చేస్తున్న రాహుల్ గాంధీ ఒక చారిత్రక విషయాన్ని తెలుసుకోవాలి. 1971లో కేంద్ర మంత్రి వై.బి.చవాన్ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి పెద్దనోట్లను రద్దుచేయటం ద్వారా నల్లధనాన్ని వెలికితీయవచ్చునని సూచించారు. దానికి ఆమె- ‘వచ్చే ఎన్నికల్లో మనం పోటీ చేయకూడదని మీ ఉద్దేశమా?’ అంటూ ప్రశ్నించింది. ఇదీ చరిత్ర? చరిత్ర పుటలను ఇవ్వాళ ఎవరూ విస్మరించలేరు. కొద్ది రోజుల క్రితం రాహుల్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి నోట్లరద్దుతో అన్యాయం జరిగిపోయిందని ఫిర్యాదు చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి సహా మరికొన్ని ప్రతిపక్షాలు రాహుల్ వెంట రాష్టప్రతి భవన్‌కు వెళ్ళడానికి నిరాకరించాయి. ఇది ప్రతిపక్షాల అనైక్యతకు దర్పణం పడుతున్నది.
***
జయలలిత పరమపదించిన ఇరవై నాలుగు గంటల తర్వాత చెన్నైలో ఒక ప్రముఖ సంఘటన జరిగింది. శేఖర్‌రెడ్డి అనే ఇసుక, మైనింగ్ వ్యాపారిపై ఐ.టి అధికారులు దాడులు చేసి నూరు కిలోల బంగారం, నూరు కోట్ల వెయ్యి రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొత్తగా వచ్చిన రెండు వేల రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. శేఖర్‌రెడ్డితో పాటు నాగరత్నం, ఎస్.ఆర్.రామచంద్రన్‌పై కూడా దాడులు జరిగాయి. టి.నగర్, అన్నానగర్, తేనాంపేటలలోని వారి ఇళ్లను సోదా చేశారు. ఈ సంఘటనను విశే్లషిస్తే మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుస్తాయి. శేఖర్‌రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యుడు. ఆయనకు ఆ పదవిని జయలలిత ఇప్పించింది. శేఖర్‌రెడ్డికి ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు పట్టుబడ్డ డబ్బు కేవలం గుమ్మడికాయలో ఆవగింజంతే. మరి ఈ కొత్త రెండు వేల రూపాయల నోట్లు ఇంత పెద్ద మొత్తంలో ఈయనకు ఎక్కడ నుండి వచ్చాయి? క్యూలో నిలబడినవారికి రెండు వేల రూపాయలు కూడా లభించటంలేదు. దాదాపు 150 మంది క్యూల్లోనే రాలిపోయారు. అయితే, శేఖర్‌రెడ్డికి ఏదైనా బ్యాంకు ఈ మొత్తాలను ఇచ్చి వుండాలి. శేఖర్‌రెడ్డి, పన్నీరు సెల్వం, మేనకోడలు దీప జయలలితకు సన్నిహితులు. దాదాపుగా వీరంతా శశికళకు బినామీలుగా వ్యవహరిస్తున్నారు. శశికళ జయలలితకు కోశ సంరక్షకురాలు. ఈ డబ్బు తనకే దక్కాలని జయ బంధువైన దీప ఇప్పుడు ఆశిస్తున్నది. పన్నీరు సెల్వం తిరుమల వచ్చినపుడు దైవదర్శన కార్యక్రమాలన్నీ శేఖర్‌రెడ్డి దగ్గర ఉండి నిర్వహించాడు. ఐ.టి. అధికారి మురగ భూపతి ఏకకాలంలో పది చోట్ల దాడులు జరపించాడు. ఈ పనిని కేంద్రం చేయించిందా? అంటే- అన్నా డిఎంకె పార్టీ తోక జాడిస్తే రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో కేంద్రంలోని నేతలు అప్పుడే కొంచెం రుచి చూపించారని తమిళనాడులో అనుకుంటున్నారు. ఏది నిజమో ఇప్పుడే చెప్పలేం.
***
ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిజం విఫలమైంది. కాస్ట్రో, హోచిమన్ వంటివారి విజయాలు ఆయా ప్రాంతాల జాతీయ వాదుల విజయాలను సూచిస్తాయే కాని సామ్యవాద విజయం కాదు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల విజయంలో జాతీయవాదుల పాత్ర గణనీయంగా ఉంటుంది. భారత్‌లో కమ్యూనిజం, కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరించిపోయాయి. ఈ దశలో కొందరు నేతలు శవాలకు ప్రాణప్రతిష్ఠ చేయాలని పరితపిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత జనంలోని అసంతృప్తిని, అసహనాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారు. ‘మోదీ నియంత’ అని విజయవాడలో కమ్యూనిస్టులు ఊరేగింపు జరిపారు. నిజంగా ఆయన నియంత అయితే వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంస్థలను ఎప్పుడో నిషేధించేవారు, పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకొని ఉండేవారు, నరహంతకుడు మసూద్ అజర్ టెర్రరిస్టు కాడని ప్రకటించిన చైనాకు బుద్ధి చెప్పి ఉండేవారు. కానీ- మోదీ ఇవేవీ చేయలేదు. ‘నాకు సలహాలు పంపండి’ అని మన్‌కీబాత్‌లో ప్రజలకు మోదీ పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు.
పెద్దనోట్లను సాహసోపేతంగా రద్దు చేసిన మోదీ మరికొన్ని కఠోర నిర్ణయాలను తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త రెండు వేల రూపాయల నోటును వచ్చే ఆర్థిక సంవత్సర ప్రారంభం తర్వాత రద్దు చేయాలి. దేశంలో అందరికీ చెక్‌బుక్‌లు ఇచ్చి నగదు రహిత భారతాన్ని నిర్మించాలి. క్రమశిక్షణ అలవడేందుకు జాతి ప్రజలకు సైనిక శిక్షణ నిర్బంధం చేయాలి. మత మార్పిడులకు, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న మత సంస్థలకు నిధులు అందకుండా చేయాలి. మతోన్మాదాన్ని ప్రేరేపించే రాజకీయ పార్టీలను నిషేధించాలి. ఉగ్రవాదుల మద్దతుతో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయాలి. విదేశీయ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించాలి. లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. ప్రముఖ ఆలయాలకు, ధార్మిక సంస్థలకు రాజకీయాలకు అతీతంగా పాలకమండళ్లను నియమించాలి. వీటిలో మాఫియాలకు, దళారులకు, అవినీతిపరులకు చోటు ఉండరాదు. ఇలాంటి చర్యలు తీసుకుంటే దేశం కొంతవరకైనా దారిలోకి వస్తుంది. లేకుంటే ప్రజల త్యాగాలు నిష్ఫలవౌతాయి.
ఇక, పేదప్రజల కోసం తెరిచిన జనధన్ ఖాతాల్లో గుట్టలు గుట్టలుగా డబ్బు వచ్చి చేరుతున్నది. ఇది రెండు మార్గాలుగా వస్తున్నది. ఒకటి ఆ పేదలపై పెత్తనం చేసే ‘నల్లబాబుల’ది. ఇక రెండవ మార్గం- మావోయిస్టుల నుంచి వస్తున్నది. ఈ దొంగ డబ్బుకు కొత్త నోట్లు ఇవ్వవలసిందిగా పేదలను భయపెట్టి మావోలు పీడిస్తున్నారు. ఇది చత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్నది. అందుకే- ‘మీ ఎకౌంట్లలో జమచేయబడ్డ మొత్తాలను మీరు తిరిగి ఎవరికీ ఇవ్వకండి’ అని ప్రధాని మోదీ జన్‌ధన్ ఖాతాదారులను కోరారు. నిజానికి భారత ఆర్థిక వ్యవస్థ గత డెబ్బది సంవత్సరాలుగా కుప్పకూలింది. పూర్వం తులం అంటే వెండి రూపాయి బరువుగల నాణెం విలువ. కానీ, నేడు నాణాలకు, కరెన్సీకి వాడే లోహాలకు, కాగితాలకు వెండి- బంగారం విలువలకు సంబంధం ఉందా? గత ఎన్నికల ముందు యుపిఏ ప్రభుత్వం 109 శాతం పెద్ద నోట్ల ముద్రణ జరిపి ముమ్మరంగా దేశంలోకి వదలటం ఒక కఠోర సత్యం.
ప్రస్తుతం దేశంలో చిల్లర సమస్య తీరాలంటే పది రూపాయల నోట్లు, నాణాలు విరివిగా ముద్రించి విడుదల చేయాలి. సామాన్యులకు రెండు వేల రూపాయల నోటుతో ఉపయోగం ఉండదు. 2018లో ఈ పెద్ద నోటును రద్దుచేస్తారన్న వదంతులు ఇప్పటికే వ్యాపించాయి. అది జరిగితే మంచిదే. కొందరు ఘరానా వ్యక్తుల చేతుల్లోకి కొత్త రెండు వేల రూపాయల నోట్ల కట్టలు ఎలా వచ్చాయి? ఇందులో బ్యాంకు మేనేజర్లు, పోస్ట్ఫాసు ఉద్యోగులు, టిటిడి మెంబర్లు, సినిమా యాక్టర్ల కొడుకులు, అలుళ్ల పాత్ర ప్రత్యక్షంగా కన్పడవచ్చు. కానీ, పరోక్షంగా మానవునిలోని అంతర్నిహితమైన నేర ప్రవృత్తి ఇప్పుడు పగడవిప్పి లేచింది. లేకుంటే ముంబయి, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కత.. ఇలా ఒకటేమిటి? ప్రతిచోటా కేసులు నమోదవుతున్నాయి. ‘కరెన్సీ కష్టాలు’ అంటూ నిరంతరం వార్తలు ప్రసారం చేసే వారు ఒకసారి బారుల వద్దకు వెళ్లి అక్కడి జనాలను చూడండి. వారి తాగుడుకు కరెన్సీ కష్టాలు అడ్డురాలేందుకు? ఒక శేఖర్‌రెడ్డి, ఒక గాలి దుమారం, ఒక మహేశ్ షా- వీరంతా దశాబ్దాల శిథిల వ్యవస్థకు ప్రతీకలు.. గుడిసెల మీద కూర్చున్న కోడిపుంజులు రెక్కలకు కాషాయపు అరుణిమను అద్దుకొని ప్రభాత గీతం పాడుతున్నాయి. క్యూలో నిలబడ్డ జనానికి ఈ పాట ఓ మేలుకొలుపు.

- ముదిగొండ శివప్రసాద్